
ఎనిమిదిన్నరకు బయల్దేరాల్సిన బస్సు తొమ్మిదైనా కదల్లేదు. సీట్ నెంబరు ఎయిట్ ప్రయాణికుడి కోసం బస్సు ఎదురుచూస్తోంది. బస్సుకోసం మనిషి ఎదురుచూడాలి. బస్సు మనిషి కోసం ఎదురుచూస్తోంది! అంటే మనిషిలో డిసిప్లీన్ తప్పింది. దారుణం అనిపించింది రాజేందర్‌కు. డ్రైవరేం తొందరపడడం లేదు. రావలసినవాళ్లు రాక మానరు, కదలవలసింది కదలక మానదు అనే కర్మ సిద్ధాంతం ఏదో ఆయన జీవితాన్ని నడిపిస్తున్నట్లుంది. లేదా, ‘పికప్ నా చేతుల్లో పనే కదా, ఎంత ఆలస్యం అయితే మాత్రం ఏముందీ’ అనుకుంటూనైనా ఉండాలి. బస్సు దిగి తాపీగా ఒళ్లు విరుచుకుంటున్నాడు. కండక్టరు కూడా పెద్దగా కంగారు పడడం లేదు. ఆయనకూ అలవాటైనట్లుంది.. రోజూ ఎవరో ఒకరు లేట్‌గా పరుగెత్తుకుంటూ రావడం. నిజానికి బస్సులో ఉన్నవాళ్లిద్దరూ డ్రైవర్‌లే. బస్సు గమ్యస్థానానికి చేరేలోపు ఒకరు కొన్ని గంటలు, ఇంకొకరు కొన్ని గంటలు రాత్రంతా డ్రైవ్ చేస్తారు. బస్సులో ఉన్నవన్నీ రిజర్వేషన్ సీట్లే కాబట్టి టిక్కెట్‌లు కొట్టడం ఉండదు, చార్టు చెక్ చేసుకోవడం మాత్రమే ఉంటుంది. అది పెద్ద పనేం కాదు. చార్టు చెక్ చేస్తున్నప్పుడు కండక్టరు అయిన మనిషే, బస్సు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ అవుతాడు.‘‘ఇంకా ఎంతసేపు ఆపుతారయ్యా?’’.. ప్రయాణికులెవరో వెనుక సీట్లలోంచి పెద్దగా అరుస్తున్నారు. బస్సుకు కుడివైపు డ్రైవర్ వెనుక వరుసలో కూర్చొని ఉన్నాడు రాజేందర్. సీట్ నెంబర్ సెవన్ అతడిది. విండో సీట్. ఆ రావలసిన ప్రయాణికుడిది రాజేందర్ పక్క సీటే. సీట్ నెంబర్ ఎయిట్. ఇంతమందిని టార్చర్ పెడుతున్న ఆ వ్యక్తిని.. బస్సు దిగైనా సరే, వెతుక్కుంటూ వెళ్లి ఒకసారి చూడాలి అనిపించింది రాజేందర్‌కి.
‘‘ఆ వస్తున్నాడు’’ అన్నారెవరో! మహానుభావుడు.. అనుకున్నాడు రాజేందర్. అయితే వస్తున్నది సీట్ నెంబర్ ఎయిట్ ప్యాసింజర్ కాదు. అంతవరకు బయట బస్కీలు తీస్తున్న బస్ డ్రైవర్. నేరుగా వచ్చి స్టీరింగ్ సీట్లో కూర్చున్నాడు. బస్ స్టార్ట్ అయింది. ‘‘ప్యాసింజర్ ఫోన్ ఎత్తట్లేదు. ఎంతసేపని చూస్తాం’’ అంటున్నాడు కండక్టర్. బస్సు వేగం పెరిగింది. సిటీ శివార్లకు రాగానే బస్సులో లైట్లన్నీ ఆఫ్ అయ్యాయి. కొద్దిగా తెరిచి ఉన్న కిటికీలోంచి వస్తున్న చల్లగాలికి మెల్లిగా కునుకు పట్టింది రాజేందర్‌కి. తన పక్క సీటు ఖాళీగా ఉండడం అతడికి కంఫర్ట్‌గా ఉంది. పెద్ద కుదుపుతో రాజేందర్‌కి మెలకువ వచ్చింది. టైమ్ చూసుకున్నాడు. ఒంటి గంట దాటింది. బస్సు వేగంగా పోతోంది. లేట్‌ని కవర్ చెయ్యాలని యాక్సిడెంట్ చెయ్యరు కదా అనుకున్నాడు. ఆ వెంటనే గ్రహించాడు.. అది బస్సు కుదుపు కాదు, తన పక్కన కూర్చొని ఉన్న మనిషి కుదుపు! ఎక్కడో బస్సు ఆగినప్పుడు ఎక్కి ఉంటాడు అనుకుని, తనవైపు తనే సర్దుకుని కూర్చున్నాడు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ‘‘మీరెప్పుడు ఎక్కారు? మీదేనా ఈ రిజర్వేషన్ సీటు?!’’... గొంతు తగ్గించి అడిగాడు ఆ మనిషి రాజేందర్‌ని! నిజానికది రాజేందర్ అడగవలసిన ప్రశ్న. ‘‘ఎప్పుడెక్కడం ఏంటీ? స్టార్టింగ్ పాయింట్ నుంచీ నేను ఇదే సీట్లో ఉన్నాను. మీరే మధ్యలో ఎక్కినట్లున్నారు’’ అన్నాడు రాజేందర్ విసుగ్గా. ఆ మనిషి నవ్వాడు. నవ్వు కనిపించడం లేదు. నవ్వడమైతే తెలుస్తోంది.
‘‘నేనూ స్టార్టింగ్ పాయింట్ నుంచీ ఉన్నాను. మీ కోసమే కదా బస్సును ఆరగంట సేపు ఆపేశాడు డ్రైవర్. అప్పటికీ మీరు రాకపోతేనే బస్సు బయల్దేరింది’’ అన్నాడు. రాజేందర్‌కి మతిపోయింది. కోపం వచ్చింది. ‘‘అలాగా?!’’ అని ఊరుకున్నాడు. రాజేందర్ ‘అలాగా’ అనేసి, కళ్లు మూసుకోవడం ఆ మనిషి ఇగోపై దెబ్బకొట్టింది. అప్పటికప్పుడు బస్సు ఆపించి, ఇతని వల్లే కదా బస్ లేట్ అయిందని ఇద్దరు డ్రైవర్ల చేత, బస్సులోని ప్యాసింజర్లందరి చేతా చెప్పించాలన్నంత కోపం వచ్చింది. ‘‘నేనేమైనా దెయ్యాన్ని అనుకుంటున్నారా? పరుగెడుతున్న బస్సులోకి కిటికీలోంచి దూరి వచ్చి, ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోడానికి’’ అన్నాడు. దెయ్యం అనే మాట వినపడగానే రాజేందర్ తన సీట్లో నిటారుగా కూర్చున్నాడు. పైగా ఆ రూట్‌లో ఎక్కడో దెయ్యాల మలుపు ఉంటుందని ఎవరో అనుకుంటుండగా ఎప్పుడో విన్నట్లు అతడికి గుర్తు. తన పక్కన ఉన్న మనిషిని చూస్తుంటే ఎందుకో రాజేందర్‌కి అనిపించింది.. బస్సు దెయ్యాల మలుపు దాటి ఉంటుందని! రాజేందర్ అలా నిటారు అవ్వగానే పక్కనున్న మనిషి కసిగా నవ్వుకున్నాడు. ఆ మనిషి రాజేందర్‌ని వదలదలుచుకోలేదు! తను టైమ్‌కి రాకుండా, తనను టైమ్‌కి రాలేదంటాడా? పైగా ‘అలాగా’ అని వ్యంగ్యంగా అంటాడా?!‘‘మీ పేరేంటి?’’ అని అడిగాడు ఆ వ్యక్తి రాజేందర్‌ని. రాజేందర్ చెప్పదలచుకోలేదు. కానీ ఆ వ్యక్తి ఒకవేళ నిజంగానే మనిషి కాకపోతే? అందుకే చెప్పాడు. ‘రాజు’ అని చెప్పాడు. ‘రాజేందర్’ అని చెప్పలేదు. ఆ వ్యక్తి నవ్వాడు. ‘‘రాజా.. శ్రమ తెలియకుండా ఉండడానికి నీకో కథ చెప్తాను వింటావా?’’ అన్నాడు. రాజేందర్‌కి రూఢీ అయింది. బస్సు దెయ్యాల మలుపు దాటేసిందని, ఆ మలుపులోంచి ఒక దెయ్యం వచ్చి తన పక్కన కూర్చుందనీ!
మెల్లిగా సీట్లోంచి లేవబోయాడు. లైట్లన్నీ ఆపేసుకుని.. బస్సు వేగంగా పోతుంటే, అంత రాత్రప్పుడు తనొక్కడే లేచి ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ కూర్చోవాలో ఆలోచించకుండానే లేవబోయాడు. ఒక్కసారిగా బస్సు ఆగిపోయింది! ఎవరో పిలిచినట్లుగా రాజేందర్ పక్క సీటు మనిషి.. ఆ చీకట్లోనే వడివడిగా బస్సు దిగి వెళ్లిపోయాడు. అతడలా దిగిపోగానే, మళ్లీ బస్సు బయల్దేరింది. కిటికీ అద్దాల్లోంచి బయటికి చూస్తూ.. ‘‘ఎక్కడి వరకూ వచ్చాం’’ అని అడిగాడు రాజేందర్ తన ముందు మెలకువొచ్చి కూర్చున్న ప్యాసింజర్‌ని. ‘‘దెయ్యాల మలుపు’’.. చెప్పాడతను.
తెల్లారే బస్ ఎండ్ పాయింట్‌లో దిగాడు రాజేందర్. డ్రైవర్లిద్దరూ టీ తాగుతున్నారు. ‘రాత్రి దెయ్యాల మలుపులో బస్సులోంచి దిగిపోయిన ఆ మనిషెవరు?’ అని వాళ్ల దగ్గరికి వెళ్లి అడుగుదామని అనుకున్నాడు రాజేందర్. కానీ అడక్కుండానే వెళ్లిపోయాడు. ‘‘మొన్న కూడా ఇలాగే జరిగింది. భోజనాలకు ఆపినప్పుడు ప్యాసింజర్లు బస్సులు మారిపోతున్నారు. రాత్రి ఎక్కిన మనిషిని నేనూ చూసుకోలేదు. సీటు నెంబరు కరెక్టే. బస్సు నెంబరు వేరే. వెనకొచ్చే డ్రైవర్ మనల్ని ఓవర్‌టేక్ చేసుకొచ్చాడు.. ఈ ప్యాసింజర్ కోసం. ఏం మనుషులో ఏమో’’ అంటున్నాడు ఇద్దరిలో ఒక డ్రైవర్.
-మాధవ్ శింగరాజు