కథ వాళ్లది... క్రియేటివిటీ మనది! | Sakshi
Sakshi News home page

కథ వాళ్లది... క్రియేటివిటీ మనది!

Published Sun, Sep 27 2015 12:51 AM

కథ వాళ్లది... క్రియేటివిటీ మనది!

ఆ సీన్ - ఈ సీన్
రాయలసీమ నేపథ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించిన సినిమాల్లో ఒకటి. ఇళయ రాజా సెకెండ్ ఇనింగ్స్ మొదలుపెట్టాక వచ్చిన మంచి మ్యూజికల్ హిట్. కృష్ణ వంశీ ప్రతిభని ఆవిష్కరించిన సినిమా. ప్రకాష్‌రాజ్‌కు జాతీయ అవార్డును సంపా దించి పెట్టిన సినిమా. తమిళం, హిందీ వంటి భాషల్లో రీమేక్ అయిన సబ్జెక్ట్. అంతఃపురం సినిమా గురించి పరిచయం చేయడానికి ఇలాంటివెన్నో చెబుతుంటారు విశ్లేషకులు. అయితే ఈ సినిమాకి సంబం ధించి చాలామందికి తెలియని విశేషం ఒకటుంది.

అదేంటంటే ఈ చిత్ర కథ, క్రియేటివ్ డెరైక్టర్ కృష్ణవంశీ క్రియేషన్ కాదు. దీనికి మూలం...  ‘నాట్ వితౌట్ మై డాటర్’ అనే హాలీవుడ్ సినిమా! అనుకోకుండా భయంకరమైన మనుషులు, ఊహించని పరిస్థితుల మధ్య చిక్కుకున్న ఒక వివాహిత... ఆ పరిస్థితుల నుంచి కూతురితో పాటు ఎలా బయట పడిందనేది 1991లో వచ్చిన ‘నాట్ వితౌట్ మై డాటర్’ కథాంశం.

ఆ తర్వాత ఏడెనిమిదేళ్లకు అదే కథాంశంతో, పాపను బాబుగా మార్చి...  సౌందర్య, సాయి కుమార్, ప్రకాష్‌రాజ్, జగపతిబాబులను ప్రధాన పాత్రల్లో పెట్టి ‘అంతఃపురం’ను రూపొందించారు కృష్ణవంశీ. అయితే భిన్నమైన నేపథ్యంతో, భిన్న పరిస్థితుల కల్పనతో తెలుగు వెర్షన్ చిత్రీకరణ జరిగింది. పాత్రల స్వభావాలు మారాయి, కొత్త పాత్రల సృష్టి జరిగింది. అవే తెలుగు వెర్షన్‌ను సక్సెస్ చేశాయి. కాపీ అన్న అనుమానం రాకుండా చేశాయి.
 
‘నాట్ వితవుట్ మై డాటర్’ కథని పరిశీలిస్తే... అమెరికాలో సెటిలైన ఓ ఇరానీ డాక్టర్... ఒక అమెరికన్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి ఒక పాప పుడుతుంది. తప్పనిసరి పరిస్థితు లేవో ఏర్పడటంతో... ఇరాన్‌లో ఉన్న తమ కుటుంబాన్ని చూసి వద్దామని అతడు ప్రతిపాదిస్తాడు. తిరిగి అమెరికాకు వచ్చేద్దా మని హామీ ఇవ్వడంతో భార్య సరే అంటుంది. తీరా ఇరాన్‌లో అడుగుపెట్టాక... ఆడది ముఖానికి ముసుగు వేసుకోవాల్సిందేననే ఛాందసవాదం అమెకు స్వాగతం పలుకుతుంది.

ఇక అక్కడ్నుంచి అడుగడుగునా ఇబ్బందులే. అమెరికాలో ఎంతో స్వేచ్ఛగా పెరిగిన ఆమెకు ఇరాన్‌లోని భర్త కుటుంబ ఛాందసత్వం నరకాన్ని తలపింపజేస్తుంది. నాలుగేళ్ల కూతురిని కూడా తమ పద్ధతు లతో పెంచాలని అత్తమామలు భావించే సరికి తట్టుకోలేక ఎదురు తిరుగుతుంది. అమెరికా వెళ్లిపోదామంటుంది. కానీ భర్త ఒప్పుకోడు. అమెరికా వెళ్లేది లేదని స్పష్టం చేస్తాడు. చివరకు ఆమెను చంపడానికి కూడా వెనుకాడనంటాడు. నిర్ఘాంతపోయిన ఆమె ఎలా బయట పడుతుంది, బిడ్డను తీసుకుని అమెరికా ఎలా చేరుకుందనేది మిగతా కథ.
 
ఈ ఆంగ్ల చిత్రంలో... రెండు సంస్కృతుల మధ్య ఉన్న తేడాలను ఎలివేట్ చేయడానికి ప్రయత్నించాడు దర్శకుడు. భర్తను ఛాందసవాదిగాను, ఇరాన్ కల్చర్‌ను భయంకరమైనదిగాను చూపించారు. కానీ తెలుగుకు వచ్చేసరికి కొన్ని మార్పులు చేశారు కేవీ. ఇరాన్ కల్చర్‌ను రాయలసీమ కల్చర్‌గా మార్చారు. భర్తను మంచివాడిగానే చూపి, ఆ క్యారెక్టర్‌ను అంతం చేశారు. ఆపైన సినిమాను హీరోయిన్ భుజస్కంధాల మీద వేశారు.  కొన్ని అదనపు పాత్రలను జోడించి, మనసులకు హత్తుకునే కొన్ని హృద్యమైన సన్నివేశాలను చేర్చారు.
 
అలాగే సౌందర్య తప్పించుకోవడానికి సహాయపడే పాత్రను జగపతిబాబు పోషించారు. ఈ పాత్ర ఆలోచన కేవీది కాదు. హాలీవుడ్ సినిమా లోనూ ఇలాంటి పాత్ర ఉంది. కాకపోతే దాని కంత ప్రాధాన్యత లేదు. కానీ తెలుగులో జగపతిబాబు హీరోయి జాన్ని ఎలివేట్ చేసి, మనసుల్లోకి చొచ్చుకు పోయేలా ఆ పాత్రని మలిచారు.
 
సాధారణంగా రీమేక్ సబ్జెక్టులకు అవార్డులివ్వరు. కాపీ అనిపించినవి కూడా అవార్డులకు అనర్హ మైనవే. కానీ ఈ చిత్రానికి చాలా అవార్డు లొచ్చాయి. జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు సైతం వచ్చింది. దానిక్కారణం కృష్ణవంశీ. ఎక్కడా కాపీ అనిపించని విధంగా ఈ చిత్రాన్ని మలిచారాయన. కాపీ చేయడంలో మాయను, కథను లోక లైజ్ చేయడంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తే... ఎవ్వరైనా ముగ్ధులవ్వాల్సిందే. ఎలాంటి అవార్డులైనా దక్కాల్సిందే!
- బి.జీవన్‌రెడ్డి

Advertisement
Advertisement