మల్బరీ సాగులో మహిళా రైతులు

Women farmers in mulberry cultivation - Sakshi

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం తుమ్మనపల్లిలో పలువురు మహిళా రైతులు పట్టు పురుగుల పెంపకంలో పట్టు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.   తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలు మల్బరిని విరివిగా సాగు చేస్తూ, మల్బరీ పట్టు ఉత్పత్తిలో ప్రముఖ స్థానం పోషిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా తుమ్మనపల్లికి చెందిన నర్ర ధనజ ఐదేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నారు. మల్బరీ సాగు ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో నర్ర ధనజ, స్వామిరెడ్డి దంపతులను సన్మానించారు.

మల్బరీ సాగులో ప్రతి యేటా రూ.3 లక్షలు ఖర్చు చేసి రూ. 11 లక్షలు ఆదాయం పొందుతున్నట్లు ధనజ తెలిపారు. ఆమెతోపాటు ఆ ఊళ్లో అనేక మంది మహిళా రైతులు మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం చేపట్టి మంచి లాభాలు పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ రైతాంగం అనాదిగా సాధారణంగా  వరి, మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేస్తుండగా అతివృష్టి, అనావృష్టి వలన పంటలను నష్టపోయిన సందర్భాలు అనేకం. ఇదే సమయంలో తుమ్మనపల్లి మహిళా రైతులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలను ఆర్జించే  మల్బరీ పంటపై దృష్టి సారించారు.

పంట కాలం తక్కువ.. లాభం ఎక్కువ..
మల్బరీ సాగు పట్టు ఉత్పత్తిలో రెండు దశలు ఉంటాయి. మొదటిది మల్బరీ పంట సాగు, రెండోది మల్బరీ ఆకులు తినిపించి పట్టు పురుగులను పెంచడం. మొదట 8 నెలల పాటు మల్బరీ తోటను పెంచుతారు. మల్బరీ పంటకు ఎకరాకు సుమారు రూ.10 వేలు ఖర్చవుతుండగా, సుమారు రూ. 55 వేల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మల్బరీ తోటను ఒకసారి నాటితే 20 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. సంవత్సరంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు పంటను పొందుతున్నారు. తుమ్మనపల్లిలో 50 మంది మహిళా రైతులు 2–3 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ తోటలు పెంచుతున్నారు. మల్బరీ తోట పక్కనే షెడ్‌  నిర్మించుకుని శ్రద్ధగా పట్టు పురుగులు పెంచుతున్నారు. ఇక్కడి సాగు తీరును తెలుసుకునేందుకు ఇతర జిల్లాల నుంచి రైతులు వచ్చి చూసి వెళ్తుండటం విశేషం.  

– గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌

అవగాహన పెంచుకుంటే నష్టం రాదు
నాకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేస్తున్నా. సంవత్సర కాలంలో నాలుగు నుంచి ఐదు సార్లు పట్టు గూళ్ల దిగుబడి పొందవచ్చు. తక్కువ వ్యవధిలో, తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం పొందవచ్చు. అయితే, మల్బరీ పంట సాగుపై అవగాహన పెంచుకుంటే రైతులు నష్టపోయే పరిస్థితి ఉండదు. మా ఊళ్లో చాలా మంది రైతులు మల్బరీ పంటనే సాగు చేస్తూ లాభాలను గడిస్తున్నారు.

– గోపగాని సరిత, మహిళా రైతు, తుమ్మనపల్లి

హేళన చేసిన వారే సాగులోకి వస్తున్నారు
నాకున్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు సంవత్సరాల నుంచి మల్బరీ సాగుచేస్తున్నా. మా కుటుంబ సభ్యుల సహకారంతో పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కల్పించుకుని మల్బరీ పంట సాగు మొదలు పెట్టాను. మొదట్లో ఇరుగు పొరుగు వారు హేళనగా చూశారు. పంట చేతికి వచ్చిన తర్వాత లాభాల గురించి తెలుసుకుని వాళ్లు కూడా మల్బరీ సాగుకు ముందుకు వస్తున్నారు. ఆహార పంటల కంటే మల్బరీ సాగే ఉత్తమం.

–  నిమ్మల వనజారెడ్డి, మహిళా రైతు, తుమ్మనపల్లి

ఆరేళ్లుగా మల్బరీ సాగు చేస్తున్నా
నాకున్న రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో మల్బరీ సాగు చేపట్టేందుకు ఉద్యాన శాఖాధికారులను సంప్రదించాను. వారు మల్బరీ సాగు విధానం గురించి వివరించారు. గత ఆరు సంవత్సరాల నుంచి మల్బరీ సాగు చేస్తున్నా. మల్బరీ సాగులో ఏమైనా సందేహాలు వస్తే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకుంటున్నా. ఉద్యోగిలా నెల నెలా ఆదాయం పొందుతున్నా. సంతోషంగా ఉంది.


– కాసిరెడ్డి కవిత, మహిళా రైతు, తుమ్మనపల్లి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top