కోటమామ కూతురు

Funday story of the week 14-04-2019 - Sakshi

ఈ వారం కథ

బుజమ్మీద పెట్టుకున్న కర్రమీద రెండు చేతులు ఏలాడదీసి ముందు పోతున్న గొర్రెల మందలో ఒక గొర్రెలా కల్సిపోయి పొలానికి పోతున్న చినసుబ్బయ్యమామ, బైలిక్కి పోయత్తన్న నన్ను వాక్కాడ ఆపి ‘‘ఆ నాగమనోల్ల ఇంటికాడెందబ్బాయ్‌ అంతమందున్నారో’’ అని అడిగేడు. ‘‘ఆటే వత్తంటివే వాళ్ళనే అడగ్గూడదా నన్నడక్కపోతే’’ అని కసురుకున్నట్టు అనేతలికి ‘‘అడుగుదామనుకుని ఆగేనబ్బాయ్‌ కాని అక్కడి జనాలని చూసి గొర్రెలు బెదిరిపోయి లగుదోల్నియ్, వాటెనకాలే నేను కూడా లగుదోలాల్సి వచ్చిందే, దీనెమ్మ నాయాల్ది ఈ గొర్రెలు నాకు కూడుబెట్టె సంగతి దేవుడెరుగ్గానే  ఈటికి మేతమేపటానికి వూరెందో వల్లకాడేందో కూడా తెలుసుకొనే సమయం లేకపోయేనే నా దగ్గర చత్‌... ’’ అంటా ముందుకి కదిలేడు. నా కళ్ళు గబుక్కున సమాదుల పక్కకి తిరిగినియ్‌ ఎవరికోసమైన గుంట తీస్తన్నారేమోనని. ఎత్తు పల్లాల మట్టితప్ప మనుసులజాడ కనపళ్ళా అక్కడ. ‘‘హమ్మయ్య’’ అనుకోని హడావిడిగా నాగమనోల్ల ఇంటికి బయల్దేరాను.

నాగమనోల్ల ఇంటికెళ్ళే రోడ్డుమూల తిరిగేసరికి ఆరేళ్ళ జాషువాతాత మనవడు మొండిమోల్నసైడుకాలవ మీద కూర్చొని గుంటగిన్నెలో ఎండుమిరగబాయలతో నూరిన గోగూరపచ్చడి మెండుగా కలుపుకొని తింటా కనిపించాడు. వాడిపక్కనే ఒకకుక్క కోడలు తెచ్చే కూటికోసం ఎదురుచూస్తున్న ముసలిఅత్తలా దిగాలుగా కూర్చొని వుంది. ఆ గోంగూర పచ్చడి మంటకి వాడి ముక్కోలోంచి కళ్ళలోంచి కారతన్న నీళ్ళపైన ఈగలు ఒకటేమాయన అరుసుకుంటూ ఎగురుతున్నాయ్‌. ‘‘నాయాలకాన లెగు ఇక్కడ్నుంచ... ఇంట్లో కూచ్చొని కూడు తినలేవా’’ అని బెదిరించినట్టు  అరిసి ‘‘ఓ కాంతత్తో నీ మనవడు ఆ మురికిగుంట పక్కన కూర్చొని కూడు తింటన్నాడు, లోపలికి పిలువు’’ అని అరిసా .

‘‘ఆనాబట్ట నామాట ఏడింటాడబ్బాయ్‌....’’ అని ‘‘ఒరేయ్‌ ఒరేయ్‌ దోవ తప్పినోడో మర్యాదగా ఇంట్లోకి వత్తావా లేకపోతే మెల్లెత్తుకొని రావాల్న’’ అని అర్సింది పిల్లోడి మీద ఇంట్లోనుంచే. వాడు లేవల.‘‘కనీసం గుడ్డలన్న ఎయ్యకూడదా వాడికా ... వాళ్ళమ్మ నాన్నయాడికి బొయేరో.....’’‘‘వాళ్ళకేడ కుదిరిద్దయ్య పిల్లోడికి గుడ్డలెయ్యనో... వాడేమో పొద్దున్నేమొద్దులు కొట్టను పోవాలయ్య ఆ పిల్లేమో గ్రేడింకి పోవాలయ్యే, వాళ్ళు ఎల్లబోయే టయానికి వీడు నిద్దర లేవడయ్యే వాళ్ళకేడ కుదిరిద్ది పిల్లోడి గురించి పట్టించుకోను, వీన్నేమో నా జివానేసి పోయేరు. నేనేమో కూసుంటే లేవలేనయ్యే నుంచుంటే కూసోలేనయ్యే.... ఈనా సితనాపిబట్టేమో సెప్పిన మాట గంగావినడయ్యే.... రేయ్‌ అక్కడనుంచి లేత్తావా లేవ్వా’’  అంటా సిన్నగా లేసి ఒక సీపురు పుల్ల తీసుకొని వాణ్ని కొట్టడానికి వస్తుంది.‘‘ ఎంత పన్లున్నాగాని పిల్లల్ని జాగ్రత్తగా సూసుకోవద్దంటే.... వాడికి ఆ సైడు కాలవలో  దోమలుకుట్టి  రేపు డెంగో బుంగో వస్తే అప్పుడు బాధ పడేదెవురొ’’ అంటా నాగమనోల్ల ఇంటి వైపుకి గబా గబా నడిచాను.    
నాగమణి వాళ్ళ ఇంటికాడికి జనం సేరుకొని, వచ్చినోల్లు వచ్చినట్టు పెద్ద పెద్దగా మాట్లాడకుండా గుస గుస లాడుకుంటూ వున్నారు. ఎవరో తెలియదుగాని ఇద్దరుముగ్గురు ఆడోల్లు దూరంగా నాగమణి రెండునెలల కొడుకు నిద్రపోతున్న  మంచంకాడ మూతులకి కొంగు అడ్డం పెట్టుకొని ముక్కులు పైకి ఎగబీల్చుకుంటున్నారు. నాగమణి మొగుడు మాణిక్యరావు కుడితి తొట్టిమీద తల ఏలాడేసుకొని కూసోనివున్నాడు అప్పుడే వూరినుంచి వచ్చినట్టు వున్నాడు కర్రల సంచి  ఆయన కాలు పక్కనే వుంది. ఇంకో పక్క నాగమణి నుంచొని ఏడుస్తా వుంది.   ‘‘బంగారం లాంటి పిల్లోన్ని నిలువున నాశనం చేసేవు కదంటే సెడిపోయిన్దానా’’ ఆదమరచి నిలుచున్న నాగమణిని ఎగిసి కాలితో తన్నాడు మాణిక్యరావు. అల్లంత దూరంలో పడింది నాగమణి.‘‘నీకు ముసలమేమన్నా పుట్టిందంట్రా సెడు నాబట్ట పచ్చి బాలింతని కాలితో తంతున్నావ్‌’’ లగుదోలింది కిందబడ్డ నాగమణిని పైకి లేపడానికి నాగమణి అమ్మమ్మ పంచలోనుంచి.కుట్లేసిన కాడ కలుక్కుమన్నట్టుంది నాగమణికి. గబుక్కున తడిమిచూసుకుంది కుట్లు పిగిలి  నెత్తురేమన్నా వస్తుందేమోనని. నెప్పేగాని నెత్తురు రాల. తనకలాడుతుంది పైకి లేవడానికి.పద్మ గోడకి కూలబడి వల వల ఏడుస్తుంది. కూతురికి పట్టిన గతిని తలుచుకొని.

కోటమామ కూతురుదగ్గరికి పోలేక వెనకడుగు వెయ్యలేక కొయ్యబారిపోయి బిత్తర సూపులు చూస్తున్నాడు జనాలవైపు.‘‘దీనెమ్మ దీన్ని సంపినా పాపంలేదు’’ అంటా పొయ్యికాడ వున్న వూదులుగొట్టం తీసుకొని కిందపడున్న నాగమణి  వీపు మీద బాదాడు మాణిక్యరావు.   నాగమణి ఆ దెబ్బకి కూసోలేక నున్చోలేక  గిల గిల తన్నుకుంటా నేలమీద పడి దొర్లుతుంది.‘‘ఒసే కోపమొస్తే మనిషి కాదమ్మా ఈ ముండమోపోడు... పిల్లని సంపెసేటట్టున్నాడో.... అయ్యో అయ్యో ఆ నా బట్టని లాక్కెల్లండయ్యా మీకు పుణ్యమున్దిద్దె’’ అని ఏడుస్తా మాణిక్యరావుని ఎనక్కి నెడతంది.  ‘‘నీ యమ్మ నువ్వు లేయే దాని అంతు తేలుస్తా ఈ రోజు’’ అంటా ఆ ముసలిదాని పక్కకి తోసి నాగమణి మీదకి దూకాడు.‘‘అన్నో ఆ పిల్లమీద ఇంకొక్క దెబ్బ పడిందంటే నీ దొమ్మలు పగుల్తియ్‌ సెబ్తన్న’’ గట్టిగా అరిసేను ఆయనికి అడ్డంపోయి.వూదులుగొట్టం కిందేసి పిల్లోడు పడుకొని వున్న మంచం కాడికి ఎడుస్తా పోయేడు మాణిక్యరావు.పద్మ గబుక్కున నాగమణి కాడికివచ్చి నాగమణి తల దీసి వొళ్ళో బెట్టుకొని  ‘‘అమ్మో నాగమనో లేయే .. తల్లో లేయే ... నా బిడ్డో లేయే ..’’ అని ఎక్కిళ్ళు ఎక్కిళ్ళు బెట్టుకుంటా ఏడుస్తా వుంది.‘‘ అయ్యో  నువ్వు రాకపోతే సంపెసేవోడయ్యా నా బిడ్డనే.... అమ్మో నాగమనో .... లేయే మనింటికి పోదామో ’’ అంటా నాగమణి కాళ్ళ కాడ కూల బడ్డాడు కోటమామ. ‘‘అబ్బాయ్‌ అబ్బాయ్‌ కొంచెం మంచినీళ్ళు తీసుకురండయ్యా ఎవురన్నా బోయే ... మోయ్‌ నాగమనా  మోయ్‌... ఇటుసూడే తల్లో ....’’ అని హడావిడిపడతా కొంగుతో నాగమణి మొఖమ్మీద గాలి ఇసురుతుంది నాగమణి అమ్మమ్మ. జనాలు నాగమణి దగ్గరకు వచ్చేరు. ‘‘మీరు పక్కకి రండి ఆ పిల్లకి కొంచెం గాలి తగల్నియ్యండి’’ అంటా నాగమణి ముందుకొచ్చి ‘‘అమ్మాయ్‌ నాగమనా పైకి లెగూ’’ అంటా చెయ్యి పట్టుకుని పైకి లేపేను. నాగమణి కూర్చుంటూ కళ్ళార్పకుండా నా వైపే చూస్తు, ‘‘నా బిడ్డ సచ్చిపోయాడు మామ ....నా బిడ్డ సచ్చిపోయేడు.... నా బంగారి బిడ్డ సచ్చిపోయేడు మామా... నా బంగారు బిడ్డ ... ’’ అంటా పెద్దగాఏడుపందుకుంది. ఎండిపోయిన నాగమణి కళ్ళలో ఎవరో ఏతమేసి తోడినట్టు కన్నీళ్లు వుబికినాయి బయటికి, అవి కిందికి జారి రయికపై అట్టకట్టుకుపోయిన పాలమరకల్లో కలిసిపోయినాయి.

‘‘అమ్మో ఏడవబాకే నీకేమన్నా అయ్యిద్దె ....’’  అంటా అరికాల్లమీద అరిచేత్తో రుద్దుతున్నాడు కోటమామ.  అక్కడున్నోల్లన్దరిలో కోటమామే పిరికోడు.మూడు సంవత్సరాల కిందటి మాట....మా అమ్మ కోటమామ పోయిన తరువాత చెప్పింది. అప్పటికే కోటమామ మా ఇంటికీ వచ్చి గంట పైన అయ్యిందంట. మా యమ్మ కూడా అప్పటికే  నాలుగైదు సార్లు‘‘ఎందబ్బాయ్‌ ఇట్టా వచ్చేవో మామ కోసమా ఏంది?’’ అని అడిగినా కూడా ‘‘వూరికినేలేప్పా’’ అంటా అక్కడే నేనొచ్చిన్దాక కూసోని వున్నాడు.నన్ను చూసి గబక్కన సర్దుకొని కూర్చుంటా ‘‘అబ్బాయ్‌ పెద్దోడా ఇట్టారా ?’’ అన్నాడు.‘‘ఏంది కోటమాం ఈ జామునొచ్చేవ్‌ ఏంది కతా’’ అని పక్కన కూర్చున్న ఆయన మీదున్న చనువుతో‘‘అది కాదబ్బాయ్‌ మా గురించి నీకు తెల్వంది ఏముంది? అత్తా నేను నాగపడకుండా పనికిపోయినా ఇల్లు గడవడం కష్టమేనయ్యా... జెరమొచ్చినా తలనొప్పొచ్చిన ఒల్లునొప్పులొచ్చిన బిర్రుగా దుప్పటి కప్పుకొని పడుకుంటా గాని ఆస్పిటిలిగ్గా పోను డబ్బులు కర్చు అవుతాఎమోనని. అప్పో నన్నెక్కడన్నా పెళ్ళిళ్ళలో చూసా’’ అని మమ్మసాయ తిరిగి అడిగి ‘‘కనీసం పెళ్ళిళ్ళకి కూడా పోను సదివిమ్పులు ఇయ్యాల్సి వస్తున్దేమోనని. ఎవురేమైనా అనుకోని పండగపూటకూడా నాగాపెట్టకుండా పనికిపోతా కావాలంటేమన పల్లెల్లో యెవుర్నయినా అడుగు’’‘అబ్బాయ్‌ కోటయ్య ఇయన్ని పిల్లోడికి ఎందుకు సెప్తన్నా’’ ఎదురడిగింది మమ్మ. నాది కూడా అదే డౌటు కాబట్టి నేను కూడా ఊ అన్నా .‘‘ఇదంతా ఎవురికొస్మప్పా నాగమణి పెళ్లికోసం కదంటే...’’ ఆయనికి ఏడుపు వస్తంది గాని ఆపుకుంటున్నాడు.

‘‘ఎవురు కాదన్నారబ్బాయ్‌...అసలు సంగతేంది?’’ నావైపు అనుమానంగా చూస్తా అడిగింది ఆయన్ని.‘‘మీ అబ్బాయి నాగమణి తో ఏమన్నాడో నువ్వే అడుగు’’ అన్నాడు కొంచెం కోపంగా.‘‘నేనేమన్నాను ... అసలు దేని గురించి?’’ నాక్కూడా కోపమొచ్చింది.‘‘వచ్చే నెలలో పిల్ల పెళ్లి పెట్టుకుంటిమే ....ఆ పిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే పోలీసు కంప్లెంటు ఇస్తానన్నవంటగా?’’ గుటకలు మింగుతా అన్నాడు.
‘‘ఏందిరా ... పోలీసు కంప్లెంటు ఏంది?’’ అయోమయంగా అడిగింది మా అమ్మ.‘‘అదా ...లేకపోతే ఎందిమా ఆ పిల్లకి పద్నాలుగేళ్ళు కూడా లేవు అప్పుడే పెళ్ళంట! కనీసం ఆపిల్ల పుష్పావతన్నా అవ్వద్దంటే?అందులో మాణిక్యరావు అన్నకి ఆపిల్లకి వయసు తేడా పదకొండేళ్ళు...అందుకే ఆపిల్లకి ఇప్పుడుగాని పెళ్లి చేస్తే బాల్యవివాహం అని చెప్పి పోలీసు కంప్లెంటు ఇస్తానని చెప్పా?’’ అన్నాను గర్వంగ.
‘‘అప్పో నువ్వు చెప్పే పిల్లకి పెళ్లి సెయ్యాలంటే ఈ రోజుల్లో మనం సెయ్య గలిగి వున్నామా..... ఎంత పనికిమాలినోడుకూడా లచ్చ కట్నం ఇయ్యంది పెళ్లిచేసుకోడయ్యా.... లచ్చలేడ దేవాలప్ప’’ గొంతుకి కల్లె అడ్డం పడి దగ్గేడు, కళ్ళలోంచి నీళ్ళు కారతన్నాయ్‌.

 ‘‘నాయాల్ది ఆడపిల్లని కన్న పాపానికి పెళ్లి మనమే సెయ్యలయ్యే, పుట్టింటి సామాన్లు మనమే తేవాలయ్యే,కానుపులు మనమే సెయ్యాలయ్యే, పిల్లకి ఏ కష్టమొచ్చినా మనమే మున్డున్డాలయ్యే.... అన్ని డబ్బులు నాకాడ యాడుండాయిమే... రేయింబగళ్ళు పని చేసినా కూటికే సరిపోతున్నే....ఆ పిల్లోడు మా అక్కాయ కొడుకే కాబట్టి కట్నం బొట్నం ఏమొద్దన్నాడు. ఈ పిల్ల పెద్దమనిశయ్యిందాక ఎదురుచూస్త కూసుంటే వాడి వయసు పోదా? వాడు గాని ఈ పిల్లని పెళ్లి చేసుకోకపోతే నేను డబ్బులేడ్నుంచి తెవాలిమే... పెద్దమనిషి కాకపోతేనేం ఆపిల్లేమన్నా  ఇప్పుడు సూట్టానికి సిన్నపిల్లలాగుందా నువ్వుసూడ్లా? ఇప్పుడు పెళ్లిచేస్తే పెద్దమనిషి అయినాకే కాపరం చేసుకుంటారు అప్పుడు దాక పిల్ల మనింట్లోనే ఉండటానికి కూడా పిల్లోడు ఒప్పుకున్నాడు. ఎట్టో కట్ట ఈ పిల్లని వాడికిచ్చి పెళ్లిచేస్తే  వాళ్ళ బతుకు వాళ్ళుబతుకుతారు.... లేకపోతే నేను పిల్లకి  పెళ్లి చెయ్యగలిగి వున్నానంటప్ప మీ వోడేమో పోలీసులుకి సెప్తానంటన్నే... నేనేడ సావాలో సెప్పప్పా’’ అంటా మా అమ్మ సేతులు పట్టుకున్నాడు.    ‘‘ఆయన్న కాకపోతే ఇంకొకడు మామ... కనీసం ఆ పిల్లకి పద్దేనిమిదేల్లన్నా నిండద్దా?’’‘‘నోర్మూసుకోరా ఆయన్ని నీకెందుకు ? వాళ్ళ కూతురు వాళ్ళిష్టం’’ నా మీద అరిసింది మా అమ్మ.‘‘అబ్బాయ్‌ నువ్వన్నట్టే మా అమ్మాయిని ఆపుతాంగానే ఎన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు... నువ్వే పెళ్లిచేసుకో కట్నంలేకుండా...సరేనా ’’ అన్నాడు కళ్ళుతుడుసుకొని నవ్వుతా‘‘నాగమణికేమి బంగారంలాగ వుండిద్ది ఆపాలేగానే పెళ్లిచేసుకోనా ఏంది?’’ అన్న నవ్వుతా నేను కూడా.‘‘మాటలకేమి గానే ... పెద్దోడో అయ్యో నీకు దండం పెడతా పోలీసులుకి మాత్రం సెప్పబాకయ్య’’ అన్నాడు కొంచెం దీనంగా.‘‘అసె వాడి మాటలకేమొచ్చే గాని నువ్వు పోరే....వాడేదో నవులాటకి అనుంటాడు’’ అంది మా అమ్మ కోట మామతో.‘‘ఆ మాట మీ పిల్లోన్ని సెప్పమనప్పా అట్టానే పోతా... ఈ మాట ఎవుడన్నా సదూకోనోడు గాని అనుంటే నేను నవ్వులాటకే అనుకునేవోన్ని మీవోడు సదూకున్న పిల్లోడైనా అన్నంత పని సేత్తాడేమోనని బయమ్మే ’’ అన్నాడు‘‘ఇప్పుడు నేనేమి పోలీసులుకి సెప్పన్లెకానా  రేపు పెళ్ళయినాక  నాగమణికి ఏమన్నాకావాలా? అప్పుడున్దిద్ది నీకు’’ అన్న నవ్వుతా.  

‘‘నువ్వేం బయపడబాకరా ఈడిప్పుడు కాలేజ్‌ కి పోతే మల్లి వచ్చేదెప్పుడో... వాడెవురికి  సెప్పడ్లే నువ్వు ఇంటికిపోయి పెళ్లి పన్లు చూసుకో’’ అని హామీ ఇచ్చింది మా అమ్మఅది జరిగిన రెండు సంవత్సరాలకి అనుకుంటా క్రిస్మస్‌ పండగ రోజు కోటమామ నన్ను వాళ్ళ ఇంటికి పిలిచేడు. ఇంటికెల్లా, కావాలనే నాగమణి చేత పిండి వంటలు తెప్పించేడు.‘‘ఇప్పుడు చెప్పరా అల్లుడా నాగమణి ఎట్టుందో? అప్పుడు తెగ బయపడి పోతివే పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేస్తున్నామని? ఇప్పుడు చూడు ఎట్టుందో’’ అన్నాడు కోట మామ.నిజంగానే తేరిపార చూడాల్సి వచ్చింది. ‘‘మామ ఆ రోజు నీ మాటిని నాగమణిని నేను పెళ్లి చేసుకున్నా బాగుండేది మామ? మిస్సయాను పొ’’ అన్నాను అందరు పగలబడి నవ్వారు, మాణిక్యరావు అన్న కూడా.చిన్నప్పటినుంచి నాగమణిని మొఖంలో ఇదే  మొదటిసారి ఏడుపు చూడటం.   ఎంతో అందంగా ఏ మాత్రం కల్మషంగాని కుట్రబుద్దిగాని లేని నాగమణి అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను. అందుకే తన నుండి దూరంగా బయటికొచ్చేసాను. మొన్ననే పండక్కని ఇంటికొచ్చిన నేను  నాగమణి ఇక్కడే వుందని తెలుసుకొని  ఇంటికి పోయినప్పుడు, కొడుక్కి అప్పుడే నీల్లుపోసిందిగామాల గుండ్రాయిలాగా బొద్దుగా వుండే వాడికి ఒళ్ళు తుడుస్తా ఆ రెండు నెలెల పిల్లోడికి  ఆ చొక్కా ఎవరు తెచ్చేరో, ఆ టవలు ఎవరు తెచ్చేరో, వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తాడో, వస్తూ వస్తూ పిల్లోడికోసం ఏమేమి బొమ్మలు తెస్తాడో అని చెబుతుంటే వాడు అవన్నీ నిజంగా వింటున్నట్టు నమ్ముతున్నట్టు  వాడి చిట్టి చేతులను బుగ్గలపై రుద్దుకుంటూ, కాళ్ళను ముందుకూ వెనక్కి ఆడిస్తూ,  నాగమణి వైపు ఆ చిట్టి కళ్ళతో తీక్షణంగా చూస్తూ వున్నాడు నేను అక్కడికి చేరుకునేసరికి.‘‘అయ్యో నిజమే మీ నాన్న నీకోసం ఒక లారి నిండా సామాను తీసుకొని వస్తున్నాడంట’’ అన్నాను పంచలోకి చేరుకుంటూ.‘‘రా మామా కూర్చో’’ అంటా కాల్లకట్టె వైపు చెయ్యి చూపించింది నవ్వుతా‘‘మేయ్‌ ఎందిమే పిల్లోన్ని కనమంటే గుమ్మడికాయని కన్నవో’’ అన్నాను పిల్లోడి అరికాళ్ళ వేళ్ళను మెత్తగా నిమురుతూ.‘‘ ఊరుకో మామ పిల్లోడికి మారు పేర్లు పెట్టమాక ...నా బంగారి కొడుక్కీ .....’’ అంటా మురిసిపోయింది.‘‘ ఏమాటకామాటే చెప్పుకోవాలిగాని నాగమనా...మీ పిల్లోడికి అన్నీ నీపోలికలే వచ్చినియ్మే నీలాగే చాల అందంగా ఉన్నాడో....’’ అన్నాను.‘‘ఊరుకో మామ దిష్టిబోద్ది మా పిల్లోడికే’’ అంటా వెంట్రుకల ముడివిప్పి ఆ పొడవాటి వెంట్రుకలతో కాళ్ళ నుంచి తలవరకూ  మూడు చుట్లుతిప్పి దిష్టితీసి అరికాల్లో కాటుకతో కుంకుడుకాయంత దిష్టిబొట్టు పెట్టింది.

‘పిల్లోడు మీద అంత జాగ్రత్తగా ప్రేమగా  వుండే పిల్లకి ఇట్ట జరిగిందేంది దేవుడా’ అనుకుంటా పక్కనే వున్న బొంకు అరుగు కాడికి వొచ్చేను.  ‘‘మామో అవ్వాయ్‌ సువ్వాయ్‌ లేమన్నా తేవాలంటే ఒంగోలు పోయే ’’ అంటా సమాదుల్లో గుంట తవ్వను పోతున్న సుధాకరు అక్కడ కూర్చున్న పేతురుతాతని  అడిగేడు.‘‘అసె చిన్న పిల్లోడికి అయ్యన్ని ఎందుకురా? ఏదో అంత గుట తీసి బూడ్చిపెట్టకా’’ అన్నాడు చుట్ట ముట్టిస్తా.గుండె జల్లుమంది.‘‘అయ్యో ప్రైటు సీసా ఒకటియ్యయ్యా  పిల్ల బాగానీరంసంగా ఉంది’’ అంటా బొంకు కాడికి వచ్చింది నాగమణి అమ్మమ.‘‘నాయనమ్మో అసలెంయ్యిందే నిన్నటిదాకా పిల్లోడు బాగానేఉన్నే ఇంతలోనే ఏందిది’’ అన్నాను‘‘ఏం సెప్పమంటావయ్యా ఆడి గాచారం అట్టరాసుంది... ఎవురు మాత్రం ఏమి సెయ్యగలరు’’ అంది స్ప్రైటు సీసా అందుకుంటా.‘‘ఒరేయ్‌ అబ్బాయ్‌ ఇటురాయ్య ఈప్రైటు తీసుకెళ్ళి పద్మమ్మకియ్యి’’ అంటా పక్కనున్న సిన్నపిల్లోడికి ఇచ్చి అరుగు పక్కనున్న సిన్నరాయిమీద కూసుంది.‘‘ మొన్న నేను ఇంటికి పోయినప్పుడు ఎంత బాగున్నాడు పిల్లోడు....పాపం నాగమణి మొకం సూడలేకపోతున్నానే’’ అన్నాను.‘‘అయ్యో రాత్రి పోడుకోబోయేటప్పుడుకూడా పిల్లోడుతో మేమందరం బాగానే ఆడుకుంటిమికదయ్యా , పిల్లోడు మేము సేప్పేయి బాగానే ఆలకించేడు, ఎండుమిరగబాయల్తో బాగానే దిష్టి తీసెను, దోమలు కుడతాయేమోనని దోమతెరకట్టి నేను పక్కనే మంచమేసుకొని పొడుకున్న, అంతా బాగానే ఉన్నే, రెండు మూడు టైం అయ్యేలోకే పిల్లోడు మామూలుగా  ఎప్పుడు పాలకి లేవనూ ఏడవనూ చేసేవాడు, అక్కడినుంచి పాపం ఆ పిల్లకి నిద్ర వుండేది కాదు. నాకెందుకో గబుక్కన మెలుకువొచ్చింది ఒక జామున, ఏంది ఇంకా పిల్లోడు పాలకి లేవలేదు అని అనుమానం వొచ్చి నాగమణిని లేపుదాం అని దోమతెరలోకి పోయి పిల్లోన్ని పట్టుకునేలికి పిల్లోడి వొళ్ళంతా సల్లంగా అయిసుగడ్డ లాగుంది. నాకు గుండెలు పగిలే’’ కళ్ళు తుడుసుకుంది.‘‘మేయ్‌ నాగమనా ఎందిమే పిల్లోడి వొళ్ళు ఇంత సల్లంగా ఉందా అని గబక్కన లైటేసి సూస్తినే... పిల్లోడు తెల్లగా పాలిపోయి నీలక్క పోయి వున్నాడు బిడ్డ, మొవ్‌ ఉచ్చ పోసుకొని ఉంటాడు లేయే పిల్లోడో... లైటాపే మల్లి వోడు లేచేడంటే నాకు నిద్రున్దదే... అంటా కదిలింది. అప్పడు తెలిసిందయ్యా నాకాపిల్లోడు ఎందుకుసచ్చిపోయేడో....బిడ్డ మొకంమీద నాగమణి రొమ్ము పడివుంది. మొదులుకే దానియి ఎత్తురొమ్ములు దానికితోడు అవి పాలతో నిండి ఇంకా బరువెక్కిల్లా..... పాపం బిడ్డ ఎంత అల్లడిపోయి ఉంటాడో తలుసుకుంటేనే ఒళ్ళు జలదరిస్తంది. బిడ్ద పిల్లోన్ని బంగారమాల సూసుకునేది... పిల్లోడికి  బాగా పాలు పడాలని  బాగా కూడు తినేది.  దానికి   ఏం ముసలం పట్టిందో ఒళ్ళు తెలియకుండా నిద్రబోయింది’’ కొంగుతో కళ్ళు తుడుచుకుంది.

‘‘యెంటనే ఒసే అడ్డల్దానా పిల్లోడు సచ్చిపోయేడే.... లేసి సూడే అనేతలికి, నీ యమ్మ గూప్పగలగొడ్త ఆమాటన్నావంటే నాబిడ్డని అంటా తాసుపాములాగా నా మీదకి లేసిందయ్యా. పిల్లోడి పక్కకి తిరిగి ఈడెమో దుప్పటి కప్పుకోడు ఒళ్లంతా సూడు ఎలా సల్లగయ్యిందో అంటా రొమ్ముతీసి పిల్లోడి నోట్లో పెట్టి నుదుటిమీద ముద్దుపెట్టుకుని  శానాసేపు అట్టాగే పడుకుందయ్యా బిడ్డ. నేను పోయి వాళ్ళమ్మా నాయన్ని లేపకొచ్చేలికే.....మా వైపు చూసి, బిత్తరసూపులు సూస్తా, మౌ పిల్లోడికేమయ్యిన్దిమా....బిడ్డ పాలుతాగట్లేదే....ఒళ్లంతా సల్లన్గయ్యిందే ఫానాపండా.... రేపు వాళ్ళనాన్న ఉయ్యాల తెత్తానన్నాడే పిల్లోడ్ని ఉయ్యాలలో పండేద్దామే.....నాపక్కనొద్దె వాడికేమన్నా అయ్యిద్దేమోనని  భయంగా వుందే .....అంటానే వుంది కళ్ళనీళ్ళు కారతానే ఉండాయ్‌...పాపం దానికేమిసెయ్యాలో అర్ధంగాక...’’ ముసల్ది ఇకసెప్పలేక పోయింది.‘‘అంత మొద్దు నిద్రెట్టా పట్టిందిరా  దానికి మగల్లారా..... బంగారం లాంటి పిల్లోడు సచ్చిపోయినే’’ అన్నాడు బొంకేసేబు.‘‘ అల్లా బొద్దికూరప్పాడు ఇస్రాన్తమ్మ మనవడు కూడా ఇట్టాగే మామ సచ్చిపోయిందే ‘‘ అన్నాడు పక్కనే వున్నా సిన్నమోసే.‘‘పోయినాదివారం యరజర్లలో ఇట్టాగే  ఒక పిల్లోడు  వాళ్ళమ్మ జాకెట్కి వుండే పిన్నిసు ఎట్ట కిందపడిందో...అది ఆపిల్లోడ నోట్లోకి ఎట్టాపోయిందో గొంతుకడ్డంపడి గిలగిల కొట్టుకుంటంటే హాస్పిటల్‌ కి తీసుకెల్లెలికె ప్రాణాలు పోయినియంట’’ చాల బాధ పడతా చెప్పేడు బాబురావు.‘‘చాల జరుగుతున్నయబ్బాయ్‌ ఇట్టంటియే’’ నిట్టూర్చింది రాయేలు సినమ్మ.‘‘నాగమణి అంత మొద్దుతరాగ నిద్రబోయే పిల్ల కాదె’’ అన్నాను నేను గొనుగుతున్నట్టు.‘‘పిల్లకి ఏవిల్లొచ్చి  అయిదోనెల రాన్గల్లోనే తెచ్చి పుట్టింట్లో వదిలిపెట్టి మొత్తం మీదే బాద్యతన్నట్లు చేతులుదులుపుకొని పోతుంట్రే మొగుళ్ళు, దాని కూటికని, హాస్పిటల్కని, కానుపులుకని కర్సులుమీద కర్సులు సెయ్యాల్సోస్తన్నే.... తీసుకున్న వడ్డీ డబ్బులు కట్టడానికి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతా బిడ్డని కనిపెట్టుకొని కూసోడానికి దాని అమ్మకి అయ్యకి  కుదరకపోతున్నే, నాకేమో సుగరొచ్చి మోకాళ్ళ నొప్పులుతోటే అడుగు దీసి అడుగు వెయ్యలేక పోతుంటినే... బిడ్డ దాని తప్పేముందిలె.... పొద్దున్నే లేసి ఇల్లూడ్సి, బాసిన్లు తోమి, గుడ్లుతుక్కొని, కావాల్సింది ఒండుకొని, పిల్లోడికి నీలు పోసి, గుడ్లేసి, అట్టకన్నుమూస్తే పిల్లోడికి ఎమయ్యిద్దో అని కనిపెట్టుకొని వుండాలయ్యే, రాత్రన్న నిద్రబోదామంటే వాడేమో తొమ్మిదికే పొడుకుంటున్నే వాడు పొడుకున్నకే ఈ పిల్ల కూటికి లేవలయ్యే...అన్ని పన్లు చేసుకొని పడుకునేలికి పిల్లోడు నిద్రలేస్తాడయ్యే బిడ్డ అట్టాగే ఎట్టోకట్టా నెట్టకోస్తానే వుంది. అది మాత్రం ఏమి చేసిద్ది. ఎంత కాలం అని నిద్రలేకుండా వుండిద్ది. దాని కర్మకాలి ఇట్టా జరిగే. ఇంకా అదేదో దాని తప్పే అయినట్టు ఆమూగి మొద్దోడేమో వూరినుంచి వచ్చీరాంగల్లోనే గొడ్డుని బాదినట్టు బాదుతున్నే’’ అని సెప్పుకుంటా అక్కడనుంచి లేచి వెళ్లి పోయింది.

చాల సేపు ఎవురూ ఏమి మాట్లాడలా. నాకూ అక్కడ కూర్చో బుద్దెయ్యలేదు. అక్కడినుంచి బయటకొచ్చాను.ఒక ఆరేళ్ళ పిల్ల ఇంకో తొమ్మిది నెల్ల పిల్లోన్ని సంకలో ఎత్తుకొని రోడ్డు దాటబోతూ ట్రాక్టర్‌ హార్న్‌ విని ఉలిక్కి పడి వెనక్కి వెళ్ళింది.ఒకామె నెత్తిమీద పలుగూ పార పెట్టుకొని సంకలో ఒక పిల్లోన్ని చేతిలో ఇంకో పిల్లోన్ని తీసుకొని నడిజామున  మట్టి పని నుంచి ఇంటికి వస్తూ వుంది. సంకలో పిల్లోడు నిద్ర పోతూ తన చేతిలో వేలాడుతూ వున్నాడు.ఇద్దరు పిల్లోల్లు ట్రాన్సా్ఫం దగ్గరలో బచ్చాలాట ఆడుకుంటా వున్నారు.జాషువా మనవడు ఆ వీదిలో పోతున్న కుక్కల్ని రాళ్ళతో కొడుతున్నాడుపిల్లలందరూ అపాయపు అంచునే కనిపించేరు నాకు.పిల్లోని బూడ్చి పెట్టిందాకా అక్కడే వుండి అందరూ పోయాకా స్మశానం గేటు మూసి గొళ్ళెం పెట్టి బయటకొస్తుంటే ముందు గొర్రెలు వాటెనకాల చినసుబ్బయ్యమామ వస్తా కనిపించేరు.‘‘ఎందబ్బాయ్‌ ఇక్కడున్నావు?’’ అని అడిగేడు   ‘‘నాగమణి కొడుకు....’’ చెప్పబోయేను. ట్రాక్టర్‌ హార్న్‌ మోగిందిగొర్రెల గుంపు చెల్లా చెదురయ్యింది‘‘హోయ్‌ ... టుర్ర్‌ర్ర్‌.... దీనెమ్మ ఈ గొర్రెలు .....’’ పరిగెత్తేడు.చూస్తూ వున్నాను గొర్రెల గుంపుని, ప్రతి గొర్రె ఇంకో గొర్రెను పట్టించుకోవడంలేదు గాని అన్ని లైన్‌ లోనే వెళ్తూవున్నాయి. అన్నీ గొర్రెలు మందలో ఉన్నాయన్న ధీమాతో చిన సుబ్బయ్య మామ వాటి వెనకాలె వెళుతున్నాడు. ఒక్క గొర్రె మాత్రం ఆ పోతున్న గొర్రెలను చూస్తూ నిలబడి పోయింది ఇంకేమి చెయ్యలేక.   

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top