పెండ్లి  చూపులు

Manne Alia Telugu Short Story In Sakshi Funday

 కొత్త కథలోళ్లు

ఈ మధ్య గుసగుసలు ఎక్కువైనట్టు విన్నాను. ఇంటికొచ్చినప్పుడల్లా కొత్త కొత్త కథలు వినబడుతున్నాయి. ఊర్లె వేరే సమస్యలు లేనట్టుగా చర్చించుకుంటున్నారట. నా గురించి మా ఇరుగు పొరుగు అమ్మలక్కలు చెప్పేకంటే ముందే నేనే చెప్పేస్తే వాళ్లకు శ్రమ లేకుండా పోతుందని నా కథ నేనే చెపుతాను.
ఆడ పిల్లలకు చదువేమి అవసరం? అనే ఆరోజుల్లో నన్ను చదివించాలనుకొన్నాడు మా నాయన. ఆటపాటల్లో చదువులో అన్నింటిలో నేనే ముందుండే దాన్ని. సంక్రాంతి పండుగ ముగ్గుల పోటిలో ప్రతి సంవత్సరం నాకే మొదటి బహుమతి వచ్చేది. మొగపిల్లలతో సమానంగా ఆటలు ఆడేదాన్ని.
మేము ఇప్పుడుంటున్న ఇల్లు ఎప్పుడో తాతలనాటి పెంకుటిల్లు. ఆ రోజుల్లో మా ఊర్లె అదే పెద్ద ఇల్లు. మా తాత కట్టర్‌ కమ్యునిస్ట్‌. నిత్యం మహామహా ఉద్దండులు వచ్చిపోయేవారు. చర్చలు సమావేశాలు సర్వసాధారణంగా జరిగేవి. ఆ వాతావరణంలో పుట్టి పెరిగిన మా నాయన కమ్యునిస్టు ఉద్యమాల్లో చురుకుగా  పాల్గొనేవాడు. తెల్లని కుర్త కమీజు, భుజం మీద కండువతో ఆరడుగుల విగ్రహం. మా తాలుకాలో తనను ఎరుగని వారు వుండేవారు కాదు.

చుట్టూ పక్కల నాలుగూల్లల్లో ఏ పంచాయతి జరిగిన న్యాయం వైపు నిలబడేవాడు. అలా నిలబడడంతో  ఎంతో మందికి శత్రువయ్యాడు. ప్రభుత్వ వుద్యోగం వచ్చిన కాదనుకొని పేదలకు జరుగుతున్నా దోపిడిని ప్రశ్నిస్తూ ఊర్లోనే ఉండిపోయాడు. ఎన్నో సార్లు తనపై దాడులు జరిగిన ఎవరికీ జంకేవాడు కాదు.
ఒకసారి రాజిగాడు దొర ముందు చెప్పులేసుకొని నడ్చిండని గడికి పిలిపించిండు. రెండు చేతులు వెనకకు విర్చి కట్టేసి, కుక్కను కొట్టినట్టు కొట్టిండు. చెప్పులు కుట్టేవాడికె చెప్పులేసుకొనే హక్కు లేకపోవడం అన్యాయం అని గొత్తెత్తిండు మా నాయన. రాజిగాని కులపోల్లలందర్కి చెప్పులేయించి గడిలోకి తీసుకెళ్లి బలవంతగా రాజిగాన్ని విడిపించుకొచ్చిండు. అది అవమానంగా భావించి కక్ష పెంచుకొన్నాడు దొర. గడిపై దాడి చేయించాడని కేసు పెట్టి  జైలుకు పంపించాడు. కొద్దిరోజుల్లోనే నిర్దోషిగా విడుదలయ్యాడు నాయన.
మా తాత నుండి వారసత్వంగా సంక్రమించిన భూమి తప్ప తను సంపాదించిందేమి లేదు.

మా అమ్మే దగ్గరుండి వ్యవసాయం చేయించేది. ఏనాడూ ఇంటి పట్టున వుండేవాడు కాదు. మా అమ్మకు ఇంటి పని, పొలం పనితోని పాటు  మా నాయన కోసం వచ్చిపోయేవాళ్ళకు చాయలు(టీ లు)  పోయడం, భోజనాలు పెట్టడం రోజుండే పని. రోజు ఎవరో ఒకరిద్దరైనా వచ్చి పోతుండేవారు. మా నాయనా వేసుకొనే కుర్త కమీజు మల్లెపూవుల్లాగా తెల్లగా ఉతికి పెట్టడం, ఇస్త్రి చేయించి పెట్టడం తప్పేదికాదు. ఎక్కడికి వెళ్ళేవాడో, ఎప్పుడు వస్తాడో ఇంటికి వచ్చేంతవరకు తెలిసేది కాదు. కొన్నాళ్ళు ఎదిరిచూసి చూసి అలవాటయ్యింది.
మా ఊర్లో ఏడవ తరగతి చదవడం అయిపోయింది. కామన్‌ బోర్డు పరీక్షల్లో మా తాలుకలోనే మొదటి స్థానం వచ్చింది నాకు. హై స్కూల్‌ చదువుల కోసం తాలుక కేంద్రానికి వెళ్ళాను. అప్పటికే నా తోటి కొందరు  ఆడపిల్లలకు పెండ్లిలయ్యాయి. ఇంకా కొందరు సిద్ధంగున్నారు.  దసర సెలవులకో, సంక్రాంతి పండుగ సెలవులకో ఇంటికి వచ్చేదాన్ని. నన్ను చూసి చుట్టూ పక్కలున్న ఆడవాళ్ళూ మా అమ్మతో ‘‘అవు అదినే! కోడలు పిల్లకు పెండ్లి జెయ్యరా? మొగపోరని తీరు సదివి పియ్యవడ్తిరి. ఇంత సదివి ఏమిసేస్తది! మల్ల ఓ అయ్యకిచ్చి పంపుడే గదా! ఓ మంచి  సంబంధం చూసి ఈ ఎండాకాలం మూడు ముళ్ళు ఏపియ్యరాదు’’ అనే వాళ్ళు. 

మా అమ్మ ఒక నవ్వు నవ్వి ‘‘ఆ...తప్పుతుందా? ఏనాటికైనా ఓ ఇంటికి  పంపుడేనాయె. కాని అదంతా ఆల్లయ్య ఇష్టం’’ అనేది. రాత్రి ఇంటికొచ్చి స్నానం చేసి భోజనానికి కూర్చున్నప్పుడు  మెల్లగా మొదలు పెట్టేది.
 ‘‘అందరు మనమ్మాయి పెండ్లి గురించి అడ్గుతుండ్రు. పిల్ల గూడా ఎదిగింది!’’ అని మా నాయన సమాధానం కోసం ఎదురుచూసేది.  
‘‘వాల్లన్నర లేక నీకే అనిపించిందా?’’ అని తల ఎత్తకుండ తింటూనే ప్రశ్నించేవాడు.
‘‘ఏదో ఒకటి...నువ్వేమంటవో చెప్పరాదు’’ అనేది అమ్మ.
‘‘మనకు ఒకతే అమ్మాయి.  మంచిగా చదువుతుంది. చాల తెలివైంది. చదివినంత వరకు చదివిద్దాం. పెళ్ళయితే చదవడం కుదరదు. భర్తా,పిల్లలు, అత్తమామలు వారి సేవలతోనే సరిపోతుంది. చూద్దాంలే ఇప్పుడెందుకు తొందర’’ అని చేతులు కడుక్కొని వాకిట్లకెళ్ళేవాడు.
వాకిట్ల వేపచెట్టు కింద చెప్టా మీద కూర్చోని కొద్దిసేపు రేడియో విని ఇంట్లకు వచ్చేవాడు.
∙∙ 
ఫస్ట్‌ క్లాస్‌  మార్కులతో పదవ తరగతి పాసయ్యాను. ఇంటర్మీడియట్‌ కోసం హైదరాబాద్లో చేర్చారు. అక్కడ తొంబది శాతం మార్కులతో కాలేజి ఫస్ట్‌ వచ్చాను. తర్వాత బిటెక్‌ చదివాను. యూనివర్సిటీ మొదటి ర్యాంక్‌ సాధించాను. పేపర్లల్లన్ని నా గురించి ప్రశంశిస్తూ కథనాలు రాసాయి. అమ్మ నాయనకు పట్టరాని సంతోషం కల్గింది. మా నాయన చాల గర్వపడ్డాడు. అమ్మ మళ్లోనాడు అడిగింది ‘‘చదువు అయినట్టేనా? ఇంకా వుందా? పెళ్లి గురించి ఇప్పుడైనా ఆలోచించేదున్నదా లేదా?’’
 ‘‘ఎం.టెక్‌ అయినంక ఆలోచిద్దాము లేవే’’ అన్నాడు.
అలాగే ఎం.టెక్‌ గూడా అయిపోయింది. హైదరాబాద్లో మంచి పేరున్న కంపెనీలో వుద్యోగం వచ్చింది. చదివిందానికి సరిపడే  జీతంతో హాయిగా సాగిపోతుంది జీవితం. కొద్ది నెలలు గడ్చిపోయాయి.              
∙∙ 
 ఒక రోజు ఆఫీస్కు వెళ్లేసరికి నా టేబుల్‌ మీద ఇన్లాండ్‌ ఉత్తరం వుంది. ఇంటి నుండి వచ్చింది. కుర్చీలో కూర్చోని విప్పి చదవడం మొదలు పెట్టాను. ‘వచ్చే శుక్రవారం పెళ్లి చూపులు. రెండు రోజుల ముందుగానే రావాలని సారాంశం. వెళ్ళాను. మొదటి రోజు నేను ఎలాగుండలో, ఏ రంగు చీర కట్టుకోవాలో, ఎలా కూర్చోవాలో...అన్నిమెలకువలతో చక్కగా శిక్షణ ఇచ్చారు.
మొదటి పెళ్లి చూపుల కార్యక్రమం కావడం వల్ల కొంత ఆందోళన పడ్డాను. ఇంట్లో గూడా ఏదో హడావిడి కనిపించింది. అబ్బాయి తాలూకు పెద్దవాళ్ళు వచ్చారు. అందరికి జరిగినట్టే నాకు జర్గింది. అందంగా అలంకరించుకొని, వీపు కనబడకుండా కొంగు కప్పుకొని, తల వంచుకొని  అందరికి  టీ అందించిన తర్వాత, అందరి ముందు చాప మీద  జాగ్రత్తగా కూర్చున్నాను. 

నా చదువు, ఉద్యోగం మొదలగువాటికి సంబంధించిన ప్రశ్నలడిగారు వచ్చిన ఆడవాళ్ళు. అందరు నన్ను తీక్షణంగా చూస్తున్నారు. ఏవో గుస గుసలు పెట్టుకుంటున్నారు. ఆ ముచ్చట ఈ ముచ్చట మాట్లాడుకున్న తర్వాత ...‘‘మేము మాట్లాడుకొని  ఏ విషయము తెలియజేస్తాం’’ అని అందర్లోకెల్ల పెద్దమనిషి అన్నాడు. అందరు లేచి నిల్చున్నారు. వెళ్తున్నారని అర్థమై నేనూ లేచి నిల్చున్నాను.
‘‘మంచిది వెళ్లి రండి’’ అంటూ మా వాళ్ళు రెండు చేతులు జోడించి నమస్కారం చేసారు. వారి వెనుకల ఇంటి గేటు బయటివరకు వెళ్లి సాగనంపి వచ్చారు. నేను వాకిట్లో నిల్చొని చూపు ఆనినంత దూరం  ఆ హీరోనే చూస్తుండి పోయాను.
∙∙ 
 నా డ్యూటీలో పడిపోయాను. కొన్నాళ్ళకు మళ్ళీ వుత్తరం వస్తే వెళ్లి వచ్చాను. ఫలితం దైవాదీనం. అలా ఎన్ని సార్లు వెళ్ళానో గుర్తులేదు. ఇక ఆ విషయం ఆలోచించడం మెల్ల మెల్లగా మర్చిపోయి నా పనిలో మునిగిపోయాను. దినాలు, నెలలు, సంవత్సరాలు గడ్చిపోయాయి. నా మనసులో తొలుస్తున్న ప్రశ్నలు– ‘‘నేనెవరికి నచ్చలేదా? ఎందుకు నచ్చడం లేదు?’’ ఎవరిని అడగలేదు.  ఎవరూ...నాకు  చెప్పడమూ లేదు.

కాలం తన పని తాను చేసుకు పోతుంది. నా పని నేను చేసుకుపోతున్నాను. చేతిలో డబ్బు చేరుతుంది. వయస్సు చేజారిపోతుంది. తల్లిదండ్రులకు  బెంగ మొదలయ్యింది. వాళ్ళు చేయని ప్రయత్నం లేదు.  నాకు తెల్సి కొన్ని నాకు తెలియకుండా కొన్ని సంబంధాలు చూసారు. ఉత్తరాలు రాయడం కొనసాగుతూనే వుంది. ఏ గ్రహణం అడ్డోచ్చిందో అంతు చిక్కడం లేదు. పెళ్లి, పిల్లలు, నా కుటుంబం అనే ఆలోచనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తునే వున్నాయి. ఆడ పిల్లను గదా ఎవ్వరికి చెప్పుకోలేను. ఆలోచించకుండా ఉండలేక పోతున్నాను. పని ఒత్తిడిలో పడి చాలావరకు మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఇంటికి రాగానే ఈ ఒంటరితనం ఎక్కువైనట్టని పించేది. రోజులు దినాలు నెలలు సంవత్సరాలు ఎన్నో వేగంగా దొర్లిపోతున్నాయి. ఇంటిలో ఇన్ని రోజులున్న వాతావరణం లేదు. మా నా నాయన మొఖంలో ఏదో  చెప్పుకోలేని బాధ. ఊరందరికీ న్యాయం కోసం జీవితాంతం పోరాడిన నాయన ఇంట్లో తన బాధ్యత నెరవేర్చడం లేదనే మనోవ్యధ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందున్న సంతోషం, ఉత్సాహం  బదులు ఆందోళన మొదలయ్యింది. ఆ విషయం బయట పడకుండా ఉండేందుకు చాల ప్రయత్నమే చేస్తున్నారు.

నేను కూడా సంతోషంగానే వున్నట్టు నటిస్తున్నాను. ఎప్పుడు నాలో ఒక్కటే ప్రశ్నా ‘ఎవరికీ నచ్చనంత లోపం ఏముందని. చదువుంది...ఉద్యోగముంది...డబ్బుంది. మరింకేమి కావాలి?’ కుప్పలు తెప్పలుగా జవాబు దొరుకని ప్రశ్నలు నాలో సుడిగుండాలై తిరుగుతూనే వున్నాయి. వయస్సు మీద పడడం కంటే నా మీది బెంగతోనే మా నాయన ఈ ప్రపంచాన్ని, ఈ బాధలను, మమ్మల్ని వదిలిపెట్టి హాయిగా వెళ్ళిపోయాడు. బయటి ప్రపంచం తెలియని అమ్మ బ్రతుకు సముద్రంలో కొట్టుకుపోతున్న నావ అయ్యింది. కాలమే గాయాలను మాన్పుతుంది. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా  మర్చిపోతున్నాం. నాయన కాలం చేసి అప్పుడే సంవత్సరం కావొస్తుంది. సంవత్సరికం కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. ఎప్పుడో తాతలనాటి పెంకుటిల్లు. గోడకు వ్రేలాడుతున్నా తాత నాయనమ్మఫోటోలు, చిన్నప్పటి నా ఫోటోలను తీసి జాగ్రత్తగా ఒక పక్కన  పెట్టాను. ఇల్లు శుభ్రం చేసి సున్నం వేయించాలని ఇల్లంతా సర్దుతున్నాం.

ఇంట్లో ఓ మూలకు సైకిల్‌ పుల్లకు గుత్తిలా వ్రేలాడదీసిన ఉత్తరాలకట్ట నా కంటబడింది. మా ఇంటికి వచ్చే ఉత్తరాలు అలా పుల్లకు గుచ్చి పెట్టడం అలవాటు. ఆ రోజుల్లో అందరు అలానే చేసేవారు. ఎన్నేండ్ల నుంచి అలా వ్రేలాడుతున్నాయో దుమ్ముతో రంగు వెలిసిపోయివున్నాయి. వాటిని కిందికి దించాను. ఎన్నో జ్ఞాపకాల సమాహారం ఆ ఉత్తరాల గుత్తి. మా నాయన చదివిన తర్వాత అలా పుల్లకు చెక్కడం మా అమ్మ పని. అందులో ఇన్లాండ్‌ లెటర్లు, టెలిగ్రాంలు, పోస్ట్‌కార్డులు దండలో దారానికి గుచ్చిన పూవ్వుల్లాగున్నాయి. 

టెలిగ్రాంలను తీసి పక్కకు పెట్టి ఒక్కొక్క వుత్తరం చదవడం మొదలు పెట్టాను. అన్నింటి కన్న పైనున్న ఉత్తరాన్ని జాగ్రత్తగా తీశాను. అది మా నాయన చనిపోయేకంటే కొద్ది రోజుల ముందు వచ్చింది. ఆ వుత్తరం నా పెళ్లి చూపులకు వచ్చిన ఆఖరి వాళ్లు రాసింది. అక్టోబర్‌ నాల్గవ తేది పంతొమ్మిది వందల తొంబది ఏడవ సంవత్సరం.
‘పూజ్యశ్రీ! రమణయ్య గారికి నమస్కరించి వ్రాయునది, మీరు మరోల అనుకోకండి. మీ అమ్మాయిని చూశాం. అమ్మాయి బాగానే వుంది కాని....వయస్సు ఎక్కువైంది. ఇన్ని రోజులుగా అమ్మాయికి పెళ్లి కాకుండ ఇంటిమీద ఉండడానికి కారణమేమై వుంటుందో? ఒకోక్కరు ఒక్కోలాగ వూహించుకుంటున్నారు. కావున మీరు వేరే సంబంధం చూసుకోగలరు’
 

రెండు లైన్లు రాసి ముగించారు. అంత కంటే ఏమి రాయగలరు గనుక! చుట్టరికం కలుస్తే ఇంకేమైనా రాసే వాళ్ళేమో. అవును అమ్మాయిలకు వయస్సు అడ్డంకి. అబ్బాయిలకు ఎంత వయసున్న పర్లేదు. ముసలి తనంలో కూడా పిల్లనిస్తారు. పూర్వపు రోజుల్లోనే కాదు ఇప్పుడు కూడా ముసలోల్లకు పిల్లనివ్వడానికి సిద్ధంగా వున్నా తల్లిదండ్రులున్నారు. మొగోడు అయితే  చాలు అనిపించింది. ఇంకో వుత్తరం తీశాను. తేది ఇరవై ఎనిమిది మార్చ్‌ పంతొమ్మిది వందల తొంబది ఆరో సంవత్సరం.
 ‘అమ్మాయి నచ్చింది. కాని మీది కమ్యునిస్ట్‌ భావాలుగల కుటుంబం. మీ పెంపకంలోని అమ్మాయికి ఖచ్చితంగా మీ ఆలోచన విధానమే వస్తుంది. ఆడ పిల్లలకు ఆ ధోరణి సంసారానికి సరిపోదనిపిస్తోంది. హక్కులు, బాధ్యతలు, సమానత్వం ఇలాంటి వాటిని మీరు నరనరాన జీర్ణించుకొని వుంటారు. మాదేమో సనాతన సాంప్రదాయ కుటుంబం. మాకు మీకు సరిపోదనిపించింది. వేరే సంబంధం చూసుకోవడం ఇరువురికి మంచిది’

మా నాయన ఆధునిక భావాలూ, ఆదర్శాలు వాళ్ళకు నచ్చలేదు. దాని కింది  వుత్తరం జనవరి మూడవ తారీకు పంతోమ్మిది వందల తొంబై ఆరవ సంవత్సరం వచ్చింది.
 ‘కామ్రేడ్‌! మీ సేవలను పార్టీ గుర్తించింది. ఈ వయసులో కూడా మీరు విలువలకు ఆదర్శాలకు కట్టుబడి వున్నారు. మీ నిస్వార్థ సేవను గుర్తించి  మన రాష్ట్రం తరపున మిమ్మల్ని కేంద్ర కమిటీకి సిఫారసు చేస్తున్నాం’’ రాష్ట్ర కమిటీ హెడ్‌ ఆఫీస్‌ వాళ్ళు రాసింది. 
నాల్గవ వుత్తరం తీశాను ‘అమ్మాయి చక్కగా వుంది. మా వాళ్ళందరికి నచ్చింది. కాని...మాకు ఈ మధ్యనే తెల్సింది....మీరు ఒకప్పుడు అన్నలతో సంబంధాలు కల్గి ఉండేవారని. కొద్ది రోజులు అన్నలతో కూడా తిరిగారని తెల్సింది. సంబంధం కలుపుకొనేది సమస్యలు తెచ్చుకోవడానికి కాదు.  మేము మీకు సరిపోమని తెలియజేయుచున్నాం’ అది అలా ముగిసింది.
మరోవుత్తరం అందుకున్నాను.

‘అమ్మాయికి వంక పెట్టలేము. మా అబ్బాయికి నచ్చింది. కాని...తీరా ఆరా తీస్తే తెల్సింది మీరు ఆ రోజుల్లోనే కులాంతర వివాహం చేసుకున్నారని. మా కుటుంబంలో కులపట్టింపు జాస్తి. మీ అమ్మాయిది ఇప్పుడు ఏ కులమో తేల్చుకోలేకున్నాం. కులం,గోత్రం లేని పిల్లను ఎవరైనా చేసుకునే వాళ్ళుంటే వాళ్లకు ఇవ్వండి. మాకోసం ఎదురు చూడకండి. కావున మీరు  ఏమి అనుకోకండి’
కుల పిచ్చి, మత పిచ్చితో కుళ్ళిపోయిన మనుష్యులను ఎవడు బాగుచేయలేడు. అది తప్పిపోవడమే మంచిదైందని పించింది. ఇంకో వుత్తరం తీశాను.
‘అమ్మాయిని ఉన్నత చదువులు చదివించారు. కాని మీరు ఒకటి ఆలోచించలేదు. మన కులంలో అబ్బాయి మీకు దొరుకడు. ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకునే అబ్బాయి ఆమె కంటే ఎక్కువగా చదువుకొని వుండాలి. అంత పెద్ద పెద్ద చదువులు చదివిన అమ్మాయి అత్తామామల మాట వినదు. మా అబ్బాయి కూడా తక్కువే చదువుకున్నాడు. అమ్మాయిలో ఏదో లోపముందని మేము అనడం లేదు. అమ్మాయి ముక్కు మూతి మొకం సక్కగానే వుంది. భార్య అన్ని విషయాలలో భర్త కంటే తక్కువగ ఉంటేనే ఆ కాపురం సల్లగ ఉంటుందని మా నమ్మకం. మీ అమ్మాయి అన్నింటిలో మా అబ్బాయి కంటే చాల ఎక్కువే...మా అభిప్రాయం తెలియజేసాం. అన్యదా భావించకండి’

ఆడవాళ్ళను అణగద్రోక్కడానికి ఇదొక ఆయుధం. చదువు విలువ తెలియని సంస్కారహీనులతో సంబంధం కలువనందుకు సంతోషమే నాకు.
ఇన్నాళ్ళ నా ప్రశ్నలకు సమాధానం ఈ రూపంలో దొరుకుతుందన్నమాట. దాదాపుగా ఉత్తరాలన్నీ మూడు నాల్గు సంవత్సరాల తేడాతో రాసినవే. ఇంకా ఎన్ని వున్నాయో!  నాలో ఆసక్తి పెరుగుతుంది. ఒక్కొక్కటి చదివి పక్కకు పెడ్తున్నాను. సాయమానులో కట్టెల పోయిమీద పప్పు ఎసరు పెట్టి, చీపురు తీసుకొని ఇంట్లోకి వచ్చింది మా అమ్మ. నా వైపు చూసింది. నా ముందర ఉత్తరాల కుప్ప. నా చేతిలో ఒక ఉత్తరం. చదివి పక్కకు పెట్టినవి కొన్ని. ఇంకో పక్క బూజు దులుపే కర్ర.  తన చేతిలోని చీపురును పక్కకు విసిరేసింది. చీర కొంగు నడుము చెక్కుకుంది. ఇంకో వుత్తరం  తీసుకొని చదువుతున్నాను. అది మా మా నాయనకు చెల్లెలు వరుస లక్ష్మత్త రాసింది. పంతొమ్మిది వందల తొంబది తొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్‌ రెండవ తారీకు.

‘ప్రియమైన అన్న, వదినలకు నమస్కరించి రాయునది, మీతో చాల సార్లు చెపుదామనుకున్నాను, మీరేమనుకుంటారోనని చెప్పలేక పోయాను. ఇలా ఉత్తరాలు రాయడం కంటే కూర్చొని మాట్లాడాలని అనుకున్నాం. కాని పనుల ఒత్తిడి వల్ల వీలు కాలేదు. మీరు తప్పుగా భావించరని అనుకుంటున్నాను. మీకంటే చిన్నదాన్ని, అడగ వచ్చో లేదో తెలియదు. ఇలా అడుగుతున్నానని ఏమి అనుకోకండి. మా పెద్ద బావ రెండవ కొడుకు రవి నీకు గుర్తున్నడనుకుంటున్నాను. మంచివాడు. నెమ్మదస్తుడు. ప్రభుత్వ వుద్యోగం వుంది. వారి ఆస్తి పాస్తుల గురించి నీకు తెలుసు. సంవత్సరంన్నర క్రితం వాడి భార్య మొదటి కాన్పులో బాలింత రోగంతో చనిపోయింది. నెల రోజులు నిండక ముందే పసిగుడ్డు చనిపోయింది. రవికి ఇప్పుడు నలభై ఐదు సంవత్సరాలు. చూస్తు చూస్తుండగానే మన అమ్మాయికి నలభై సంవత్సారాలు దాటినాయి. మీరు ఇంకా ఆలోచించుకుంటుంటే వయస్సు మీద పడుతుంది. మీకు సమ్మతమైతే రెండవ పెళ్ళికి వాళ్ళు సిద్ధమని చెప్పమంటున్నారు. మీ బావ నేను అన్ని ఆలోచించే ఈ విషయం మీ దృష్టికి తెస్తున్నాము. ఈ సంబంధం అందరికీ అన్ని విధాల మంచిది. మన అమ్మాయి సుఖపడుతుందని మా అభిప్రాయం. వదినతో చర్చించి, అమ్మాయిని కూడా అడిగి ఏ విషయం తొందరగా తెలుగపగలరు. మీ ఉత్తరం కొరకు ఎదురు చూస్తుంటాం’

చదవడం అయిపొయింది. గబగబ వచ్చి నా చేతిలోని ఉత్తరాన్ని లాగేసింది. నా చుట్టూ కింద పడివున్న వాటిని  రెండు చేతులతో నలిపి ముద్దలాగా మడ్చింది. ఉత్తరాల గుత్తిని పట్టుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళింది. మండుతున్న ఒక కొర్రాయిని బయటికి తీసి ఉత్తరాలకట్టను, ఉత్తరాల ముద్దను కట్టెల పొయ్యిలో విసిరేసింది. కొర్రాయితో లోపలికి తోసింది. బర్రున కాలి బుదిడైనాయి ఉత్తరాలు. ఆ వేడికి పోయిమీది పప్పు బుసబుస పొంగింది. ముంగాల్ల మీద కూర్చొని రెండు చేతులు గదవ కింద పెట్టుకొని దీనంగా చూస్తోంది.
ఎన్నో ఏండ్ల నుండి భద్రంగా దాచి పెట్టిన జ్ఞాపకాలు  అన్ని పొయ్యిలో కాలిపోతున్నాయి. పక్కనున్న బూజు కర్ర తీసుకొని ఇంటికి పట్టిన బూజులను దులుపడం మొదలు పెట్టినాను. ఇంటికి సున్నాలు వేయించిన తర్వాత  ఇంట్లో వస్తువులన్నీ సర్దుకోవడం పూర్తయ్యేసరికి చీకటి పడింది. బుక్కెడు తిని నడుం వాల్చాను. అలసిపోయిన కండ్లు మూతలు పడ్డాయి.
∙∙ 
‘‘చూడమ్మా బుజ్జి! నా మాట విను. రోజు రోజుకు నీకు వయస్సు పెరిగి పోతుంది. ఇంకా ఆలస్యమైతే ఇలాంటి  సంబందం కూడా దొరకడం కష్టమవుతుంది. మంచోచెడో నువ్వు ఒప్పుకుంటావనుకుంటున్న. మా ఆరోగ్యాలు కూడా ఏమి బాగుండడం లేదు. బలవంతం చేస్తున్నానని అనుకోవద్దు. అన్ని రోజులు ఒక్కలాగానే వుండవు. నీ భవిష్యత్తు కోసమే చెప్తున్నా. మేము పోయిన తర్వాత నీవు ఒంటరిగా వుండడం చాల కష్టం. ఇప్పటికే చాల ఆలశ్యమయ్యింది. జీవితంలో కొన్నింటికి రాజీ పడక తప్పదు. మనం అనుకున్నట్టు అన్ని జరగవు. మరో సారి ఆలోచించుకో ...’’  మా నాయన నా మంచం మీద కూర్చొని నా తలనిమురుతూ అంటున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. చుట్టూ చిమ్మని చీకటి. ఇంక తెల్లవారలేదు. కల మాయమయ్యింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. వెళ్లి నీళ్ళు తాగి వచ్చి పడుకున్నాను. ఎంత ప్రయత్నించిన నిద్ర పట్టడడం లేదు. అటిటు దొర్లుతుంటే ఎక్కడో కోడిపుంజు కోక్కరోకో అని  కూసింది.  -మన్నె ఏలియా 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top