ఏది ముగింపు

funday new story special - Sakshi

కొత్త కథలోళ్లు

‘‘రేపు మనం పులుకుర్తికి వెళ్తున్నాం’’ భార్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు ధనుంజయ. ‘‘రేపు ఎప్పుడు?’’ ఉత్సాహంగా అడిగింది శారద.‘‘సాయంత్రం అయిదు అయిదున్నరకి బయలుదేరుదాం. ముప్పావు గంటలో అక్కడ ఉండొచ్చు’’.  అభినవ్, అభిషేక్‌ మొహాల్లో వెలుగును గమనించాడు. లోలోపలే నవ్వుకున్నాడు. పులుకుర్తి అంటే తనకు ఒక రకమైన పులకరింత కలుగుతుంది. పుట్టిన ఊరు అంటే ఎవరికైనా మమకారం ఉంటుంది. ‘‘డాడీ! మనం ఎన్ని రోజులుంటాం?’’ ఆసక్తిగా అడిగాడు అభిషేక్‌. ‘‘అయిదు రోజులు’’ గంభీరంగా జవాబిచ్చాడు.తమ చెవులను తామే నమ్మలేకపోయారు. కుటుంబ సమేతంగా పులుకుర్తికి వెళ్ళక దాదాపు పది సంవత్సరాలు దాటింది. అప్పుడప్పుడు పిల్లలు కూడా వెళ్లి వచ్చేవారు. తను ఒక్కడు వెళ్ళినప్పుడు మాత్రం చిన్ననాటి మిత్రులు సాంబమూర్తి, యాకయ్య, రాజేందర్‌లతో కలిసి ఊరవతల మామిడి తోటలో పార్టీ చేసుకొని ఎంజాయ్‌ చేసి వచ్చేవాడు. యావత్‌ కుటుంబంతో కలిసి పులుకుర్తికి వెళ్ళడం అరుదైపోయింది. చాలాకాలం తర్వాత ఇప్పుడు వచ్చింది అవకాశం.ధనుంజయ ప్రతిభ గల ఆర్టిస్టుగా, రేడియం స్టిక్కర్‌ డిజైనర్‌గా కొద్దికాలంలోనే పేరు ప్రఖ్యాతులు గడించాడు. తీరిక సమయం అనేది లేకుండా అయిపోయింది. పులుకుర్తి నుండి కేవలం డబ్బు సంపాదించాలనే పట్టుదలతో వరంగల్‌ వచ్చాడు కాబట్టి, సంపాదనే ధ్యేయంగా తను నమ్ముకున్న వృత్తిలో మునిగిపోయాడు. దాంతో కుటుంబ సభ్యులతో సమయం గడపడం, అప్పుడప్పుడు విహారయాత్రలకు వెళ్ళిరావడం అనేవి దాదాపు కనుమరుగైపోయాయి. 

తన పెద్దమ్మాయి పెళ్ళికి చిన్ననాటి మిత్రుడు యాకయ్య కుటుంబ సమేతంగా వచ్చి వారం రోజులపాటు ఉండి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా స్నేహధర్మం నిర్వర్తించాడు. ఆ సమయంలోనే యాకయ్య కూతురి పెళ్ళికి తను కూడా పులుకుర్తికి వచ్చి వారం రోజులుంటానని మాట ఇచ్చాడు. ఎల్లుండే యాకయ్య కుమార్తె పెళ్ళి!  ‘‘పులుకుర్తికి రావడానికి ఏర్పాట్లు అవుతున్నట్లేనా?’’ మొన్న ఫోన్‌ చేసి అడిగాడు. వాస్తవంగా తనకు ఒక్క రోజు కూడా తీరిక అనేది లేదు. చేతి నిండా ఒప్పుకున్న పనులు.. ‘పెళ్ళికి ఖచ్చితంగా కుటుంబంతో సహా వెళ్ళాలి’ అనేది మనస్సాక్షి ప్రబోధం. మొత్తానికి అంతరాత్మ గెలిచింది. సాయంత్రం ఆరుగంటలకల్లా యాకయ్య ఇంటిముందు ధనుంజయ ఫ్యామిలీతో దిగాడు. ధనుంజయ రాకతో పెళ్లి పనులతో బిజీగా ఉన్న యాకయ్య కుటుంబం ఆనందంతో మునిగిపోయింది.అర్ధగంటలో అతిథులందరూ ఫ్రెషప్‌ అయిపోయారు. మిత్రులిద్దరూ పార్టీలో మునిగిపోయారు.పెళ్ళిసందడి ఉదయం అయిదు గంటలనుండి మొదలయింది. ధనుంజయ ప్రత్యేకంగా చేయాల్సిన పనులేవీ లేకపోయినా తన వెంట ఉండటం కొండంత బలాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది యాకయ్యకి. సరిగ్గా పదకొండున్నరకి ముహూర్తం. అన్ని పనులు సజావుగా అయిపోయాయి. కట్నాలు రాసే బాధ్యతని అభినవ్‌కి అప్పజెప్పాడు. బిటెక్‌ రెండవ సంవత్సరం చదువుతున్న అభినవ్‌కి ఈ పనిని చేపట్టడం థ్రిల్‌ అనిపించింది. సంతోషంగా ఆ పనిలో నిమగ్నమైపోయాడు. 

‘అభిషేక్‌ ఎక్కడున్నాడు? కనబడటం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? అసలు టెన్త్‌ చదివేవాణ్ని ఈ పెళ్ళికి తీసుకురావడం పొరపాటైపోయింది’ అనుకుంటూ పెళ్లి ప్రాంగణమంతా కళ్ళతో గాలించాడు ధనుంజయ. ఎక్కడా కనిపించలేదు. ‘కొంపదీసి చెరువుకి ఈత కొట్టడానికి వెళ్ళాడా! వీనికి ఈత పిచ్చి!!’ అనుమానాన్ని నివృత్తి చేసుకునేందుకు అభిషేక్‌కి ఫోన్‌ చేశాడు. రెండుసార్లు చేసినా ఫోన్‌ లిఫ్ట్‌ చెయ్యలేదు. మూడోసారి లిఫ్ట్‌ చేశాడు. ‘‘అభీ! ఎక్కడికెళ్లావు?’’ తండ్రి గొంతులోని ఆదుర్దాని పట్టించుకోకుండా ‘‘కృష్ణప్రసాద్, మోహన్, నేను ఇక్కడ చెరువులో ఈత కొట్టడానికి వచ్చాం’’ అని కూల్‌గా సమాధానం చెప్పాడు.రాజేందర్‌ రెండో కొడుకు కృష్ణ ప్రసాద్, సాంబమూర్తికి ఒక్కడే కొడుకు మోహన్‌. వాళ్ళతో తన కొడుకు ఉన్నాడనే నిశ్చింత కలిగి నెమ్మదిపడ్డాడు. జలకాలాటలలో ముగ్గురు మిత్రులు ప్రపంచాన్ని మరిచిపోయారు. కృష్ణప్రసాద్‌కి ఆకలి దంచేస్తున్నది. ‘‘ఇక చాలు.. వెళ్దాం...’’ అన్నాడు. మిగతా ఇద్దరికీ కూడా అదే ఆలోచన వచ్చింది.‘‘అదిగో!  అటు చూడండి.. అక్కడ నీళ్ళల్లో ఆ గుండు... బండరాయి... కనబడుతోందా?’’ కవ్విస్తున్నట్లుగా అన్నాడు మోహన్‌.‘‘ఆ! కనబడుతూనే ఉంది. అయితే ఏముంది అక్కడ?’’ కృష్ణప్రసాద్‌ అసహనంగా ప్రశ్నించాడు. మోహన్‌ ఉద్దేశం అభిషేక్‌ని రెచ్చగొట్టాలని. అతననుకున్న దానికి విరుద్ధంగా కృష్ణ స్పందించాడు. ‘‘ఎక్కడా ఆగకుండా అక్కడిదాకా వెళ్లి వెంటనే ఇక్కడికి తిరిగి రాగలిగినోడే నిజమైన మొగోడు!’’ మోహన్‌ మాటలకి తీవ్రంగా రియాక్ట్‌ అయ్యాడు కృష్ణప్రసాద్‌.‘‘చూడు.. నేను అక్కడికి వెళ్లి వస్తాను. ఎన్నోసార్లు ఆ గుండు దాటి వెళ్లి వచ్చినవాణ్ని!’’  అంటూనే నీళ్ళల్లోకి డైవ్‌ చేశాడు. ఈ సవాల్‌ని స్వీకరించడం తను చేస్తున్న అతిపెద్ద తప్పు అని ఆ సమయంలో తెలియలేదు. 

సరిగ్గా ఆ గుండుకి నాలుగు అడుగుల ముందు, పోయిన ఎండాకాలంలో మొరం మట్టి కోసం ట్రాక్టర్‌ వాళ్ళు పదిహేను అడుగుల లోతైన గొయ్యి తవ్వారు. చెరువులోకి నీళ్ళు చేరిన తర్వాత అక్కడ లోతైన గొయ్యి ఉందని ఎవరికీ తెలిసే అవకాశం లేదు. సరిగ్గా అక్కడే అందమైన తామరపూలు పుట్టుకొచ్చి ప్రకృతి అందమంతా పరచినట్లు కనబడుతున్నది. నీళ్ళ అడుగున తామర తీగలు దట్టంగా ఒకదానికొకటి అల్లుకొని ఒక వలలా ఏర్పడి ఉన్న సంగతి ఎవరికీ తెలిసే అవకాశం లేదు.కృష్ణప్రసాద్‌ సునాయాసంగా అక్కడిదాకా వచ్చేశాడు. ఎడమకాలికి ఏదో సన్నని పాము చుట్టుకున్నట్లనిపించింది. ఒళ్ళు గగుర్పొడిచినట్లయింది. అసంకల్పితంగా కాలును బలంగా విదిల్చాడు. అంతే బలంగా తామర తీగ అతని కాలును చుట్టేసింది. ఏదో తెలీని భయం మనసులో ప్రవేశించింది. ఆ వెంటనే కుడికాలును కూడా మిగతా తీగలు అల్లుకుపోయాయి. సెకన్లలో ఉచ్చు అతన్ని లోపలకి లాగేసింది. శ్వాస అందడం కోసం నీటిని గుటకలు వేయడం ప్రారంభించాడు. కొన్ని నిమిషాలపాటు ఆగుతూ, ఆగుతూ బుడగలు వచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి.

ఒడ్డున ఉండి ఇదంతా చూస్తున్న ఇద్దరు తీవ్రమైన ఉద్వేగానికి లోనయ్యారు. మోహన్‌కి చిరుచెమటలు పట్టాయి. అపరాధ భావన తినేయడం మొదలైంది. ‘తన మూలంగానే స్నేహితుడు కళ్ళ ముందే మరణిస్తున్నాడు’ అనే భావన మోహన్‌కి ఒక రకమైన తెగింపుని కలిగించింది. ఏదీ ఆలోచించకుండా ముందుకు దూకాడు. ఆ ‘స్పాట్‌’కి చేరుకోగానే ఆకలిగా ఎదురుచూస్తున్న తామర తీగలు అతన్ని కూడా లోపలకు లాక్కున్నాయి. చావు భీకర రూపాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అభిషేక్‌ ఆపాదమస్తకం వణికిపోయాడు. మైండ్‌ బ్లాంక్‌గా మారిపోయింది. ఏమీ వినబడటం లేదు. జరుగుతున్నది వాస్తవమా అబద్ధమా అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోయాడు. రెండు నిండు ప్రాణాలను మింగిన ఆ చెరువు ఆ సమయంలో నిర్మలంగా, ప్రశాంతంగా, అమాయకంగా అవకాశం దొరికితే మళ్ళీ ప్రాణాలను కబళించేందుకు సిద్ధంగా ఉంది. అక్కడికి వెళ్తే తన గతి ఏమవుతుందో అభిషేక్‌కి అర్థమయింది. అసంకల్పితంగా అభినవ్‌కి ఫోన్‌ చేశాడు.

దాదాపుగా కట్నాలు రాయడం పూర్తయింది. చేతిలో ఉన్న నోట్‌బుక్‌ పక్కనపెడుతూ ఉంటే ఫోన్‌ వచ్చింది. తమ్ముని వద్ద నుండి. ‘పదవ తరగతి చదివే వానికి ఫోన్‌ వద్దు అంటే డాడీ వినలేదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఫోన్‌ చెయ్యడం వీనికి అలవాటయిపోయింది’  విసుక్కుంటూనే ‘‘హలో!’’ అన్నాడు. తమ్ముని గొంతులోని దుఃఖాన్ని వెంటనే పసిగట్టాడు. మనసు ఏదో కీడును శంకించింది. వెక్కి వెక్కి ఏడుస్తూ అభిషేక్‌ చెప్తున్న విషయాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ‘‘నేను వస్తున్నా!’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు. కొద్దిసేపు తీవ్రంగా యోచించాడు. ‘నీళ్ళలో పడ్డవారు అయిదు నుండి పది నిమిషాల కంటే ఎక్కువ బతికే వీలుండదు. ఇక్కడి నుండి ఎంత తొందరగా చెరువు వద్దకి వెళ్ళినా కూడా పది నిమిషాలపైనే సమయం పడుతుంది. వాళ్ళను కాపాడటం కష్టం..’ దిగ్గున లేచాడు.‘‘చెరువులో ఇద్దరు పడ్డారు. మునిగిపోతున్నారు..’’ బిగ్గరగా అరిచాడు. అక్కడి జనాలకు వెంటనే అర్థం కాలేదు. ఆ తర్వాత బోధపడి కొందరు హడావుడిగా మోటార్‌ బైకులపై చెరువు వైపు బయలుదేరారు.రాజేందర్, సాంబమూర్తి కొడుకులు చెరువులో పడి చచ్చిపోయారన్న వార్త దావానలంలా ఊరంతా వ్యాపించింది. ఊరు మొత్తం చెరువు వద్దకి కదిలి వచ్చింది. చెరువు గట్టు మీద విగత జీవులైన కృష్ణప్రసాద్, మోహన్‌లను చూస్తూ ఊరిజనం కన్నీటి పర్యంతం అయ్యారు. పిల్లల తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరి తరం కావడం లేదు. 

వెక్కి వెక్కి ఏడుస్తూ అభిషేక్‌ చెప్తున్న విషయాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ‘‘నేను వస్తున్నా!’’ అంటూ ఫోన్‌ పెట్టేశాడు. దిగ్గున లేచాడు. కొద్దిదూరంలో ఉన్న యాకయ్య వద్దకి వెళ్లి బైక్‌ కీ అడిగి తీసుకొని వేగంగా చెరువు వైపు బయలుదేరాడు. ‘స్పీడ్‌గా ఎటు వెళ్తున్నాడో’ అర్థంకాక నివ్వెరపోయి చూశాడు యాకయ్య. పదినిమిషాలలో చెరువు వద్దకి వచ్చాడు. శ్మశాన నిశ్శబ్దంలో అభిషేక్‌ ఏడుపు సన్నగా వినిపిస్తూంటే అభినవ్‌ గుండె పిండినట్లయింది. అన్నను చూస్తూ తన ఫ్రెండ్స్‌ మునిగిపోయిన చోటును చేతితో చూపించాడు. వెనకా ముందు ఏమీ ఆలోచించకుండా చెరువులోకి దూకాడు. ఇంకా దాహం తీరని మృత్యువు అదృశ్యరూపంలో ఆబగా, ఆశగా ఎదురు చూస్తూ ఉంది. కొద్దిసేపట్లో అత్యంత దయనీయ స్థితిలో అభినవ్‌ జలసమాధి అయిపోయాడు.రాజేందర్, సాంబమూర్తి, ధనుంజయ కొడుకులు ముగ్గురూ చెరువులో పడి చచ్చిపోయారన్న వార్త దావానలంలా ఊరంతా వ్యాపించింది. ఊరు మొత్తం చెరువు వద్దకు కదిలివచ్చింది. చెరువు గట్టు మీద విగత జీవులైన ముగ్గురిని చూస్తూ ఊరిజనం కన్నీటి పర్యంతం అయ్యారు. పిల్లల తల్లిదండ్రుల రోదనలను ఆపడం ఎవరి తరం కావడం లేదు.

కథ పూర్తిగా చదివి రాంబాబు విస్మయాన్ని వ్యక్తం చేశాడు. ‘‘చంద్రా! ఈ కథకి రెండు ముగింపులు ఇచ్చావు. నాకేమీ అర్థం కాలేదు..’’ అంటున్న స్నేహితుణ్ని చూసి చంద్రకాంత్‌ చిన్నగా చిరునవ్వు చిందించాడు. ‘‘ఈ రెండు ముగింపులలో నీకేది నచ్చిందో చెప్తే అప్పుడు నా ఆలోచన వివరిస్తాను’’ అన్నాడు.‘‘రచయితలు ఎప్పుడూ ఆశావహ దృక్పథాన్ని తమ రచనల్లో చూపాలని నేను విశ్వసిస్తాను. నాకైతే మొదటి ముగింపు నచ్చింది. నీకు రెండో ముగింపు నచ్చినట్లుంది. ఇప్పుడు నీ వివరణ చెప్పు!’’ అంటున్న మిత్రుని వైపు సాలోచనగా చూశాడు. ‘‘వాస్తవంగా జరిగిన సంఘటనని కథగా రాశాను. ముందుగా చూపిన ముగింపు రచయితగా నా ఊహాశక్తితో రాశాను. ఇహ రెండవ ముగింపు, అది నిజంగా గత నెలలో జరిగిన దుస్సంఘటన!! ఈ కథను చదివేవారు తమకు నచ్చిన ముగింపును ఎంపిక చేసుకోవాలనేది నా ఉద్దేశం. అందుకే ఇలా రాశాను’’.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top