శరణు

I like to have a meal at TV and enjoy me dinner - Sakshi

కథా ప్రపంచం

ఎండ మాడ్చేస్తోంది. టీవీలో కార్యక్రమాల్ని చూసి ఆనందిస్తూ భోజనం చెయ్యటమంటే నాకెంతో ఇష్టం. సన్‌ టీవీలో ఏదో పాత సినిమా వస్తోంది.ఆ సమయంలో వాకిట్లోకి ఎవరో అపరిచితుడు వచ్చి నిలబడి అటూ ఇటూ చూస్తున్నట్టున్నాడు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. తైల సంస్కారం లేని జుత్తు ఎండిపోయిన పొదలా కనిపిస్తోంది. ముఖం పెయింట్‌ కొట్టినట్టుగా తళతళమని మెరుస్తోంది. నల్లటి పెయింట్‌! మీసాలూ, గడ్డమూ లేవు. కళ్లల్లో ఎరుపు జీర!  చూడ్డానికి పల్లెటూరి మనిషిలా ఉన్నాడు.మెట్లెక్కి వాకిలి దగ్గరకు వచ్చేశాడు. నాకు కంగారు పుట్టింది. ఒక ముద్ద మాత్రమే నా గొంతులోకి దిగింది. అరిటాకును పరిచి, దాని చివరన వేయించిన చేపల ముక్కల్ని పెట్టి, మధ్యలో అన్నం వడ్డించి, దానిమీద సాంబారును పోసి వెళ్లింది నా భార్య సరోజ. ఆమె ఇప్పుడు స్నానాలగదిలో స్నానం చేస్తోంది. మా రెండవవాడు పడగ్గదిలో మొబైల్లో ఏదో గేమ్‌ ఆడుకుంటున్నాడు.‘‘ఎవరయ్యా నువ్వు? నీకేం కావాలి?’’ అన్నం నమలటాన్ని ఆపి కూర్చునే గదమాయిస్తున్నట్టుగా అడిగాను.కొత్త వ్యక్తి కంగారుపడ్డట్టుగా అనిపించలేదు. వాకిట నిలబడే చూపుల్ని వంటగది వరకూ సారిస్తూ... మనుషులెవరూ కనిపించకపోయేసరికి ఓ క్షణం నిరుత్సాహపడి మళ్లీ సర్దుకున్నాడు. అతని ముఖంలో అమాయకత్వం కనిపిస్తోంది. నోట్లో నుండి మాటలు బయటికొచ్చాయి. ‘‘సరోజ ఇల్లే కదా ఇదీ?’’

ఎంతగా దాచాలని ప్రయత్నించినా అతని మాటలు అతను తాగి ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. నాకు కోపం నషాళానికెక్కింది. కొత్తగా ఒక ఇంటికి వచ్చేవాడు పూటుగా తాగి రావటమే కాక ఏమిటో వాడు తాళికట్టిన పెళ్లాంలా సరోజను పేరుపెట్టి పిలుస్తున్నాడేనని అసహనం పొంగుకొచ్చింది. ఒకవేళ సరోజకు బంధువేమోనన్న అనుమానంతో ఆలోచించాను. అతణ్ని ఎక్కడో చూసినట్టుగాను, చూడనట్టుగాను నాలో రెండు రకాల ఆలోచనలు కమ్ముకోసాగాయి.‘‘ఏ సరోజ?’’‘‘పెరుంగుళం సరోజ. నువ్వు దాని మొగుడివే కదా?’’‘‘ఔను.’’‘‘నేను తెలియటంలే నీకు? నా పేరు సేతు. నాదీ పెరుంగుళమే. మీరిద్దరూ పెరుంగుళానికి వచ్చిన ఎన్నో సందర్భాల్లో నేను ఆమె ఇంటికి వచ్చున్నాను.’’‘‘ఔను, ఇతనో గొప్ప మనిషి, ఇతని గురించి అందరికీ తెలిసుండాలనుకొని పొంగిపోతున్నాడు. శుద్ధ మొద్దులా వచ్చి నిలబడి పరాయి వ్యక్తి పెళ్లాం అని కూడా ఆలోచించకుండా, సరోజను ‘అదీ ఇదీ’ అంటూ ఏక వచనంలో పిలుస్తున్నాడు. అయినా, ఇతనికేంటీ ఎక్కువ వయస్సా ఉంటుంది? సరోజ కన్నా ఒకట్రెండేళ్లు ఎక్కువగా ఉండొచ్చు. కచ్చితంగా నా కన్నా వయసు తక్కువగానే ఉండొచ్చు. నన్నే మర్యాద లేకుండా ‘నువ్వు’ అంటూ పిలుస్తున్నాడే. ఏ ధైర్యంతో అలా పిలుస్తున్నాడు?’‘‘మీరెవరో తెలియదే!’’ ఒళ్లు మండిపోతుంటే అన్నాను.నాలో ఒక ఆలోచన స్ఫురించింది. వచ్చినప్పటినుండీ సరోజ గురించే అడుగుతున్నాడు. ఆమె ఇంట్లో ఉందని చెబితే గంటల తరబడి సుత్తికొట్టేలా ఉన్నాడనిపించింది.‘‘సరోజ ఇప్పుడు ఇంట్లో లేదు. బయటికెళ్లింది.’’‘‘బయటికి... అంటే?’’‘‘బజారుకు...’’‘‘ఇప్పుడే వెళ్లిందా? ఎప్పుడో వెళ్లిందా?’’

‘‘ఇప్పుడే వెళ్లింది. రావటానికి ఎలాగూ రెండు గంటలు పట్టొచ్చు. ఏ విషయంగా ఆమెను కలవాలనుకున్నారు? నాతో చెప్పి వెళ్లండి. ఆమె రాగానే చెబుతాను.’’
‘‘దళవాయిపురంలో ఒక ఇంటికి సున్నం కొట్టేందుకు వచ్చాను. ఇంటి యజమాని ఈరోజు వద్దనేశాడు. వచ్చే దార్లో ఉన్న వైన్‌షాప్‌లో నా దగ్గరున్న డబ్బంతా ఇచ్చేసి తాగేశాను. కడుపులో ఇప్పుడు అగ్గిలా మండుతోంది. ఒక వంద రూపాయలు ఉంటే ఇవ్వండి. నా కడుపులో ఇంతేసుకుని, బస్సుకూ టిక్కెట్‌ కొనుక్కుని ఊరెళ్లిపోతాను. అందుకే సరోజను చూసి వెళదామని వచ్చాను.’’‘‘చేతిలో డబ్బు లేదు కదా, మరెందుకు తాగారు?’’‘‘అంతా సరోజ ఉందన్న ధైర్యంతోటే.’’‘‘మీరు ఇంతకుమునుపు ఈ ఇంటికి వచ్చినట్టు లేరే? మరిప్పుడు ఈ ఇంటిని ఎలా కనుక్కున్నారు?’’‘‘మదురైకు మార్గం నోటితోనే చెప్పలా? మనుషుల్ని అడగ్గానే ‘కరెట్టుగా’ ఈ ఇంటికి చేరిపోయాను.’’‘ఇక్కడ నుండి దళవాయిపురం అర కిలోమీటరు దూరంలో ఉంటుంది. పెరుంగుళం పదిహేను కిలోమీటర్ల దూరం ఉండొచ్చు. పెరుంగుళం నుండి బస్సు పట్టుకొని దళవాయిపురానికి రావాలి. అంత దూరం నుండి సున్నం కొట్టే పనికోసం వచ్చాడా ఇతను? లేదూ అబద్ధమాడుతున్నాడా?’ ఆలోచనలో పడ్డాడు.ఎండ తీవ్రతకు తనను పూర్తిగా రక్షించుకోలేక ముందుకు నీడలోకి వచ్చి నిలబడ్డాడు. కూర్చుని అలసట తీర్చుకునేందుకు చోటుకోసం అతని పాదాలు వెతుకుతున్నాయి. దీనంగా నా ముఖాన్ని చూడ్డమూ, తడబాటుగా పాదాలను ముందుకూ, వెనకకూ వేస్తూ అల్లాడిపోసాగాడు. అప్పుడు నేను ‘నిజమైన’ మనిషిగా మారవలసి వచ్చింది. సాటి మనిషి తన సాయం కోసం తపిస్తుండటాన్ని చూసి మనసు కరిగి అతనిమీద దయ చూపించాలనిపించింది. కొడుక్కు వినబడేటట్టుగా... ‘‘ఆయనకొక కుర్చీని పట్టుకొచ్చి వెయ్యరా!’’ అని గట్టిగా అరిచాను.

నా ఆజ్ఞకోసం ఎదురుచూస్తున్నవాడిలా నా కొడుకు వెంటనే ఒక ప్లాస్టిక్‌ కుర్చీని తీసుకొచ్చి వాకిలి లోపలిగా గోడవారగా వేశాడు.ఆ కొత్త వ్యక్తి సునిశితమైన చూపులతో గదిలోని వస్తువులన్నింటినీ పరిశీలనగా చూస్తూ ఉండటాన్ని గమనించాను. గోడకు వేలాడుతున్న ఇంటి పెద్దల ఫొటోల మీద అతని చూపులు నిలిచాయి. అదే వేగంలో నన్నూ చూపులతో ఆశ్చర్యంగా చూడసాగాడు. ఫొటోల అంచులకు రంగురంగుల సరిగ కాగితాలు సరాలు సరాలుగా వేలాడుతున్నాయి. వేగంగా తిరుగుతున్న సీలింగ్‌ ఫ్యాన్‌ గాలికి అవి సరసరమన్న సంగీతాన్ని వినిపిస్తున్నాయి. పెరుంగుళంలో కనిపించిన సరోజ పూరి గుడిసెకు, ఇక్కడ, ఇప్పుడు కనిపిస్తున్న – ఆమె పెళ్లి చేసుకుని కాపురానికొచ్చిన ఇక్కడి కాంక్రీట్‌ ఇంటికీ ఎంతో వ్యత్యాసం ఉందని భావించి అతను ఆశ్చర్యపడుతుండాలి.నేను నా భోజనాన్ని ముగించాను. వచ్చిన వ్యక్తితో మాట్లాడుతున్నప్పటికీ నా నోరు దాని పనిని అది పూర్తిచేసింది. కొడుకును అతనికి తోడుగా ముందు గదిలోని సోఫాలో కూర్చోమని చెప్పి, ఆకును మడిచి పెరట్లోకి వెళ్లాను.సరోజ స్నానం పూర్తిచేసినట్టుంది. స్నానాల గది తలుపు తీసుకొని ఠక్కున బయటికొచ్చింది. మండే ఎండలో వాకిట్లోకొచ్చి నిలబడ్డ వ్యక్తితో మాట్లాడిన మాటల ద్వారా చిరాకు పుట్టుకొచ్చిన నాకు, సరోజ తెల్లటి దేహాన్ని చూడగానే మనసుకెంతో హాయిగా అనిపించింది. తల వెంట్రుకలను తడి తువ్వాలుతో చుట్టుకుంది. చందనపు సోపు వాసన గుభాళించింది. అరిటాకును గంపలో పడేసి తొట్టెలో నుండి నీళ్లు ముంచుకొని చేతులు కడుక్కున్నాను.‘‘వాకిట్లో ఎవరితోనో మాట్లాడినట్టుగా శబ్దం వినిపించింది. ఎవరండీ ఆయన?’’‘‘మీ ఊరేనంట. పేరు అడిగితే ‘సేతు’ అని చెప్పాడు. నిన్ను చూడాలంట. ఎంతో ఆశతో వచ్చినట్టుగా తెలుస్తోంది.’’పరిహాసంతో కూడిన మాటల్ని సాగదీయకుండా సరోజతో అన్నాను. ఎప్పుడూ నా మాటలు ఇలాగే ఉంటాయి కనుక నా ఎగతాళికి నొచ్చుకోకుండా చిరునవ్వుతో ముందుగది వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. నేను ఆమె చెయ్యి పట్టుకొని ఆపాను.

‘‘నువ్వు ‘బజారుకు వెళ్లినట్టుగా’ చెప్పాను. నువ్వు అతని ముందుకెళ్లి నిలబడి నన్ను దోషిని చెయ్యకు తల్లీ!’’సరోజ ఠక్కున ఆగిపోయింది. అయినా ‘అతనెవరో’ తెలుసుకోవాలన్న ఆతృత ఆమెలో కనిపించింది. హాల్లో నిలబడే తలుపు సందులో నుండి చూసింది. అంతే! తేలు కుట్టినట్టుగా అదిరిపడింది. ఆమె పొత్తికడుపులో ఏదో పెట్టి తిప్పినట్టుంది. ఒంట్లో నొప్పి పెడుతున్నట్టుగా వణకసాగింది.‘‘ఈ దొంగ వెధవ ఇక్కడికెందుకొచ్చాడు?’’ అని నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అంది.‘‘దొంగ వెధవా వాడు? మీ ఊరి వాడేనా?’’‘‘ఔనండీ! ఇతనిది పెద్ద వీధి! రౌడీతనం చెలాయిస్తూ తిరుగుతుండేవాడు. మా వీధి మనుషుల్ని పట్టుకొని అదిలించి బెదిరించి డబ్బులు గుంజుకొని వెళ్లేవాడు. ఇదేంటని నిలదీయటానికి ఎవరూ సాహసించేవారు కారు. వీర పరంపర అట. ఒకటే హంతకుల గుంపు. ఇక్కడున్న మన ఇల్లు వీడికి ఎలా తెలిసిందబ్బా? ఇప్పుడెందుకొచ్చాడో? దొంగ సచ్చినోడు!’’ సరోజ మాటలుసణుగుడుగా దొర్లాయి. ముఖమంతా ఎర్రబడింది.అతను నాతో అన్న వాగ్దానాన్ని అలాగే సరోజతో చెప్పాను.ఉన్నట్టుండి ముందు గదిలో నుండి ‘‘నాన్నా... నాన్నా... పరిగెత్తి రండి. కిందపడిపోయాడు’’ అని హెచ్చు స్థాయిలో మావాడి గొంతు వినిపించింది. గబగబా ముందు గదిలోకి పరుగెత్తాం.అతను కూర్చున్న కుర్చీలో నుండి జారిపోయి వాకిలి దగ్గర అస్తవ్యస్తంగా కిందపడున్నాడు. భుజం చుట్టూ కట్టుకున్న డైమన్‌ తువ్వాలు పైకొచ్చి తలను మరుగుపరిచింది. నడుముకున్న పట్టుపంచె పక్కకు తొలగిపోయింది. అతని నోటి నుండి కారిన తాంబూలం ఉమ్మి వాకిలి నేలమీద కారి ఉంది.‘‘అయ్యో, ఏమయ్యిందో తెలియటం లేదే? వెళ్లి లేపండి!’’ సరోజ ఆదుర్దాతో గట్టిగా అరిచింది.నేనూ, మావాడూ గబగబా సేతును పైకెత్తి మళ్లీ అదే కుర్చీలో కూర్చోబెట్టాం. అతని ముఖం వికారంగా మారి ఉంది. అతని చేతుల్లో, కాళ్లల్లో బలం లేదు. అవి బలహీనంగా వేలాడుతున్నాయి. వాటిని దగ్గరకు చేర్చాడు మావాడు.‘‘ఏమండీ, ఇదిగో ఇటు చూడండీ...’’ అని అతణ్ని రెండు మూడుసార్లు గట్టిగా పిల్చాను. మత్తు నుండి బయటపడలేదు అతను. సరోజ వేగంగా వంటగదిలోకి పరుగెత్తుకెళ్లి ఒక చెంబులో మంచినీళ్లు తీసుకొచ్చింది.‘‘ఇదిగో, దీన్ని కాస్త అతనికి తాగటానికివ్వండి. చస్తాడో, ఏమిటో!’’ అని అసహనంగా ఆ చెంబును నా చేతికిచ్చింది.నాకు బెరుకుగా అనిపించింది. ‘‘వీళ్లు మన ఇండ్లల్లో పచ్చి మంచినీళ్లు అయినా తాగుతారంటావా? అతనికి తెలిస్తే గొడవైపోదూ?’’

‘‘అవసరానికి తప్పులేదండీ. ‘అతనేం తాగాడో’ అతనికెలా తెలుస్తుందీ? మనలో ఎవరైనా చెబితేనే సరి! భయపడకుండా అతని నోటిని తెరిచి తాగించండి.’’ ఆమె చెప్పింది సరిగ్గానే అనిపించింది. అతని దగ్గరికెళ్లి తలను వెనక్కు వాల్చి నోట్లోకి నీళ్లను ఒంపేందుకు ప్రయత్నించాను. కొంతసేపటికి నూతనోత్సాహాన్ని తెచ్చుకున్న సేతు, మెల్లగా కళ్లను తెరిచి మమ్మల్ని ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాడు. అసంకల్పితంగా చెంబును అతని దృష్టిలో పడకుండా జాగ్రత్తపడ్డాను.‘‘ఉన్నట్టుండి ఏమైందండీ మీకు? బాగానే మాట్లాడుతూ ఉన్నారుగా?’’‘‘ఆకలి దహించటంతో కళ్లు తిరిగి పడిపోయినట్టున్నాను. మందు కొట్టిన కడుపుకు ఏదో ఒకటి మింగాలి కదా! ఖాళీ కడుపుతో మందు కొడితే ఇలాగే ఉంటుంది’’ మత్తు దిగని కళ్లతో మాట్లాడినా సరిగ్గానే బదులిచ్చాడు సేతు. అతని దృష్టి సరోజ మీద నిలిచింది.‘‘నువ్వు బజారుకెళ్లినట్టుగా నీ మొగుడు చెప్పాడే?’’‘‘నేను బాత్‌రూమ్‌లో స్నానం చెయ్యటం ఆయనకు తెలియదు’’ అబద్ధం చెప్పింది సరోజ.మళ్లీ అతడు తానుగా తన కోరికను తెలిపేటట్టుగా మాట్లాడాడు.‘‘సరోజా... నిన్ను నమ్ముకునే వచ్చాను. ఒక వంద రూపాయలుంటే ఇవ్వు. ఆకలి మంటై దహించేస్తోంది. హోటల్లో తినేసి అట్నుంచి అటే ఊరికి వెళ్లిపోతాను.’’‘‘వంద రూపాయలకు నేనెక్కడికెళ్లనూ? ఇప్పుడంతా వ్యవసాయంలో ఏం లాభం వస్తోందనీ? ఇప్పటికి మీకు పెట్టడానికి మా ఇంట్లో అన్నం మాత్రమే ఉంది. అయినా మీరు మా ఇండ్లల్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరుగా.’’అకస్మాత్తుగా నా చూపులు టీవీకేసి తిరిగాయి. పాత సినిమా క్లైమాక్స్‌కొచ్చింది.ముఖంలో దైన్యం కనిపిస్తుంటే సరోజనే చూడసాగాడు సేతు. అతని చూపులు చాలా నీరసంగా కిందికి వాలిపోతున్నాయి. ఆకలి బాధకు అతని ముఖం పీల్చుకుపోసాగింది. కుర్చీలో కూర్చోనుండటం కూడా అతనికి కష్టమైన కార్యంగానే అనిపిస్తోంది. పాములాగా మెలి తిరుగుతూ కూర్చుని ఉన్నాడు.‘‘నేను ఆకలిని తట్టుకోలేకపోతున్నాను. ఇంకేం చెయ్యను? కడుపుకు ద్రోహం చెయ్యకూడదు కదా? కొద్దిగా అన్నం పట్టుకొచ్చి ఇవ్వు. ఆకలినైనా అణచుకొని వెళతాను.’’సినిమా ముగిసింది.తర్వాత రాబోయే కార్యక్రమాలను చూసే ఆసక్తి లేకపోవటంతో టీవీ స్విచ్‌ ఆఫ్‌ చేశాను.
తమిళ మూలం: అభిమాని
 అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top