వ్యవస్థల్ని ఇంత పతనం చేయాలా?

ABK Prasad  Writes Guest Columns On CBI Issue - Sakshi

రెండో మాట

సీబీఐలో తాజాగా సాగిన రెండు వర్గాల మధ్య పోరు– అవినీతికి సంబంధించిందే. ఇందులో ప్రధాన డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా మధ్య ఎవరికెక్కువ అవినీతి అన్న సమస్యను తేల్చడంలో బీజేపీ పాలకవర్గం ప్రధానంగా ఆరోపణలున్న ఆస్థానాకు కంటితుడుపుగా కొమ్ముకాసి, డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మపై ఆస్థానా ఆరోపణలను భుజానికెత్తుకుంది. రఫేల్‌ ఒప్పందం కాగితాలు, వాటి వెనుక జరిగిన వేలకోట్ల రూపాయల లావాదేవీలు సీబీఐ చేతికి చిక్కి రచ్చకాకుండా ఉండాలంటే– ఆలోక్‌ వర్మ అక్కడ ఉండకూడదు. ఈ పథకంలో విజిలెన్స్‌ కమిషనర్, సుప్రీం జడ్జి కూడా మోదీకి దన్ను కాస్తూ భాగం కావడం రాజ్యాంగ వ్యవస్థల పరిపూర్ణ పతనానికి గుర్తు.

‘‘నీవు శిక్షణ ఫలితంగా అబ్బిన గుణగ ణాల వల్ల, నీవు జతకట్టిన స్నేహితులను బట్టి, నీలో కొన్ని వర్గ భావాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు నీవు ఇతరుల అభిప్రాయాలను పరిశీలించాల్సి వచ్చినప్పుడు నీవు చెప్పాలనుకున్న నీ మంచి అభిప్రాయాన్ని నిశితమైన నీ తీర్పును ప్రకటించలేవు. శ్రమజీవుల పట్ల తీర్పులు ప్రకటించేటప్పుడు న్యాయమూర్తులకు (జడ్జీలు) ఎదురయ్యే సమస్యే ఇది. నిజానికి నిష్పాక్షికంగా వ్యవహరించగల నీ జడ్జీలెక్కడ? ఈ జడ్జీలు విద్యాధికులైనప్పటికీ, పారిశ్రామిక యాజమాన్యాలు పెరిగిన మూస భావాల్లోనే వారూ పెరుగుతూవచ్చారు. అలాంటప్పుడు ఒక శ్రామికుడు కానీ, ఒక ట్రేడ్‌ యూనియన్‌ కానీ, నిష్పాక్షికమైన తీర్పుల్ని ఎలా పొందగలడు? ఈ భిన్న దృక్పథాలు గల వర్గాల్లో ఒకరైన శ్రామికునికి దానికి విరుద్ధమైన వర్గానికి చెందిన మరొకరి (జడ్జి)కి మధ్య నిష్పాక్షిక నిర్ణయం అనేది క్లిష్టమైన విషయం!’’  – సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్‌ స్క్రూటన్, కేంబ్రిడ్జి లా సొసైటీలో ఉవాచ.

‘‘న్యాయమూర్తులనేవారు కూడా ఒక వర్గానికి చెందినవారే. ఫలి తంగా ఆ వర్గ లక్షణాలు వారికి అలవడటం సహజం. జడ్డీలు కూడా ప్రజాప్రయోజనాలను నిర్వచిస్తూ ఉంటారు, అయితే తామేవర్గం నుంచి వచ్చారో ఆ వర్గ భావాలనే వల్లిస్తారు. వారి దృక్పథం నుంచే భాష్యం చెబుతారు’’ – (ప్రొఫెసర్‌ గ్రిఫిత్‌ : ‘‘ది పాలిటిక్స్‌ ఆఫ్‌ ది జ్యుడీషియరి’’)

నేడు దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో, రిపబ్లిక్‌ రాజ్యాంగం పేరిట ఘటిల్లుతున్న పరిణామాలు దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒక్కటొక్కటిగా పాలక పక్షాలు కూలగొట్టడం వైపుగానే సాగుతున్నాయనిపిస్తోంది. సుమారు 19 ఏళ్ల నాడు భారత సుప్రీం కోర్టు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజున (జనవరి 26) సుప్రసిద్ధ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్‌ వి.ఆర్‌ కృష్ణయ్యర్‌ ధర్మాసన చైతన్యం ప్రజా ప్రయోజనానికి ఎంత ఉపయోగకారిగా ఉందో అంత దుర్వినియోగపడుతోందని చెప్పారు. ఇంతకూ దేశాన్ని ఎదుర్కొంటున్న అసలు సవాలంతా– సుప్రీం కోర్టును భారత ప్రజల సమున్నత స్థాయి వాణిగా మార్చేయడమేనని అదే నిజమైన వ్యవస్థా, ప్రజాస్వామిక పరివర్తన అనీ ఆయన వర్ణించారు. ఈ ప్రజాస్వామిక పరివర్తనా దశకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో మన పాలకులు గాని, వారి సమక్షంలో కొలువు తీరుతున్న న్యాయవ్యవస్థగానీ నడుచుకోగలుగుతున్నాయా? 

అప్పుడప్పుడూ అవాంఛనీయమైన ఒత్తిళ్లకు కేంద్రపాలకులు (ప్రధానమంత్రితో సహా) న్యాయవ్యవస్థను గురిచేస్తున్నప్పటికీ ఒక మేరకు న్యాయమూర్తులు కొందరు నిభాయించుకుని రాగలుగుతున్నట్లు కన్పిస్తున్నా, తిరిగి ఏదో ఒక దశలో పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా తీర్పులను పాలకులు లొంగదీసుకునే స్థితికి అలవాడుపడుతున్నారు. ఇందుకు ఇటీవల కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. వీటిలో తాజా ఘటనగా రఫేల్‌ విమానాల కొనుగోలు కుంభకోణంలో మోదీ (బీజేపీ) ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎదుర్కొన్న అనేక విమర్శలు, చివరికి ఫ్రెంచి మాజీ ప్రెసిడెంట్‌ హయాంలో అనిల్‌ అంబానీ ప్రయోజనాలు నెరవేర్చే దసాల్ట్‌ ఫైటర్‌ విమానాల కంపెనీతో కుదిర్చిన ‘వియ్యం’ తాలూకు (రూ.30,000 కోట్ల పైచిలుకు కాంట్రాక్టు) ఒప్పందం రగడ అక్కడితో కూడా ఆగకుండా దాని తాలూకు ప్రకంపనలు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ), సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ పెద్దల దాకా విస్తరించాయి. స్వతంత్ర భారతంలో ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో రాజ్యాంగ విధులను పక్కకు తోసేసి రాజ్యాంగ ప్రధాన బాహ్య శాఖలలో ఒకటైన న్యాయ వ్యవస్థలోనే రాజకీయ పాలనా వర్గం జోక్యం చేసుకోవడానికి, తీర్పులను బలవంతంగానో లేదా నర్మగర్భంగా ‘సన్నాయి నొక్కుళ్ల’ ద్వారానో తారుమారు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలూ, సామాజిక శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంస్థలూ గమనిస్తూనే ఉన్నారు. 

ఈ విషయమై బీజేపీ మాజీ మంత్రి అరుణ్‌ శౌరి పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్‌ లోథా మాట్లాడుతూ చాలా బరువైన సందేశాన్ని అందజేశారు: ‘‘సుప్రీంకోర్టు ప్రస్తుతం నడుస్తున్న దశ, తీరూ వినాశకరమయింది. సుప్రీంను నడపగలిగిన సుప్రీం నాయకత్వం అత్యవసరం. స్వతంత్ర న్యాయస్థానం ఒత్తిళ్లకు రాజీ బేరాలకు అతీతంగా ఉండాలి. అందుకు చొరవ అగ్రస్థానం నుంచే రావాలి. లేనిపక్షంలో దేశ న్యాయ వ్యవస్థే అరాచకం పాలయ్యే సమయం దగ్గర పడుతుంద’’ని హెచ్చరించారు జస్టిస్‌ లోథా. ఒరిస్సా మెడికల్‌ ఇనిస్టిట్యూట్‌ నిర్వహణ నియామకాల్లో ఒక న్యాయమూర్తి అవినీతిని శిక్షించకుండా సమర్థించి రక్షించినందుకు అది పెద్ద వివాదాస్పద సమస్యగా మారినప్పుడు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆధ్వర్యంలో సుప్రీం పాలనా నిర్వహణ శాఖాధికారిగా ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాన్ని ప్రశ్నించకుండానే ఆ అధికారాన్ని చట్ట పరిధులకు లోబడి హేతుబద్ధంగా నిర్వహించాలన్న సత్యాన్ని గుర్తింపజేస్తూ నలుగురు సుప్రీం జడ్జీలతో పత్రికా గోష్ఠి నిర్వహించి తొలిసారిగా సుప్రీంలో ప్రజాస్వామిక పద్ధతుల్లో స్పష్టమైన భిన్నాభిప్రాయాన్ని ప్రకటించి చరిత్ర సృష్టించారు. సుప్రీం నిర్వహణలో ఇదొక ఆహ్వానించదగ్గ ప్రజాస్వామ్య మలుపు. 

ఇక తాజాగా, రఫేల్‌ కుంభకోణం పూర్వ రంగంలో మొత్తం సీబీఐ– కేంద్ర పాలకవర్గం తేనెతుట్టెంతా కదిలింది. సీబీఐ నాయకత్వంలో రెండు వర్గాల మధ్య పోరు– అవినీతికి సంబంధించిందే. అయితే ఇందులో ప్రధాన డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానా మధ్య ఎవరికెక్కువ అవినీతి అన్న సమస్యను తేల్చడంలో బీజేపీ పాలకవర్గం ప్రధానంగా ఆరోపణలున్న ఆస్థానాకు కంటితుడుపుగా కొమ్ముకాసి, డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మపై ఆస్థానా ఆరోపణలను ప్రధానంగా భుజానికెత్తుకుంది. సోహ్రాబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు హత్యలో అమిత్‌ షా పాత్ర తెరమీదికొచ్చినప్పుడు, తరువాత జస్టిస్‌ లోయా అనుమానాస్పద మరణం వెనుక గాథ వెల్లడైనప్పుడు అమిత్‌ షాను ఉదహరిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.పి.షా మాట్లాడారు, జస్టిస్‌ లోయా మరణవార్త చుట్టూ పాకిపోయిన అనుమానాన్ని తేలిగ్గా తోసిపుచ్చుతూ లోయా కేసును కాస్తా మూసేయడం న్యాయ శాస్త్రం రీత్యా అనుమతించదగింది కాదని ఆయన చెప్పారు. తీరా ఇప్పుడు ‘వయా రఫేల్‌’ జరిగిన తంతు– అసలు మోదీ బర్తరఫ్‌ చేసిన సీబీఐ చీఫ్‌ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ తిరిగి పదవిలో ప్రతిష్టించి న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడారు. 

కానీ రఫేల్‌ ఒప్పందం కాగితాలు, వాటి వెనుక జరిగిన వేలకోట్ల రూపాయల లావాదేవీలు సీబీఐ చేతికి చిక్కి రచ్చకాకుండా ఉండాలంటే– ఆలోక్‌ వర్మ అక్కడ ఉండకూడదు. కనుకనే సీబీఐకి పోటీగా కేంద్ర విజిలెన్స్‌ (నిఘా) కమిషనర్‌ కేవీ చౌదరి రహస్యంగా ఒక పని నెరవేర్చారని ప్రధాన ప్రతిపక్షం బయట పెట్టింది. ఈ ‘రహస్యం’ ఏమిటి? ఆలోక్‌ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించడానికి 17 రోజుల ముందు (అక్టోబర్‌ 6) సీవీసీ చౌదరి ‘అర్ధరాత్రి మద్దెలదరువు’ అన్నట్టు అకస్మాత్తుగా వెళ్లి వర్మకు ఉద్వాసన ఉత్తర్వును అందజేయడానికి వెళ్లినప్పుడు ఆయనకు సీవీసీ పదవి పరువు కూడా గుర్తుకు రాలేదు. ఈ వ్యవహా రంలో మరో పరువు తక్కువ కార్యం ఏమిటంటే, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్‌ తరఫున ప్రధాని ఆధ్వర్యంలో ఉన్న ‘త్రిసభ్య ఉన్నతాధికార నిర్ణయ సంఘానికి సీనియర్‌ న్యాయమూర్తి ఎ.కె. సిక్రీని మూడవ సభ్యునిగా నిర్ణయించారు. అయితే ఈ నియామకానికి ముందే ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన పని లండన్‌లోని అంతర్జాతీయ కామన్వెల్త్‌ సెక్రటేరి యట్‌ ఆర్బిట్రేషన్‌ (తీర్పరి) ట్రిబ్యునల్‌ సంస్థలో ప్రభుత్వ ప్రతినిధిగా సిక్రీని నియమించడం. ఈ వార్త పొక్కి పోవడంతోనే సిక్రీ లండన్‌ ట్రిబ్యునల్‌లో తన నియామకం వార్తను ఖండిస్తూ ప్రకటించాల్సి వచ్చింది.

రాజకీయ నాయకులు (పాలకులు) అందరినీ ఎలా ‘నీతిమంతులు’గానో అవినీతిపరులుగానో మూకుమ్మడి ముద్ర ఎలా వేయలేమో పోలీసు అధికారులు సహా యావత్తు అధికార గణాన్ని అలా బదనాం చేయలేం. కానీ ‘నాపై అవినీతి ఆరోపణలను రుజువు చేయండి అవి రుజువూ పత్రంలేని ఆరోపణలు. నాపట్ల శత్రుత్వంతో వ్యవహరిస్తున్న స్పెషల్‌ డైరెక్టర్‌ వేసిన అభాండాలు’’ అని ఆలోక్‌ వర్మ సవాలు చేశారు.  కనుకనే వర్మను పదవినుంచి బర్తరఫ్‌ చేస్తూ 2018 అక్టోబర్‌ 23 నాటి సీవీసీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేయడమే వర్మ వాదనకు బలం అవుతోంది. సీబీఐ స్వతంత్ర సంస్థగా, ఎలాంటి రాజకీయ పాలకుల ప్రలోభాలకు లోనుకాని కేవలం స్టాట్యుటరీ సంస్థగా వర్ధిల్లకుండా పాలకుల ‘చేతి ఎత్తుబిడ్డ’గా ఎదుగుతూ పాక్షిక విచారణలు, శత్రుపూర్వక ఆరోపణలతో ఎలా వ్యక్తులను, ప్రత్యర్థులను పాలకులు వేధిస్తారో– కొందరు న్యాయమూర్తుల్ని, సీబీఐ అధికారులను గత పాతికేళ్లలో తాను కేసుల్నుంచి బయట పడటానికి లేదా జగన్‌మోహన్‌ లాంటి యువ ప్రత్యర్థుల్ని అక్రమంగా జైళ్లపాల్జేయడానికీ ఏ మాత్రం వెరవని బాబు లాంటి పయోముఖ విషకుంభాలు నిరూపించాయి. ఇక అలాంటి చరిత్రలు పునరావృతం కావడాన్ని తెలుగు గడ్డపై సహించరాదు. కొందరు జడ్జీలు నేనా కేసును చూడను (నాట్‌ బిఫోర్‌) అని తప్పుకుంటారు. జగన్‌ కేసులో జస్టిస్‌ లోకూర్, సుప్రీంలో అంబానీ ప్రవేశంతో జస్టిస్‌ భండారీ ఇలాగే తప్పుకున్నారు. ఈ వైఖరి స్వతంత్ర శక్తికి, నిజాయితీకి అగ్నిపరీక్ష!

వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్‌, సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top