ఆప్ ఆయే... బహార్ ఆయీ... | Latha Bhat became a famous singer | Sakshi
Sakshi News home page

ఆప్ ఆయే... బహార్ ఆయీ...

Jul 24 2014 4:54 AM | Updated on Aug 11 2018 8:27 PM

ఆప్ ఆయే... బహార్ ఆయీ... - Sakshi

ఆప్ ఆయే... బహార్ ఆయీ...

ఆమె రాకతో సినీ సంగీత ప్రపంచంలోకి కొత్త వసంతం వచ్చింది. అప్పటికే గానకోకిల లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోంస్లే బాలీవుడ్‌ను ఏలుతున్న కాలం.

హైదరాబాదీ..హేమలత:  ఆమె రాకతో సినీ సంగీత ప్రపంచంలోకి కొత్త వసంతం వచ్చింది. అప్పటికే గానకోకిల లతా మంగేష్కర్, ఆమె చెల్లెలు ఆశా భోంస్లే బాలీవుడ్‌ను ఏలుతున్న కాలం. అలాంటి కాలంలో పసితనం వీడక ముందే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే ‘తూ ఇస్ తరహ్ మేరే జిందగీ మే..’ అంటూ శ్రోతలను ఓలలాడించిన ఆ గొంతు పేరు హేమలత. అసలు పేరు లతా భట్. హైదరాబాద్‌లోని సంప్రదాయ రాజస్థానీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది. కొద్దికాలానికే ఆమె కుటుంబం కోల్‌కతా చేరుకుంది. బాల్యం అక్కడే గడిచింది.
 
 చిన్ననాటి నుంచే హేమలత సంగీతమంటే చెవి కోసుకునేది. ఆమె తండ్రి జయ్‌చంద్ భట్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసుడే అయినా, ఛాందసుడైన ఆయనకు కూతురు పాడటం ఇష్టం ఉండేది కాదు. అయినా, ఆమె రహస్యంగా పూజా పెండాల్స్ వద్ద పాడేది. హేమలత తండ్రి జయ్‌చంద్ భట్ శిష్యుడు గోపాల్ మల్లిక్ ఆమె ప్రతిభ గుర్తించాడు. జయ్‌చంద్‌ను ఒప్పించి, కోల్ కతాలోని రవీంద్ర స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ కార్యక్రమంలో ఆమె చేత పాడించాడు. అప్పుడామె వయసు ఏడేళ్లు మాత్రమే. అక్కడి నుంచి ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కలకత్తా నుంచి ఆమె కుటుంబం 1966లో బాంబేకు తరలి వచ్చింది. అక్కడే ఆమె ఉస్తాద్ అల్లారఖా ఖాన్, ఉస్తాద్ రియాజ్ ఖాన్ వంటి ఉద్దండుల వద్ద సంగీత శిక్షణ పొందింది.
 
ఏసుదాస్‌తో అత్యధిక హిందీ గీతాలు పాడిన ఘనత
 గానగంధర్వుడు కె.జె.ఏసుదాస్‌తో కలసి అత్యధిక సంఖ్యలో హిందీ గీతాలు పాడిన ఘనత హేమలతకే దక్కుతుంది. హిందీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, రాజస్థానీ, సింధీ, ఒరియా, అస్సామీ, తమిళ, మలయాళ, డోగ్రీ, కొంకణి, ప్రాకృత, సంస్కృత వంటి స్వదేశీ భాషలు, నేపాలీ, అరబిక్, పర్షియన్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ వంటి విదేశీ భాషలు కలిపి మొత్తం 38 భాషల్లో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఎస్.డి.బర్మన్, మదన్‌మోహన్, సలిల్ చౌదరి, ఖయ్యాం, లక్ష్మీకాంత్-ప్యారేలాల్, కల్యాణ్‌జీ-ఆనంద్‌జీ, రాజ్‌కమల్, ఉషా ఖన్నా, రవీంద్ర జైన్ వంటి సంగీత దర్శకుల సారథ్యంలో చిరస్మరణీయమైన గీతాలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. ముకేశ్, మన్నా డే, మహమ్మద్ రఫీ, తలత్ మహమూద్, కిశోర్ కుమార్, ఏసుదాస్, శైలేంద్ర సింగ్, సురేశ్ వాడ్కర్ వంటి గాయకులతో కలసి యుగళగీతాలతో ఉర్రూతలూగించింది. సినీగీతాలే కాదు, భక్తిగీతాల ప్రైవేట్ ఆల్బంలు, వివిధ దేశాల్లో నిర్వహించిన శాస్త్రీయ సంగీత కచేరీలూ ఆమెను లక్షలాది మంది అభిమానులకు చేరువ చేశాయి. ‘చిత్‌చోర్’లో పాడిన ‘తూ జో మేరే సుర్ మే...’ పాట 1977లో ఆమెకు ‘ఫిలింఫేర్’ ఉత్తమ గాయని అవార్డు తెచ్చిపెట్టింది. ‘ఫకీరా’, ‘సునయనా’, ‘ఆప్ ఆయే బహార్ ఆయీ’, ‘ఆప్‌తో ఐసా న థే’ వంటి సినిమాల్లో హేమలత పాడిన పలు హిట్ పాటలు సంగీతాభిమానులను ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.
 
అమెరికాలో మ్యూజిక్ అకాడమీ
 అమెరికాలో మ్యూజిక్ అకాడమీ స్థాపించిన ఏకైక సినీ గాయని హేమలత మాత్రమే. ప్రపంచ సిక్కుల సంఘం, పంజాబ్ ప్రభుత్వాల నుంచి అరుదైన గౌరవాన్ని పొందిన ఘనత కూడా ఆమెకే దక్కుతుంది. ఆనంద్‌పూర్ సాహిబ్ అకల్ తక్త్‌లో 1999లో జరిగిన ఖల్సా పంత్ త్రిశతాబ్ది వేడుకల సందర్భంగా ‘గుర్మత్ సంగీత్’ గీతాలను వాటి అసలు రాగాలలో ఆలపించే అవకాశం లభించింది. ఆ సందర్భంగా అప్పటి ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్‌ల చేతుల మీదుగా ఘన సత్కారాన్ని అందుకుంది.
 - పన్యాల జగన్నాథదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement