
మతసామరస్య ప్రతీక
మెహిదీపట్నంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు దగ్గర్లో ఉంది జాంసింగ్ బాలాజీ మహాదేవ్ దేవాలయం. దీన్ని 1810లో నిర్మించారు.
మెహిదీపట్నంలోని గుడిమల్కాపూర్ మార్కెట్‌కు దగ్గర్లో ఉంది జాంసింగ్ బాలాజీ మహాదేవ్ దేవాలయం. దీన్ని 1810లో నిర్మించారు. జాంసింగ్ రాజ్‌పుట్ వీరుడు. మూడో నిజాం ప్రభువు నవాబ్ సికిందర్ జా బహదూర్ (1803-1829) కాలంలో గొప్ప పరాక్రమ శాలిగా పేరు తెచ్చకున్నాడీయన. మేలిరకం గుర్రాలను కొనుగోలు చేయడంలో జాంసింగ్ దిట్ట. నిజాం కుటుంబీకుల కోసం, నిజాం ప్రభుత్వం కోసం అవసరమైన అశ్వాలను ఆయనే అందజేసేవారు. జాంసింగ్ బాలాజీ దేవాలయం విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు.
చుట్టూరా ఎత్తై ప్రాకారం, తూర్పున ప్రధాన సింహద్వారం ఉంది. ఈ ఆలయంలో 12 పిల్లర్లతో నిర్మించిన సభామండపం చూడదగింది. ఆలయానికి దక్షిణాన పెద్ద బావి ఉంది. ఆ బావిమీద నల్లని రాతిపై పర్షియన్ భాషలో ‘ఈ దారిన వెళ్లే యాత్రికులు బావిలోని మంచి నీరు తాగి సేదతీరండి’ అని ఆహ్వానిస్తూ ఆకర్షణీయంగా రాసి ఉంది. దేవాలయం ఎదుట ఎత్తై రాజగోపురం, దానికి ఇరువైపులా అశ్వాల రాతి శిల్పాలు ఆకట్టుకుంటాయి. సుమారు రెండొందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి చెక్కడాలు కంచి-కామాక్షి, తిరుమల వేంకటేశ్వర దేవాలయ నిర్మాణ రీతిని పోలి ఉంటాయి. ఇక్కడ ఉన్న ఏకశిలా ధ్వజస్తంభం, నల్లని గ్రానైట్‌పై చె క్కిన ఆనాటి శిల్పాలు నేటికీ అద్భుత రీతిలో కన్పిస్తున్నాయి.
నిజాం ప్రభువు ఆగ్రహం...
జాంసింగ్ బాలాజీ దేవాలయ నిర్మాణం వల్ల ఆనాటి నిజాం ప్రభువు సికిందర్ జా ఆగ్రహానికి గురయ్యాడని చెప్తారు. భక్తరామదాసు భద్రాద్రిలో శ్రీరాముని ఆలయం కుతుబ్‌షాహీల కాలంలో నిర్మించినట్లు, విజయనగర రాజుల కాలంలో ఆనాటి ఖజానాధికారి విరూపన్న అనంతపురం జిల్లాలో లేపాక్షి దేవాలయం నిర్మించినట్లు, నిజాం సైన్యానికి అవసరమైన అశ్వాల కొనుగోలుకు సమకూర్చిన నిధులతో జాంసింగ్ దేవాలయాన్ని నిర్మించాడని నవాబు సికిందర్ జా కోపోద్రిక్తుడై జాంసింగ్‌ను జైలుపాలు చేయాలని ఆదేశించాడని చరిత్రకారులు పేర్కొంటారు.
అయితే నాటి నిజాం సంస్థాన ప్రధానమంత్రి చందూలాల్ అడ్డుపడి శిక్ష తగ్గించి, దేవాలయానికి సమీపంలోనే మసీదు నిర్మాణం కూడా చేయించాల్సిందిగా ఆదేశించారని, అందులో భాగంగానే బాలాజీ దేవాలయం పక్కనే కుతుబ్‌షాహీ శైలిలో మసీదు నిర్మాణం చేపట్టార నీ చెబుతారు. ఈ మసీదునే జాంసింగ్ మసీదుగా పిలుస్తారు. ఈ అరుదైన నిర్మాణాలు మతసామరస్యానికి ప్రతీకలు. ఈ రెండు నిర్మాణాలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి.
విశిష్ట ఆలయం...
బాలాజీ దేవాలయ ప్రాంగణంలోనే శివుని గుడి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. ప్రతి ఏటా మే నెలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, దసరా వేడుకలు ఘనంగా జరుగుతాయి. ధ్వజస్తంభానికి సమీపంలో భగవంతుడిని ఆరాధిస్తున్నట్లు జాంసింగ్ ఆయన భార్య రాతి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఉత్సవ సమయంలో భజంత్రీలు మోగించేందుకు ఏర్పాటు చేసిన ‘నఖర్‌ఖానా’ నిర్మాణశైలి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఇప్పుడిది శిథిలావస్తకు చేరుకుంది.
మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com