పాదుకల శ్లోకం పుట్టుపూర్వోత్తరాలు

Sai patham  - Interchange 40 story - Sakshi

 సాయిపథం – అంతర్వేదం 40

భారతంలో ధర్మరాజుని గురించి వ్యాసుడు వర్ణిస్తూ ధర్మమనే చెట్టులాంటివాడు ధర్మరాజు అనీ నకుల సహదేవులు పుష్పఫలాలు వంటి వారనీ– మాను భీమసేనుడనీ– అర్జునుడు చెట్టు నిలబడటానికి కారణమైన శక్తి అనీ మూలం శ్రీ కృష్ణుడనీ చెప్పాడు. ఇదే తీరుగా దుర్యోధనుడ్ని గురించి చెప్తూ రోషమయ మహావృక్షం దుర్యోధనుడని తెలియజేశాడు వివరించి.బోధి అనే పేరున్న వృక్షం కింద కూర్చుని తపశ్శక్తిని పొందిన కారణంగానే తాను తపశ్శక్తిమంతుడ్ని కాగలిగానని బుద్ధుడు కూడా ప్రకటించాడు.ఇలా చెట్లకీ తపస్సులకీ తాపసులకీ అనుబంధం గోచరిస్తుంది. అందుకే సాయి బహుశ ఈ వృక్షాన్ని ఎంచుకుని ఉండి ఉంటాడు. ఆ చెట్టు నీడని తాను ఉపయోగించుకుంటున్నాడు కాబట్టి, రుణవిముక్తి కోసంమరికొన్ని వృక్షాలని పెంచవలసిన బాధ్యత తనకుందని గ్రహించి ‘వెండీతోట’ని స్వయంగా పెంచి పెద్ద చేయాలనుకునే ఆలోచనకి వచ్చి దాన్ని అమలు చేసుంటాడు. ఎండిన చెట్ల కొమ్మలనీ కాండాలనీ సమిధలుగా చేస్తూ ఇంతటి పవిత్ర నిస్వార్థ భావంతో మనకి ఎంతో ఆశ్రయాన్నిచ్చిన చెట్లకి సద్గతులు కలగాలనే భావంతో (జీవులే వృక్షాలనేది సాయి భావన) వాటి సమిధలని అగ్నిహోత్రంలో (ధుని)వేస్తూ ఆయా దేవతల్ని తృప్తి పరచవలసిందే నన్నాడు సాయి పరోక్షంగా.

ఆ పవిత్రతని కాపాడేందుకే....
అంతటి పవిత్రమైనదీ నిస్వార్థంగా తనని ఆశ్రయించిన అందరికీ సేవచేసినదీ అయిన వృక్షానికి ఉన్న పవిత్రతని మరింత చేసేందుకూ, జనులందరికీ ఉపకారబుద్ధితో పాటూ చెట్టుకున్న గొప్పదనాన్ని తెలియజేసేందుకూ నిర్ణయించుకున్న సాయి ఆ చెట్టు మొదట్లోనే సాయి పాదుకలని ఉంచాలని భావించాడు మనసులో. ఆ పాదుకలు తనవి మాత్రమే కావాలని ఏనాడూ సాయి భావించలేదు.ఎక్కడైనా భగవంతుడు అనగానే వెంటనే పాదాలని కదా ముందుగా పూజిస్తాం. అంతటి శక్తిమంతుడైన భగవంతుని పాదాలని ఎవరి మటుకు వాళ్లు తల మీద పెట్టుకోలేరు కదా! ఆ కారణంగా అందరికీ భగవంతుని చరణాల సేవా సౌభాగ్యం కలగాలనీ, కలిగించాలనీ భావించిన సాయి భగవత్పాదుకలని ఆ పవిత్ర వేపచెట్టు మొదట్లో ఉండేలా చేయాలని సంకల్పించాడు.దేవాలయాల్లో కూడా శఠగోపం అని ఒకటుంటుంది. కిరీటం ఆకారంలో, దాన్ని మన శిరసు మీద పెడతారు. హిరణ్య గర్భాది సురాసురాణాం కిరీటమాణిక్య విరాజమండితం (ఉదాహరణకి శివాలయమైతే)శివస్య తత్పాదసరోజ యుగ్మం త్వదీయ మూర్ధాన మలంకరోతు’ అని చదువుతూ ఆ శఠగోపాన్ని భక్తుల శిరసు మీద ఉంచుతారు. ఆ శఠగోపం మీద ఏ దేవాలయపు శఠగోపమైతే ఆ దేవుని పాదుకలు (ధరించిన పాదరక్షలు) కనిపిస్తూ ఉంటాయి. ఆ శఠగోపం మన తలమీద పెట్టగానే ఆ దైవపాదుకలకి మన తలతో నమస్కారాలని చేసిన పుణ్యం మనకొస్తుందని దానర్థమన్నమాట. పాదుకలని ప్రతిష్ఠించిన తీరూ– అక్కడ చదవాల్సిన శ్లోకాన్నీ అర్థాన్నీ గురించి తెలుసుకుందాం! ఎవరైనా ‘సాయి’ అనగానే వెంటనే గుర్తొచ్చే శ్లోకం ‘సదా నింబవృక్షస్య... సాయినాథమ్‌’ అనే శ్లోకమే. ఒక బిడ్డ పుట్టిందనగానే అందరికీ చెప్పలేని ఆనందం కలుగుతుందనేది యథార్థమే గానీ, ఆ బిడ్డ పుట్టుకకి వెనుక తల్లి గర్భంలో కలిగిన అలజడిని దాదాపుగా ఎవరూ పట్టించుకోరు. అందుకే కాళిదాస మహాకవి అన్నాడు–మామిడి పండుని తినేవాడెవడూ దానిపువ్వు పుట్టడం గురించి ఆలోచించడని. మామిడి చెట్టుకి ఆనందం ఎప్పుడు కలుగుతుందట? మొదటిసారిగా తాను పువ్వుని వేసినప్పుడట. దాన్నే ‘పుష్పవతి’ కావడమంది శాస్త్రం.అలాగే ఈ పైననుకున్న శ్లోకం ఎలా పుట్టిందో దాని అర్థం వివరంగా ఏమిటో తెలుసుకుందాం!

శ్లోకానికి నాంది ఇదీ!
షోలాపూర్‌ జిల్లాలో అక్కల్‌కోట అనే ఓ గ్రామం ఉంది. అక్కడ ఓ మహాతపశ్శక్తి సంపన్నులు ఉండేవారు. ఆయన్ని అందరూ ‘మహారాజ్‌’ అని పిలుస్తూ ఉండేవారు. దాంతో ఆయన ‘అక్కల్‌కోటకర్‌ మహారాజ్‌’గా వ్యవహారంలోకి వచ్చేశారు. వీరికి మహాభక్తుడు కృష్ణజీ(భాయి కృష్ణజీ అవీ బాగేకర్‌). ఆయనెప్పుడూ ఈ మహారాజ్‌ గారి చిత్రపటాన్ని ఎదురుగా పెట్టుకుని నిరంతరం పూజిస్తూ ఉండేవారు. ఓసారి మాత్రం కృష్ణజీకి అక్కల్‌కోట గ్రామానికి స్వయంగా వెళ్లాలనీ, అక్కడ ఉన్న మహారాజ్‌ గారి పాదుకల్ని దర్శించి స్వయంగా పూజించుకోవాలనీ ఓ ఆలోచన వచ్చింది. ఇక బయల్దేరి రేపు వెళ్దామనుకుంటూ ఉండగా ఆయనకి ఓ కలొచ్చింది. ‘కృష్ణజీ! ప్రస్తుతం నా నివాసస్థలం అక్కల్‌కోట కాదు షిర్డీ. అక్కడికి పోయి నా మీద ఉన్న నీ భక్తినంతా అక్కడ ఉంచి నీ పూజని అక్కడ చేసుకో!’ అని స్వయంగా అక్కల్‌కోటకర్‌ మహారాజుగారే చెప్పినట్లుగా తోచింది కలలో. వెంటనే కృష్ణజీ తన నిర్ణయాన్ని మార్చుకుని అక్కల్‌కోటకి బదులుగా షిర్డీకి వెళ్లాడు. ఎందుకో అక్కడకి వెళ్లాక సాయిని దర్శించాక, అక్కడ వాతావరణం మరింత హృద్యంగా అనిపించాక వెంటనే వెళ్లిపోదామనిపించలేదు. దాంతో ‘రేపు వెడదాం – మాపు పోదాం’ అనుకుంటూ ఆయన ఆర్నెల్లపాటు అక్కడే సాయిని సేవించుకుంటూ ఉండిపోయారు.దాంతో ఆయనకి సాయితో మరింత అనుబంధం పెరిగిపోయింది. ఇలా షిర్డీలో వీరున్న కాలంలో బొంబాయి నుంచి డాక్టరూ(రామారావు కోరారే) ఆయనతో పాటు ఆయన కాంపౌండర్‌ కూడా వచ్చారు. దీంతో డాక్టరూ, కాంపౌండర్‌ వీరే కాక సగుణ్‌ –దీక్షిత్‌ అనే వారు కూడా బాగా సన్నిహితులయ్యారు ఈ ఆరునెలల కాలంలో. ప్రతినిత్యం ఇలా సాయి గురించిన భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మాటల మధ్యలో– సాయి ప్రతినిత్యం ఏ వేపచెట్టు కింద కూర్చుని నిరంతర విరాగమూర్తిగా తపస్సు చేసుకుంటూ ఎండ, వాన, చలి అనే వాటిని లెక్క చేయకుండా ఉండి మొత్తానికి సిద్ధిని సాధించి సిద్ధుడయ్యాడో ఆ విశేషం అందరికీ ముందునాటికి అర్థమయ్యేలా తెలియజేయాలి’ అనే ఆలోచన ఒక్కరికి కాదు ఏకగ్రీవంగా వచ్చింది.

ఆలోచన రావడమేమిటి? దాన్ని అమలు చేయాలనే నిర్ణయబుద్ధి కలిగిన డాక్టరుగారు షిర్డీలోనే పాదుకల నమూనాని రాయించారు. ‘మన బుద్ధికి తోచినట్లూ– అంతేకాక అక్కల్‌కోటకర్‌ మహారాజుగారి పాదుకలని చూసి వాటి పద్ధతిలో నమూనాని రాసినట్లూ ఉన్నాయి ఈ పాదుకలు. ఏ అతి ముఖ్యమైన శాశ్వతమైన పనిని చేయదలచినా అది లోపభూయిష్టంగాని, దుర్విమర్శకి లోనయ్యే తీరుగా గానిఉండకూడదు సరికదా– ఒకసారంటూ వాటికి ప్రతిష్ఠ జరిగిన పక్షంలో వాటిని మార్చడం కూడా సరికాదు. భక్తులందరికీ కూడా అదో తీరు భావన ఈ పాదుకల విషయంలో కలగచ్చు కూడా.అందుకని పాదుకలూ– నమూనా... మొదలైన విషయాల్లో గట్టి అనుభవం, అంతేకాక తపశ్శక్తీ పుష్కలంగా ఉన్న ఉపాసనీ మహారాజ్‌ గారు ఉండే ఖండోబా అనే పేరున్న ఆలయానికెళ్లారు. ఆయన ఆ పాదుకల నమూనాని చూస్తూనే ఎంతో సంతోషపడి – ఎన్నాళ్లకి ఈ మంచిపని జరుగుతోందనే ఆనందాన్ని వ్యక్తీకరించారు. ఆ పాదుకల నమూనాలో కొన్ని మార్పుల్ని చేస్తూ– పద్మం, శంఖం,చక్రం అనే వాటిని కూడా చేర్పించారు. ఈ వేపచెట్టుకున్న గొప్పదనాన్ని కూడా లోకానికంతటికీ తెలియజేయదలిచి ఓ శ్లోకాన్ని రాసి– దాన్ని ఓ ఫలకం మీద చెక్కించి ప్రతిష్ఠించడం బాగుంటుంది అని సూచించారు కూడా.

పెద్దరికం
పెద్దలెప్పుడూ కూడా ‘ఇలా చేయవలసిందే – చేసి తీరాలి’ అని ఆజ్ఞాపించరు. ఒకవేళ అవతలి వ్యక్తులు తమభావాన్ని అర్థం చేసుకోలేక తాము సూచించిన విధంగా చేయని పక్షంలో మనసు నొచ్చుకోవలసి వస్తుందనుకుంటూ కేవలం సూచన ప్రతిపాదన వంటి వాటినే చేస్తారు. దీన్నే ‘పెద్దరికం నిలుపుకోవడం’ అంటారు.పెద్దలు అలా చేసిన సూచనని తప్పక పాటించదలిచి ఆ సూచననే సలహానే ప్రతిపాదననే ఓ ఆజ్ఞగా భావించి చేయడమనేదాన్ని ‘భక్తి – శ్రద్ధ’ అంటారు. ఇలా తాము చెప్పిందాన్ని చెప్పినట్లుగా అవతలివారు పాటిస్తున్నారని అనిపిస్తే పెద్దలు – మరింత జాగ్రత్తగా ఆలోచించి, ఒకటికి రెండుమార్లు తర్కించుకుని మాత్రమే సూచన, సలహా, ప్రతిపాదనని చేస్తారు తప్ప యథాలాపంగా ఏమేమో చెప్పెయ్యరు. ఇలాంటి చరిత్రలని వింటూ ఉంటే ఎదుటివారికి ఎలా సలహా సూచన ప్రతిపాదన అనే వాటిని మనం చేయాలో అర్థమవుతుంది. ‘నా ఈ సలహాని, సూచనని పాటించని పక్షంలో... భోజనం చేయననీ, ఇంటికి రానేరాననీ, ముఖం చూడననీ’ ఈ తీరుగా పలకడం ఎంతటి పిల్లతనానికీ, పిల్లచేష్టలకీ ఉదాహరణమో... అర్థం చేసుకోగలుగుతారు ఆ తీరు లక్షణమున్నవాళ్లు. పైగా ఈ సూచన చేసిన ఆయన ‘ఉపాసని–మహారాజ్‌’ ఉపాసనని చేసి చేసి, ఉపాసన కారణంగా ‘ఉపాసని’ గానూ అందరి పట్లా ప్రేమా వాత్సల్యాలని చూపే కారణంగా మహారాజ్‌గానూ పేరు పొంది ‘ఉపాసనీ మహారాజ్‌’ అయ్యారు. అలాంటి వాళ్లకి రాబోయే విషయం సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా చెప్పకపోవడం అనేది వారి గొప్పదనం – పెద్దరికం కూడా. అందుకే దేవతలు అలాంటి వారికి మాత్రమే భవిష్యత్‌ దర్శన శక్తినిస్తారు. దాన్ని సద్వినియోగ పరుచుకుంటే నిచ్చెన మెట్ల మీదుగా సాగిపోయేటట్లు ఎదిగిపోతారు. అలాంటి ప్రవర్తన లేని పక్షంలో వైకుంఠపాళి (పరమపదసోపాన పటం) ఆటలో పామునోట్లో పడి ఒక్కసారిగా కిందికి పడిపోయినట్లు అథఃపతనానికి వచ్చేస్తారు. సరే!

శ్లోకం– అర్థం
సదా నింబవృక్షస్య మూలాధివాసాత్‌
సుధాస్త్రావిణం తిక్తమప్యప్రియం తమ్‌
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురం సాయినాథమ్‌
ఈ శ్లోకాన్ని కొన్ని సాయి దేవాలయాల్లో తప్పుగా వేయించడం జరిగిన కారణంగానూ, అది అధికసంఖ్యలో భక్తుల నోళ్లలోకి వెళ్లిపోతోందనే ఉద్దేశంతోనూ స్పష్టంగానూ వివరంగానూ దీని అర్థాన్ని తెలుసుకోవలసి ఉంది. ముఖ్యంగా ‘మూలధివాసాత్‌’కి బదులుగా ‘మూలాదివాసాత్‌’ అనీ, ‘కల్పవృక్షాధికమే’ అన్నదానికి బదులుగా ‘కల్పవృక్షాదిక’ అనీ దోషాలు దొర్లి కనిపిస్తున్నాయి. ఆ దోషాల్లేకుండా ఉండేందుకూ ఏది దోషమో ఏ తీరుగా చదివితే దోషం లేకుండా చదువుకుంటున్న తృప్తి ఉంటుందో– ఆ తీరులో అర్థమయ్యేలా వివరించుకుందాం శ్లోకాన్ని.
శ్లోకానికి ముందుగా తెలుసుకోవలసినది పదాల విరుపుని. దీన్నే పద విభాగం అంటారు.

సదా– నింబవృక్షస్య– మూలాధివాసాత్‌
సుధాస్రావిణమ్‌– తిక్తమ్‌– అపి– అప్రియమ్‌– తమ్‌
తరుమ్‌– కల్పవృక్షాధికం– సాధయంతమ్‌
నమామి– ఈశ్వరమ్‌– సద్గురుమ్‌– సాయినాథమ్‌ అనేది పదవిభాగం.

పదవిభాగం లాగానే ప్రతి పదానికీ అర్థాన్ని కూడా తెలుసుకుంటే పొరపాటున కూడా ఈ శ్లోకమే కాదు ఏ శ్లోకాన్ని కూడా తప్పుగా ఉచ్చరించనే ఉచ్చరించలేం. అలా తప్పుగా ఉచ్చరించినందువల్ల కలిగే దుష్పరిణామం కూడా మనకి తెలిసే అవకాశముంటుంది.

ప్రతిపద అర్థం
సదా– పగలు, సాయంతరం, రాత్రి, ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం, చలికాలమనే భేదాన్ని లెక్కించకుండా ఎప్పుడూ కూడా నింబ వృక్షస్య– ఆ తోవపక్కనే ఉన్న వేపచెట్టు యొక్క మూల+అధివాసాత్‌– మొదట్లోనే స్థిరంగా కూచుని ఉండే కారణంగా తిక్తమ్‌ – పుట్టుకతో తనకి కలిగిన చేదు తనంతోనే ఉన్నదీ అ–ప్రియమ్‌–ఎవరికీ కూడా ఏ మాత్రపు ఇష్టమూ కానిదీ అయిన తమ్‌ తరుమ్‌ – సామాన్యమైన జాతికి చెందిన ఆ వేప చెట్టుని (మంచిగంథం వంటిది కానిదైన)సుధా స్రావిణమ్‌ – నిరంతరం తేనెని ప్రవహించే తీరు కలిగిన దానిగానూ నిరాశా నిస్పృహలతో జీవితాన్ని చాలిద్దామనుకునేవారికి అమృతాన్ని ప్రవహించే తీరు లక్షణం కలిగినదవుతూ జీవించాలనే ఆలోచనని కలిగించే దానిగానూకల్పవృక్ష+అధికమ్‌ – అంతేకాక, ఏ కోరికని అడిగితే ఆ కోరికని అడిగినవాని అర్హతని బట్టి తీర్చే లక్షణమున్న దేవలోకవృక్షమైన కల్పవృక్షం కంటే గొప్పదనం కలదానివిగానూసాధయంతమ్‌ – ఏ రోజు కారోజు దాని గొప్పదనం జనులకి అర్థమయ్యేలా తీర్చిదిద్దుతున్నవాడూసత్‌+గురుమ్‌ – సజ్జనులకి మార్గదర్శనాన్ని చేస్తూ ఉండే ఓ గురువైనవాడూ, ఏ విధమైన లోటూ లోపమూ లేకుండా పరిపూర్ణమైన గురు లక్షణాలు కలిగిన వాడూసాయి నాథమ్‌ – దీనులకి రక్షకుడవుతూ ‘సాయి’ అనే పేరుగలిగి అందరికీ దిక్కైన వాడూఈశ్వరమ్‌ – సర్వశక్తులూ సర్వసిద్ధులూ తనలో కలిగి అందరి కష్టాలనీ నష్టాలనీ తొలగించగల సమర్థుడూ అయిన వానికి నమామి – ఎల్లవేళలా సర్వకాలాల్లో నమస్కరిస్తూనే ఉంటాను.భావం – ఈ శ్లోకంలో సాయి గొప్పదనం మొత్తం చిత్రీకరింపబడి కనిపిస్తుంది తరిచి చూస్తే.అదో సామాన్యమైన వేరు చెట్టు. ఆ చెట్టుకి ఆకులు కూడా సన్నగా చిన్నగానే ఉండే కారణంగా ఎక్కువనీడ నియ్యలేదు. పోనీ! దాని పుష్పాలు గాని, ఫలాలు గాని ఆహారంగా పనిచేస్తాయా? అంటే అందుకూ దానికి సమర్థత లేదు. పోనీ! ఏ నిద్రగన్నేరో మర్రీ మొదలైన వృక్షాల్లాగా పక్షులకి గూళ్లనీ, ఎలుకలూ మొదలైన వాటికి కన్నాలనీ,కోతులూ మొదలైన వాటికి ఆధారంగా కొమ్మల్నీ... ఈయగలదా? అంటే అలా ఈయగలిగిన శక్తీలేనిది– ఏ జీవజంతువులకీ ఆశ్రయాన్ని ఇచ్చి ఉన్నదీ కాదు. అలాంటి వేపచెట్టు అది. పైగా తన దగ్గరికి ఎవరినీ రానిచ్చుకోలేని రెండు అవగుణాలు – ఒకటి చేదుతనం, రెండవది ఎవరికీ ఈ చెట్టు అనగానే పట్టనితనం అనేవి కలిగి ఉండే జాతికి చెందిన వృక్షం.అలాంటి వృక్షాన్నే ఆశ్రయించాడు సాయి అనేది విశేషం. మల్లె, సంపెంగ, చందనం మొదలైన తీగల్నీ, చెట్లనీ ఎందరో ఇష్టపడతారు. అది కాదు విశేషం. ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం.
 – సశేషం

ఏ గొప్పదనమూ లేనిదాన్ని స్వీకరించడం అలా ఆశ్రయించిన వ్యక్తి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఏ వారమో 2 వారాలో ఆ చెట్టు మొదట్లో కూచుని అసౌకర్యంగా ఉందనే విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించి మరో చెట్టు మొదట్లోకి చేరడం గొప్పదనం కాదు. అదే చెట్టు మొదట్లో ఉండటం. అంతే కాక తన నివాసం కారణంగా ఆ చెట్టుకి ఓ గొప్పదనాన్నీ మహిమనీ కలిగించడం ఓ విశేషం. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top