ట్రంప్‌ సాక్షిగా గోడకు అటూ ఇటూ!

ABK Prasad Article On Wall Construction To Hide Slums Ahead Of Trump Ahmedabad Visit - Sakshi

రెండో మాట

ట్రంప్‌ రాక సందర్భంగా పేదరికం ఆయన కళ్లబడకుండా అహ్మదాబాద్‌ కార్పొరేషన్‌ ‘గోడకట్టుడు’ ముసుగు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆర్థికంగా మనం ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న ప్రస్తుత దశలో మనల్ని వర్ధమాన దేశంగా కాక, అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించి ఆ మేరకు మన ఉత్పత్తులపై అమెరికా అదనపు సుంకాలు విధిస్తోంది. తన సరుకులపై సుంకాలు తగ్గించాలని పట్టుబడుతోంది.  ఈ ఒత్తిళ్లు సహించరానివి. ప్రపంచంలో నాలుగింట మూడువంతుల జనాభా వర్ధమాన దేశాల్లోనే ఉన్నదని, కనుక వాటికి ప్రపంచ పరిణామాలనే ప్రభావితం చేయగల సత్తా ఉంటుందని సౌత్‌ కమిషన్‌ ఏనాడో నొక్కిచెప్పింది. మన పాలకులందరూ దాన్ని విస్మరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. 

అమెరికా  అధ్యక్షుడు ట్రంప్‌ ఈనెల 24న అహ్మదాబాద్‌ నగరానికి వస్తున్న సందర్భంగా గుజరాత్‌ ప్రభుత్వం ట్రంప్‌ మెప్పుకోసం నగరంలోని రోడ్ల గతుకులు సరిచేసి అందంగా కనపడేలా మెరుగులు దిద్దుతోంది. ఆయన వచ్చే వీధుల వెంట కొబ్బరి చెట్లు నాటడంతోపాటు ఆ పొడవునా పెద్ద గోడ కడుతున్నారు. ఈ పనంతా ట్రంప్‌కు మన మురికివాడలు కనబడకుండా చేయడానికి. అహ్మదాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్దార్‌ పటేల్‌(మోతేరా) స్టేడియం దాకా ఊరకుక్కలుగానీ, పశువులుగానీ కంటికి కనబడకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయి. –‘ది హిందూ’ రిపోర్టు 14.02.2020

మన ఇంటిని, మన దేశాన్ని పేదరికం లేకుండా చూడాలని, సర్వులకూ సుఖమయ జీవితాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేయాలని, నలుగురికీ ఆదర్శంగా దాన్ని మలచాలని  బుద్ధి, జ్ఞానం ఉన్నవారెవరైనా ఆశిస్తారు. అందుకోసం శ్రమిస్తారు! కానీ మన పాలకుల (అన్ని రంగులవారూ) ప్రవర్తన, మనస్తత్వం ఈ ఆదర్శానికి పరమ విరుద్ధంగా ఉంటోంది! పై వార్త విన్న తర్వాత ప్రజల మనస్సులు ఎక్కడ గాయపడతాయోనన్న భీతి, లజ్జ కూడా లేకుండా మురికివాడలు ట్రంప్‌ కళ్లకు కనబడకుండా ఉండేందుకు ‘‘గోడ కట్టుడు’’ ముసుగు వేయడానికి గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రయత్నించింది. ఈ సందర్భంగా కమిషనర్‌ విడుదల చేసిన ప్రకటన మరీ వింతగా, ఆశ్చర్యం గొలిపేదిగా ఉంది–‘‘రోడ్డును ఆక్రమిస్తూ నిర్మాణాలు జరగకుండా చూసేందుకు గోడ నిర్మించాలని రెండు నెలలనాడే కార్పొరేషన్‌ నిర్ణయించింద’’ని ఆయన ప్రకటించారు. అయితే ట్రంప్‌ రాకతోనే మన పేదరికం తొలగిపోతుందా అన్నది వేరే ప్రశ్న! 

ట్రంప్‌కు కనబడకుండా ఉండేందుకు పేదవాళ్ల వాడల్ని, పొగచూరిన వారి గోడల్ని కనబడకుండా చేద్దామన్న ‘ఔదార్యం’తో పాలకులు తలపెట్టిన ‘‘గోడకట్టుడు’’ పూర్తి కాకుండానే దాదాపు అదే రోజున ఇండియాను అభివృద్ధి చెందిన లేదా వర్ధమాన దేశాల ప్రతిపత్తి జాబితానుంచి అమెరికా ప్రభుత్వం తొలగించి, భారత్‌ దిగుమతి చేసుకుంటున్న అమెరికన్‌ వస్తువులు, తదితర సరంజామాపై దిగుమతి సుంకాలను తగ్గించాలన్న షరతు విధించుతూ ప్రకటించింది(13.02.20) అంటే మన దేశం పేద దేశం కాదు, ‘‘అభివృద్ధి చెందిన సంపన్న దేశమే’’నని అమెరికా వర్తక వాణిజ్య కార్యాలయం నిర్ధారణకు వచ్చింది. అమెరికా దిగుమతి చేసుకునే మన వస్తువులపై దాని ప్రకారం సుంకాలు గణనీయంగా తగ్గించివేయాల్సిందేనని పట్టుబడుతోంది! అమెరికా తన సమ ఉజ్జీగా దూసుకువెడుతున్న చైనాతో ఇలాంటి వాణిజ్య యుద్ధాన్నే చేస్తోంది. దాన్ని సమ ఉజ్జీల మధ్య పోటీగా భావించవచ్చు. కానీ అన్ని అంతర్జాతీయ మదింపు సంస్థలూ మన అభివృద్ధి రేటు గత పదేళ్ల వ్యవధిలోనే ఎలా దిగజారిపోతూ వస్తున్నదో చూపుతున్న వర్తమాన దశలో భారత్‌పై కూడా ఈ పిడుగును వదిలింది. ఇంకా వర్థమాన దశలోనే ఉంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న మన దేశంపై అమెరికా చేస్తున్న ఒత్తిడి సహించరానిది. పైగా ట్రంప్‌ భారత పర్యటన సందర్భంగా ‘‘భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరే వ్యవహారం కాద’’ని అధికారికంగా ప్రకటించ సాహసించడం మన స్వతంత్ర ప్రతిపత్తిని ప్రశ్నించడమేనని మరవరాదు. మన ప్రణాళికలుగానీ, వార్షిక బడ్జెట్లుగానీ, ఆర్థిక సర్వేక్షణలుగానీ ప్రజలకు దేశ వాస్తవిక పరిస్థితుల గురించి చెప్పకుండా దాచడం, మభ్యపరచడం కొత్తగాదు. వింత కూడా కాదు! 

మన ఆర్థిక వ్యవస్థా చట్రానికి సోకిన వైరస్‌ ఇప్పటిది కాదు. పైగా కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ పాలన నాటికన్నా బీజేపీ ఏలుబడిలోని ఎన్‌డీఏ సంకీర్ణ పాలన దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చే వైపుగా అడుగులువేస్తోంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వస్తుతహ ఎంత తెలివిగల మహిళో, బీజేపీ వరలోకి వెళ్లిన తరవాత తానే చెప్పుకున్నట్లు అంత ‘మితవాద శక్తి’గా మారి ‘‘నేను మితవాదినే కావచ్చుగానీ వాస్తవవాదిని’’ అనవలసివచ్చింది. ప్రపంచ బ్యాంకు ప్రజా వ్యతిరేక సంస్కరణలకు 1990లలో ప్రధాని హోదాలో నరసింహారావు తలవూపారు. అంతకు చాలాముందుగానే చరిత్రాత్మకమైన ‘‘సౌత్‌ కమిషన్‌’’ వర్థమాన దేశాల స్వతంత్ర ప్రగతి బాటకు రూపకల్పన చేసింది. ఆ కమిషన్‌కు అప్పటి టాంజానియా అధ్యక్షుడు, ఆఫ్రికా దేశాల ఆరాధ్య నేత జూలియస్‌ నైరేరి అధ్యక్షుడు కాగా, మన్మోహన్‌సింగ్‌ ప్రధాన కార్యదర్శి. భారతదేశంలాంటి వర్ధమాన దేశాలు స్వావలంబన ద్వారా సొంతకాళ్లపై నిలబడి ఎంతటి అభివృద్ధి సాధించవచ్చునో , అదెంత ఆచరణ సాధ్యమో సౌత్‌ కమిషన్‌ నివేదిక తెలిపింది. అందులోని కీలకమైన ప్రతిపాదన– ‘‘వలస విధానాన్ని వలస దేశాల ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆ విధానాన్ని వారు పాతిపెట్టగలిగారు. ఆ అనుభవంతోనే విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వివిధ రూపాలలో అనుభవిస్తున్న దేశాలు కూడా అలాంటి దృఢచిత్తం తోనే, స్వావలంబన పైన ఆధారపడిన కార్యాచరణ ద్వారా మాత్రమే విదేశీ ఆర్థిక పెత్తనాన్ని వదిలించుకోవచ్చునని ఆ నివేదిక హెచ్చరించింది. కానీ అదే మన్మోహన్‌ ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, ప్రధానిగా ప్రపంచబ్యాంకు వరలో ఇమిడిపోవలసి వచ్చింది. బీజేపీ పాలకులు అంతకన్నా పది అడుగులు ముందుకి దూకి స్వతంత్ర భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులెత్తిన ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా వినాశనం వైపునకు నెడుతున్నారు. ఫలితంగా ఆర్థిక పరాధీన స్థితి మరింత పెరగడానికి మార్గం ఏర్పడింది. 

దేశ నిరంతర ఆర్థిక అభివృద్ధి ‘‘దిగుమతి చేసుకునే వస్తువు’’ కాదని, ఉత్పత్తి అయిన సంపద అనేది సామాజికుల మధ్య న్యాయబద్ధంగా పంపిణీ కావడం ద్వారానే ఆర్థికాభ్యుదయం సాధ్యమని సౌత్‌ కమిషన్‌ నొక్కి చెప్పింది! ఈ అభ్యుదయకర పాఠం మన పాలకుల చేతిలో ఆవిరైపోయింది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసినట్లు నేటి ప్రధాని మోదీ పబ్లిక్‌ రంగ వ్యవస్థల్ని క్రమంగా నిర్వీర్యం చేస్తూ, బ్యాంకుల విలీనీకరణ పేరిట బడా ప్రయివేటు బ్యాంకుల ద్వారా దేశంలో రూ. 360 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని ఆశగొల్పుతున్నారు! ‘స్విస్‌ బ్యాంకు’ ఖాతాలు తెరిచి వాటిలో దాగిన భారత బడా సంపన్నుల 25 లక్షల కోట్లకుపైగా సంపద బయటకు లాగి మరీ ప్రతి కుటుంబానికీ రూ. 15 లక్షలు పంచుతానన్న మోదీ బాస కాస్తా గాలి కబురుగానే మిగిలిపోయింది! చివరకు భారీ యంత్రాలనుంచి పిన్నులకు, పెన్నులకు, ‘పిడుగుకూ, బియ్యానికీ’ విదేశీ కంపెనీల మీద, వాటి సరుకుల మీద బతకాల్సిన పరాధీన స్థితికి దేశ పాలకులు దేశాన్ని నెడుతున్నారు. ప్రజల దృష్టిని గుళ్లూ గోపురాలవైపు, మతం పేరిట కుహనా సంస్కృతుల వైపు మళ్లించి మూఢత్వాన్ని చేటలతో చెరిగే ప్రక్రియను పెంచి పోషిస్తూ తమ పనిని చడీచప్పుడూ లేకుండా చకచకా చేసుకుపోతున్నారు. అదేమని ప్రశ్నించిన వారి నోళ్లకు తాళాలు వేస్తున్నారు. నిర్బంధించి భిన్నాభిప్రాయాలను అణిచేస్తున్నారు. అందుకే ‘‘వర్ధమాన దేశాలు చేతులు ముడుచుకు కూర్చోరాదని, ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలే ఈ దేశాల ప్రాపంచిక దృష్టికి వెలుగు దివ్వెలు కావాలనీ, నాల్గింట మూడు వంతుల జనాభా(350 కోట్లుపైగా) వర్ధమాన దేశాల్లోనే ఉన్నందున ప్రపంచ పరిణామాలనే ప్రభావితం చేయగల హక్కు, సత్తా ఈ దేశాలకు ఉంది’’ అని కూడా సౌత్‌ కమిషన్‌ మూడు దశాబ్దాల నాడే చెప్పింది. కానీ మోదీ నినాదం ‘ఇండియాలోనే తయారీ’(మేక్‌ ఇన్‌ ఇండియా) కాస్తా క్రమంగా ‘‘ఇండియాలోనే తయారీ, కానీ దాని నిర్మాత అమెరికా’’ అన్న చందంగా మారిపోయింది! మరో మాటలో చెప్పాలంటే–అమెరికా, దాని జేబు సంస్థ ప్రపంచబ్యాంకు చేసిన, చేస్తున్న నిర్వాకమల్లా– ‘‘అరువులివ్వడం, కరువులు తేవడం, రుణం పెట్టడం, రణం పెంచడం’’ అందుకే యువకవి అలిశెట్టి ఏనాడో చాటాడు: ‘‘ అన్నం మెతుకునీ/ఆగర్భ శ్రీమంతుణ్ణీ/ వేరుచేస్తే/ శ్రమ విలువేదో తేలిపోతుంద’’ని! అది తేలకుండా ఉంచడానికే ఘరానా దేశాధిపతుల రాక పోకలప్పుడు పేదల గుడిసెలు కనబడకుండా ఎల్తైన గోడలు కట్టించడం!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top