మాతోనా గేమ్స్! | The game of Kabaddi taught ourselves to humans | Sakshi
Sakshi News home page

మాతోనా గేమ్స్!

Published Sat, Aug 13 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

మాతోనా గేమ్స్!

మాతోనా గేమ్స్!

‘‘మానవులకు కబడ్డీ అనే ఆట నేర్పింది మేమే. అసలు కబడ్డీ అనే ఆటకు మూలం మా జాతే తెలుసా? ’’ అంది కోడి పుంజు.

హ్యూమర్
 
‘‘మానవులకు కబడ్డీ అనే ఆట నేర్పింది మేమే. అసలు కబడ్డీ అనే ఆటకు మూలం మా జాతే తెలుసా? ’’ అంది కోడి పుంజు. ‘‘అదెలా?’’ అడిగాయి మిగతా పక్షులూ, జంతువులు. ‘‘కాదు... నేను కూత పెట్టడం చూసి... నన్ను ఇమిటేట్ చేయడానికి తామూ కూత పెట్టాలని మనుషులు అనుకున్నారు. కూత ఆగితే ఓడిపోయినట్టే అన్న అంశం ఆధారంగా వాళ్లు కబడ్డీని కనిపెట్టారు. మనుషులు స్వార్థపరులు. మా కోడి జాతికి తగినంత పేరు దక్కడం ఇష్టం లేక ఈ విషయాన్ని లోకానికి తెలియనివ్వ లేదు’’ అంది కోడిపుంజు.
 జంతువులూ - పక్షులూ కాస్త పిచ్చాపాటీగా మాట్లాడుకుంటున్నాయి. మాటల్లో  ఇటీవల కబడ్డీకి చాలా ఆదరణ వచ్చిందని ఎవరో టాపిక్ తెచ్చారు. అలా... కబడ్డీకి తమ కంట్రిబ్యూషన్ ఏమిటో కోడిపుంజు చెప్పింది.

 ‘‘ఆ మాటకొస్తే మనుషులకు జిమ్నాస్టిక్స్ నేర్పింది మేమే’’ అంది పిల్లి. ‘‘ఇదే మాట కోతి అంటే నమ్మేవాళ్లం. కానీ నువ్వు చెబితే నమ్మడం కాస్త కష్టమే. మనుషులకు నవ్వడం నేనే నేర్పానంటే ఎంత ఎబ్టెట్టుగా ఉంటోందో ఇదీ అంతే’’ అంది హైనా. ‘‘పిచ్చి జంతువుల్లారా... జిమ్నాస్టిక్స్‌కు మొదటి స్టెప్పు మా నుంచి మానవులు నేర్చుకున్నారు. అందుకే మా గౌరవర్థమే వాటికి ‘పిల్లిమొగ్గలూ... పిల్లిగంతులూ’ అని మా పేరు పెట్టుకున్నారు తెల్సా’’ గొప్పలు పోయింది పిల్లి. ‘‘అన్నట్టు కుస్తీ పట్టడం అన్నది మాదగ్గర్నుంచే మానవులు నేర్చుకున్నారు. ముట్టె కిందికి వంచి ఒకదానికి ఒకటి తాటించి మేం తోసుకుంటూ ఉంటాం కదా. అది చూసే మనుషులు రెజ్లింగ్ నేర్చుకున్నారు’’ అని కొండ గొర్రె మధ్యలో తన గొప్ప చెప్పుకోబోయింది. ఈ విషయంలో కొండ గొర్రెలకూ, కొమ్ము జింకలకూ కాస్త అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ ఈలోపు మధ్యలో అడవి దున్న జోక్యం చేసుకొని... ‘‘కాస్తంత తేడాలున్నా మీరు రెండూ ఒకే జాతి. కాబట్టి మీరిలా కుస్తీ పట్లు  పట్టకండి. ఒకటి మాత్రం నిజం. మమ్మల్ని చూసే కుస్తీ వస్తాదులు ఒళ్లు పెంచారేమో. సూమో ఫైటర్లను చూశాక ఆ ప్రక్రియకు కారణం మేమేనని కచ్చితంగా తెలుస్తోంది’’ అని తన వాదనకు  సాక్ష్యాధారాలను చూపించింది దున్న.

కుస్తీ విషయంలో కొండగొర్రెలూ, కొమ్ముజింకలూ ఘర్షణపడుతున్నప్పుడు ఎంటరైంది అశ్వం. ‘‘ పేటెంట్ కోసం కొట్టుకునే తుచ్ఛమానువుల్లా ఎందుకలా దెబ్బలాడుకుంటారు?   ఒక పని చేయండి. కుస్తీ కనిపెట్టిన క్రెడిట్టు గొర్రెలకు ఇచ్చేద్దాం. లాంగ్ జంప్ జింకలకు కేటాయిద్దాం. మేం ఏ పని చేసినా అంతే... మనుషులు కనిపెట్టారనుకున్న చందరంగం ఎవరిదనుకుంటున్నారు. మాదే! కాకపోతే పాపం... ఆ ఆటలో అటు ఒంటెలనూ, ఏనుగులనీ కలుపుకుపొమ్మని మనుషులకు సలహా ఇచ్చాం. వాళ్లకు అది నచ్చి ఆ ఆటలో మిగతా జంతువుల కంటే మాకే ఎక్కువ క్రెడిట్ ఇచ్చారు. అంతెందుకు వాళ్ల రాజూ, మంత్రి కంటే మాకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు’’ అంటూ ఇకిలిస్తూ, సలికిలించింది గుర్రం.
 
అదలా మాట్లాడుతుండగానే ‘‘గుర్రంగారు... లేనిపోని గొప్పలకు పోకండి. మీరు చెబుతుంటే ఇప్పుడే గుర్తొచ్చింది. మనిషికి అష్టా.. చెమ్మా నేర్పింది నేనే. అలా కిందా మీదా పడి పోతూ, నా సాయంతో  ఐదు గళ్లు గీసి ఆడమని చెప్పా. ఆ తర్వాత పరిణామ క్రమంలో ఎనిమిది గళ్లను పెంచుకున్నాడు మానవుడు. మీరు చెప్పిన చదరంగం అష్టచెమ్మ తర్వాతే’’ అంటూ గుర్రం పట్ల, చెస్సు పట్ల కాస్త కస్సుబుస్సులాడింది గవ్వ.
 
‘‘అసలు మనుషులకు బాణ విద్యను నేర్పింది ఎవరనుకుంటున్నారు. మేమే అంది’’ ఊసరవెల్లి. ‘‘నక్కను చూసి వాళ్లు గోతి కాడ కాచుకొని ఉండటం నేర్చుకుంటారంటే నమ్ముతాను. నిన్ను చూసి వాళ్లు నేర్చుకుంది రంగులు మార్చడం కదా! ఒళ్లు కదలకుండా ఉండే నీకూ బాణవిద్యకూ అసలు సంబంధం ఏముంది?’’ అడిగింది తోడేలు. ‘‘మీరెంత అమాయకులు... అసలు నా నాలుకను చూశాకే కదా మనిషి బాణం కనిపెట్టింది’’ అంది ఊసరవెల్లి. ‘‘ఆపండెహె... మనుషులవి సిగ్గుపడాల్సిన బతుకులు. వాళ్లకు కుట్టడం నేర్పిందే నేను. నా నుంచి కుట్టడం... అనగా టైలరింగ్ నేర్చుకుని బట్టలేసుకొని తమ లోపాలను కప్పిపుచ్చుకుంటూ ఒళ్లు దాచుకొని బతుకుతున్నారు. వాళ్లకు అవి నేర్పాం... ఇవి నేర్పాం అంటూ మీరూ సిగ్గులేకుండా చెప్పుకోవద్దు... మనమూ బట్టలేసుకునే పరిస్థితి రానిచ్చుకోవద్దు. వాళ్లకు అందం లేదు కాబట్టి బట్టలు అవసరమయ్యాయి. దయచేసి వాళ్లతో సమానం కాకండి. అలా మీరు తొడుక్కోవాలనుకుంటే కుట్టకుండానే నా కుబుసం రెడీ’’ అంటూ పాము బుసబుసలాడింది. కింగ్ కోబ్రా కసిరికొట్టడంతో  జంతువులన్నీ సెలైంటైపోయియి. మనిషిలా పక్కదార్లు పట్టకుండా వాటి దారిన అవి  వెళ్లిపోయాయి.
 - యాసీన్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement