ఓటర్లను ఎంత అవమానించారు!

ఎస్పివై రెడ్డి -  చంద్రబాబు నాయుడు - Sakshi


ఓటర్లకు ఎంత అవమానం!  ప్రజా తీర్పును ఎంత చులకన చేశారు! ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలిసిందే.  ప్రతి రాజకీయ పార్టీ తను అమలు చేసే పథకాలను, తను అనుసరించే విధానాలను ప్రజలకు తెలియజేసి ఎన్నికలలో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుంది. ఏ రాజకీయ పార్టీ విధానాలు, పథకాలు, పద్దతులు నచ్చుతాయో ఆ పార్టీకి చెందిన అభ్యర్థులను ఓటర్లు ఎన్నుకుంటారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని, అన్ని విధాల తమకు అండగా ఉంటారని ఓటర్లు ఆ పార్టీని, ఆ పార్టీ నేతను తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారు. అలా ఎన్నికైన ప్రజా ప్రతినిధి పట్టుమని పదిరోజులైనా కాకుండానే పార్టీ ఫిరాయిస్తే ఏమనాలి? ఎన్నికైన పదవికి ప్రమాణస్వీకారం కూడా చేయకుండా మరో పార్టీలో చేరిపోతే ఆ వ్యక్తిని ఏ విధంగా అంచనా వేయాలి? ఇది తమను ఎన్నుకున్న ప్రజలను అవమానించడం కాదా? ఆ విధమైన పార్టీ మార్పిడులను ప్రోత్సహించినవారిని, సమర్ధించిన వారిని ఏమనాలి? వారికి ప్రజాస్వామ్యంపై నమ్మకం, గౌరవం ఉందా? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినట్లు కాదా? ప్రజాస్వామ్య పటిష్టత కోసం మన రాజ్యాంగాన్ని రూపొందించిన కర్తలను అవమానించడం కాదా?



లోక్సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 16న వెలువడ్డాయి.  సార్వత్రిక  ఎన్నికల బరిలోకి  తొలిసారి దిగినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  టిడిపికి గట్టి పోటి ఇచ్చి 9 లోక్సభ స్థానాలను, 70 శాసనసభ స్థానాలను గెలుచుకుంది. పోలైన ఓట్లలో దాదాపు 45 శాతం ఓట్లు  ఈ పార్టీకి పోలయ్యాయి.  గెలిచిన పార్టీకి, ఈ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం1.9 శాతం మాత్రమే. ఎంత నమ్మకం లేకపోతే ఇంత శాతం ఓట్లు ప్రజలు ఈ పార్టీకి వేశారో అర్ధం చేసుకోవచ్చు. ఈ పార్టీ తరపున గెలిచిన ఎంపిలలో ఏడుగురు, శాసనసభ్యులలో 45 మంది కొత్తగా ఎన్నికైనవారు కావడం ప్రజలు ఈ పార్టీని చూసి ఓటు వేశారనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎస్పివై రెడ్డి  నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.



కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ ఇంకా ప్రభుత్వాలు ఏర్పడలేదు. ఫలితాలు వెలువడి పది రోజులు పూర్తి కాలేదు. అప్పుడే ఎస్పివై రెడ్డి  తనను గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి టిడిపిలో చేరిపోయారు. ఎస్పివై రెడ్డి అంటే చిన్నచితకా మనిషి కాదు. జీవితానుభవం, రాజకీయానుభవం, వ్యాపారునుభవం ఉంది. జిల్లాలో, రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి. కాస్త పేరున్న వ్యక్తి. ఆయనే చెప్పుకున్నట్లు హార్డ్ కోర్ పొలిటిషియన్ కాదు. అదీ గాక ''వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవు. వైఎస్ జగన్ అంటే అభిమానం'' అని ఆయన చెప్పారు. అటువంటి పరిస్థితులో ఆయన పార్టీ ఎందుకు మారవలసి వచ్చింది.  ఎస్పివై రెడ్డి లాంటి వ్యక్తి పార్టీ మారాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య విలువలు గురించి ఆలోచించలేదా? తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకున్నారు? ఈ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? ఆయనపై అనర్హత వేటు పడుతుండా? లేదా?  అనేది ఇక్కడ అప్రస్తుతం. అసలు ఎస్పివై రెడ్డి లాంటి వ్యక్తికి ఇది మంచి పద్దతేనా? ఎస్పివై రెడ్డి కూడా రాజకీయంగా దిగజారిపోయాడనుకోవాలా? ప్రజాసేవ చేయడానికి రాజకీయ పదవులు అవసరంలేదని అనేక మంది చెబుతారు. అలాగే చేస్తుంటారు. అటువంటిది తన ప్రాంతం, తన నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను పార్టీ మారినట్లు ఎస్పివై రెడ్డి చెబుతున్నారు. ఆ మాటలను నిజం అని నమ్మాలా?  నిజమని నమ్మినా ఇలా పార్టీ మారడాన్ని ఎవరైనా సమర్ధిస్తారా?



ఇక ఇటువంటి ఫిరాయింపులను ప్రోత్సహించేవారిని, సమర్ధించేవారిని ఎలా అర్ధం చేసుకోవాలి? ముఖ్యంగా పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఎలా అర్ధం చేసుకోవాలి? ప్రస్తుత పరిస్థితులలో టిడిపికి లోక్సభ సభ్యుల అవసరం కూడా లేదు. అయినా ఇటువంటి ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఆయనకు ఇటువంటివి కొత్తేమీకాదనుకోవాలా?. చంద్రబాబు నాయుడు నైజమే, స్వభావం, ఆలోచనా విధానం, రాజకీయం విధానం, వ్వహార శైలి ఇదేనని, గతంలో అనుసరించిన విధంగానే అనుసరిస్తున్నారని అనుకోవాలా?

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top