ఇలాంటి ప్రేమ మీకు ఎప్పుడైనా దొరికిందా? | If you ever need to have such a love? | Sakshi
Sakshi News home page

ఇలాంటి ప్రేమ మీకు ఎప్పుడైనా దొరికిందా?

Sep 14 2014 1:16 AM | Updated on Sep 29 2018 3:55 PM

ఇలాంటి ప్రేమ మీకు ఎప్పుడైనా దొరికిందా? - Sakshi

ఇలాంటి ప్రేమ మీకు ఎప్పుడైనా దొరికిందా?

కుక్క విశ్వాసానికి మారుపేరు. తిండి పెడితే నమ్మకంగా ఉంటుంది. ఇంటిని కాపాడుతుంది. ఇక్కడి వరకు మామూలే.

హృదయం
కుక్క విశ్వాసానికి మారుపేరు. తిండి పెడితే నమ్మకంగా ఉంటుంది. ఇంటిని కాపాడుతుంది. ఇక్కడి వరకు మామూలే. కానీ ఓ కుక్క తనకు రోజూ తిండి పెట్టే తన యజమాని చనిపోయాడని రెండు వారాలపాటు తిండీ నీళ్లూ మానేసింది. ఎండా వానా, రాత్రీ పగలూ చూడకుండా తన యజమాని సమాధి దగ్గరే కూలబడిపోయింది. ఆ కుక్కే టామీ. తమిళనాడులోని పూనమల్లి ప్రాంతానికి చెందిన భాస్కర్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఓ రోజు రోడ్డుమీద దెబ్బ తగిలి ఉన్న కుక్కను చేరదీశాడు. దానికి టామీ అని పేరుపెట్టాడు.

రోజూ తిండి పెట్టాడు. దీంతో టామీ భాస్కర్‌నే అంటిపెట్టుకుని ఉండేది. అయితే ఓ రోజు మోటర్ సైకిల్‌పై వెళ్తూ, ప్రమాదానికి గురైన భాస్కర్, తీవ్ర గాయాలపాలయ్యాడు. తర్వాత ప్రాణాలు వదిలాడు. భాస్కర్‌కు తండ్రి లేడు. తల్లి సింధూరి ఆశలన్నీ అతడి మీదే ఉండేవి. ఇప్పుడు కొడుకు కూడా తనకు దూరమవడంతో సింధూరి కుప్పకూలిపోయింది.

అందరూ ఆమె గురించే ఆలోచించారు. అయ్యో పాపం అనుకున్నారు. భాస్కర్ దహన సంస్కారాలు అయిన తర్వాత ఆమెను తల్లిదండ్రులు తమ ఊరికి తీసుకెళ్లిపోయారు. కానీ టామీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కొడుకును పోగొట్టుకున్న బాధలో సింధూరి కూడా టామీ గురించి ఆలోచించలేదు. అయితే తన యజమాని మృతదేహాన్ని పాతిపెట్టడం చూసిన టామీ, అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయినా తను మాత్రం కదల్లేదు. సమాధి పక్కన కూర్చుండిపోయింది. తన యజమాని లేచి వస్తాడని అనుకుందో ఏమో అక్కడే కూలబడిపోయింది.

ఇలా ఒకటి రెండు రోజులు కాదు. ఏకంగా రెండు వారాలు గడిచిపోయాయి. అసలా కుక్క తన యజమాని కోసం అక్కడే ఉండిపోయిందన్న విషయాన్నే ఎవరూ గుర్తించలేదు.  అయితే రెడ్‌క్రాస్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి ఆ దారిలో వెళ్తూ, రెండుసార్లు ఆ కుక్కను గమనించాడు. మూడోసారి కూడా ఆ కుక్క అక్కడే ఉండటంతో అనుమానం వచ్చింది. చుట్టుపక్కల వాళ్లను విచారించాడు. వైన్ షాపు యజమాని అసలు విషయం చెప్పాడు.
 
టామీని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి రెడ్ క్రాస్‌వాళ్లు ప్రయత్నించినా, అది రాలేదు. దీంతో సింధూరి గురించి ఆరా తీసి, ఆమెకు విషయం తెలిసేలా చేశారు. ఆమె వెంటనే బయల్దేరి, తన కొడుకు సమాధి దగ్గరికి వచ్చింది. సింధూరిని చూడగానే పరుగు పరుగున ఆమె వద్దకు వచ్చింది. ఆమె దాన్ని తీసుకుని ముద్దాడింది. సింధూరి పెడితే కానీ తిండి ముట్టలేదు టామీ.

అప్పటిదాకా తన కొడుకు లేని జీవితం ఎందుకని, తనిక బతకడం వ్యర్థమని అనుకున్న సింధూరికి, టామీని చూశాక బతకాలనిపించింది. టామీలోనే తన కొడుకును చూసుకుంది. దాన్ని తీసుకుని తన పుట్టింటికి బయల్దేరింది. అయితే అప్పుడు కూడా టామీ అక్కడి నుండి కదల్లేక కదిలింది. ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడైనా దొరుకుతుందా? ! దొరికితే మనంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు!
 
కేసే... యూట్యూబ్ సెన్సేషన్
యూట్యూబ్‌లో ‘డాగ్ పాసెస్ ఔట్ ఫ్రమ్ ఓవర్వెల్మింగ్ జాయ్’ అని కొట్టి ఓ వీడియో చూడండి. ‘కేసే’ అనే కుక్క ఉద్వేగం చూసి విస్తుపోవాల్సిందే. ష్నాజెర్స్ జాతికి చెందిన ఈ కుక్క, తొమ్మిదేళ్లుగా స్లొవేనియాలోని రెబెక్కా స్టీవెనా ఇంట్లో ఉంటోంది. తన టీనేజ్ మొత్తం కేసేతో కలిసి ఆడుకున్న రెబెక్కా, ఆ తర్వాత పెళ్లి చేసుకుని వేరే దేశానికి వెళ్లిపోయింది. అయితే రెబెక్కా వెళ్లిపోయాక, కేసే బాగా దిగులుపడిపోయింది.

తన ప్రియనేస్తం ఏమైందో అర్థం కాలేదు ఆ కుక్కకు. అయితే రెబెక్కా రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ తన పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో రెబెక్కాను చూసిన కేసే ఆనందం, ఆవేదన ఆపుకోలేకపోయింది. కిందపడి కేకలు పెడుతూ, రెబెక్కా మీదకి ఎక్కి ముద్దులు పెట్టేస్తూ తన ఎమోషన్ చూపించింది. కేసే ప్రేమ చూసి రెబెక్కా ఆనందం పట్టలేకపోయిపోయింది. దాన్ని చేరదీసింది. మీరూ ఓసారి యూట్యూబ్‌లోలోకి వెళ్లి ఆ కుక్క విన్యాసాలు చూసేయండి మరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement