నే నే కాశీని

Shankara Vijayam Part 8 - Sakshi

శంకర విజయం 8

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర 

ప్రజ్ఞానం బ్రహ్మ..... గొప్పదైన జ్ఞానమే బ్రహ్మ.
అహం బ్రహ్మాస్మి... నేను బ్రహ్మమును.
తత్త్వమసి....నీవు బ్రహ్మమై ఉన్నావు.
అయమాత్మా బ్రహ్మ... ఆత్మయే బ్రహ్మము అవుతున్నది.
–ఈ నాలుగు మహావాక్యాల సారమే తమ జీవిత నేపధ్యాలుగా కలిగిన విశిష్టులైన శిష్యులు నీకు నలుగురు లభిస్తారు. నీ చరిత్రకు వన్నె తెస్తారు. వేదవ్యాసుడు నాలుగుగా విభజించిన ఆమ్నాయమనే వేదసంస్కృతిని సముద్ధరించు. భరతఖండానికి నాలుగు వేదసింహాలను నాలుగు దిక్కుల్లోనూ కాపుదలగా ఉంచు. ఇకపై కాలం త్వరత్వరగా మారిపోబోతోంది. అయితే రాబోతున్న పరిణామాలేవీ శాశ్వతం కాదు. నీ మార్గమొక్కటే శాశ్వతమై, ఆచంద్రతారార్కమై నిలుస్తుంది...అన్నారు గోవింద భగవత్పాదులు.

శంకరుడు వినమ్రుడై నిజగురువుకు నమస్కరించాడు.
పరమగురువైన గౌడపాదాచార్యులు కూడా తమ వాణిని వినిపించారు. ‘‘సాక్షాత్‌ కైలాస శంకరుడే తాను నేలకు దిగి వస్తానని మాటిచ్చాడు. నర్మద పొంగును అరికట్టడమే తన అవతారాన్ని గుర్తించడానికి సంకేతమని వ్యాసునికి చెప్పాడు. మానవ ఉపాధిలోకి వచ్చిన తరువాత ఆదిగురువుకైనా గురువు అవసరమవుతాడు. ఆ బాధ్యతను మా గోవిందుడు చక్కగా నెరవేర్చాడు. నేటితో నీ విద్యాభ్యాసం ముగిసింది. ఇంక ఇక్కడ ఉండనక్కరలేదు. నీ మార్గాన్ని ఆవిష్కరిస్తూ సంచారం చేయి. ఎప్పటికప్పుడు నీ లక్ష్యాలను మార్గదర్శకులైన గురువులే నిర్ణయిస్తారు. ముందుగా కాశీనగరాన్ని సందర్శించు. అన్నట్లు శంకరా! నా అద్వైత సిద్ధాంతానికి వెలుగు ప్రసాదిస్తావు కదూ!’’
శంకరుడు పరవశుడై పరమగురువు పాదాలను స్పృశించాడు.

‘‘జగద్గురూ! ఆదిశంకరాచార్యా విజయోస్తు’’ అంటూ గురువులిద్దరూ అక్కడి నుంచి నిష్కమ్రించారు.
జయ జయ శంకర ధ్వానాలు మిన్నుముట్టాయి. అవి ఓంకార పర్వతంపై ప్రతిధ్వనించాయి.
విష్ణుశర్మతో పాటు ఓంకారవాసులు ఒకరిద్దరు శంకరుని వెంట వచ్చారు. తూర్పుదిశగా వారి ప్రయాణం ప్రయాగ మీదుగా గంగాతీరం వెంబడి వారణాసి దిశగా కొనసాగుతోంది. 
శ్రావణ ఆకాశం దట్టమైన మేఘమండలాన్ని సృష్టిస్తోంది. మధ్యమధ్య మెరుపు తీగలు కన్నులకు మిరుమిట్లు గొలుపుతున్నాయి. చిత్తంలో జ్ఞానకళ తళుక్కున తోచి గొప్ప సత్యాన్ని ఆవిష్కరించినట్లు... లోకమంతా శిష్యసమేతుడై నడిచి వస్తున్న బాలశంకరుణ్ణి తిలకించి పులకిస్తోంది.

ఖరదూషణుల వంటి రాక్షసులను నిర్జించిన శ్రీరామచంద్రుని చూపుల్లా తాపసచంద్రుడైన శంకరుని చూపులు తీక్షణమైనవి. రావణ సంహారం అనంతరం మీకేం కావాలంటే నాకోసం చనిపోయిన వారినందరినీ బతికించమన్నాడట రాముడు. ఆ కన్నులలో ఉన్నంత దయారసం ఈ కన్నులలోనూ ఉంది. వేదదూషణ చేసేవారి మతాలను ఖండించి, దేహాత్మభావన తొలగించి జ్ఞానామృతాన్ని జగతికి పంచడానికే శంకర యతీంద్రుడు విజయం చేస్తున్నాడు. జగన్మాత కరుణకు పుంభావంలా భాసిస్తున్నాడు. 
గురుశిష్యుల మధ్య అడుగుకో ప్రశ్న మెరుపుల్లా మెరుస్తుంటే, అంతే చురుకుగా జవాబులు శరాలై కురుస్తున్నాయి.
‘‘గురుదేవా! అన్నింటికంటే గొప్ప విద్య ఏది?’’
‘‘బ్రహ్మజ్ఞానం.’’

‘‘ఏ బోధను మనం అత్యుత్తమం అనవచ్చు?’’
‘‘ముక్తిదాయకం అయిన బోధను.’’
‘‘ముక్తి ఎప్పుడు వస్తుంది?’’
‘‘విషయ వాంఛలు నశించినప్పుడు.’’
‘‘మానవుడు కోరదగిన గొప్ప లాభం ఏమిటి?’’
‘‘ఆత్మలాభం.’’
‘‘జగత్తును జయించగలవాడు ఎవడు?’’
‘‘మనసును జయించినవాడు.’’
–శంకరుడు, విష్ణుశర్మల ప్రశ్నోత్తరాల పరంపర కొనసాగుతుండగా వేరెవరో అడ్డుపడి,
‘‘గురుదేవా! సంసార సముద్రంలో మునిగిపోతున్న వారికి దిక్కేమిటి?’’ అని అడిగారు.

‘‘విశ్వనాథుని పాదపద్మాలే సంసార సాగరాన్ని దాటించగల అతిపెద్ద నౌక’’ అన్నాడు శంకరుడు.
మనోనివృత్తిః పరమోపశాంతిః
సాతీర్థవర్యా మణికర్ణికాత్ర
జ్ఞాన ప్రవాహా విమలా గంగా
సాకాశికాహం నిజబోధరూపః
–ఎక్కడ మనస్సును లయింప చేసే పరమశాంతి దక్కుతుందో అక్కడే... తీర్థాలలో గొప్పదైన మణికర్ణిక ఉంది. జ్ఞానప్రవాహంతో కూడిన గంగను ప్రవహింప చేస్తూ కాశిని సృష్టిస్తోంది. అదే నా బోధలలో ప్రతిఫలిస్తుంది అన్నాడు శంకరుడు.
కాలభైరవుని అనుమతి పొంది కాశీలో ప్రవేశించారు వారంతా. బిందుమాధవుని సేవించి, విశ్వనాథుని అర్చించారు. అన్నపూర్ణను, విశాలాక్షిని పూజించి వెలుపలికి వచ్చారు. విష్ణువు వంటి దేవతలు,  వ్యాసుని వంటి మహర్షులు తపస్సులు పండించుకున్న భూమి అది. విద్యల నగరం కనుక విద్యార్థులందరికీ అక్కడే ఆశ్రయం. పండితుల శాస్త్రచర్చలు సుదీర్ఘంగా సాగుతుంటాయి. విభిన్న మతాలవారంతా అక్కడికే వస్తుంటారు. తమ మతాలను వేదమతంతో పోల్చుకుని, మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు.

పదుల సంఖ్యలో అశ్వమేధాలు చేసిన చక్రవర్తులెందరో సామ్రాజ్య ప్రకటనలు చేసిన దశాశ్వమేధ ఘట్టానికి వచ్చాడు శిష్యసమేతంగా శంకరుడు. ఆయన తేజస్సును గమనించిన విద్వాంసులు కొద్దిసేపు అనుగ్రహ భాషణం చేయమని అభ్యర్ధించగా, శంకరుడు ప్రారంభించాడు.
‘‘ఆనందమే బ్రహ్మ స్వరూపం. శోకానికి తావులేదు. అది మానవుడు కల్పించుకున్నదే. ఆనందమయుడు అయిన విద్వాంసుడు భయానికి దూరమవుతాడు. అత్యంత నిగూఢమైన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఆత్మ నిత్యమైనది. అదే బ్రహ్మము. అందువలన ఆత్మ సర్వవ్యాపి. జీవాత్మ, పరమాత్మలకు భేదం లేదు....ఆ రెండూ ఒక్కటే అనే జ్ఞానమే బ్రహ్మమును పొందే మార్గం. ఆ విధంగా బ్రహ్మమును తెలుసుకున్నవాడు తిరిగి సంసారానికి రాడు. అజ్ఞానం వల్లనే ఈ జగత్తు నానారూపాలతో కనిపిస్తుంటుంది. 
యస్యామిదం కల్పిత మింద్రజాలం
చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా
సా కాశికాహం నిజబోధరూపః
–మనోవిలాసం ఇంద్రజాలాన్ని కల్పిస్తుంది. మిధ్యామయమైన చరాచర ప్రపంచాన్ని సృష్టించి భ్రమలలో ముంచెత్తుతుంది. సత్‌ చిత్‌ సుఖ స్వరూపమే పరమాత్మ అనే ఎరుక జీవునికి కలిగించేది కాశీ క్షేత్రమే. అదే నా బోధారూపం.’’

అందరూ మంత్రముగ్ధులై వింటున్నారు. సభలో ఉన్నవారిలో ఒక లేత కుర్రవాడు మాత్రం పైకి లేచాడు. సింహగమనంతో ముందుకు నడిచి వచ్చాడు. అగాథమైన అతని కళ్లు అన్వేషణ చాలించుకున్నట్లుగా శాంతాన్ని ప్రదర్శిస్తున్నాయి. అతడు శంకరునిపై పాదాలపై పడ్డాడు.
‘‘ఎవరు నాయనా!’’ దయగా అడిగాడు శంకరుడు.
‘‘మాది కావేరీతీరాన చోళదేశం స్వామీ! నా పేరు విమలుడంటారు. భవరోగ పీడితుడినై తీర్థాలన్నీ సేవిస్తూ వస్తున్నాను. చివరకు ఇక్కడ నిజగురువును కనుగొనగలిగాను. రాగద్వేషాలనే అలలతోనూ, కామములనే మొసళ్లతోనూ కూడిన ఈ చావుపుట్టుకల సంసార సాగరం నుంచి నన్ను తరింప చేయండి. మీ దయ అనే నావపై నన్ను జ్ఞానతీరానికి చేర్చండి’’ అని వేడుకున్నాడా బాలుడు.
అతడిని రెండుచేతులా లేవనెత్తి, ‘‘బాలకా! నా కంటికి నీవు జ్ఞానవృద్ధునిలా కనిపిస్తున్నావు. నీవు ఒక్కనివే కానీ, అనేకమందిలా తోస్తున్నావు’’ అంటూ చిరునవ్వు నవ్వాడు శంకరుడు.
‘‘మహాగురూ! మీరు ఆత్మరమణులై వేదాంతమార్గాన్ని విస్తరిస్తున్నారు. మీ తేనె పలుకుల తీపి నేర్పును ఒక్కసారి చవిచూసిన వాడు త్యాగమూర్తి కాగలడు. భూమి కంపించినా, పర్వతాలు నిప్పులు కక్కినా ఆ శాంతమూర్తి చలించడు. ఈ లోకాలన్నీ కలిసివచ్చినా మీ వద్ద బ్రహ్మజ్ఞానం పొందినవాడి సంపదను మట్టుపెట్టలేవు.’’

‘‘అయితే లోకాలన్నీ చుట్టి వచ్చానంటావు?’’ ప్రశ్నించాడు శంకరుడు.
‘‘ఎంత చూసినా, పురుషుడి నడినెత్తిన విదతి అనే మార్గం ద్వారా ఆనందమయ స్థానాన్ని ఆక్రమించిన పరమాత్మను కనిపెట్టలేక పోయాను మహాగురూ!’’ 
‘‘అదేమిటి...ఆయన నిద్రించే వేళ కలుసుకోమని మూడు చోట్లు చెప్పింది కదా ఉపనిషత్తు?’’
‘‘నిజమే... నేత్రం, కంఠం, హృదయం అనే ఆ మూడు తావుల్లోనూ వెతికాను. కన్నులు మూసి తపించాను. మౌనాన్ని ఆశ్రయించి సంభాషించాను. హృదయాన్ని అరికట్టి విహరించాను. సృష్టికర్త అయిన పరమాత్మను అనేక రూపాలలో ఆరాధించాను. నామరూపాలుగా ఇక్కడ విస్తరిల్లినదంతా ఆయన ప్రజ్ఞానమే అని తెలిసి విస్తుపోయాను. ఆ ప్రజ్ఞాన నేత్రాన్ని అన్వేషిస్తూ మీ చరణ సన్నిధికి చేరుకున్నాను’’ అన్నాడు బాలుడు.
‘‘గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే విజ్ఞానమంతా నేర్చుకున్నాను. దేవతలు నాకు రక్షణ కల్పించారు. అమ్మ కడుపు నుంచి గద్దలా బయటపడ్డాను అని చెప్పుకున్నాడు కదా ఓ మహర్షి.... ఆయనకూ నీకూ ఏమైనా చుట్టరికమా?’’ అడిగాడు శంకరుడు.
‘‘తెలియదు స్వామీ! నేను ఇల్లు వదిలి చాలాకాలమైంది’’ అమాయకంగా అన్నాడు విమలుడు.

శంకరుడు సంతృప్తి చెందాడు. తనకు తొలి శిష్యుడు కాదగినవాడు దొరికాడన్న ఆనందం ఆయన కళ్లలో కనిపించింది. విమలుడికి క్రమసంన్యాసం ఇచ్చాడు. జ్ఞానదండాన్ని చేతికందించాడు. హస్తమస్తక సంయోగంతో మంత్రోపదేశం చేశాడు. సనందాచార్యుడనే యోగనామం ఇచ్చాడు. తమ తొలి సంభాషణలో ఐతరేయ ఉపనిషత్తు ప్రస్తావన రావడం శంకరుని మనసులో స్ఫురించింది. అందుకే ఆ ఉపనిషత్తు చిట్టచివరిగా తీర్మానం చేసిన....ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యాన్నే శిష్యునికి అనవరతం సాధన చేయమంటూ బోధించాడు. సనందుని తరువాత ఆనందగిరి వంటి మరికొందరు కూడా శంకరుని వద్ద సంన్యాస దీక్ష స్వీకరించారు. విష్ణుశర్మ అడగలేదు. శంకరుడు ఇవ్వనూ లేదు. 
శంకర శిష్యులందరిలోనూ సనందుడే క్రమంగా ప్రథమస్థానాన్ని ఆక్రమించాడు. శంకరునికి ఉపనిషత్‌ భాష్య రచనలో సనందుడు సహకరిస్తున్నాడు. వాదోపవాదాలలో బాసటగా ఉంటున్నాడు. శంకరుడు జ్ఞానభాస్కరుడు. ఆ సూర్యునికి అనూరుని వంటి సారధి సనందుడు.

శివుడే దక్షిణామూర్తిగా అవతరించి జీవబ్రహ్మల ఏకత్వాన్ని చిన్ముద్రతో ప్రకటించాడు. ఆయనకు వామదేవుని వంటి మహర్షులు శిష్యులయ్యారు. వారే శంకరునికి కూడా మేటి శిష్యులై అవతరించారని కాశీ ప్రజలు చెప్పుకుంటున్నారు. సూర్యకాంత మణిలా తేజరిల్లుతూ శంకరుడు బ్రహ్మవిద్యా ప్రచారం చేస్తున్నాడు. త్రిపురాసుర సంహారవేళ శివుని ఫాలనేత్రం వెలువరించిన నిప్పు మిణుగురుల్లాంటి వాక్కులతో అవైదిక మతాలను ఖండిస్తున్నాడు. అద్వైత స్థాపన చేస్తున్నాడు.
ప్రస్తుతం శంకర శిష్యులలో ఒకడైన ఆనందగిరి పూర్వాశ్రమంలో చార్వాక మతానికి చెందినవాడు. దేవుడే లేడు. ఉంటే కనబడడేం అని వాదించే పరమ నాస్తికుడు.  అతణ్ణి వెంటపెట్టుకుని, ఒకనాటి తెల్లవారు జామున మణికర్ణికకు స్నానానికి బయలుదేరాడు శంకరుడు. దారిలో ఆనందగిరిని అడిగాడు. 
‘‘వత్సా! ఈ సమస్తాన్నీ ప్రకాశింపచేస్తున్న జ్యోతి ఏది?’’
‘‘పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, చుక్కలు.’’
‘‘సూర్యుణ్ణి, చంద్రుణ్ణి నీకు చూపిస్తున్న జ్యోతి ఏది?’’
‘‘కన్ను.’’
‘‘కన్నులు మూసుకున్నప్పుడు కూడా వెలుగుతున్న జ్యోతి ఏది?’’
‘‘బుద్ధి.’’
‘‘ఆ బుద్ధిని చూస్తున్నదేమిటి?’’
‘‘నేను.’’
‘‘అంటే ఆత్మ. కనుక నీవు పరంజ్యోతివి.’’
‘‘ప్రభూ! నేను జ్యోతిని గుర్తించాను’’ అని శిష్యుడు పాదాభివందనం చేశాడు.

గంగాతీరం సమీపించింది. మణికర్ణికా ఘట్టంలో ప్రవేశించబోయి శంకరుడు ఆగిపోయాడు. మెట్లకు అడ్డంగా ఎవరో స్త్రీ తన భర్త శవాన్ని ఒడిలో పడుకోబెట్టుకుని, దీనంగా విలపిస్తోంది.
దారి ఇరుకుగా ఉండడం వల్ల ముందుకు వెళ్లడం సాధ్యం కావడం లేదు. శవాన్ని దాటుకుంటూ పోవాల్సిందే కానీ వేరే మార్గం లేదు. శంకరుడు చాలాసేపే వేచివున్నాడు. కానీ ఆమె కదిలేలా లేదు.
ఎంతో మథనపడి చివరకు, ‘‘తల్లీ! నువ్వీ శవాన్ని ఇక్కడినుంచి తొలగిస్తే మేము స్నానానికి వెళ్తాం. మాకు వేళ మించిపోతోంది’’ అన్నాడు శంకరుడు.
ఆమె వినిపించుకోలేదు. శంకరుడు మళ్లీ మళ్లీ తన అభ్యర్ధనను వినిపించాడు.
అలా కొన్నిసార్లు జరిగిన తరువాత ఆమె చాలా ప్రశాంతంగా, ‘‘ఏం మహాత్మా! నన్ను జరపమని అడగడం ఎందుకు? పక్కకు జరగమని నా భర్తనే అడగకపోయారా?’’ అని ప్రశ్నించింది.
శంకరుడు ఆ మాటతో వెరగు పడ్డాడు. ‘‘తల్లీ! దుఃఖాతిశయంతో నువ్వు గుర్తించ లేకుండా ఉన్నావు. శవానికి తనంత తానుగా కదిలే శక్తి ఉంటుందా?’’ అన్నాడు.
ఆ స్త్రీ శంకరునిపైనే తదేకంగా దృష్టిని నిలిపి, ‘‘ఒకే పరబ్రహ్మ అంతటా నిండి ఉన్నాడని చెబుతున్నావుగా. జీవించి ఉన్నప్పుడు కదిలించిన చైతన్యం జీవుడు శవం కాగానే ఎక్కడికి పోతోంది? నువ్వు చెప్పినట్లు ఆత్మ నిత్యమైనది అయితే.. కాస్త పక్కకు తప్పుకోమని ఈ శవాన్నే అడగరాదా?’’ అని ప్రశ్నించింది.

శంకరుడు నిరుత్తరుడయ్యాడు. అంతర్ముఖుడయ్యాడు. అప్పుడు స్ఫురించింది...
కోశేషు పంచస్వధిరాజమానా 
బుద్ధిర్భవానీ ప్రతిదేహ గేహమ్‌
సాక్షీ శివః సర్వగతో అంతరాత్మా
సా కాశికాహం నిజబోధరూపః
–అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశాలకు ప్రతీకగా అయిదు క్రోసుల మేరకు వ్యాపించి ఉన్నది వారణాసి. ఇక్కడ ప్రతి దేహాన్ని ఇల్లుగా చేసుకున్న బుద్ధియే భవాని. అంతరాత్మ, సర్వగతుడు, సాక్షి శివుడు. ఈ ఉభయ తత్త్వ సమ్మేళనమే నా బోధారూపం అన్నాడు శంకరుడు. 
వెలుగు రేకలు విచ్చి చూసేసరికి అక్కడ స్త్రీ జాడ లేదు. శవమూ లేదు.
- నేతి సూర్యనారాయణ శర్మ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top