‘ఉద్భవి నిందితులను రెచ్చగొట్టింది’

Heart Touching Telugu Story On Woman - Sakshi

ఈవారం కథ

పొడవాటి జడ, పెద్ద పెద్ద ఝుంకీలు, ఆకట్టుకునే కళ్లు, ముట్టుకుంటే కందిపోయేంత తెలుపు. గులాబీ రంగు పొడవాటి కుర్తా మీద బంగారపు రంగు దుపట్టా గుండెల నిండుగా కప్పుకుని.. హ్యాండ్‌ బ్యాగ్‌ వేసుకుని వచ్చింది ఆమె. ‘ఏంటమ్మా.. ఏం కావాలి?’ అడిగాడు గట్టిగా రాఘవయ్య ఆమెని చూసి. ‘రూమ్‌.. కావాలి’ అని గేట్‌కి ఉన్న టులెట్‌ బోర్డ్‌ చూపిస్తూ సైగ చేసింది. ‘ఓ.. మాటలు రావా? రూమ్‌ ఆ పక్కనే గోడ దాటి వెళ్లాలి.. చూస్తావా?’ అన్నాడు రాఘవయ్య అదే స్వరంతో. ‘ఊ..’ అన్నట్లుగా తల ఆడించింది ఆమె. వయసు 23 ఏళ్లు ఉండొచ్చు. ‘నాకు కొంచెం చెవుడుందిలేమ్మా.. అందుకే గట్టిగా అరుస్తున్నా.. పద చూపిస్తా’ అంటూ నెమ్మదిగా పైకి లేచి, అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు కదిలాడు. అతడి వెనుకే ఆమె నిదానంగా, పొందిగ్గా నడిచింది.

‘ఏం తాతా? అద్దెకా?’ అని రాఘవయ్యని పలకరిస్తూనే.. ‘ఏ ఊరమ్మాయ్‌?’ అంటూ మాట కలిపింది పక్కింటి రాధమ్మ. ‘ఆ.. అద్దెకే.. ఈ పిల్లకి మాటలు రావట’ అంటూ తలుపు తాళం తీసి లోపల లైట్‌ వేసి.. ‘రా అమ్మాయి లోపలికి..’ అన్నాడు రాఘవయ్య. చిరునవ్వు నవ్వుతూ లోపలికి వెళ్లింది. ‘అద్దె మూడువేలు.. ఈ దేవ్‌ నగర్‌ కాలనీలో ఇంతకంటే తక్కువకు రాదమ్మా. తెలిసే ఉంటుందిలే. ఎంతమంది ఉంటారు?’ అని అడిగాడు రాఘవయ్య. ‘నేను ఒక్కర్తినే’ అంటూ సైగ చేసింది మళ్లీ నవ్వుతూ.. ‘అవునా.. అయితే ఈ రూమ్‌ సరిగ్గా సరిపోతుంది. కాకపోతే బాత్‌ రూమ్‌ వెనుక వైపు ఉంది, ఈ తలుపు కాస్త గట్టిగా నొక్కి వేసుకోవాలి. సెక్యూరిటీ అంటావా? ఇక్కడ అన్ని ఇళ్లు దగ్గర దగ్గరగానే ఉంటాయి కదా.. అంత సాహసం ఎవ్వరూ చెయ్యరు. అడ్జెస్ట్‌ అవుతావా?’ అడిగాడు చిన్న స్వరం చేసుకుని.

మళ్లీ తల ఆడించింది నవ్వుతూ.. ఆమె వినయానికి ముగ్ధుడైపోయాడు ఆ ముసలాయన. ‘ఇదిగో అమ్మాయ్‌.. చూస్తుంటే చాలా పద్ధతిగా కనిపిస్తున్నావ్‌. అందుకే చెబుతున్నా, నీళ్లు తక్కువగా వాడాలి. రెంట్‌ ఏ నెలకానెల ఇచ్చెయ్యాలి. ఇంతకీ ఈ ఊరిలో నీకు పనేంటీ?’ అడిగాడు ఆసక్తిగా. ఆమె సైగలు అర్థం చేసుకోలేక.. ‘సరే సరేలే.. ఒక నెల అడ్వాన్స్‌ ముందుగానే ఇవ్వాలి. రేపు వచ్చేస్తావా?’ అన్నాడు. సరే అంది ఆమె. ‘అవునమ్మాయ్‌ ఇంతకీ నీ పేరేంటీ?’ అడిగాడు రాఘవయ్య. చేతి మీద పచ్చబొట్టు చూపించింది ఆమె నవ్వుతూ.. తెల్లటి చేతి మీద ‘ఉద్భవి’ అని పెద్దపెద్దగా ఉన్న తెలుగు అక్షరాలు ఆమెలానే చాలా అందంగా ఉన్నాయి.

‘ఉద్భవీ.. ఉద్భవీ.. మీ బాబాయ్‌ చికెన్‌ కూర తెచ్చుకున్నారు. నీకు ఈ రోజు ఆదివారమే కదమ్మా.. వచ్చి కాస్త హెల్ప్‌ చేస్తావా?’ అడిగింది రాధమ్మ. ఇంటి పని, వంట పని అన్నింటిలోనూ సాయం చేసే ఉద్భవి.. అద్దెకు దిగి ఏడాదికాక మునుపే.. ఆ కాలనీలో అందరికీ చాలా దగ్గరైపోయింది. పండగొస్తే ఇంటి ముందు ముగ్గులు వేయడానికి, చుట్టాలొస్తే పిండి వంటలు చెయ్యడానికి ఉద్భవే గుర్తొస్తుంది ఆ చుట్టుపక్కల ఆడవాళ్లకి. ‘ఏం ఉద్భవీ.. పెళ్లెప్పుడు చేసుకుంటావ్‌? ముందు వెనుకా ఎవరూ లేరని చెప్పావ్‌.. అనాథాశ్రమంలో పెరిగానన్నావ్‌.. అయినా ఫర్వాలేదు. నువ్వు ‘ఊ’ అను. మా చుట్టాల్లో మంచి పిల్లోడ్నే చూస్తా. పిల్లవేమో అందగత్తెవి, చక్కగా ఆ డెఫ్‌ అండ్‌ డంబ్‌ స్కూల్లో గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నావ్‌.. ఎవరికైనా అంతకన్నా ఏం కావాలి చెప్పు?’ అంది ఉద్భవితో వంట పనులకు సాయం తీసుకెళ్లిన పద్మక్క. ఎవరేమన్నా చిన్న నవ్వు నవ్వి ఊరుకునేది ఉద్భవి. పెళ్లి గురించి మరీ గట్టిగా అడిగితే.. ‘వివాహబంధం మీద నమ్మకం లేదు’ అంటూ సైగల్లో చెప్పేది. కానీ ఆ సైగలు ఎవరికి అర్థం కావాలి?

‘ఉద్భవిగారూ..! మన కాలనీ కుర్రాళ్లనీ తీసుకొచ్చాను. ఇవన్నీ ఆటోలో పెట్టించెయ్యాలా?’ అని అడిగాడు స్వరాజ్‌. ‘ఊ’ అన్నట్లుగా సైగ చేసింది ఉద్భవి. ‘రేయ్‌.. అవన్నీ అందులో వేసుకుని ఆశ్రమానికి వచ్చేయండి. జాగ్రత్త ఏవీ ఒలికిపోకూడదు. లాస్ట్‌ టైమ్‌ సాంబారు సగం జారేశారు. ఈసారి అలా జరగకూడదు సరేనా..’ అని గట్టిగా వార్నింగ్‌ ఇస్తూనే.. బైక్‌ స్టార్ట్‌ చేశాడు స్వరాజ్‌. వెనుక ఓ వైపుకి ఎక్కి కూర్చుంది ఉద్భవి. హీరోయిన్‌ ఎక్కిన తర్వాత హీరో గమ్మునుంటాడా? ఓ చెయ్యి కాలర్‌ ఎగరేస్తుంటే.. మరో చెయ్యి బైక్‌ ఎక్సలేటర్‌ రెయిజ్‌ చేస్తోంది. పరిచయం కాగానే ఉద్భవి.. స్వరాజ్‌కి ఓ క్లారిటీ ఇచ్చింది. ‘నా నుంచి స్నేహాన్ని తప్ప మరేం ఆశించినా దొరకదని’. ప్రేమించాడు కదా ఆ మాత్రం చాలనుకున్నాడు. అప్పుడే స్వరాజ్‌ కూడా ఉద్భవికి ఓ మాట ఇచ్చాడు. ‘బంధాన్ని బలపరిచే మాట చాలు. భావాన్ని బలపరిచే స్పర్శని అనుమతి లేకుండా నేను ఎప్పటికీ కోరను’ అని.
దేవ్‌ నగర్‌ కాలనీ.. టౌన్‌కి కాస్త దూరం. కొన్నేళ్ల క్రితం ఉద్భవి ఇంటి ఓనర్‌ రాఘవయ్య, స్వరాజ్‌ తాత, మరికొందరు కలిసి ఊరికి దూరంగా ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్నారు. కాలక్రమేణా అక్కడ జనాలు, ఇళ్లు పెరిగి అదో కాలనీగా మారిపోయింది.

లేవగానే యోగా, ధ్యానం తప్పకుండా చేసేది ఉద్భవి. తనకి కుట్లు, అల్లికలు అంటే మహా ఇష్టం. సెలవు వస్తే.. అందరికీ జాకెట్ల మీద వర్క్‌ చేసి ఇవ్వడం, దారంతో అందంగా పేర్లు రాయడం.. ఇలా ఖాళీ దొరికిన ప్రతిసారీ ఏదొక చేతి పని చేస్తూనే ఉండేది. బాగా దగ్గరైన వాళ్లకు ఫ్రీగా, ఇతరులకు డబ్బులు తీసుకుని కుట్టేది. స్వరాజ్‌కి అది అమ్మమ్మ ఊరు. తల్లీదండ్రీ చనిపోతే.. తాత దగ్గరే పెరిగాడు. కొన్నాళ్లకు తాత కూడా చనిపోయాడు. ఆస్తి అయితే బాగానే ఉంది. టౌన్‌లో వడ్డీ వ్యాపారం చేస్తుండేవాడు. చిన్న వయసులోనే అన్ని బంధాలకు దూరమైన స్వరాజ్‌.. మనసుతో ముడిపడే బంధాలకు చాలా విలువిచ్చేవాడు. అందుకే కాబోలు ఉద్భవి ‘కేవలం స్నేహమే’ అన్నా.. ఆమే ప్రాణంగా బతకడం మొదలుపెట్టాడు.

‘నా బంగారు తల్లి.. ప్రతివారం మా కోసం ఇలా అన్ని స్వయంగా వండి తీసుకొస్తావ్‌. నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి’ అంటూ ఆ ఆశ్రమంలో కొందరు ఆశీర్వదిస్తుంటే.. ‘పెళ్లి చేసుకో తల్లి’ అని సలహా ఇచ్చేవాళ్లు మరికొందరు. ‘స్వరాజ్‌నే పెళ్లి చేసుకో’మని ప్రేమగా చెప్పేవాళ్లు ఇంకొందరు. అందరికీ ఆమె చిరునవ్వే సమాధానం. రోజులు, నెలలూ గడుస్తున్నాయి. కాలనీ వాళ్లకే కాదు ఉద్భవి తెలిసిన వాళ్లందరికీ.. ఉద్భవితో మంచి స్నేహం కుదురుతోంది. స్వార్థం లేని ఆమె నవ్వు అందరినీ కట్టిపడేస్తోంది.
ఉద్భవి సైగలను గమనించిన స్వరాజ్‌.. ‘అర్థమైందండీ.. పక్క ఊరిలో ఉండే.. కూరగాయల ముసలమ్మ దగ్గరకు తీసుకుని వెళ్లాలి.. అంతేగా?’ అన్నాడు. ‘అవును’ అన్నట్లుగా తల ఊపుతూ బైక్‌ ఎక్కబోయింది ఉద్భవి. ‘అవునూ.. ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను.. ఆమె మీకు ఎప్పటి నుంచి తెలుసు? ప్రతినెలా ఆమెని కలిసి నెలకు సరిపడా డబ్బులు ఇచ్చివస్తుంటారు ఎందుకు? వాళ్లేమో ముస్లింలనుకుంటా? మీకు ఎలా పరిచయం? ఆమెకు పిల్లలు లేరా?’ అంటూ ఆరా తీశాడు స్వరాజ్‌. ‘నేను అనాథాశ్రమంలో ఉన్నప్పుడు ఆమె మా ఆయా.. భర్త మంచానపడ్డాడు. ఆమెకి ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు చనిపోయాడు, మరో కొడుకు పెళ్లి చేసుకుని దూరంగా ఉంటున్నాడు’ అని సైగలతో చెప్పింది. ‘మరి.. ఎక్కడికైనా నన్ను వెంట తీసుకెళ్లే మీరు.. ఆమె దగ్గరకు ఎందుకు తీసుకుని వెళ్లరు? కాస్త దూరంలోనే బైక్‌ దిగి మీరు మాత్రమే వెళ్లి కలుస్తారెందుకు?’ అని అడిగాడు అనుమానంగా.. ‘ఆమెకు నీ వయసు మగపిల్లల్ని చూస్తే.. తన కొడుకులు గుర్తుకొచ్చి బాగా ఏడుస్తుంది. అందుకే నిన్ను తీసుకుని వెళ్లను’ చెప్పింది ఉద్భవి సైగలతో..

‘ఏం ఉద్భవి.. నువ్వు రావట్లేదా పెళ్లికి? నీకు తెలుసో తెలియదో కానీ నైట్‌ పెళ్లిళ్లు చూడటానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. కాలనీ వాళ్లమంతా పోతున్నాం.. నువ్వు ఒక్కదానివే ఎట్లుంటావ్‌? పెళ్లి కొడుకు వాళ్లు బాగా సౌండ్‌ అట. అరవై రకాల ఫుడ్‌ ఐటమ్స్‌ పెడుతున్నారట, రెండు లగ్జరీ బస్సులు పెట్టారు. మన చెవిటి రాఘవయ్య కూడా వస్తున్నాడు. నువ్వు రావటానికేంటీ? ఈ విషయం అసలు పద్మక్కకి చెప్పావా? కూతురు పెళ్లికి నువ్వు రాలేదంటే అస్సలు ఊరుకోదు. మేకప్‌ అదీ నువ్వే చెయ్యాలిగా?’ అడిగింది రాధమ్మ. ‘చెప్పాను పిన్నీ.. మేకప్‌ కోసం ఓ పార్లర్‌ ఆమె వస్తుందట. పెళ్లి నుంచి తిరిగి వచ్చేసరికి తెల్లారిపోతుంది. మళ్లీ ఉదయాన్నే నేను స్కూల్‌కి వెళ్లడం కష్టం అవుతుంది. మీరు వెళ్లిరండి’ అంటూ సైగ చేసింది ఉద్భవి.

మరునాడు ఉదయాన్నే పెళ్లినుంచి తిరిగి వచ్చిన వాళ్లంతా అలసిపోయి, మధ్యాహ్నం వరకూ మంచం దిగలేదు. ఉద్భవి స్కూల్‌కి వెళ్లి ఉంటుందిలే, సాయంత్రం వస్తుందిలే అనుకున్నారు కొందరు. కానీ ఉద్భవి ఆ రోజు రాత్రికి కూడా రాలేదు. పోలీసులు అందించిన సమాచారంతో ఆ మరునాడు ఉదయాన్నే.. ఉద్భవి హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య ఉందని తెలిసి కాలనీ వాళ్లంతా పరుగుతీశారు. ‘ఎవరో గ్యాంగ్‌ రేప్‌ చేసి పక్కూరు పైడితల్లి గుడివెనుక తుప్పల్లో పడేశారట. నిన్న పొద్దున్నే ఓ కూరగాయల ముసలమ్మ మన ఉద్భవినీ గుర్తుపట్టిందట’ చెప్పింది రాధమ్మ పక్కనే ఉన్నామెతో.. ‘అయ్యో నోరులేని పిల్ల.. పాపం.. చాలా అన్యాయం చేశారు. పిల్లకి న్యాయం జరిగేవరకూ ఇక్కడ నుంచి కదిలేదే లేదు’ అంటూ ఆ కాలనీ వాళ్లంతా అక్కడే నినాదాలు మొదలుపెట్టారు. అమ్మాయి అందంగా ఉండేసరికి.. మీడియా బ్రేకింగ్స్‌ కూడా వేయడం మొదలుపెట్టింది. ‘ఆడదానికి ఏదీ రక్షణా?’ అంటూ చర్చాగోష్టి, ర్యాలీలు ఊపందుకున్నాయి. రచ్చ మీడియాకి ఎక్కడంతో.. పోలీసులు హుటాహుటిన నేరస్తుల్ని పట్టుకునే పనిలో పడ్డారు. ఘడియ ఘడియకు సీసీ పుటేజ్‌లు, సీన్‌ టూ సీన్‌ లైవ్‌లతో మీడియా హోరెత్తిస్తుంటే.. రెండు రోజులకు మరో బ్రేకింగ్‌ పెద్ద దుమారమే రేపింది. ‘డాక్టర్స్‌ రిపోర్ట్‌లో బయటపడ్డ నిజం. ఉద్భవికి మాటలొచ్చా? కావాలనే మాట్లాడకుండా అందరినీ మోసం చేసిందా?’

నాలుగు రోజులకు ఇంకో బ్రేకింగ్‌. ‘ఉద్భవి ప్రాణాలకు ప్రమాదం లేదన్న వైద్యులు, అనుమానితుల అరెస్ట్‌..’ ఈ అన్యాయగాథలో బాధితురాలు మూగ దానిలా నటించిందనే సరికి జనాల్లో ఆసక్తి పెరిగింది. మరో 4 రోజులకు ‘మీడియా ముందుకు ఐదుగురు నిందితులు’. ‘అసలు ఉద్భవి అమ్మాయే కాదు.. తను ఓ హిజ్రా’ అంటూ ఆవేశంగా ప్రకటించాడు ఓ నిందితుడు. అది విన్న వాళ్లంతా షాక్‌ అయ్యారు. అమ్మాయి కాదంటే పోరాటం చేసేవాళ్లు లైట్‌ తీసుకుంటారని, దానితో.. న్యూస్‌లో పస పోతుందనే కారణంతో అప్పటిదాకా నిజాన్ని దాచిన మీడియా కూడా మరో బ్రేకింగ్‌ వేసింది. ‘ఉద్భవి అమ్మాయా? హిజ్రానా?’ అని.

‘నీకు ఈ లోకంతో పనా? ఈ లోకానికి నీతో పనా? అవసరాలతో పూట వెళ్లదీసే ఈ సమూహానికి నీ మనోగతంతో పనా?’ అంటూ తనలో తనే పాటలాంటి మాటలను వల్లెవేస్తూ.. వచ్చి పక్కనే కూర్చున్నాడో పెద్దాయన. ఎరుపెక్కిన కళ్లతో.. ముక్కు పుటాలను గట్టిగా తుడుచుకుంటూ తలపైకెత్తి అతడిని చూసింది తను. మెడలో రుద్రాక్షలు, నుదిటి మీద నిలువు విభూది బొట్లు.. చేతికి కాశీతాళ్లు, జైదుర్గా అనే నామస్మరణలు.. భలే విచిత్రంగా ఉన్నాడా మనిషి. 60 ఏళ్లు పైబడి ఉంటాయి. కూర్చోవడమే తనని చూస్తూ..  ‘ఏమైంది తల్లీ.. ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావ్‌?’ అంటూ ఆరా తీశాడు.

‘నీకు ఈ బతుకు అవసరమా చచ్చిపో? అంది మా అమ్మ. అందుకే చచ్చిపోదామని వచ్చేశానండీ. కానీ భయమేస్తోంది..’ గుండె లోతుల్లోని దు:ఖాన్ని అణచివేసుకుంటూ వణుకుతూ వచ్చిన మగ స్వరాన్ని విని విషయాన్ని అర్థం చేసుకున్నాడు అతడు. మోకాళ్ల కిందకి గౌను వేసుకుంది తను. ఒత్తైన, పొడవైన జుట్టులోని ముందరి వెంట్రుకలు గాలికి కళ్ల మీదుగా అటూ ఇటూ ఊగుతుంటే.. వెక్కి వెక్కి ఏడ్చిన తర్వాత వచ్చే అలసటతో నిట్టూరుస్తూ.. చూపుకు అడ్డుపడ్డ వెంట్రుకలను చెవులకు చుట్టింది. ఏడ్చిన తర్వాత వచ్చే దగ్గు మాత్రం మగపిల్లాడ్ని గుర్తుచేస్తుంది. ‘నాకు నీ సమస్య అర్థమైంది. నీ వయసెంత?’ అని అడిగాడు ముసలాయన. ‘పదేళ్లు..’ అంది తను ఆగని కన్నీళ్లను తుడుచుకుంటూ.. ‘నిన్ను నువ్వే అర్థం చేసుకోలేని వయసు నీది. కానీ ఈ సమాజం తనని అర్థం చేసుకోమంటోంది. నీ పుట్టుకలోని లోపం దేవుడి సృష్టి. నువ్వు దేవుడ్ని నమ్ముతావా?’ అడిగాడాయన. ‘ఊ’ అంది నిస్తేజంగా మారిన నిస్సహాయపు చూపులతో మరోసారి కళ్లు పైకెత్తి. ‘ఎందుకు నమ్ముతావ్‌?’ అని అడిగాడు. ‘ఏది కోరుకున్నా తీరుతుందని ఒకసారి మా అమ్మ చెప్పింది’ అంది తను. ‘దేవుడు మన కోరికలు తీర్చడమే కాదు.. అప్పుడప్పుడు మన శక్తిని పరీక్షిస్తూ ఉంటాడు.

నీకు ఒక సమస్య వచ్చిందంటే.. నీ శక్తి మీద ఆ దేవుడికి అపారమైన నమ్మకం ఉందని అర్థం. నువ్వు ఎలాగైనా ఆ సమస్యని ఎదుర్కొని జీవిస్తావని దేవుడి నమ్మకం. నీ లోపాన్ని ఎత్తిచూపిస్తూ.. నీతో ఏ అవసరం లేదని ఈ సమాజం నిన్ను ఒంటరిదాన్ని చేసింది కదూ? కానీ.. నువ్వు బతకాలంటే ఈ సమాజం కచ్చితంగా కావాలి. నేను నీకు తోడుగా ఉండే ఓ సమూహాన్ని పరిచయం చేస్తాను. మరి నేను చెప్పినట్లే చేస్తావా?’ అడిగాడు ఆయన.  ఏడ్చీ ఏడ్చీ బొంగుర పోయిన స్వరాన్ని సరిచేసుకుంటూ ‘ఊ’ అని అంగీకారంగా తల ఆడించింది తను. ‘పద నాతో..’ అంటూ చెయ్యి పట్టుకుని ఓ మధ్యవయస్కుడి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. చేతిలో ఉన్న చిట్టి చేతిని అతడికి చూపిస్తూ.. ‘ఇక్కడ ఉద్భవి అని అందమైన తెలుగు అక్షరాలను పచ్చబొట్టుగా వెయ్యి’ అన్నాడు ఆ ముసలాయన. ‘సరే బాబు’ అంటూ అంతా సిద్ధం చేస్తుంటాడు ఆ వ్యక్తి. ఇంతలో ఆ ముసలాయన తనను కాస్త దూరంగా తీసుకుని వెళ్లి.. ‘ఇప్పుడు ఆ మనిషికి నీ గురించి ఏమీ తెలియదు. నీకు నీ స్నేహితుల హేళనలు బాగా గుర్తున్నాయి కదా?’ అడిగాడు. అర్థమైనట్లే మౌనంగా ఉంది తను. పది నిమిషాల తర్వాత ‘ మీ మనవరాలు భలే అమ్మాయండీ. ఏడవకుండా, అరవకుండా భలే ఓపిగ్గా పచ్చబొట్టు వేయించుకుంది. ఇంత ధైర్యవంతమైన ఆడపిల్లని నేనింత వరకూ చూడలేదు’ అన్నాడు ఉద్భవిని చూసి నవ్వుతూ పచ్చబొట్టు వేసిన వ్యక్తి.

‘పేరు ఉద్భవి.. వయసు పదేళ్లు, నా అనే వాళ్లెవరూ లేరు, తనకి మాటలు రావు. దారిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటే.. ఈ ఆడపిల్లల ఆశ్రమానికి తీసుకొచ్చాను’ అన్న ఆ ముసలాయన మాటలు వింటూ ఓ పక్కకు పొందిగ్గా నిలబడింది పదేళ్ల ఉద్భవి. అప్పటి నుంచీ తనకి ఆ ముసలాయన చెప్పిన మాటలు పదేపదే వినిపించేవి. ‘ఉద్భవీ.. ఇక నుంచి ప్రతిరోజూ ఒక సాధన చెయ్యి, ఎవరితోనూ నోరు తెరిచి మాట్లాడను అని. ఒక లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో లోపాన్ని అంటగడుతున్నాడేంటీ అనుకోకు. సమాజం పోకడ తెలిసినవాడిగా నీకీ సలహా ఇస్తున్నాను. ఇది నీకు ఎంత సహకరిస్తుందో.. పోనుపోనూ నీకే అర్థమవుతుంది. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే.. ఇక్కడున్న వాళ్లందరికీ నీ లోపం తెలుస్తుంది. దానితో హేళనలు, అవమానాలు వేటినీ నువ్వు ఆపలేవు.

ఎందుకంటే సమూహానికి వ్యక్తి మనసుతో పని లేదు. తప్పించుకోలేవు. పైగా కొత్తగా నువ్వు ఏర్పరచుకున్న బంధాలు కూడా నీకు దూరమయ్యే ప్రమాదం ఉండొచ్చు. ఆ భయంతోనైనా నువ్వు నోరు తెరవలేవన్న నమ్మకం నాకుంది. ఒక్కటి మాత్రం నిజం. ఈ లోకానికి నీతో పని లేకపోయినా నీకు ఈ లోకంతో పని ఉంది. ఎందుకంటే.. ఏ మనిషికైనా బతకడానికి నలుగురు మనుషుల తోడుకావాలి. పొట్లాడటానికైనా, పోరు సాగించడానికైనా, తన మంచితనాన్ని పంచడానికైనా.. మనల్ని, మన విధానాలను సమ్మతించే నలుగురు మనుషులు తోడుగా ఉండాలి. నీ వయసుకి నేను ఇప్పుడేం చెప్పినా నీకు అర్థం కాకపోవచ్చు. కాలం నీకు చాలా నేర్పిస్తుంది. జాగ్రత్త, చావు అనే పదాన్ని ఇంకెప్పుడూ నీ మనసులోకి రానివ్వకు. ఆ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడన్న విషయం మరిచిపోకు’

హాస్పిటల్‌ బెడ్‌ మీద నిసత్తువగా పడి ఉన్న ఉద్భవికి ఆ ముసలాయన చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి. కాసేపు నిశ్శబ్దం. ‘రేయ్‌ ఇది అమ్మాయి కాదురా..?’, ‘ఏదైతే ఏంట్రా..’ అన్న కీచకుల మాటలు అస్పష్టంగా పదేపదే వినిపిస్తుంటే.. హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉన్న ఉద్భవి ఉలిక్కిపడి కళ్లు తెరిచింది. కానీ బెడ్‌ మీద నుంచి పైకి లేవలేకపోయింది. అంతకు 2 నిమిషాల ముందే ఉద్భవి కోలుకోవాలని గుడికి వెళ్లి వచ్చిన స్వరాజ్‌.. ఉద్భవి నుదిట మీద బొట్టు పెట్టి వెళ్లాడు.
‘అమ్మా.. మీరు చెప్పండి. ఉద్భవి మీతో ఎలా ఉండేది? తను అమ్మాయి కాదనే విషయాన్ని మీరు కనిపెట్టలేక పోయారా?’ అనే రిపోర్టర్‌ ప్రశ్నకు.. ‘ఇదిగో బాబూ.. తన గురించి మమ్మల్ని అడగకండి, ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు ఉన్నారు. వాళ్లకి పెళ్లిళ్లు కావాలి. తను మా ఇంటి ముందు ఉందన్న మాటే కానీ.. మాకు అంతగా తన గురించి తెలియనే తెలియదు. అయినా ఆడో, మగో కనిపెట్టడానికి ఏముందయ్యా? మాట రాదండి. బట్టలు ఊూూూ చూడలేం కదా’ అంది రాధమ్మ కోపంగా..
ఐదుగురు నిందితుల్లో నలుగురు కాలనీకి చెందిన కుర్రాళ్లే కావడంతో.. కాలనీ వాళ్లు వెనక్కి తగ్గారు. ‘తను అమ్మాయే కాదట. ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడింది. కావాలనే మా పిల్లల్ని రెచ్చగొట్టి ఉంటుంది. లేకపోతే వీళ్లెందుకు ఆ పని చేస్తారు?’ అనే నిందితుల తల్లిదండ్రుల వాదనను చాలామంది బలపరిచారు.

‘అసలు ఆమె అమ్మాయే కాదు. ఒకేసారి ఐదుగురిని చూసేసరికి ఆమెలో ఎలాంటి భావాలు కలిగాయో మనం చెప్పలేం.. నిందితులని ఆమే బాగా రెచ్చగొట్టింది. చూడటానికి అందంగా ఉండటం, అప్పటికే వీళ్లంతా తప్ప తాగి ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది’ అంటూ కేసు తీవ్రతని తగ్గించే ప్రయత్నం మొదలుపెట్టాడు నిందితుల తరఫు లాయర్‌. అతడి వాదనని చాలామంది సమర్థించారు. ‘నిజమే అయ్యుంటుంది.. లేకపోతే అమ్మాయిలే లేనట్లుగా హిజ్రాని ఎందుకు రేప్‌ చేస్తారు?’ అంటూ నోరు జారి మహిళా సంఘాలకు కోపం తెప్పించినవాళ్లు కొందరైతే.. ‘ఓరీడమ్మా బడవా.. ఇది నేను చూడ్లా.. ఇదేం గోలరా నాయనా?’ అంటూ కామెడీగా ఈ సమాజంలో మేము సైతం అన్నారు మరికొందరు. ఉద్భవి అమ్మాయి కాదని తెలిశాక చాలామంది న్యాయ పోరాటం నుంచి తప్పుకున్నారు. మెల్లగా మీడియా కూడా మరో బ్రేకింగ్‌ కోసం వెంపర్లాడటంతో.. ఉద్భవి కేసు మరుగున పడింది. కొన్ని వారాలకు ఆసుపత్రిలోనే పూర్తిగా కోలుకున్న ఉద్భవిని.. పోలీసుల పరిరక్షణలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆ సమయంలో స్వరాజ్‌ తనని కలవడానికి వచ్చినా ఉద్భవి అందుకు ఇష్టపడలేదు. చివరికి ఒక బ్యాగ్‌ తీసుకొచ్చి ఉద్భవికి ఇవ్వమన్నాడు స్వరాజ్‌. అందులో ఉద్భవికి సంబంధించిన సర్టిఫికెట్స్, కొన్ని బట్టలు, డైరీలు, పుస్తకాలు, సెల్‌ ఫోన్‌.. ఇలా అవసరమైనవి చాలానే ఉన్నాయి. ఒకరోజు సెల్‌ఫోన్‌లో తన మీద వచ్చిన కథనాల గురించి యూట్యూబ్స్, సోషల్‌ మీడియాల్లో వచ్చిన వీడియోలు, ట్రోల్స్‌ అన్నీ చూసి గుండెలవిసేలా రోదించింది. ఒంటరిగా భవనంపైకి వెళ్లి.. ఎన్నో ఏళ్లుగా మూగబోయిన ఆ గొంతు తెరిచి దిక్కులు పిక్కటిల్లేలా గట్టిగా అరుస్తూ.. ఏడ్చింది.

కాస్త దూరంగా.. ‘అల్లా....’ అంటూ నమాజ్‌ స్పీకర్‌లో వినిపిస్తోంది. ఎన్నో రోజులుగా ఖాళీగా ఉన్న డైరీలోని పేపర్స్‌ ముందుకు కదిలాయి. పైనుంచి కిందదాకా నల్లటి వస్త్రాన్ని వేసుకున్న ఉద్భవి.. డైరీ రాయడం మొదలుపెట్టింది. ‘నేను మనిషిని. సమాజం నన్ను మనిషిగా గుర్తించాలని కోరుకునే పిచ్చి మనిషిని. గౌరవంగా బతకడానికి సమాజాన్ని మోసం చేశాను. నిజానికి ఇది మోసం కాదు, సమాజం ముందు నేనో నిజాన్ని దాచాను. ఎవరికీ అపాయం కానీ, అవసరం లేని ఒకే ఒక్క నిజాన్ని దాచాను. నన్ను నన్నుగా ఎవరూ అంగీకరించడం లేదు కాబట్టి మూగదానినని అబద్ధమాడాను. ఈ అబద్ధంతో నేను ఎవరినీ బాధపెట్టలేదు. ఇప్పుడు ఎవరినీ తప్పు బట్టడం లేదు. ఎందుకంటే.. నాలానే ప్రతి మనిషి ఒంటరిగా బతకడానికి భయపడతాడు. సమాజం తోడు కావాలని కోరుకుంటాడు. అందుకే కుల, మత, ప్రాంత, లింగ భేదాలతో వర్గాలుగా విడిపోయి.. ఆయా సమూహాల్లో తనూ ఒకడిగా బతుకుతుంటాడు. ఏదో ఒక వర్గానికి పరిమితమై జీవనాన్ని గడపుకుంటాడు. ఒకవేళ ఏ కారణం చేతైనా ఆ సమూహం నుంచి బయటపడితే..

‘ఒంటరిగా బతకడం ఎలా? ప్రాణం మీదకి వస్తే పరిస్థితి ఏంటి? ప్రాణాలు పోయాక మోసేదెవరు?’’ అంటూ లెక్కలేసుకుంటాడు. అందుకే సాహసించి ఆ సమూహాన్ని దాటలేడు. తన సమూహంలోకి మరో వర్గానికి చెందిన మనిషిని ఏకపక్షంగా ఆహ్వానించనూలేడు. అందుకే.. నా తరఫున ఎవరూ నిలబడలేదని వేదన చెందను. నేను చేసేది తప్పేమోనని నాలో నేనే చాలాసార్లు మథనపడ్డాను. అలా మథనపడిన ్రçపతిసారీ నాకు తోచిన సమాధానం ఒక్కటే. ఇది నా వ్యక్తిగతం అని. ప్రతి మనిషికీ ఈ లోకంలో ‘సమాజంతో నేను, నాతో నేను’ అనే రెండు పాత్రలుంటాయి. వ్యక్తిగతంగా పెళ్లి, పిల్లలు అవసరం లేదనుకున్నప్పుడు.. ఈ సమాజానికి నేను తప్పుడు ఆదర్శం కానప్పుడు.. నా వ్యక్తిగతంతో ఈ సమాజానికి పనేముంది? అనుకున్నాను. ఇప్పటిదాకా నా స్వరాన్ని ఆ దేవుడు దాచుకునేలా చేస్తే.. ఇక నుంచి నా ముఖాన్ని ఈ సమాజం దాచుకునేలా చేసింది. ఇంకా ఆ దేవుడు నా శక్తిని పరీక్షిస్తూనే ఉన్నట్లున్నాడు. ఇప్పుడు కూడా చావు గురించి ఆలోచించాలనిపించడం లేదు. చావు దానంతట అదే వచ్చేదాకా చావు గురించి ఆలోచించాలని లేదు’ అని ముగించి పెన్‌ పక్కన పెట్టి, కుర్చీపైన ఉన్న నల్లటి దుపట్టాని ముఖానికి కట్టుకుంది. మనియార్డర్‌ పోస్ట్‌ మీద కూరగాయల ముసలమ్మ అడ్రస్‌ రాసి.. హ్యాండ్‌ బ్యాగ్‌లో పెట్టుకుని, తను కొత్తగా పెట్టిన బ్యూటీ పార్లర్‌కి బయలుదేరింది.

రెండేళ్లు గడిచాయి. ‘ఏమయ్యా స్వరాజ్‌? పక్కనే సొంత ఇళ్లు పెట్టుకుని.. ఎన్నాళ్లు ఆ ఉద్భవీ ఉన్న పిచ్చి అద్దె కొంపలో ఉంటావ్‌? మంచిగా ఓ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా?’ అంటూ సలహా ఇచ్చింది రాధమ్మ కరెంట్‌ ఫ్యూజ్‌ మార్చి సాయం చెయ్యడానికి వెళ్లిన స్వరాజ్‌తో.. (అచ్చం అప్పట్లో ఉద్భవికి చెప్పినట్లే). స్వరాజ్‌ నవ్వి ఊరుకున్నాడు. కాసేపటికి ఇంటికి వెళ్లి పైనున్న ఓ సూట్‌కేస్‌ మెల్లగా దించి ఓపెన్‌ చేసి చూసుకున్నాడు. అందులో అన్నీ ఉద్భవి డ్రెస్‌లే. ఒక డైరీ కూడా ఉంది. అది ఉద్భవికి స్వరాజ్‌ పరిచయం అయిన తర్వాత రాసిన డైరీ. (అందులో చాలా విషయాలు ఉన్నాయి. కూరగాయల ముసలమ్మ ఆయా కాదని, తన కన్నతల్లి అని, ఆ విషయం ఆమెకు కూడా చెప్పలేదని, స్వరాజ్‌ని తను ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఇలా చాలానే ఉన్నాయి). సూట్‌కేస్‌లో.. బంగారు రంగు చున్నీ తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. దానికి ఓ చివర ఉన్న ‘స్వరాజ్‌’ అనే ఎర్రటి దారపు కుట్టుని చూసుకుని మురిసిపోతూ.. మరోసారి గుండెలకు హత్తుకున్నాడు.
‘ఒక మనిషి క్షేమాన్ని గుండెల నిండా కోరుకోవడమే కదా ప్రేమంటే.. అలాంటి ప్రేమే నాది కూడా. లవ్యూ స్వరాజ్‌..’ అని రాసి ఉన్న డైరీలోని మధ్యపేజీల్లో చివరి వాక్యాలను స్వరాజ్‌ ప్రేమగా నిమిరాడు 151వ సారి.
- సంహిత నిమ్మన

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top