పాత్రికేయ సమరయోధుడు

Journalist fighter - Sakshi

ధ్రువతారలు

చరిత్ర ప్రస్థానంలో కొందరు పత్రికా రచయితలు నిలబడిన బిందువులను పరిశీలిస్తే సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. ‘ఓల్డ్‌మన్‌ అండ్‌ ది సీ’, ‘ఫర్‌ హూం ద బెల్‌ టోల్స్‌’ వంటి నవలలను అందించిన రచయిత, నోబెల్‌ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్‌ మిల్లర్‌ హెమింగ్వే వంటివారు అందుకు చక్కని ఉదాహరణ. రెండు ప్రపంచ యుద్ధాలతో పాటు, స్పెయిన్‌ అంతర్యుద్ధం వార్తలు కూడా రాసిన ఖ్యాతి హెమింగ్వేకు ఉంది. యుద్ధవార్తలను రాసే విలేకరులు ఒక తెగ అనొచ్చు. చరిత్రలో పెద్ద మలుపునకు ప్రత్యక్ష సాక్షిగా నిలబడి, దానిని వార్తగా మలిచే అవకాశం కూడా అరుదుగానే దక్కుతుంది. మన దేశానికి సంబంధించి అలాంటి పత్రికా రచయితలలో ఒకరు బెనెగల్‌ శివరావ్‌. 

 జనాభిప్రాయాన్ని మలచడం, సమాచారాన్ని పంచడం వార్తాపత్రికల సహజ లక్షణం. 20వ శతాబ్దం ఆరంభం నుంచి రేపటి చరిత్రకారుడికి ముడి సరుకును అందించే బాధ్యత కూడా వార్తాపత్రికల విధ్యుక్త ధర్మాలలో ఒకటిగా రూపొందింది. చరిత్ర నిర్మాణ ం, వార్తావ్యాఖ్యల రచన ఒకే నాణేనికి బొమ్మ బొరుసుగా కుదిరిపోయాయి.ఆగస్ట్‌ 15, 1947– వేదకాలం నుంచి నేటి వరకు కూడా భారతదేశ చరిత్రలో ఇంతకు మించిన చరిత్రాత్మక దినం బహుశా మరొకటి కానరాదు. వేయేళ్ల బానిసత్వం నుంచి భారతదేశం స్వతంత్రదేశంగా అవతరించిన రోజు అదే. రవి అస్తమించని సామ్రాజ్యంలో రవి అస్తమించడం మొదలైంది కూడా ఆ రోజునే. వలస దేశాలకు స్వాతంత్య్రం ఇచ్చే పనిని భారతదేశంతో ఆ రోజే ఇంగ్లండ్‌ ఆరంభించింది. ఆ సంగతిని ప్రకటించడానికి ఆఖరి బ్రిటిష్‌ వైస్రాయ్‌ ఢిల్లీలోని వైస్రాయ్‌ హౌస్‌లో జూన్‌ 4, 1947న పత్రికల సమావేశం ఏర్పాటు చేశాడు. అప్పటికి కొన్ని నెలల ముందునుంచే ప్రపంచ పత్రికా రంగంలో కదలిక కనిపించింది. అసోసియేటెడ్‌ ప్రెస్, ఏజెన్స్‌ ఫ్రాన్స్‌ ప్రెస్సె, టాస్, సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ (చైనా) వంటి వార్తా సంస్థల ప్రతినిధులు, న్యూయార్క్‌ పోస్ట్, న్యూయార్క్‌ టైమ్స్, లైఫ్, టైమ్, షికాగో డైలీ న్యూస్, షికాగో ట్రిబ్యూన్, సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ వంటి విదేశీ పత్రికల ప్రతినిధులు అప్పటికే ఢిల్లీలోని ఇంపీరియల్‌ హోటల్‌ బస చేశారు. ఇక ఇంగ్లండ్‌ నుంచి వెలువడే మాంచెస్టర్‌ గార్డియన్, ది టైమ్స్, మార్నింగ్‌ పోస్ట్, డైలీ ఎక్స్‌ప్రెస్, డైలీ మెయిల్, డైలీ హెరాల్డ్, డైలీ టెలిగ్రాఫ్‌ వంటి పత్రికల ప్రతినిధులు కూడా ఆ హోటల్‌లోనే వేచి ఉన్నారు. భారతదేశం నుంచి వెలువడే స్టేట్స్‌మన్, ది హిందు, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, అమృతబజార్‌ పత్రికల ప్రతినిధులు సరేసరి. ఇందులో ది హిందు తరఫున పని చేస్తూ ఇంగ్లండ్‌కు చెందిన మాంచెస్టర్‌ గార్డియన్‌కు కూడా సేవలు అందించిన మన పత్రికా రచయిత బెనెగల్‌ శివరావ్‌. బ్రిటిష్‌ పత్రికలు ఇద్దరు వంతున విలేకరులను నియమించుకున్నాయి. దేశీయ పత్రికల సేవలు కూడా తీసుకున్నాయి. 

భారత్‌కు స్వాతంత్య్రం ఇస్తున్నట్టు జూన్‌ 4, 1947 చివరి ఆంగ్ల వైస్రాయ్‌ మౌంట్‌బాటన్‌ విలేకరుల సమావేశంలో చెప్పాడు. మూడువందల మందికి పైగా విలేకరులు పాల్గొన్నారు. శివరావ్‌ ఇలాంటి అసాధారణ చారిత్రక ఘట్టాన్ని నమోదు చేయడమే కాదు, స్వతంత్ర భారతదేశ నిర్మాణానికి జరిగిన కృషిలో కూడా తన వంతు పాత్ర నిర్వహించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశం తొలిగా ఒక సవాలుగా, ప్రతిష్టాత్మకంగా స్వీకరించిన కార్యక్రమం రాజ్యాంగ నిర్మాణం. ఎందరో మహానుభావులతో కలసి శివరావ్‌ పనిచేశారు. బెనెగల్‌ శివరావ్‌ (ఫిబ్రవరి 26, 1891– డిసెంబర్‌ 15, 1975) కర్ణాటకకు చెందినవారు.మంగళూరు ఆ స్వస్థలం. తండ్రి బి. రాఘవేంద్రరావు ప్రఖ్యాత వైద్యుడు. మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయన చదువుకున్నారు. నిజానికి శివరావ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌తో కలసి పనిచేయలేదు. ఆయన అనీబిసెంట్‌ నుంచి, ఆమె దివ్యజ్ఞాన సమాజం నుంచి ప్రేరణ పొంది జర్నలిజంలో ప్రవేశించారు. తరువాత గాంధీజీ ఆరాధనలో పడినప్పటికీ ఆయన ఉద్యమ క్రమంలో తీసుకున్న కొన్ని ఎత్తుగడలను మాత్రం శివ్‌రావ్‌ పూర్తిగా వ్యతిరేకించి, విమర్శలకు దిగారు. కానీ శివరావ్‌ రాజకీయ వ్యాఖ్యలు ఎంత నిష్పాక్షికమైనవంటే గాంధీజీతో పాటు జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌ వంటివారు కూడా వాటిని ఔదల దాల్చేవారు. 

పత్రికా రచయితగా ఉంటూనే శివరావ్‌
కార్మిక రంగంలో కూడా పనిచేశారు. అంతర్జాతీయ కార్మిక సంస్థలో విజయలక్ష్మీ పండిట్, బాబూ జగ్జీవన్‌రామ్‌లతో కలసి ఆయన పనిచేశారు. 1947, 1948, 1949, 1950 సంవత్సరాలలో భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీకి వెళ్లిన భారత ప్రతినిధుల బృందానికి ఆయనే నాయకత్వం వహించారు. రాజ్యాంగం అవతరించిన తరువాత ఏర్పడిన ప్రతిష్టాత్మక తొలి లోక్‌సభకు శివరావ్‌ దక్షిణ కెనరా నుంచి ఎన్నికయ్యారు. తరువాత 1957 నుంచి 1960 వరకు రాజ్యసభలో తన వాణిని వినిపించారు. అక్కడితో పార్లమెంట్‌కు వీడ్కోలు చెప్పారు. తరువాత తన అపార జీవితానుభవాలను నమోదు చేసే పనిలో, పరిశోధనలో జీవితం గడిపారు. ‘భారతరాజ్యాంగ నిర్మాణక్రమం’ అన్న గ్రంథ సంకలనం ఆయన సోదరుడు బెనెగల్‌ నరసింగరావ్‌ చేపట్టారు. ఆ పత్రాలను ఎడిట్‌ చేసే పని శివరావ్‌ నిర్వహించారు. సిరిల్‌ హెన్రీ ఫిలిప్స్, మేరీ డొరీన్‌ వెయిన్‌రైట్‌లు రూపొందించిన ‘భారతదేశ విభజన:విధానాలు, దృక్పథం 1935–47’ అన్న గ్రంథ రచనలో తోడ్పడ్డారు. ‘భారత స్వాతంత్య్ర సమర యోధులు: కొందరు మహోన్నతులు’ ఆయన రాసిన చివరి గ్రంథం. ఇది 1972లో వెలువడింది. ఆయన ఇతర రచనలు పరిశీలించినా శివరావ్‌ మేధాశక్తి ఎంతటిదో, ఎంత విస్తృతమైనదో అర్థమవుతుంది. ‘భారతదేశంలో సంస్కరణల వలన కార్మికులకు దక్కినదేమిటి?’ (1923), డేవిడ్‌ గ్రాహమ్‌ పోల్‌తో కలసి ‘భారతదేశ సమస్య’ (1926), ‘ఎంపిక చేసిన ప్రపంచం రాజ్యాంగాలు’ (1934), ‘భారతదేశ పరిశ్రమలలో కార్మికులు’ (1939), ‘భారత స్వాతంత్య్ర సమరం: కొన్ని కోణాలు’(1968), ‘ఐక్యరాజ్య సమితిలో భారత్‌ పాత్ర’ (1968) శివరావ్‌ రాసిన పుస్తకాలు. ఆయన భార్య కిట్టీ వెర్సియాండి. ఆస్ట్రియా దేశస్థురాలు. శివరావ్‌ అంటే ముక్కంటి. నిజమే! శివరావ్‌ స్వాతంత్య్రోద్యమాన్ని చూశారు. ఉద్యమాన్నీ, ఆ ఉద్యమ అనుభవాలను, ఫలశ్రుతిని నమోదు చేశారు. సామాజిక రంగాన్ని తనదైన దృష్టితో వీక్షించారు.  
డా. గోపరాజు నారాయణరావు

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top