వెండి చెంచా

Funday Special Story Vendi Chemcha - Sakshi

కొత్త కథలోళ్లు

వేసవి కాలమొచ్చింది. వేడి తీవ్రంగానే ఉంది. అసలే పట్టణాల్లో ఎక్కడపడితే అక్కడ  ఫ్లాట్స్‌ కట్టేయడంతో చెట్లకి చోటు లేదు. అపార్టుమెంటు బాల్కనీలో పెరుగుతున్న పూలమొక్కలు నీళ్ళు తక్కువై  నీరసంగా తలలూపుతున్నాయని అనిపించింది రాధాకృష్ణకి.
కొడుకు ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం. వాళ్ళ అమ్మని రమ్మనమని గొడవపెడితే ఆవిడతో పాటు తనూ వచ్చాడు ఈ కాంక్రీటు జంగిల్‌లోకి. తన ఊరిని, సొంతిల్లుని ఒక్కరోజుకూడా వదిలి రావడం సుతరామూ అతనికి ఇష్టం ఉండదు. ఇంటి దగ్గర రామాలయంలో ప్రవచనాలు, పూజలు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, తనకి అందరూ మర్యాద ఇచ్చి సలహాలు అడుగుతూ ఉంటారు. అస్సలు టైము తెలియదు. అదీకాక ఈ వేసవిలో తన తోటలో కాసే మామిడిచెట్టు బోల్డుమంది పిల్లల్ని ఎత్తుకున్న తల్లిలా బరువుతో ముందుకు ఒంగి ఉంటుంది. దాని బరువు దింపాలి అర్జంటుగా! ఉన్న నాలుగు కొబ్బరిచెట్లు  దింపు తీయించాలని అనుకుని  కంగారుపడుతున్నాడు.
నెమ్మదిగా  హైదరాబాద్‌ శివారునున్న  అపార్టుమెంట్ల  ఆవలి వైపుకి సూర్యుడు దిగుతున్నాడు. కాలింగ్‌ బెల్‌ మోగింది. కొడుకు రఘు వచ్చాడు.  మొబైలు మోగింది. రఘు ఫోన్‌ ఎత్తి ‘‘చెప్పరా అవినాష్‌’’ అన్నాడు.  రఘు  మొహంలో ఆందోళన చూసి అవతలి వ్యక్తి  చెప్పేది సీరియస్‌ విషయం అనిపించింది రాధాకృష్ణకి.    ‘‘ఏమిటా ఫోన్‌ ఏదైనా సీరియస్‌ విషయమా?’’ అని అడిగాడు.

‘‘అవినాష్‌ తన వైఫ్‌కి విడాకులిస్తాడట నాన్న!  రేపే లాయర్‌ని కలుస్తానంటున్నాడు అనగానే– 
‘‘అరే! మొన్ననే ఆరునెలలు అయింది  కదరా పెళ్లై!’’ ఆశ్చర్యపోయాడు రాధాకృష్ణ. 
‘‘అవును డాడీ! ఇద్దరిదీ లవ్‌మ్యారేజ్‌  కూడా! ఇంట్లో వాళ్ళతో విడిపోయి మరీ పెళ్లి  చేసుకున్నారు’’ అన్నాడు రఘు.
‘‘అయినా ఈ రోజుల్లో ప్రేమ మరీ చీపు అయిపోయిందిలే! అసలు అలాంటి వాళ్ళు ఎందుకు ప్రేమించాలి,  పెద్దల్ని ఎందుకు ఎదిరించాలి? అన్నిటికి నిలబడి తాము చేసింది తప్పుకాదు, ప్రేమించుకుని మేం తప్పు చేయలేదు అని అందరికీ తెలియచెప్పాలి తప్ప ఇలా సడన్‌ గా నిర్ణయాలేంటి  వెరీ బాడ్‌ డెసిషన్‌’’ అని రా«ధాకృష్ణ  అనగానే రఘు తండ్రికేసి ఆశ్చర్యంగా చూశాడు.  సాధారణంగా  ఇటువంటి విషయాలమీద తండ్రి ఎక్కువ ఆసక్తి చూపించడు. ఈరోజేంటో కొత్తగా అని అనుకున్నాడు.

‘‘ఏదో ఇద్దరికీ ఈగోలు. ఈ మధ్య వాడి అమ్మ నాన్న వీడ్ని కలిసారట. దానికి ఇద్దరూ గొడవ పడ్డారు.  అవ్యక్త మా అమ్మ నాన్నని తీసుకొస్తాను అంటే వీడేదో అన్నాడట. ఇలా మాటామాటా అనుకున్నారట. ఈ మధ్య తనతో సరిగ్గా మాట్లాడడం లేదని, ఎప్పుడూ మొబైల్‌లో మెసేజెస్‌ చూసుకుంటోనో, ఎవరెవరితోనో చాటింగ్‌తో  బిజీగా ఉంటున్నాడని అవ్యక్త  నా దగ్గర గోల పెట్టింది. ఇద్దరి మధ్య ఉత్తిపుణ్యానికి అగాథం పెరిగిపోయింది డాడీ!’’ చెప్పాడు రఘు.
‘‘సరైన అవగాహన లేకుండా ప్రేమించుకుంటే  ఇలాగే వుంటుంది’’ అని  చెయ్యి కడుక్కునేందుకు లేచాడు రాధాకృష్ణ. తండ్రి ఇలా మాట్లాడడం తనకి కూడా సూచనేమో అని తనకి వస్తున్న లవ్‌  ప్రపోజల్స్‌ గురించి ఒకసారి ఆలోచించాలి అనుకున్నాడు. ఒక వారం తర్వాత రఘుకి తండ్రి ఇక్కడ వాతావరణంలో  ఉండలేక పోతున్నాడన్న విషయం  తెలిసి ‘‘మీ మ్యారేజి డే అయ్యాకా వెడుదురుగాని నాన్న!’’ అనగానే కూతురు ఆకృతి కూడా ‘‘అవును నాన్న! మీరుండాల్సిందే’’ అని పట్టుపట్టింది. కూతురు, అల్లుడు సాకేత్‌  సాఫ్టువేరు కంపెనీలో ఉద్యోగస్థులు.
ఆకృతి  కూడా ‘‘అవును నాన్నగారు! మీ 35 వ పెళ్ళిరోజు  సరదాగా మన వాళ్ళనందరిని పిలిచి హడావుడి చేద్దాం అనుకుంటున్నాము’’  అనగానే  ‘‘ ఎందుకమ్మా  బోల్డు ఖర్చు! హాయిగా మన ఊళ్ళో అయితే కాసేపు గుళ్ళో పూజ, ఒక సినిమా, కాస్త కొత్తబట్టలతో గడిచిపోతుంది, నా మిత్రుడు రామారావుని ఇంటికి పిలిచి  ఇద్దరం భోజనాలు చేస్తూ  కాసేపు కబుర్లు చెప్పుకుంటాము. అలా  గడిచిపోతుంది. అయినా ఇంకా పెళ్ళిరోజులు జరుపుకునే వయసా మాది?’’  అని సున్నితంగా తిరస్కరించాడు రాధాకృష్ణ.
కాని కూతురు, కొడుకు పట్టుబడితే రుక్మిణి ‘‘పోన్లెండి. పిల్లలు సరదా పడుతున్నారు కదా!’’ అని బలవంతాన  ఒప్పించింది.

రాధాకృష్ణ  కోనసీమలోని  ఒక పల్లెటూరిలో టీచర్‌ ఉద్యోగం చేసి రిటైర్‌ అయ్యాడు. చాలా నిరాడంబరంగా, పొదుపుగా ఉంటూ తండ్రి ఇచ్చిన కాస్త పొలం, ఒక ఇల్లు జాగ్రత్తగా కాపాడుకుంటూ, పిల్లలని క్రమశిక్షణతో పెంచి చదువులు చెప్పించాడు. ఈ మధ్యే కూతురుకి మంచి అల్లుణ్ణి చూసి పెళ్ళి చేసేశాడు. కొడుకు పెళ్ళి కూడా అయిపోతే ఇక పెద్ద బాధ్యతలేమి ఉండవు అని అనుకుంటున్నాడు. ఆరోజు ఆదివారం రాధాకృష్ణ, రుక్మిణిల 35వ పెళ్లిరోజు కార్యక్రమం  ఒక త్రీ స్టార్‌ హోటల్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో  పిల్లలు ఇద్దరూ ఏర్పాటు చేశారు.  
ఈ రోజుల్లో సిటీలో ఉండే చుట్టాలకి కొదవేముంది? వచ్చిన వాళ్ళందరు మావయ్య,అత్తయ్య, బాబాయ్, పిన్ని అని వరసపెట్టి పిలుస్తూ ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. పలకరింపులతో హాలంతా కోలాహలంగా ఉంది.
‘‘రాధాకృష్ణ  మావయ్య కొత్తపెళ్ళికొడుకులా మెరిసిపోతున్నాడు, రుక్మిణి  అత్తయ్యకు అస్సలు వయస్సు తెలియటం లేదు. ఎంత బావుందో’’ అంటూ హాస్యాలాడుతుంటే ఆవిడ సిగ్గులమొగ్గ అయ్యింది. ‘‘మావయ్య మీసాలకి రంగు వేయకపోయావా! అక్కినేనిలా ఉండేవాడివి’’ అంటూ వరసకి మేనల్లుళ్ళైన వాళ్ళు చమత్కారాలాడుతుంటే  రాధాకృష్ణ  గుంభనంగా నవ్వుకుని ‘‘నాకు ఈ తెల్ల మీసాలే బావుంటాయి అని మా ఆవిడ అంటుందిరా మరి’’  అన్నాడు చమత్కారంగా.
మిమిక్రీతో పాటు  చక్కని తెలుగు పాటలు పాడే వాళ్ళు వచ్చి అతిథుల్ని రంజింప చేయడానికి ముందుగా  డయాస్‌ ఎక్కారు. చక్కని పాత తెలుగు పాటలు పాడుతూ  మధ్య మధ్య  కొత్త దంపతులని  రకరకాలుగా అభినందిస్తున్నారు.
రాధాకృష్ణ  తన బాల్య మిత్రుడు రామారావుని రావడం చూసి  ‘‘ఏరా! ఎలా ఉంది మన  ఊరు?’’  అనగానే ‘‘నువ్వు వచ్చి నెల కూడా కాలేదు. ఏం అయిపోతుంది మన ఊరు? హాయిగా పిల్లలతో ఆనందంగా గడుపు’’ అని నవ్వాడు. 
రఘు ఫ్రెండ్స్‌ కూడా కొంతమంది వచ్చారు. వారిలో అవినాష్‌  కూడా వచ్చాడు. అవినాష్‌ చాలా డల్‌గా ఉన్నాడు. అవినాష్‌ భార్య అవ్యక్త విడిగా  వచ్చింది. ఇద్దరికి కామన్‌ ఫ్రెండ్‌ రఘు కావడం వలన  ఇద్దరు విడివిడిగా వచ్చి పలకరించారు.  కానీ  ఎడమొహం పెడమొహంగా  కూర్చున్నారు.
రాధాకృష్ణ  వాళ్ళిద్దరినీ ప్రత్యేకంగా పలకరించాడు.  రఘు  మైక్‌ తీసుకొని  తన తల్లిదండ్రుల గురించి భావోద్వేగంగా మాట్లాడాడు.

‘‘మా నాన్న చాలా కష్టజీవి.  ఆయనకి ఎందరో ప్రియ శిష్యులున్నారు. ఎందరో ఉన్నతమైన స్థితిలో కూడా ఉన్నారు. మమ్మల్ని కూడా చాలా ప్రేమగా చూసేవారు. ఏ రోజూ నేను దెబ్బలు తిన్న సందర్భం లేదు. ఒకసారి ఇండిపెండెన్స్‌ డే నాడు స్కూల్‌ ఫంక్షన్‌ అయ్యేకా కొన్ని డబ్బులిచ్చి ఏమైనా కొనుక్కుంటావో, దాచుకుంటావో నీ ఇష్టం అన్నారు. నేను స్నాక్స్‌ కొనుక్కొని మిగిలిన డబ్బులలో కొంత డిబ్బీలో వేసాను. ఆ డబ్బులుని ఏం చేద్దామనుకుంటున్నావు? అని అడిగారు. నేనింకా ఆలోచించలేదు అన్నాను. కొంత సొమ్ము ఎవరికైనా సహాయం చేయి అన్నారు. అది నాకు అలవాటుగా మారింది. అలా  మా డాడ్‌ ఎలా ఇతరులకు సాయం చెయ్యాలో చెప్పారు.  మనిషిగా ఎలా  బతకాలో  ఎలా జీవించాలో చెప్పారు.
ఇక అమ్మ నన్ను బాగా గారం చేసేది. కానీ  నాకు  అన్ని నేర్పేది. చిన్నతనంలో నేర్పిన భాగవత పద్యాలు, రామాయణ కథలు నేను ఇప్పటికీ మర్చిపోలేదు’’ అంటూ ముగించగానే చప్పట్లతో  మోగిపోయింది హాలు. 
ఈలోగా  రామారావు తన స్నేహితుడి గురించి నాలుగు మాటలు  చెప్పడానికి  స్టేజి ఎక్కి  ‘‘నా ఫ్రెండ్‌ గురించి అందరూ తలో మాట చెప్పారు. అవన్నీ నాకు ఎలా అనిపించాయంటే  ఇక్కడ ఏదైనా  వాడి సన్మాన సభ జరుగుతోందా? ఇవ్వాళ వాడి పెళ్ళిరోజేనా! అని అనిపించింది’’  అనగానే అందరూ ఘోల్లున నవ్వారు.  ‘‘ఇవాళ వాడి  పెళ్ళిరోజు  కదా,  సరదాగా వాడి గురించిన  ఒక రహస్యం చెప్పనా! ఎంత సార్థకనామధేయుడో చెప్పనా? వాడెంత చిలిపివాడో!  చిన్నప్పుడు ఎలా ఉండేవాడో!  వాడికి ఉన్న నిక్‌ నేమ్‌ మీకు తెలుసా!  ‘ వెండిచెంచా’ ’’  అనగానే అందరు నవ్వేశారు. ‘‘మీకు తెలుసా పెళ్ళికి ముందు ఒక ప్రేమ వ్యవహారం నడిపాడు!’’  అనగానే అందరు ‘‘తెలియదు’’ అని గట్టిగా అరిచారు.

అందరూ ఒక్కసారిగా ‘‘మాకూ చెప్పండి ఆ ప్రేమ గాథ!’’ అనగానే ‘‘అది వాడు చెప్తేనే బావుంటుంది. ఆ ‘వెండిచెంచా‘ కథాకమామీషు అందులోనే ఉంది అనగానే రాధాకృష్ణ  ‘‘ఎందుకు లేరా ఇప్పుడవన్నీ’’ అని దాటేయబోయాడు.  ‘‘మేము ఒప్పుకోం’’ అని అందరు ముక్తకంఠంతో అరిచారు.  దానితో రాధాకృష్ణ  తప్పదన్నట్టు  లేచి ‘‘ ఇప్పటివాళ్ళకున్నంత స్వేచ్ఛ అప్పుడేది? ఆడపిల్ల కేసి చూడడమే భయం.
అవి  నేను స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నరోజులు. మా బామ్మకి ఆచారాలు ఎక్కువ! మడి కట్టుకుని వంట చేసేది. పొద్దు కనబడేతేనే  అన్నం ముట్టేది. అంతా ఆవిడ పెత్తనమే!  పుట్టింటి వాళ్ళిచ్చిన ఒక అరెకరం పొలం, ఒక ఇల్లుతో సహితంగా కొంత వెండిసామాను ఆమె  ఆస్తులు.  నేను ఒక్కణ్ణే వంశోద్ధారకుణ్ణి కావడం వల్ల  మధ్యలో  బంగారం పువ్వు వేసిన వెండి కంచం, ఒక గ్లాసు, ఒక వెండి నేతి గిన్నె చేయించింది నాకు. రోజూ దానిలోనే నా  భోజనం,  పెద్ద వెండిగ్లాసు పక్కన కాపలా. అలాగే వెండిగిన్నెలో కమ్మని నెయ్యి. ఆ వెండిగిన్నెలో నేతిలో ‘తలదాచుకున్న’ చెంచాకూడా వెండిదే మరి! 
రోజూ మా బామ్మే వాటిని తోముకుని జాగ్రత్త పెట్టేది. అసలు కన్న వడ్డీ ముద్దన్నట్టుగా తన మనవడి   గురించే  ఈ వెండి జవహరీని మా తాతగారితో దెబ్బలాడి సాధించి చేయించిందిట. ఆఖరికి మా అత్తయ్య మామయ్య వచ్చినా వాళ్ళకు మామూలు కంచాల్లోనే భోజనం. మా అత్తయ్య నిష్ఠూరమాడినా ససేమిరా అనేదిట. ఇదిలా ఉండగా ఒకరోజు మా బామ్మకి కాస్త నలతగా ఉండి మా అమ్మకి ఆ వెండిసామాను తోమే పని అప్పగించింది. మా అమ్మ వాటిని తోముతూ మా నాన్న పిలిస్తే ఇంట్లోకి వెళ్ళింది. ఈలోగా ఏ మూల దాగుందో ఒక బొంత కాకి  వచ్చి వెండి చెంచా కాస్త ముక్కున కరుచుకుని తుర్రుమని ఎగిరి  మా ఇంటి ప్రహారీ ఎక్కి దానిని కాలి కింద తొక్కిపెట్టి దాని అందం చూస్తోంది. ఇక చూసుకోండి మా బామ్మకి ఈ విషయం తెలిసి మా అమ్మ మీద భగ్గుమంది.

అంత అనారోగ్యంలోను  కాకిని ‘హుష్‌ హుష్‌’  అని  దానిని పట్టుకోడానికి  పరిగెడుతుంటే  ‘బామ్మ!  ఉండు నేను పట్టుకుంటాను.  నువ్వు కంగారు పడకు అంటూ అది ఎగురుతుంటే దానితో పాటే  నేను పరుగెత్తాను. అది వెళ్ళి వెళ్ళి ఒక పెంకుటింటి మీద  ఆ చెంచా పడేసి పోయింది. ఆ ఇల్లు మాకు తెలిసిన  చంద్రశేఖరం గారిది. నేను గబగబా ఆ ఇంటి తలుపులు తట్టాను, ఎంత సేపటికీ అలికిడి లేదు. అరుగుమీద నిలబడి తలుపు కన్నాల లోంచి చూస్తూ గట్టిగా పిలిచాను. తలుపులు బాదాను, కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. 
నేను చూద్దును కదా! ఒక పద్దిమిదేళ్ల అమ్మాయి కోపంగా ‘ఎవరు కావాలండి?’ అని గట్టిగా గొంతు పెంచి అడిగింది. నేను ‘అబ్బే ఏం లేదండి  కాకి... చెంచా అంటూ  నసిగాను. ‘కాకేంటి? చెంచా ఏంటి?’ అని మళ్ళీ గట్టిగా అడిగేసరికి తడారి పోయిన గొంతుతో ‘ఒక్కసారి పక్కకి జరగండి’ అని ఆ అమ్మాయిని  పక్కకి తోసేసి, ‘చంద్రం అంకుల్‌!’ అని పిలుస్తూ లోపలికి పరుగెట్టాను. విషయం తెలిసిన చంద్రం మాష్టారు నిచ్చెన తెప్పించి పైకి నన్ను ఎక్కించి ఆ వెండిచెంచా దొరకబుచ్చుకొనేలా చేశారు. ఇదంతా చూసిన ఆ పిల్ల ఒకటే నవ్వు! చెంచా కోసమా? అని ఆటపట్టించింది. ఆ అమ్మాయి చంద్రం మాష్టారి మేనకోడలుట. వేసవి సెలవలకి వచ్చిందిట, పక్క ఊరేనట.  తర్వాత మా ఊళ్ళో తనని  చాలా చోట్ల చూశాను. తను ఎక్కడికి వచ్చినా సైకిల్‌ మీద వెనకాలే వెళ్ళేవాడిని, సిగ్గుతో తలవంచుకుని నడుస్తూ అప్పుడప్పుడు చిలిపిగా కళ్ళతో నవ్వేది  చుట్టూ ఉన్న స్నేహితులు తనని  పిలవడంతో తన పేరు ఫలానా అని  తెలుసుకున్నాను. 
తనని ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేక పోయేవాడిని. ‘ఎలాగైనా ఈ అమ్మాయేరా  నాకు కాబోయే  భార్య’ అని మా రామారావు దగ్గర అనేవాడిని. వాడు ‘ఒరేయ్‌! వేసవి సెలవులు అయిపోతున్నాయి. వాళ్ళ నాన్నో అన్నయ్యో వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోతారు. నువ్వు త్వరపడాలి మరి’ అన్నాడు. నేను ఆలోచనలోపడ్డాను. మనకా ఇంకా ఉద్యోగం సద్యోగం లేదు. ఏ మొహం పెట్టుకుని పెళ్ళి చేసుకుంటావా అని అడగనూ? అందుకని సంశయించాను. అదేమాట రామారావుతో అన్నాను. వాడు ‘ఒరేయ్‌! నీ ప్రేమలో  నిజాయితీ ఉంటే అది ఖచ్చితంగా సఫలమవుతుంది’ అన్నాడు.

గుళ్ళ దగ్గర, సినిమా హాలు దగ్గర కనబడ్డ తన స్నేహితుల చెవుల్లో ఆ అమ్మాయి  ఏదో గుసగుసలాడడం చూసి ‘వెండిచెంచా’ వస్తున్నాడు అని అంటోందేమో అని గిజగిజలాడేవాడిని. వేసవి సెలవులు ఇట్టే కరిగిపోయాయి, తను వాళ్ళూరు వెళ్ళిపోయింది. నాకు బెంగ వచ్చేసింది. కానీ ఉద్యోగం పురుష లక్షణం అనీను, అది లేకపోతే ఏ పిల్ల పెళ్ళి చేసుకోదనీను  అంతరాత్మ హెచ్చిరించడం  వల్ల నా  ఉద్యోగ ప్రయత్నం తీవ్రతరం చేశాను. ఈలోగా నాకు టీచర్‌ ఉద్యోగం రావడం, తను డిగ్రీ చదువుతూ ఉండడం వల్ల,  నేను తనకోసం కొంతకాలం ఆగేను. మళ్ళీ ఎక్కడ వాళ్ళ వాళ్ళు ఎవర్ని ఇచ్చి పెళ్ళి చేసేస్తారో అని కంగారు పడుతూంటే నా మనసులోని కోరిక రామారావు మా వాళ్ళకు చేరవేశాడు. పనిలో పని ఆ అమ్మాయి మనస్సు కనుక్కోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టాను.
అందులో భాగంగా ఒక్కసారి ఆ అమ్మాయి కాలేజీ దగ్గర మాటేసి పలకరించే ప్రయత్నం చేశాను. ఒక్కముక్క ‘మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి’ అని వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దాంతో నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆమెకి ఇష్టమేనని.
నేను ఉండబట్టలేక ఒక రోజు  రామారావుతో  ఆ అమ్మాయిని చూద్దాం అని వాళ్ళ వీధిలో తచ్చాడుతూ ఉంటే ఎక్కడున్నాడో  ఆమె అన్నయ్య   రుక్మాంగదరావు వచ్చి నా కాలర్‌ పట్డుకున్నాడు. ‘ఇక్కడేంచేస్తున్నావు?’ అంటూ నన్ను చెయ్యి చేసుకోబోతుంటే   పెద్దవాళ్ళు వచ్చి విడదీశారు.  ఇది వాళ్ళింట్లో తెలిసింది  కానీ రుక్మాంగదరావు ‘బడిపంతులుతో పెళ్ళేంటి! ఏ ఇంజినీర్‌ కో ఇచ్చి చేద్దాం’ అని అడ్డుపెట్టాడుట. నా ప్రయత్నాలు మానలేదు. 
మా నాన్నకి ఈ విషయాలు తెలిసి ‘ఎందుకురా అలా దొంగచాటు వ్యవహారం? మనమే దర్జాగా వెళ్ళి అడుగుదాం. నీకేమిటి లోటు చక్కని ఉద్యోగం, బాదరబందీలు ఏమీలేవు అని, అసలు నువ్వు ఇంత ఇదవుతున్నావు గాని ఆ  అమ్మాయి ఉద్దేశం ఏమిటో!’ అని సందేహం వ్యక్తం చేశారు. ‘ఆ అమ్మాయికి ఇష్టమే నేనంటే’ అన్నాను. 
ఇంతలో అక్కేడే వున్న రామారావు ‘నేను సంధానకర్తగా ఉండి మాటాడతాను. మగవాడి తరఫు కదా! మీరెళ్ళడం ఏమిటి ? నేను మిత్రసాయం చేస్తాను’ అని ముందుకొచ్చి ఆమె తల్లిదండ్రులని కలిశాడు. అంతాచెప్తే వాళ్ళు ఆ అమ్మాయి మనస్సు కనుక్కొన్నారు. పెళ్ళంటే చేసుకుంటే ఆయననే అని గట్టిగా చెప్పడంతో రుక్మాంగదరావు కూడా  ఏమి చెయ్యలేక తల ఊపాడు.

సంప్రదాయం అంటూ ఒకటి వుంది కదా!   అందుకని   తాంబూలాలకి తరలి వచ్చి  మాట్లాడారు. ‘ఒకసారి వచ్చి మీ కంటితో మా అమ్మాయిని ఒకసారి చూసుకోండి’ అని  మా వాళ్ళని ఆహ్వానించగానే  వెంటనే వాళ్ళింటికి వెళ్ళాము. 
మా అమ్మ, నాన్న, బామ్మలకి  ఆ అమ్మాయి చదువుతో పాటు    అణుకువ, పెద్దలపట్ల గౌరవం, వినయవిధేయత   అన్నివిధాల నచ్చి,  మా బామ్మ ‘చక్కగా ఉంది చిదిమి దీపం పెట్టుకోవచ్చు’ అని తను మనవరాలి కోసం దాచి ఉంచిన కాసులపేరు మెళ్ళో వేసేసింది...’’ రాధాకృష్ణ ఇంకా మాట్లాడడం పూర్తికాకుండానే– ‘‘ఇంతకీ ఆమె ఎవరూ? నాన్నకి ఇంత ప్రేమకథ ఉందా? మాకు ఎప్పుడు ఎవ్వరూ చెప్పలేదు అని ఆశ్చర్య పోయారు రఘు, ఆకృతి.  
‘ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?’ అంటూ  అప్పుడే వస్తున్న తన భార్య రుక్మిణి కేసి వేలు చూపాడు.  ఒక్కసారిగా కరతాళ ధ్వనులు వినిపించాయి.
‘ఆ రోజు నా కాలర్‌ పట్టుకున్న మా బావమరిది రుక్మాంగదరావు నా గెడ్డం క్రింద బెల్లం ముక్కపెట్టి మరీ బ్రతిమాలాడు మా చెల్లిని చేసుకోండి కాశీకి వెళ్ళకండీ అని!’ అదుగో ఆ ముందువరసలో కూర్చున్నాడు అనగానే అందరూ ఆ పక్కకి చూస్తే నవ్వుతూ చేతులూపాడు. 
అలా ‘వెండి చెంచా’  మమ్మల్ని కలిపింది. ఇంతకీ చెప్చొచ్చేదేమిటంటే  మనం ప్రేమిస్తే దాంట్లో నిజాయితీ ఉండాలి, ఆ ప్రేమని చక్కగా జీవితాంతం ఆస్వాదించాలి, ఉధృతంగా, ఉద్రేకంగా  పెళ్ళికి ముందు   బాగా చక్కర్లు కొట్టేసి పెళ్ళై పోగానే  బోర్‌ కొట్టేసి బ్రేకప్‌లు చెప్పుకునే  ప్రేమ అసలు ప్రేమే కాదు. నేను ఇప్పటి వాళ్ళకి చెప్పేదేమిటంటే నిజాయితీగా ప్రేమించండి. పెళ్ళాడండి. జీవితాంతం  నిలబడండి. అదే మీరు ప్రేమకిచ్చే గౌరవం. అప్పుడు మీరు ఆదర్శవంతులౌతారు’ అని ముగించాడు రా«ధాకృష్ణ.
ఈ మాటలు సూటిగా అవినాష్, అవ్యక్త గుండెల్లో నాటుకున్నాయి. ఒకళ్ళ మొహం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ మొహంలో కనబడిన అపరాధభావం మార్పుకి సంకేతం కాబోలు! 
రాధాకృష్ణ  ఇంకా మాట్లాడుతూ ‘ఏముందండి,  ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకుని ‘అంతేగా అంతేగా’ అనుకుంటే  రోజూ కొత్తగా ఉంటుంది. అసలు గొడవలనేవే రావు’ అనగానే అందరూ నవ్వుతూ ఆనందంగా భోజనాలకి లేచారు.
- చాగంటి ప్రసాద్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top