ఐదు పైసలు వరదక్షిణ

Sakshi Funday Translated Story

కథా ప్రపంచం

చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గుర్తుకొస్తుంది. మా ఇంటికి ఇద్దరు చిన్నపిల్లలు దూరం ఊరి నుంచి సెలవులు గడపటానికి వచ్చారు. నాన్నకు దూరపు బంధువులైన ఈ పిల్లల ఇంటి పరిస్థితి అంత సుభిక్షంగా ఉండలేదు. పెద్దవాడి పేరు ప్రాణేశ. సుమారు పదేళ్ళు. వాడి చెల్లెలు సుధ. ఆమెకు ఏడేళ్ళు. మా అక్క, నేను దాదాపు అదే వయస్సు వాళ్ళం కావటం వల్ల మాతో ఆడుకుంటూ సెలవులు గడుపుతారని నాన్ననే చెప్పి వాళ్ళిద్దరినీ పిలిపించారు.
పిల్లలిద్దరూ చాలా చక్కగా ఉన్నారు. మా ఊరిలో నీటి సమస్య ఉండేది. వారి ఊరిలోనూ అలాంటిదే సమస్య అనీ, తమ ఇద్దరికీ నీళ్ళు తీసుకుని రావటం వస్తుందని, చిన్న బిందెలు పట్టుకుని మా వెంట కొళాయి నీళ్ళ కోసం వచ్చేవారు.
 చిన్నదైన సుధ అమ్మ పక్కన కూర్చుని మెంతి ఆకులను తుంచి ఇచ్చేది. దేనికీ మొండితనం చేసేది కాదు. వాళ్ళ తల్లితండ్రులను గుర్తుచేసుకుని దుఃఖించేది కాదు. కాళ్ళకు గజ్జెలు వేసుకుని, ఎర్రటి జాకెట్టు  తొడుక్కుని చకచకా తిరిగే సుధ, ఉదయమే స్నానం చేసిన వెంటనే  పట్టువస్త్రాన్ని గోచి వేసుకుని, గోపి చంధనాన్ని ఢాలుగా పూసుకుని, వసారాలో కూర్చుని సంధ్యావందనం చేస్తున్న ప్రాణేశ చిత్రం ఇప్పటికీ నా కళ్ళ ముందుకు వస్తుంది.

అది అక్టోబర్‌ నెల. 
మా ఊరు చుట్టుపక్కంతా పచ్చదనంతో అలరారే సమయం. సామాన్యంగా  ఈ సమయంలో వీధిలోని చిన్నాపెద్ద పిల్లలు అందరూ కలిసి గండి నరసంహస్వామి దేవస్థానానికి వెళ్ళిరావడం అలవాటు. అది ఊరి నుంచి నాలుగు మైళ్ల దూరంలో ఉంది. అదే సమయంలో మా మేనమామ కూడా ఊరికి వచ్చాడు. 
అతను మా మొత్తం పిల్లల సైన్యాన్ని దేవస్థానానికి పిల్చుకుని పోయాడు. ఇంటి నుంచే బిసిబేళేబాత్, పెరుగన్నం కట్టుకుని పోయాం. 
చెరువుగట్టు మీద కూర్చుని, కడుపు నిండా తిని, నీటి చెలమను తవ్వి దాహాన్ని తీర్చుకుని, కోతులతో ఆటలాడి అత్యంత సంతోషంతో ఇంటివైపు బయలుదేరాం.
ఊరులోకి ప్రవేశించే దారిలో కొత్తగా ఓ హోటల్‌ పెట్టారు. మావయ్య అందరిని హోటల్‌కు  తీసుకుని పోయాడు. మాకెవరికీ మా ఊరి హోటల్‌కు వెళ్ళే అలవాటులేదు. బళ్ళారి–హొసపేటకు వెళ్ళినపుడు మాత్రం నాన్న ఒక్కొక్కసారి మసాలా దోసె ఇప్పించేవాడు. అందువల్ల ఊళ్ళోని ఈ హోటల్‌కు వెళ్ళినపుడు ఎవరైనా పరిచయస్థులు చూస్తే మా గతి ఏమిటనే భయం ఉండేది. అయితే నగర జీవితాన్ని చూసిన మా మేనమామ అందరికీ ధైర్యం చెప్పి లోపలికి తీసుకునిపోయాడు. అందరికీ కాఫీ ఇప్పించాడు. మా అందరికీ ఒక విధమైన సంతోషం. 
అయితే చీకటిపడేలోగా ఇంటికి తిరిగి రావాలని అమ్మగట్టిగా చెప్పి పంపింది. అందువల్ల మామయ్య అందర్ని తొందరపెట్టి ఇంటికి తీసుకుని బయలుదేరాడు. కొద్దిదూరం వెళ్ళామో లేదో,  సుధ అత్యంత కలవరంతో ‘‘ప్రాణన్నా... ప్రాణన్నా...’’ అని తన అన్నను పిలిచింది.
 ‘‘ఏమిటే?’’ అని పెద్దవాడైన అతను నిర్లక్ష్యంగా అడిగాడు.
 ‘‘మరి... మరి... కాఫీ చాలా వేడిగా ఉండింది. నేను పూర్తిగా తాగలేకపోయాను. సగం తాగి అలాగే వదిలిపెట్టి వచ్చాను’’ అని కంగారుగా అంది.
 ఆ మాటకు ప్రాణేశ చాలా కంగారు పడ్డాడు.

‘‘అయ్యో ముండా, అమ్మకు తెలిస్తే తిడుతుంది...’’ అని  వెంటనే హోటల్‌కు  పరుగెత్తుకుని వెళ్ళి, చెల్లెలు మిగిల్చిన సగం కప్పు కాఫీ గటగటా తాగి, మళ్ళీ పరుగున వచ్చి మమ్మల్ని కలుసుకున్నాడు.
 తన చెల్లెలితో ‘‘భయపడకు. నేను తాగివచ్చాను. అమ్మ తిట్టదు’’ అని ఓదార్చాడు.
ఇప్పుడు ఈ సంఘటన తలుచుకుంటే చాలా నవ్వు వస్తుంది. అయితే ఆ బాల్యంలో ఏదైనా  ఆహారాపదార్థాలను కింద చల్లితే అమ్మానాన్నలు తిడతారనే విచిత్రమైన భయం మాలోఉండేది. దానికి ధర్మపు ముడిని వేసి పెద్దలు మేము ఏమీ చల్లకుండా చూసుకునేవారు. 
ఉదాహరణకు రాత్రి సమయంలో ఏదైనా కంచంలో తినకుండా వదిలేస్తే ఆ ఇంటి నుంచి లక్ష్మిదేవి వెళ్ళిపోతుందనే ప్రత్యేకమైన భయం అందరిలోనూ ఉండేది. దాదాపు బంధుబలగాల్లో ఆందరిదీ పేదరికపు జీవితాలే. అయినప్పటికీ లక్ష్మిదేవి భయం మాత్రం ఎవరికీ తక్కువగా ఉండలేదు. పెద్దవాళ్ళు దాన్ని ప్రామాణికంగా నమ్మేవారు. 
కొన్నిసార్లు దోసకాయ కూరనో, బీరకాయ కూరనో చేసినపుడు అమ్మకు తెలియకుండా చేదుకాయ అందులో కలిసిపోయేది. నాన్న మాత్రం దాన్ని పారవేయకుండా తింటుండటం ఇప్పుడు తలుచుకుంటే గొప్పగా అనిపిస్తుంది. ఆయన ఎంత స్వచ్ఛంగా భోజనం చేసేవాడంటే, తరువాత ఆ  కంచంలోనే అమ్మ భోజనం చేస్తుండటం మాకు ఎన్నడూ  అసహ్యమనిపించలేదు. 
పండుగ రోజున ఎన్నో వైవిధ్యమైన వంటకాలు ఉంటాయికదా? ఆ రోజు పిల్లలు ఆశతో ఎక్కువగా పెట్టించుకుని, తరువాత తినలేక కింద పారవేయటం ఎక్కువ. దాన్ని తప్పించటానికి నాన్న ఒక ఉపాయాన్ని కనుక్కున్నాడు.  

‘‘అరటి ఆకు నుంచి ఏమీ చల్లకుండా ఎవరు భోజనంచేస్తే వారికి ఐదుపైసలు ఇస్తాను’’  అని భోజనానికి కూర్చోవటానికి ముందే ప్రకటించేవాడు.
 ఆ ఐదుపైసలు మాకు చాలా పెద్దమొత్తంగా కనిపించేది. మాకు ఎంత కావాలో అంత మాత్రమే పెట్టించుకుని ఒక్క మెతుకు కింద పడకుండా తినేవాళ్ళం. ఆకు చివర ఉన్న ఉప్పు కూడా చివరికి చేతికి పూసుకుని, శుభ్రం చేసుకునే అలవాటు చేసుకున్నాం.
 భోజనం అంతా పూర్తి అయిన తరువాత, ఎంగిళ్ళు శుద్ధి చేసే అమ్మ, మేము  ఆకులకింద ఏమీ దాచిపెట్టలేదని కచ్చితపరుచుకున్న తరువాత, చెప్పిన మాటకు బద్ధులైనట్టు నాన్న ఐదుపైసలు ఇచ్చేవాడు. పెద్దమొత్తం సంపాదించిన సంతోషం మాకు కలిగేది. దాంతో ఏమి కొనుక్కోవాలా అని చాలా దీర్ఘంగా చర్చించుకునేవాళ్ళం.
 నాన్న ఈ ఉదారత గురించి  అమ్మ సదా గొణక్కునేది.
 ‘‘ఇప్పటి నుంచే పిల్లలకు డబ్బు రుచి చూపిస్తే తరువాత ఏమిటి గతి?’’ అని నాన్నను నిందించేది.
నాన్న సామాన్యంగా అడవి జంతువు ఉదాహరణ ఇచ్చేవాడు. 
‘‘ఏ అడవి జంతువుకైనా బొజ్జ ఉండటం చూశారా?’’ అని ప్రశ్నించేవాడు. 
బొజ్జ సమస్య ఏమున్నప్పటికీ మనుషులకు లేదా మనుష్యులు సాకిన జంతువులకు మాత్రమే అని కచ్చితంగా చెప్పేవాడు.

కడుపు నిండిన పులిముందు సంచరించినా అది మనల్ని ముట్టదు తెలుసా? ఒక జింకను పట్టుకుంటే మూడు రోజులు దాని మీద జీవిస్తుంది. సంవత్సరానికి సరిపోయే బియ్యం, బేడలు, జొన్నలు సేకరించి పెట్టుకోవటం మనుష్యులు మాత్రమే చేస్తారని చెప్పేవాడు. ‘అడవి జంతువులకు ఉన్న జ్ఞానం కూడా మనుషులకు లేదంటే ఎలా?’ అని వాదించేవాడు.
నాన్న ఇస్తున్న ఆ ఐదుపైసలు ఇప్పటికీ నన్ను అనేక సందర్భాలలో వేధిస్తూనే ఉంటుంది.  జీవితంలో అంతకన్నా ఎక్కువ పొందటానికి ప్రయత్నించినప్పుడంతా నాన్న ఇస్తున్న ఆ ఐదుపైసలు పోగొట్టుకున్న భావన సద్దుచేయకుండా ఏర్పడి, బాధను కలిగించేది.
 వేసుకోవటానికి తగినన్ని దుస్తులున్నప్పుడు, కారణం లేకుండా కొత్త బట్టలను కొనుక్కోవడానికి వెళ్ళినపుడు ఆ ఐదుపైసలు నా కళ్ళ ముందుకు వస్తాయి. చక్కగా ఉన్న టీ.వీని మంచి ఎక్సే్ఛంజ్‌ ఆఫర్‌ ఉందని మార్చి కొత్త టీ.వీ.  తెచ్చేటప్పుడు ఈ ఐదుపైసలు పోగొట్టుకున్నట్టు ఒకటి రెండు క్షణాలు బలహీనమవుతాను. 
ఏదో ఊరికి వెళ్ళి తిరిగొచ్చినపుడు తెచ్చిన లగేజ్‌ను  ఖాళీ చేసేటప్పుడు, అంత దూరం మోసుకుపోయినా వాడకుండా అలాగే వాపసు తెచ్చిన వస్తువు మళ్ళీ అదే ఐదుపైసలను కళ్ళ ముందు కదిలిస్తుంది. నాన్న పాటించే ఆ ఐదుపైసల గొప్పదనాన్ని గ్రహిస్తే, మొత్తం సమాజమే మారే అవకాశం ఉన్నదనే నమ్మకం నాకుంది.
 మొత్తానికి ఈ ఐదుపైసలు నా మొత్తం ఆశపోతుతనానికి కళ్ళెం వేసేటంతటి శక్తి కలిగింది.
ఇలాంటి నాన్న కూడా ఒకింత అన్నం చల్లేటటువంటి ఒక తమాషా ప్రసంగం మా ఇంట్లో జరగటం నాకు గుర్తుకొస్తోంది.

కుక్క, పిల్లి, మొదలైన పెంపుడు జంతువుల పట్ల అమ్మకు చెప్పుకోదగ్గ మమకారం ఏమీ ఉండలేదు. విపరీతమైన మడి–మైలను పాటించే మాధ్వ కుటుంబం కావటంవల్ల పెంపుడు జంతువు మీద ప్రేమ తక్కువే. ఓ రోగిష్టి కుక్క ఏదో విధంగా మా పెరట్లోకి వచ్చి మకాం పెట్టింది. ఎంత తరిమినా మళ్ళీ మళ్ళీ వచ్చి చేరుకునేది. ఎంగిళ్ళను శుద్ధి చేసి చల్లిన దాంట్లోని మెతుకులను తినటానికి అది ఆశగా ఎదురుచూస్తూ కూర్చునేది. అయితే ఒక మెతుకునూ చల్లకుండా భోంచేసే అలవాటును పెంచుకున్న మా ఇంట్లో దానికి ఏం దొరుకుతుంది? నిరాశగా ముఖం పెట్టుకుని వెనుతిరిగిపోయేది. నాన్న ఒకటిరెండుసార్లు అది చూసి నొచ్చుకున్నాడు. మరుసటి రోజు ఒక విచిత్రమైన పద్ధతిని అలవరుచుకున్నాడు. భోజనానికి ముందు చిత్రావతి పెట్టాలికదా? దానికోసం పెద్దపెద్ద ముద్దలు చేసి నాలుగు ముద్దలు చిత్రావతి పెట్టసాగాడు. ఆ విషయం అడిగినపుడు, ‘‘ఆచార్యులవారు అలా చేస్తే మంచిదని చెప్పారు’’ అని నెపం చెప్పారు. అయితే అమ్మకు రెండు రోజుల్లోనే దాని రహస్యం తెలిసిపోయింది.
‘‘చూడండ్రా, ఇది ఆ పాడు కుక్క కోసం మీ నాన్న ఆడే ఆట’’ అని మా ముందు గొణగసాగింది.
ఇప్పటికీ ఏ సమావేశాలకు వెళ్ళినా, జనం ఎలా భోజనాలు చేశారో అని గమనించటం నాకు అలావాటు అయిపోయింది. బఫే డిన్నర్‌ అయినా, తిని వదిలేసిన కంచాలను వేసే  డస్ట్‌ బిన్‌ వైపు ఒకసారి పరిశీలనగా చూడటం నేను తప్పించను.  

భోజనం చేసిన సముదాయపు జనం ఏ విధమైన వారో నాకది స్పష్టంగా తెలియజేస్తుంది. ఇది కేవలం, ‘‘దేశంలో తీవ్రమైన ఆహార సమస్య ఉంది. చాలామంది ఆహారం లేకుండా ఉపవాసం ఉంటున్నారు. అందువల్ల మనం కింద చల్లకూడదు’’ అనే సరళమైన విషయంగా నాలో ఉండిపోలేదు. ఆ మాట నిజమని అంగీకరించినా, దానికి మించిన నైతిక విషయంగా ఇది నన్ను వేధిస్తోంది. 
జగత్తులోని ప్రతి ఒక్కరూ నాన్న దగ్గర ఐదుపైసలు పొందాలని నాకు కోరిక కలుగుతుంది.
‘‘రుచి లేకుండా ఎందుకు ఊరకే తినాలి’’ అనే ఒక వాదనను అప్పుడప్పుడు విన్నాను. ఈ వాదనను నేను అంగీకరించను. భోజనం మాట ఉండనీ, జీవితంలోనూ ఆసక్తి లేని ఎన్నో విషయాలను మనం స్వీకరించాల్సిన ఒత్తిడి ఉండనే ఉంటుంది. ఇక భోజనం సమయంలో ఈ తారతమ్యాలు ఎందుకు? అప్పుడప్పుడు రుచిహీనమైనది తింటే ఏమీ ప్రమాదం సంభవించదు. మనకు వంటచేసి వడ్డించేవారి పట్ల గౌరవం చూపినట్లు అవుతుంది. కావాలంటే అనారోగ్యకరమైన ఆహారాన్ని తినకూడదని అంగీకరిద్దాం.
మొన్న అక్క కూతురి పెళ్ళి జరిగింది. అల్లుడు ఎలాంటి పిల్లవాడోననే కలవరం అక్కలో ఉండనే ఉండేది. ఎవరో  సంబంధం సూచించారని జాతకం చూసి పెళ్ళి చేసే పెళ్ళిళ్ళల్లో కుర్రవాడి స్వభావం ఎలాంటిదో ఎంత వరకు తెలుసుకోవడం సాధ్యం?
పెళ్ళిరోజునే నేను దానికి జవాబు కనుక్కున్నాను. కుర్రవాడు ఒక్కమెతుకు కింద చల్లకుండా శుభ్రంగా భోజనం చేశాడు. అతడి తల్లితండ్రులు అలాగే భోంచేశారు. అక్కను పిలిచి ఆ ఆకును చూపించి, ‘‘భయపడకక్కా, కుర్రవాడు మంచివాడు. అహంకారం లేదు. వారి వంశమూ మంచిదని అనిపిస్తుంది’’ అని చెప్పాను.
అక్కకు ఈ మాట వల్ల సంతృప్తి  కలిగింది.
‘‘అల్లుడికి ఐదుపైసలు వరదక్షిణ ఇవ్వొచ్చు కదా?’’ అని అనిన నా మాటలకు బాల్యాన్ని గుర్తుతెచ్చుకున్న అక్క చిరునవ్వు నవ్వింది.

కన్నడ మూలం:  వసుధేంద్ర
అనువాదం:  రంగనాథ రామచంద్రరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top