పుత్తడిబొమ్మ.. | save girls save india... | Sakshi
Sakshi News home page

పుత్తడిబొమ్మ..

Feb 19 2015 11:14 PM | Updated on Sep 2 2017 9:35 PM

పుత్తడిబొమ్మ..

పుత్తడిబొమ్మ..

బాల్యవివాహం.. ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న ఓ దురాచారం!

బాల్యవివాహం.. ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న ఓ దురాచారం! దీనికి వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఈ పదం డిక్షనరీలో కనిపించకూడదు! కానీ ఆ పదమే కాదు, ఆ దురాచారమూ సజీవంగా ఉంది... దీనికి నిదర్శనం అక్షరాస్యత అసలేలేని మారుమూల పల్లెలు కావు నవనాగరికత చిందులేస్తున్న హైదరాబాదే! మచ్చుకు ఒకటే ఈ కథనం...
- సరస్వతి రమ

 
ఉమ (పేరు మార్చాం)కి ఇరవై ఏళ్లు. హైదర్షాకోట్లలో ఉన్న కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతోంది. అక్కడెందుకు ఉంది.. అనాథ? కాదు. అమ్మా, నాన్న, చెల్లి అందరూ ఉన్నారు. ఎనిమిదేళ్ల కిందట అంటే ఆ అమ్మాయికి పన్నెండేళ్లున్నప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చింది.

ఎందుకు?
ఉమ తల్లిదండ్రులు ఆ పిల్లకి పన్నెండేళ్లకే పెళ్లి చేయాలనుకున్నారు. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా పెళ్లి సంబంధమూ చూసి ఖాయం చేశారు. ఈ అమ్మాయి వద్దు మొర్రో అంటున్నా బలవంతంగా పుస్తె కట్టించాలనుకున్నారు. ఇంట్లో ఉంటే ఆ బంధనం తప్పదు అనుకున్న ఉమ రాత్రికిరాత్రే ఇల్లు వదిలి ఈ ఆపద నుంచి తప్పించమని ఓ ఇంటి చూరు కింద నిలబడింది. ఆ కుటుంబం ఉమను ఆదరించింది. ఉమ తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని నచ్చచెప్పాడు సర్పంచ్. ససేమిరా అన్నారు వాళ్లు. వారం రోజులు ప్రయత్నించినా ఆ తల్లిదండ్రుల మొండి వైఖరిలో ఇసుమంతైనా మార్పులేదు. ఇలా అయితే కుదరని ఉమని తీసుకెళ్లి కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో చేర్పించాడు సర్పంచ్.
 
పెళ్లి తప్పింది..
కానీ చదువు మీద ఆసక్తి అయితే పెరగలేదు ఉమకి. కారణం.. చిన్నప్పటి నుంచి ఎదురైన రకరకాల ఇబ్బందులు, అడ్డంకులు! నాలుగో తరగతి చదువుతున్నప్పుడే ఆ అమ్మాయి వాళ్ల చిన్నాన్నకి పెళ్లయింది. ఆయన డ్యూటీకి వెళ్లిపోతే ఇంట్లో కొత్త పెళ్లికూతురు ఒక్కతే ఉంటుందని ఈ పిల్లను తీసుకెళ్లి ఆమెకు తోడుగా ఉంచారు. దాంతో ఉమ చదువు అటకెక్కింది. కొత్త పెళ్లికూతురు పాతబడగానే ఉమ మళ్లీ సొంతింటికి చేరింది. అప్పుడు ఈ అమ్మాయిని పెళ్లికూతుర్ని చేసే తతంగం మొదలైంది. దాన్నుంచి తప్పించుకునే పోరాటం, భద్రంగా ఉండడం కోసం ఆరాటం.. వీటన్నిటిలో పడి చదువును నిర్లక్ష్యం చేసింది. కస్తూర్బాలో ఆ అవకాశం వచ్చినా అప్పటికే ఆసక్తి పోయిందంటుంది ఉమ.
 
మరి ఇప్పుడు..
ఎలీప్ వాళ్ల సౌజన్యంతో కస్తూర్బాగాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న జ్యూట్‌బ్యాగ్ తయారీలో శిక్షణ పొందుతోంది. టైలరింగ్ కూడా నేర్చుకుంటోంది. ఆత్మవిశ్వాసం పెరిగింది. తన చుట్టూ ఉన్న ఆమ్మాయిలు చక్కగా స్కూల్‌కెళ్తూ బాగా చదువుకుంటుంటే తనకూ చదువుకోవాలనిపిస్తోంది. ఆ ఆశ నిశ్చయమైంది కూడా. అందుకే తోటి వాళ్ల దగ్గర లెక్కలు, ఇంగ్లిష్ నేర్చుకుంటుంది. ఓపెన్ టెన్త్ రాయడానికి సన్నద్ధమవుతోంది.
 
ఇంకో విషయం..
ఉమకి పద్దెనిమిదేళ్లు నిండాక ఆమె తల్లిదండ్రులకు కబురు పెట్టారు ఆశ్రమం వాళ్లు ‘వచ్చి అమ్మాయిని తీసుకెళ్లమని’. వాళ్లు రాలేదు కానీ వాళ్ల నుంచి సమాధానం వచ్చింది ఉమ తమకు అక్కర్లేదని. ఆ జవాబుకి ఈ అమ్మాయేం బాధపడలేదు. ‘నేను నా తల్లిదండ్రులకు అక్కర్లేక పోవచ్చు కానీ నాలాంటి చాలామందికి నా అవసరం  ఉంది. ఇక్కడే ఉండి చేతనైన పనిచేస్తూ వాళ్లకు అండగా ఉంటా’ అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement