చిన్నోడా!

A story by bhagya chandra sri - Sakshi

అర్ధరాత్రి వేళ నిద్రపట్టక మంచంపై అటూ ఇటూ దొర్లుతున్నాడు బాషా. బాషా తన తల్లిదండ్రులకు లేక లేక కలిగిన సంతానం కావడంతో పేదరికంలో ఉన్నప్పటికీ వాడికి ఏ లోటూ రాకుండా గారాభంగా పెంచారు. ఇంట్లో ఒక్క మంచం మాత్రమే ఉండటంతో కొడుకును మంచంపై పడుకోబెట్టి భార్యాభర్తలిద్దరు నేలపైనే కునుకు తీస్తున్నారు. మంచంపై పడుకుంటున్న బాషా కంటినిండా ఒక్క రోజైనా నిద్రపోయింది లేదు. బాషా తన తల్లిదండ్రులవైపు చూసి, ‘ఇక్కడ నిద్ర పట్టక చస్తుంటే కింద పడుకొని వీళ్లు ఎలా నిద్రపోతున్నార్రా!’ అనుకోని రోజు లేదు. ఇదే విషయం అమ్మను అనేక సార్లు అడిగినా, ఆమె నవ్వి ఊరుకుంటుంది గానీ సమాధానం చెప్పలేదు. బాషా తండ్రి రఫీ మాంసం అమ్ముతాడు. తల్లి రబియా ఆయనకు అన్నివిధాల సహకారంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఒకరోజు రఫీకి నాలుగు పక్కల పని తగిలింది. డబ్బుకి ఆశపడి పనులన్నీ ఒప్పుకున్నాడు.  కానీ లోలోన ఆందోళనగానే ఉన్నాడు. ఎలా ఇవన్నీ చక్కబెట్టాలా అని భార్యతో ఆలోచించాడు. ఎవరో ఒక వ్యక్తిని పనికి పురమాయించుకున్నాడు. అయినా ధైర్యం చాలడం లేదు. ‘‘మరేమీ కంగారుపడకండి. మన బాషాను కూడా తీసుకుపోదాం. వాడి కాలేజీకి ఇప్పుడు సెలవులు కూడా! ఇవ్వాళ్టికి వాడినీ తీసుకెళ్తే బాగుంటుంది.’’ అంది రబియా కాస్తంత ధైర్యాన్నిస్తూ.

బాషాను పనికి తీసుకెళ్లడం రఫీకి ఇష్టం లేదు. కానీ ఈసారికి తప్పదనుకున్నాడు. రాత్రి పదకొండు గంటలకే బయలుదేరి పన్నెండు గంటలకు మంత్రి గారింటికి చేరుకున్నారు. అక్కడ ఆరు గొర్రెలు కోయాల్సి ఉంది. పెట్టుకున్న మనిషి రాలేదు. రఫీ చకచకా పని కానిచ్చేస్తున్నాడు. రఫీ గొర్రెలను భాగాలుగా విడదీసి పడేస్తుంటే, తల్లి ముక్కలుగా నరుకుతోంది. బాషా ఇద్దరి మధ్య అటు ఇటు అందించడం, సహాయంగా పట్టుకోవడం వంటి పనులు చేస్తున్నాడు. ముగ్గురూ చకచకా పని చేస్తున్నారు కానీ అంత పని ఒకేసారి, ముగ్గురే చేయడం కష్టమైన పనే! సమయం రాత్రి రెండు దాటుతోంది. మంత్రిగారి మనిషి వచ్చి, ‘‘తెల్లారిపోతోంది. ఇంకో ఇద్దరిని తీసుకురాకపోయారా! మీ ఇద్దరివల్ల ఏమవుతుంది? వీడికేమో పని రానట్లుంది’’ అన్నాడు బాషా వైపు చూస్తూ. ‘‘అవునండీ! వాడికి పని రాదు. ఏదో ఉన్నంతలో వాడ్ని చదివిస్తున్నాం. అందువల్ల పని అబ్బలేదు.’’ అంది రబియా. ‘‘ఎంతసేపు లెండి! అయిపోతుంది. మనిషిని పెట్టాను కానీ వాడు రాలేదు. అయినా ఫర్వాలేదు సమయానికి మీకు అందిస్తాను కదా!’’ అన్నాడు రఫీ. ఆ మాటంటూ కూడా పనిచేస్తూనే ఉన్నాడు.

తెల్లవారు జాము నాలుగయ్యేసరికి పనంతా పూర్తయింది. మంత్రిగారింట్లో పనవ్వగానే అక్కడ్నుంచి రఫీ హడావుడిగా దుకాణం తెరవాలని వచ్చాడు. రబియా, బాషా ఇంటికి వెళ్లిపోయారు. దుకాణంలో ప్రతిరోజూ మూడు నాలుగు మేకలు అమ్ముతుంటాడు రఫీ. ఈరోజు ఒకటయినా చేద్దామని దానిని సిద్ధం చేసుకుని దుకాణం తెరిచాడు. ఇంతలో రాజుగారి ఇంటినుండి కబురు రానే వచ్చింది. మేకలు కోసేందుకు తొందరగా రావాలన్నది దాని సారాంశం. రఫీ త్వరగా దుకాణం పనులు ముగించుకొని ఇంటికి వచ్చాడు. ‘‘రాజుగారింట్లో మేకలు కోయాల్సి ఉంది. త్వరగా బయలుదేరండి.’’ అని భార్యాబిడ్డలను తొందర చేశాడు. బాషా తల్లి వైపు దిగాలుగా చూశాడు.రబియా వాడి పరిస్థితి గమనించి, ‘‘చిన్నోడా! నీకోసమేరా. మీ నాన్నా, నేను కష్టపడుతున్నాం. నువ్వింకా చదవాలి. ఉద్యోగం రావాలి. హాయిగా బతకాలిరా! అందుకేరా ఈరోజు నిన్ను కూడా పనిలోకి తీసుకురాక తప్పలేదు. నాలుగు డబ్బులుంటేనే కదా చదువుకోవడం వీలవుతుంది’’ అని సముదాయించింది. ‘‘పర్వాలేదమ్మా! ప్రతిరోజూ నాన్నా, నువ్వు ఎంత కష్టపడుతున్నారో నాక్కూడా అర్థమైంది.’’ అన్నాడు. రాజుగారింటికి ముగ్గురూ హడావుడిగా బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు అక్కడ పని పూర్తిచేశారు. చెమటలు కక్కేస్తున్నారు. హడావుడిగా ఇంటికి వచ్చి స్నానాలు చేసి రబియా బిర్యానీ తయారీలో పడింది. ఈరోజు ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. బాషా అమ్మకు సహయం చేస్తున్నాడు.

ఇంతలో ఎవరో వచ్చి, ‘‘రఫీ! నిన్ను వాండ్రమ్‌ సర్పంచ్‌ గారు రమ్మంటున్నారు. అక్కడ రెండు మేకలు చెయ్యాలి’’ అన్నాడు. ‘‘రాలేనండీ! రాత్రినుండి పనిచేసి ఇప్పుడే ఇంటికి వచ్చాం. తయారయిన బిర్యాని అప్పగించాలి.’’ అన్నాడు రఫీ. ‘‘రానంటే ఎలా! సర్పంచ్‌ గారింట్లో ఎప్పుడూ నువ్వే కదా చేసేది’’ అన్నాడతను. ‘‘అవుననుకోండి! కానీ ఇప్పటికిప్పుడంటే ఎలా వీలవుతుంది? ఈ పని అవ్వాలి కదా’’ అన్నాడు రఫీ. ‘‘ఫర్వాలేదు. అక్కడ రాత్రి పది గంటల వరకు ప్రార్థనలు జరుగుతాయి. అవి అయిన తర్వాతే భోజనాలు. నువ్వు నాలుగు గంటలకు వచ్చినా సరిపోతుంది.’’ అన్నాడు ఆ వచ్చినతను. భార్య వైపు చూశాడు రఫీ. ‘‘సర్పంచ్‌ గారికి ఎప్పుడూ మీరేగా చేసేది. కాదంటే బాగుంటుందా! సరేననండి. ఇవ్వాళ ఉన్న పని రేపు ఉంటుందా?’’ అంది. ‘‘సరే వస్తానని చెప్పండి సర్పంచ్‌ గారితో’’ అన్నాడు రఫీ. చిన్నోడు ఈసారి తండ్రివైపు గుర్రుగా చూశాడు – ‘‘ఇప్పటికే ఒళ్లు హూనమైంది. ఇంకేం వెళతాం నాన్నా!’’ అంటూ. ‘‘తప్పదురా చిన్నోడా! తెలిసినోళ్లు. కాదంటే ఎలా?’’ అంది రబియా.

త్వరగా పని ముగించుకొని సర్పంచ్‌ ఇంటికి బయలుదేరారు ముగ్గురూ. అక్కడ  మేకను కోస్తుండగా సర్పంచ్‌ వచ్చాడు. రబియాను చూసి, ‘‘మీ చేతి పలావు బాగుంటుందమ్మా! కాస్త పలావు వండి వెళ్లాలి మీరు’’ అన్నాడు. రబియాకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. రబియా ఏదో అనబోతుండగా మళ్లీ సర్పంచ్‌ అందుకొని, ‘‘నాకు తెలుసు, మీరు రాత్రి నుండి పని చేస్తూనే ఉన్నారని. ఇలాంటి సమయంలో అడగకూడదు. అయినా తప్పదు. ఎందుకంటే మాకు ప్రత్యేకమైన అతిథులు వచ్చారు. వారు మళ్లీ మళ్లీ వచ్చే వ్యక్తులు కాదు. పలావు మీరు చేసినట్లుగా మన చుట్టుపక్కల ఎవ్వరూ చేయలేరు. మా ప్రత్యేకమైన అతిథులకు మీ చేతి పలావు రుచి చూపించాలని అడుగుతున్నాను. వంటవాళ్లు ఉన్నారు. మీకు సాయం చేస్తారు. కాస్త కాదనకుండా చేయండి’’ అన్నాడు. ఈసారి రబియా భర్త వైపు చూసింది. ‘‘సర్పంచ్‌గారు అంతలా అడుగుతుంటే ఎలా కాదంటాం, కానివ్వు..’’ అన్నాడు రఫీ. ఇప్పుడు చిన్నోడు అమ్మవైపు గుర్రుగా చూశాడు. ‘‘నాయనా! నీకోసమేరా ఇదంతా’’ అంది రుబియా. బాషా మాట్లాడలేదు.

మేకను కోసే పని అవ్వగానే బిర్యానీ తయారీలో పడింది రబియా. అప్పటికే నీరసం వచ్చిన బాషా ఒక మూల కూలబడ్డాడు.రఫీ, రబియాలు పలావు పూర్తిచేశారు. రాత్రి తొమ్మిది గంటలయ్యింది. అక్కడే కాస్త తిన్నామనిపించి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి పదకొండు గంటలయ్యింది.రబియా వెంటనే వేడినీళ్లు పెట్టింది. ‘‘చిన్నోడా! స్నానం చేసి పడుకోరా. ఉదయం నుండి క్షణం తీరిక లేకుండా పోయింది.’’ అంది. చిన్నోడు పలకలేదు. మళ్లీ పిలిచింది. పలకలేదు. ‘‘వాడు కునుకు తీస్తున్నట్లున్నాడే నేను చేస్తా. ఈలోపు వాడు లేస్తాడులే’’ అన్నాడు రఫీ. రఫీ స్నానమయింది. మళ్లీ నీళ్లు కాగాయి. ‘‘చిన్నోడా! స్నానం చెయ్యరా’’ పిలిచింది. చిన్నోడు అరుగు మీద హాయిగా నిద్ర పోతున్నాడు. తల్లి పిలుపుకి ఉలుకూ పలుకూ లేదు. ‘‘సరే! నిద్రలో ఉన్నట్లున్నాడు. నువ్వు చేసిరా. ఆ తరువాత వాడు చేస్తాడులే!’’ అన్నాడు రఫీ. రబియా స్నానమయింది.

నీళ్లు రెడీ అయ్యాయి. ‘‘చిన్నోడా!’’ అని పిలిచింది. వాడు మత్తుగా నిద్రపోతున్నాడు. తల్లి మాటలకు పలకలేదు. తట్టి లేపింది. అయినా వాడు లేవడం లేదు. హాయిగా నిద్ర పోతున్నాడు. ‘‘వీడు లేవడం లేదండి. ఏం చేయాలి?’’ అంది రబియా. ‘‘పోనీలే! వాడ్ని లేపకు. పడుకోనీ. లేచినప్పుడే చేస్తాడులే’’ అన్నాడు రఫీ.నేలపైనే నిద్రపోతున్న కొడుకు వైపు ప్రేమగా చూసింది రబియా. ఆ సమయంలో.. ‘‘అమ్మా నాకు మంచి నిద్ర పట్టడం లేదు. నాన్నా, నువ్వు నేలపై ఎలా నిద్దరవుతున్నారే’’ అన్న వాడి మాటలు గుర్తుకు వచ్చి రబియా తనలో తనే నవ్వుకుంది. ప్రేమగా బాషా తల నిమిరి ఆ పక్కనే నిద్రకు ఉపక్రమించింది. ఎప్పుడు తెల్లారిందో బాషాకు తెలియలేదు. లేచి చూసేసరికి తల్లి వంట చేస్తోంది. తను ఎక్కడ పడుకున్నాడో చూసుకుంటే చిన్నోడికి ఆశ్చర్యమేసింది. రోజూ మంచంపై పడుకున్నా పట్టని నిద్ర ఇక్కడ పట్టిందా. ఎంత మత్తుగా పడుకున్నాను. ఊహ తెలిసాక ఇంత మత్తుగా ఎప్పుడూ పడుకోలేదనుకున్నాడు.

‘‘అమ్మా! నాన్న ఎక్కడ?’’ అని అడిగాడు బాషా. ‘‘మీ నాన్న ఉదయాన్నే దుకాణం వెయ్యడానికి వెళ్లార్రా! నువ్వు రాత్రినుండి అలా పడుకొనే ఉన్నావు. ఎంత లేపినా లేవడం లేదని మీ నాన్న వాడి నిద్ర పాడు చేయొద్దు. పడుకోనివ్వు అన్నారని నిన్ను లేపలేదు. త్వరగా స్నానం చేసిరా. టిఫిన్‌ చేద్దువుగాని’’ అంది. చిన్నోడు కదలలేదు. రబియా దగ్గరకు వచ్చి, ‘‘నాయనా! ప్రతిరోజూ మంచంపై పడుకునేవాడివి రాత్రి నేలపై పడుకుండిపోయావు. ఎలా నిద్ర పట్టిందిరా!’’ అంది ప్రేమగా, బిడ్డవైపు చూస్తూ. ‘‘అమ్మా! నిన్ను ఎన్నోసార్లు నేను ఇదేమాట అడిగేవాడ్ని. నువ్వు సమాధానం చెప్పకుండా నవ్వి ఊరుకునేదానివి. కానీ నాకు సమాధానం దొరికిందమ్మా’’ అన్నాడు. ‘‘ఏంట్రా!’’ అంది రబియా. ‘‘అమ్మా! కష్టపడి పనిచేసేవాడికి నేలేంటి? మంచమేంటి? ఎక్కడైనా నిద్ర పడుతుంది. అమ్మా! శ్రమలోనే సుఖం ఉంది. సంపాదన ఉంది. ఒక ధీమా ఉంది. ధైర్యం ఉంది. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉంది’’ అన్నాడు. ‘‘ఒరేయ్‌ చిన్నోడా! ఇవన్నీ నాకు తెలియదుకానీ నువ్వు స్నానం చేసిరా. టిఫిన్‌ చేద్దువుగాని’’ అంది. చిన్నోడు విషయం గ్రహించాడు. ప్రతిరోజూ తండ్రికి సహాయపడుతూ మరింత ధీమాగా, మరింత హాయిగా నిద్రపోతున్నాడు.  

-  కె. భాగ్య చంద్రశ్రీ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top