గురుకుల విద్యాసంస్థలకు సరుకుల సేకరణపై హైకోర్టు
టెండర్ల ప్రక్రియలో ప్రభుత్వ విధానపర నిర్ణయం సబబే
అయినా మార్పులు అవసరం.. లాటరీ విధానం ఆపేయాలి
గిరిజన సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలకూ రిజర్వేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 1,023 గురుకుల, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ఆహార, ఇతర సరుకుల టెండర్ల ప్రక్రియలో చిన్న, స్థానిక కాంట్రాక్టర్లకు 25 శాతం రిజర్వేషన్ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సరుకుల సేకరణలో సమానత్వం, పారదర్శకత, నిష్పాక్షికత పాటించాలని స్పష్టం చేసింది. బిడ్డర్లను లాటరీ ద్వారా ఎంపిక చేసే విధానాన్ని నిలిపివేయాలని తేల్చిచెప్పింది. జూలై 8న ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 17 సబబే అయినా.. కొన్ని మార్పులు అవసరమని అభిప్రాయపడింది.
గిరిజన సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలకు టెండర్ల ప్రక్రియకు ముందే రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. జిల్లాల వారీగా విద్యార్థులకు అందించే సరుకులు, ఆహార పదార్థాల ఏకరీతి సేకరణ వ్యవస్థ కిందకు తీసుకొస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 17ను సవాల్ చేస్తూ తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. దశాబ్దాలుగా సరుకులు పంపిణీ చేస్తున్న చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లను తప్పించి.. ఆర్థికంగా ఉన్న వారికి కట్టబెట్టేందుకు ఈ జీఓ తీసుకొచ్చారన్నారు. జీఓ జారీలో ఎలాంటి దురుద్దేశం లేదని, టెండర్లలో అందరూ పాల్గొనవచ్చని ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమరి్థస్తూనే కొన్ని.. పలు మార్గదర్శకాలు జారీ చేశారు. ఏళ్ల తరబడి సరుకులు పంపిణీ చేస్తున్న చిన్న కాంట్రాక్టర్ల జీవనోపాధిని దెబ్బతీయవద్దన్నారు.
హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి
» గిరిజన సహకార సంస్థ (జీసీసీ), మండల, జిల్లా మహిళా సమాఖ్యలకు ఏదైనా రిజర్వేషన్ లేదా ఇతర ప్రాధాన్యతను టెండర్ నోటిఫికేషన్‌లోనే స్పష్టంగా పేర్కొనాలి. రిజర్వేషన్ శాతం, అది వర్తించే సరఫరా ప్రాంతాలను ముందుగానే ప్రకటించాలి.
» రూ. కోటి కంటే తక్కువ విలువైన కాంట్రాక్టుల విషయంలో ఈఎండీ అంచనా విలువలో 2 శాతానికి మించకూడదు. వార్షిక టర్నోవర్ కాంట్రాక్టు విలువను మించకూడదు.
» ప్రతి టెండర్ నోటిఫికేషన్‌లో పని మొత్తం అంచ నా విలువ, సరఫరా చేయాల్సిన వస్తువులు, వా టి పరిమాణాలు, సుమారు యూనిట్ రేట్లు స్పష్టంగా పేర్కొనాలి.
» ఏదైనా బిడ్‌ను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి కారణాలను రాతపూర్వకంగా నమో దు చేయాలి. సంబంధిత సంక్షేమ శాఖల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా బహిరంగంగా ఈ కార ణాలను అందుబాటులో ఉంచాలి. æ సాంకేతికంగా అర్హత కలిగిన బిడ్డర్లలో లాటరీ తీసి పనిని కేటాయించే విధానాన్ని వెంటనే నిలిపివేయాలి.
» మండల లేదా గురుకుల స్థాయిలో అనుభవమున్న చిన్న, స్థానిక కాంట్రాక్టర్లకు 25 శాతానికి తక్కువ కాకుండా రిజర్వేషన్ ఇవ్వాలి.
» టెండర్ నోటీసుల ప్రచురణ, సవరణలు, ఫలితాలు, టెండర్ ప్రక్రియల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి కేంద్రీకృత ఆన్‌లైన్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.
» ఈ తీర్పు అందిన తేదీ నుంచి 2 వారాల్లో పైన పేర్కొన్న మార్గదర్శకాలతో నోటిఫికేషన్ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ శాఖలు, వాటి అధీన సంస్థలకు ఒకేలా వర్తింపజేయాలి.


