యూటూ...

Even without the knowledge of good sleep daughter Sujata - Sakshi

ఈవారం కథ

కోళ్ళు కూయక ముందే నిద్దర లేచింది రాజమ్మ. లేస్తానే బిందెలు, చేంతాడు తీసుకోని బయల్దేరింది. ఒళ్ళు తెలియకుండా  నిద్ర పోతున్న కూతురు సుజాతని తట్టి లేపి ‘అమ్మాయ్, లే, లేచి తలుపు గడేస్కో, నేను బాయికి పోతన్నా’ అని చెప్పి బయట పడింది.తిరిగొచ్చే సరికి తెల్లగా తెల్లారిపొయ్యింది. ఎప్పుడూ ఎండాకాల మొచ్చిందంటే ఇదే తంతు.చెర్లో ఉన్న కమ్మోళ్ళ బాయిలో చుక్క నీళ్లు ఉండవు. ఊరు మొత్తానికీ మాలోళ్ళ బాయే గతి. దాంట్లోనైనా ఇబ్బడిముబ్బడిగా ఏవీ నీళ్ళుండవు. కొంచెం కొంచెంగా జల ఊరతా ఉంటది. జనాలు రేత్తిరి తెల్లార్లూ డబ్బాలకు గాలాలేసుకోని వంతులవారీగా చేదుకుంటా ఉంటారు.ఎప్పుడు వంతొచ్చేనో ఏమో అని వరసలో నుంచోని నుంచోని ఇసుగు పుట్టి పక్కకి పొయ్యామా, అప్పుడే వంతొచ్చుద్ది, ఎనకోళ్ళు ముందుకొచ్చేత్తారు, ఇంక చివర్నే మళ్ళీ వంతొచ్చేది. ఎందుకొచ్చిన గోలనుకోని  కొంతమందిఅక్కడే ఆ చెరువు కట్ట మీదే ఒక నిద్ర బోతారు తమ వంతొచ్చేదాకా. ఈ బాధలన్నీ పడలేక కొంతమంది ఆసాములు సైకిళ్ళున్నోళ్ళు పొలం బాయికో, పక్కూరి బాయికో పోయి నీళ్ళు తెచ్చుకుంటారు. అట్లా వీలు కానోళ్ళు రాజమ్మలాగే తంటాలు పడతారు. అయితే ఊళ్లోని ముసలీ ముతకా బాయికాడకొస్తే కాపోళ్ళు గదా అని పల్లె జనాలు కాస్త బరవాసాగానే పోతారు. వంతుల్తో పని లేకుండా ‘‘వరసలో రాండమ్మో’’ అనకుండా నీళ్ళు చేదిపోస్తారు. కానీ రోజు అట్టా కుదరొద్దూ?ఎవురికోళ్ళకే తొందర పనులాయె! వస్తా వస్తానే కూతుర్ని కేకలు పెట్టి పక్కలు తియ్యమని చెప్పి చీపురుతో గబగబా చిమ్మి కల్లాపు చల్తుంది రాజమ్మ. అందరికంటే ముందు పాచికసువు తీయలేకపొయ్యాననే ఇసురులో ఉంది.  ‘ఇయ్యాలేందొదినా పొద్దెక్కిందాకా ఉన్నావు. మెలుకువ రాలేదా ఏంది ?’ అప్పటికే ఇంటిముంగల ముగ్గెయ్యడం పూర్తిచేస్తున్న పొరుగామె ఆరా తీసింది.

‘ఆ... ఎంత ముందు లేచినా  నీళ్ళ బాయి దగ్గరే పున్నెకాలం పూర్తవుతుంది.  ఒకరోజు అయితే బతిమాలీ బామాలీ వరసతో పన్లేకండా దోర్చుకుంటాం.  రోజూ అడుగుతుంటే  వాళ్ళు మాత్రం ఊరుకుంటారా? మాకు పనులు లేవా అని ఎదురు అడుగుతున్నారు.’‘అవునొదినా. మరీ పెద్దంతరం చిన్నంతరం లేకండా పోతంది. నిన్న మాయిటేల నీళ్ళ బాయి దగ్గర నడిం బజారోల్ల మీద అడ్డం దిరిగారు పల్లెలో కుర్రాళ్ళు. ఆ గంగి కొడుకు ఏసోబు గాడయితే మరీ పెచ్చుమీరి పోతన్నాడు. వాళ్ళనట్టా అలవాటు కానిస్తే ఎట్టా?అందుకే మీ బావకొడుకు శీనూ ఇంకా నలుగురయిదుగురొచ్చి బాయి దగ్గర దుమ్ముదులపబోయారు. పిల్లల్ని వదిలితే గోల పెద్దదయిద్దనీ ఎసోబుగాడ్ని పంచాయితీకి పిలిపిచ్చి మాట్టాడారు పేద్దోళ్ళు. వాడు పొగురుగా మాట్లాడతా మిర్రిమిర్రి చూస్తా శీనయ్య మీద కొచ్చ్సాడు. వాళ్లమ్మొచ్చి కొడుక్కి నాలుగుబెట్టి లాక్కెళ్ళింది సర్దుకు పోవాలగానీ ఏందీ తగాదాలంటా’.   ‘ఏమోలే వదినా.  నాల్రోజులు తాలితే అదే చల్లబడుద్దిలే. ఇయ్యాల సత్తాయి చేలో నయ్యెరువు జల్లాల. అందరూ పనులు మొదలు పెడితే పల్లెలో మంగి ముఠా కట్టిద్ది. ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు. మనుషుల్ని పిల్చకరమ్మని పొద్దుననంగా పంపా పల్లె మీదికి. వొచ్చాడేమో చూడు మీ అన్న!’’ అంటా రాజమ్మ లోపలికొచ్చింది. సుజాతకి జడలేస్తా వాళ్ళ నాన్నింకా బజారునుండి పెత్తనాలోదిలి రాలేదని సాగాదీస్తుండగానే   తాగే బీడీని బైట గోడమీద బెట్టి లోపలికొచ్చాడాయన.‘మిడిమేలపు చావొచ్చిందాకా ఇట్టానే తాగు. రోగమొస్తే రోప్పోస్తే ఎట్టనా అనేదే లేదు. అవతల మీ అన్న కాడెద్దుల ఎగసాయం జేస్తా, ఎకరాలు సంపాయిస్తా ఉంటే నువ్వు మాత్రం మీ అయ్యిచ్చిన ఆ ఎకరం ముక్కలోనే పొర్లాడతా ఉండు..సిగ్గన్నా పెట్టలా మడిసి జన్మకి ..ఇంతకీ మణుసుల్ని పిల్చావా లేదా?’ఈ గొంతుకి అలవాటైపోయిన ఆయన తాపీగా చెప్పాడు.‘ఇయ్యాలెవరూ పన్లోకి రారు. మంగి కూతురు కుమారుళ్ళా.. దాని మొగుడు ఐదరాబాద్‌లో యాక్సిడెంటయి చచ్చిపోయాడంట. రాత్రి మేదరమెట్ట ఫోనోచ్చిందంట. శవాన్నిక్కడికి తెచ్చేసరికి రేపటేలయ్యిద్దంట..‘ ‘ఎట్టా జరిగిందంటా?’ అడిగింది రాజమ్మ‘ఏమోనే. వస్తేగానీ తెలీదు.  పాపం ఊరొదిలి ఎల్లడం వాడికి బాదగా ఉన్నా, ఇద్దరాడపిల్లల్నీ బాగా చదివిచ్చుకోవాలనీ, ఈడుంటే మంగి కుమార్ని చేనూ చేనూ తిప్పిద్దనీ, ఐదారాబాద్‌లో వాళ్ళ బావ ఇళ్ళకిరంగులేసే పని జేస్తంటే ఆడనే ఎదో ఒక పని చూసుకుంటానని ఎల్లాడు. ఇప్పూడిట్టా జరిగా. ఇద్దరూ ఎంతఒద్దిగ్గా ఉంటారు పాపం’  అన్నాడు రామయ్య.పదింటికి వచ్చిన శవాన్ని చూసినోళ్ళందర్రూ ఇళ్ళకు సాంతం వెళ్ళకుండానే– ‘చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఆ పిల్లల్నేట్టా నెట్టాల కుమారి. యాక్సిడెంట్‌ డబ్బులొస్తే పెళ్ళిజేసి అది కూలో నాలో జేసుకు బతకడమే’నని తేల్చారు.     రాజమ్మమాత్రం మొగుడులేనిల్లు ఊరందరికీ అలుసైద్దనీ కాయలున్న చెట్టుకే రాళ్ళదెబ్బలనీ అంది. కొన్నాళ్ళు పిల్లలిద్దర్నీ  బడికి పంపింది కుమారి.   పెద్దదయిందగ్గర నుండి బరువు పెరిగిద్దనీ పెళ్ళి జేయ్యమని అందరూ తొందర పెట్టడంతో సుజాతోళ్ళ  పెద్దయ్య  దగ్గర డబ్బు తెచ్చి పెద్దకూతురి పెళ్లి చేసింది.చిన్న కూతురు దేవిని సుజాతతో పాటు హైస్కూల్‌కి పంపింది. దేవి ఎనిమిదో తరగతి సుజాత పది.
 
మనిషి నలుపైనా దేవి ఎంత అందంగా ఉండేదో.నవ్వే కళ్ళతో మెరిసిపోతా ఉండేది. గలగలా  మాట్లాడ్డం మొదలు పెట్టిందంటే చుట్టూ ఉన్నోళ్ళు అట్టా నోర్లు తెరుచుకోని ఇంటానే ఉండేవాళ్ళు. అంత అయిస్కాంతం ఆ పిల్ల. తొమ్మిది అయిపోగానే పెద్ద పిల్ల పురుళ్లనీ, అయ్యనీ, ఇయ్యనీ డబ్బుల్లేక దేవిని చదువు మాన్పించేసింది కుమారి. పొలంపనులకి తీస్కెళ్ళడం మొదలుపెట్టింది.పత్తి చేలల్లోఊళ్ళో వాళ్ళందరూ ఒక వరసగా, తరువాత పల్లెలో వాళ్ళందరూ ఒక వరుసగా సాళ్ళు పట్టుకుని పనిజేసేవాళ్ళు. సాళ్ల మధ్యలో ఎవరికిష్టమైన యవ్వారాలు వాళ్ళు పెట్టుకునే వారు. కుమారి సాల్లో ఉండి  పనిజేస్తే,  దేవి మనిషెత్తు సాళ్ళు దాటి అందరి ఒళ్ళల్లో పత్తి తీసుకుని గోతాలకేసుకుని, గట్టు మీదున్న శీనయ్యకి అందిచ్చేది.  ఎప్పుడూ గలగలా మాట్లాడతానే ఉండే పిల్లకి పాపం నోరు తెరిచే తీరికుండేది గాదు. బడి మానేసినాక ఈ రెండేళ్ళలో దేవి యవ్వనోత్సాహంతో మరింత అందంగా తయారయింది. పొలంలో దిగిం దగ్గర్నించీ ఆ పిల్లని కూర్చోనివ్వరు, నుంచోనివ్వరు. వొడినిండిందనో, మంచి నీళ్ళనో పిలుస్తానే ఉండేవాళ్ళు.  వీటికి తోడు గట్టు మీదనుంచి శీనయ్య గోతాలెత్తాలనో, కుట్టాలనో చీటికి మాటికి పిలుస్తా ఉండేవాడు. ఒకరోజు శీనన్న అట్ట పిలిచినప్పుడు దేవి సుజాతని తోడు రమ్మంది. ఇది గమనించిన శీను ‘‘సుజాత వల్ల కాదులే, నువు రా’’ అని గట్టిగా పిలిచాడు. దేవి అయిష్టంగా కదిలి వెళ్ళింది.ఏదో తేడాగా అనిపించింది సుజాతకి. ఆ మాటే అంది వాళ్ళమ్మతో సాయంత్రం.  ‘అసలా గోతాలు వాడేత్తుకోలేకనా. ఆ సోంబేరోడు దేనికీ కాకుండా పోతున్నాడు.గాలెవ్వారాలెక్కువౌతున్నాయి. ఈడు మొగపిల్లోడనీ, వంశాన్ని నిలబెడతాడనీ ఉన్న పొలమంతా మీ తాత పెదయ్యకి బెట్టె.  మీ అయ్యకేమో గొర్రెలూ బర్రెలూ ఇచ్చి బయటకి పంపే. నోరున్నోడి మాటే చెల్లిద్ది. ఈడెమో సదువూ సంధ్య లేకుండా ఊరు మీద దిరుగుతున్నాడు. ఈడికి కాదుగానీ దానికి జెబుతాలే’ అంది వాళ్ళమ్మ.  వాళ్ళమ్మ మాటతో సుజాతకి  ఊరట కలిగింది. అమ్మ ఎప్పుడూ అంటుంది. మగపిల్లల జోలికి వెళ్ళకూడదు. వాళ్లోస్తే ఊరుకోకూడదు. గట్టిగా బుద్ది జెప్పాలనేది.ఒకరోజు పొద్దున్న ‘అమ్మాయి సుజాతా ... నాకు చేలో ఉమ్మరంగా  పనుంది గానీ, తొందరగా పన్జేసుకొని కొట్టం కాడికెళ్ళమ్మా బర్రీనేటట్టుంది’ అని చెప్పి రాజమ్మ బయటికెళ్ళింది.    అమ్మ వెళ్ళిం తర్వాత మిగిలిపోయిన పనులు చేయటానికి సిద్దం అయింది సుజాత. ఇంతలో గోడవతలనుండి శీనన్న పిలవడంతో బయటకొచ్చింది. ఎందన్నాయ్‌ ‘ అంటా దగ్గరకెళ్ళింది. ‘అమ్మోల్లు పొలం ఎల్లారా? ...నువ్వు కొట్టం దగ్గరకి వెళ్లొద్దులే. బర్రె పని నేను జూస్తాలే’ అన్నాడు. ఎప్పుడూ పనందుకొని శీనన్న ఇలా అనటంతో సుజాతకి ఆశ్చర్యం వేసింది.  వద్దులే అందామనుకొని ఏదో విషయం ఉందని అర్ధమయ్యి ‘ఎందుకన్నాయి?’ అంది.‘ఏం  లేదులే ...మొన్న నేను దేవితో ఉన్నప్పుడు వాళ్ళ మామ ఏసోబు గాడు చూశాడు’ అన్నాడు నంగినంగిగా.  ‘వాడు దాన్ని కొట్టాడు. అది నామీద చెప్పింది వాడికి. వాడు నామీద కోపంగా ఉన్నాడు. నన్నేమనలేక నిన్నేమన్న అంటాడేమోనన్లే ...జాగర్తగా ఉండు.’  అనెళ్ళాడు.

అన్నమాటలకి సుజాత బిత్తరకపోయింది. ఎంత తేలిగ్గా చెప్పెల్తన్నాడు!. ఏసోబు, వాళ్ళమ్మ  దేవినేమన్నారో. ఆ పిల్ల ఎంతేడుస్తుందో. ఏసోబుకి నిజంగానే కోపం వచ్చుంటుంది. మొన్న అంజమ్మత్త చెప్పిన బాయికాడ సంగతి గుర్తొస్తే భయమేసింది. వీడు జేసిన పనికి నిజంగా నన్నేమన్నా అంటాడేమో. ఇంట్లో ఉన్నా భయం పుట్టేట్టు జేశాడు. చేసిందంతా చేసి ఇప్పుడు నాకు జాగ్రత్త చెబుతున్నాడు. మా పెద్దయ్యోల్లకు తెల్సో లేదో. ఎవరికన్నా జెప్తే శీనన్నాయ్‌ ఏమంటాడో ...శీనన్న బర్రెదగ్గరకి వెళ్ళాడో లేదో. చెప్పింది చేస్తాడని లేదుబర్రీనుంటే?   ఏంకాదులె  అనుకోని కొట్టంకాడికి బయల్దేరింది. ఇల్లు మూలదాటి గొందిలోకి ఎళ్ళగానే హటాత్తుగా ఎదురయ్యాడు ఏసోబు. వేగంగా అడుగులేస్కుంటా వస్తున్నాడు.. తనకోసమే వస్తున్నాడా? భయమేసింది. గబుక్కున వెనక్కు తిరిగింది. ఏసోబు పిలుస్తున్నా వెనక్కి తిరగలేదు. పరుగులాంటి నడకతో ఇంట్లోకొచ్చిపడింది.అమ్మకోసం ఎదురు చూస్తా కూర్చుంది సుజాత. తప్పుజేస్తే అమ్మ ఎవర్నైనా ఊరుకోదు. ఇవ్వాళ శీనన్నకి బాగా గడ్డిబెట్టిద్ది. పెద్దయ్యోళ్లతో తగాదయినా సరే.  ‘ఏందే బర్రె దగ్గరకెళ్ళ లేదు? బర్రీనిందని ఏసోబు చెబుతున్నా వినిపించోకుండా వచ్చావంట.’ అంది రాజమ్మ లోపలికొస్తానే. జరిగిందంతా చెప్పింది సుజాత. ‘ఆ సన్నాసోడికేం పొయ్యేకాలమొచ్చింది. దాన్నలరిపాలు చెయ్యడానికి. ఈడిలాగే అందరూ ఎదవ పనులు జేస్తారంటనా. వాళ్లట్టాటోళ్ళుకాదు. ఏసోబు మాట కటువైనా మనిషి మంచోడు. అయినా ఊళ్ళో వాళ్ళ జోలికి రావడం అంత తేలికా’  అంది రాజమ్మ.ఆ రాత్రి కుమారి రాజమ్మ దగ్గరకొచ్చింది. ‘అక్కాయ్‌ గ్రేడు పనులు మొదలు పెడితే చెప్పు మేం  కూడా వస్తాం.’ దిగులు గొంతుతో అంది కుమారి.  సరేలే కుమారీ అట్టనే వద్దువు... విషయం తెలిసిందిలే. అయినా దానికైనా జాగర్త ఉండొద్దా. ఎవురేందో తెలియోద్దా.. నువ్వయినా చేప్పొద్దా.’  అంది.అమ్మ మాటలో, గొంతులో ఏదో తేడా అనిపించింది సుజాతకి.   ‘నాకేం తెలుసక్కాయి ఇట్ట జేస్తాడనీ.... ఈడ పెరిగిన పిల్ల కాదాయె. దానికేందెలుసు..... అయినా ఆ మనిషే ఉంటే.... ఎన్ని అనుకున్నాడు..’ దుఃఖంతో కుమారి గొంతు పూడుకుపోయింది.‘ఇప్పుడు ఏడిచి ఏం లాభం కుమారీ... ముం దుండాలి. ‘అంది రాజమ్మ.కాసేపు మాట్లాడి కుమారి వెళ్ళిపోయింది.అమ్మ మాట్లాడాల్సినవేవో మాట్లాడలేదనిపించింది సుజాతకి ‘‘పాపం దేవిమా ...’  అంది సుజాత వాళ్ళమ్మ మొహంలోకి చూస్తూ.‘ఏమయ్యిద్ది .. దానికి తెలియోద్దంటే జాగర్త? ఎదురెళ్ళి తెచ్చుకుంటారనుకుందా? ఆ ఏసోబు గాడికిచ్చి ముడి పెట్టేస్తార్లే ’’ అంది తేలిగ్గా .సుజాతకు అమ్మ కొత్తగా కనిపించింది. అమ్మ ఎందుకు ఇంత కటువుగా మాట్లాడుతుంది.     శీనన్న మీద అమ్మకెప్పుడూ మంచి అభిప్రాయం లేదు. చిన్న విషయాల దగ్గర కూడా తిడుతుంది. కానీ ఇప్పుడు శీనన్న మీద రావల్సినంత కోపం రాలేదెందుకనీ. పైగా దేవినే తప్పుబడుతూ మాట్లాడింది.   పొలంలో దేవి గురించి అమ్మ జాగ్రత్త దేవి గురించేనా?అమ్మ గురించి చెడ్డగా అనుకోలేకపోయింది.ఏసోబు మంచితనం మీద అమ్మ నమ్మకానికి, మనజోలికి రాలేడనే ధీమాకి మధ్య ఎదో సంబంధం ఉన్నట్లనిపించింది సుజాతకి .కానీ అదేమిటో తెలీలేదు.ఆ రాత్రి నిద్ర పోలేదు సుజాత.   
 -ఝాన్సీరాణి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top