గోరంత విషం

women empowerment :  Discremination - Sakshi

కొండంత కష్టం వచ్చినప్పుడు గోరంత విషం తీర్చేస్తుందనుకోవడం తప్పు. కష్టాన్నే గోరంతగా తీసిపడేయాలి. అందుకోసం..కొండంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి.కొండంత ధైర్యమా?ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది?కష్టమే ఇస్తుంది.  విషం ఇవ్వదు! 

డిగ్రీ పూర్తి చేయాలి. గ్రూప్స్‌ రాయాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. స్వతంత్రంగా జీవించాలి. మూడేళ్లుగా ఈ కలల సాగుకి నారు పోసి నీరు పెట్టాను.  కానీ వేధింపుల చీడ సోకడంతో అవి మాడి మసైపోయాయి. దీని వెనుక ఉన్న మగ ప్రపంచపు కుట్రల్ని తలచుకుంటే గుండెల్లో భగ్గుమంటుంది. 
   
బస్టాప్‌లో ఉండగా, వాడు స్కూటర్‌ మీద రివ్వున దూసుకొచ్చి నా పక్కన నిలబడ్డాడు. కాలేజీ దగ్గర దించుతానన్నాడు. బదులివ్వకుండా కాస్త దూరంగా వెళ్లి నిలబడ్డాను. పావుగంట తర్వాత బస్సెక్కి కాలేజీకి పోయాను. కాలేజీలో మళ్లీ ఎదురయ్యాడు! దాదాపు నెల రోజులు ఇలా వెంటబడ్డాడు. ఓ రోజు మా ఇంటివరకూ వచ్చి.. ‘నువ్వంటే ఇష్టం. పెళ్లి చేసుకుందాం’ అన్నాడు. భయమేసింది. నిద్ర కూడా పట్టలేదు. మర్నాడు ఇంట్లో విషయం చెప్పేశాను. మా అమ్మ ఆ రోజు కాలేజీ మాన్పించింది.

ఆ రాత్రి ఇంట్లో పంచాయితీ. నాన్న కాలేజీ మానేయమన్నాడు. కనీసం డిగ్రీ అయినా పూర్తి చేస్తానని మొత్తుకున్నాను. కుదరదని ఖరాఖండిగా చెప్పేశాడు. ఏడ్చి గొడవ చేసినా ఎవ్వరూ వినలేదు.
నా కన్నీళ్లు మా అన్నయ్యను కాస్త కరిగించినట్టున్నాయి. నా వెంటపడుతున్న వాడిని హెచ్చరించి వచ్చాడు. ఇంట్లోవాళ్లని ఒప్పించి నన్ను కాలేజీకి తీసుకుపోయాడు. రెండు నెలలు ప్రశాంతంగా గడిచాయి. 
ఆ తర్వాత మా అన్నయ్య నుంచి కొత్త రకం వేధింపులు! అవును మా అన్నయ్య నుంచే!!

‘‘ఆయన భార్య ఆరోగ్యం బాగా లేదట. నువ్వు నచ్చావట. నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. పెళ్లి తర్వాత నిన్ను చదివిస్తాడట. నన్ను ఉద్యోగంలో పెట్టిస్తాడట’’ అంటూ నస పెట్టడం మొదలెట్టాడు. మా అన్నయ్య చెబుతున్నది నా వెంటపడినవాడి గురించే!‘‘మనిషి కూడా బాగున్నాడు. ఇంతకంటే అందగాడు దొరుకుతాడా నీకు’’ అంటూ ఒత్తిడి తెచ్చాడు. మా అమ్మానాన్నలు కూడా అన్నయ్యకే వంత పాడారు. పేరెంట్స్‌ సపోర్ట్‌ కూడా దొరకడంతో మా అన్నయ్య నా మీద మరింత ఒత్తిడి తెచ్చాడు. తట్టుకోవడం కష్టమైంది. చచ్చిపోదామనిపించి నెయిల్‌ పాలిష్‌ తాగాను. కానీ బతికి బయటపడ్డాను. దీంతో ఇంటా బయటా అందరూ నన్ను మాటలతో చంపేశారు. పీక్కుతిన్నారు. 

నా ఫ్రెండ్స్‌ ధైర్యం చెప్పి పోలీస్‌ స్టేషన్‌కి తీసుకుపోయి కేసు పెట్టించారు. ఈ విషయం తెలిశాక ఇంట్లో అందరూ నన్ను తిట్టిపోశారు. నేను వాళ్ల పరువును గంగలో కలిపానట!ఆ తర్వాత నా కష్టాలకు అంతూ దరీ లేకుండా పోయింది. పోలీసులు నన్ను వేధించిన వాడి పక్షాన నిలబడ్డారు. ‘‘ఏం రోగం నీకు? ఏమైనా ఉంచుకుంటానన్నాడా? పెళ్లే కదా చేసుకుంటానంటున్నాడు. చదివిస్తానని కూడా అంటున్నాడు కదా? ఎందుకు చేసుకోవు? పెళ్లి చేసుకో’’ అని వాళ్లు కూడా అన్నారు! స్టేషన్‌ చుట్టూ తిప్పించుకున్నారు.

వాళ్లు వాడిన భాష మానసికంగా నన్ను ఎంత హింసించిందంటే.. దాని గురించి నోటితో చెప్పలేను. కేసు వాపసు తీసుకునేందుకు వాళ్లు పన్నిన వ్యూహంలో ఆ భాష ఒక భాగమనుకుంటాను.ఇటువైపు ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగింది. ఇంటి గుట్టును రచ్చకెక్కించావంటూ నన్ను మాటలతో చిత్రవధ చేశారు. ఇక కేసును వెనక్కి తీసుకోక తప్పలేదు. నాకు అతణ్ణి పెళ్లి చేసుకోవాలని లేదు. అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే అతగాడికి లేదు. కేవలం నన్ను లొంగదీసుకునేందుకు అతడు ‘పెళ్లి’ పదాన్ని వాడాడు. మా అన్నకు ఉద్యోగం వేయిస్తానన్నాడు. ఇంకా చెప్పాలంటే నా శరీరం కోసం మా అన్నను ఓ పావుగా వాడుకోవాలనుకున్నాడు. కానీ మా అన్నకి వాడి కుట్ర ఎందుకు అర్థం కాలేదో తెలియడం లేదు. ఇప్పుడు నన్ను కాలేజీ మాన్పించేశారు. నా కలల ప్రపంచాన్ని కూల్చేశారు. నాలుగు గోడల మధ్య నన్ను బందీని చేశారు. గట్టిగా మాట్లాడలేను. ఎవ్వరితోనూ మాట్లాడటానికి వీల్లేదు. ఎవ్వరితోనూ నా బాధ పంచుకోవడానికి లేదు. ఎప్పుడూ మనసంతా అల్లకల్లోలంగా ఉంటుంది. ఒత్తిడిగా ఉంటుంది. నిద్ర పట్టదు.నాది కాని నేరానికి నన్ను శిక్షించిన ఈ మగ సమాజంపై నాకు విపరీతమైన కోపం. బహుశా జీవితంలో ఏ మగాణ్ణీ నమ్మలేనేమో.

సమాజ దృష్టికోణం మారాలి
లైంగిక హింస / వేధింపుల కేసుల్లో బాధితురాలిని మరింత బాధల్లోకి నెట్టే శత్రుపూరిత వాతావరణం మన చుట్టూ అలముకుని ఉంది. ఉమ కేసు ఇందుకు ఒక ఉదాహరణ. చాలా సందర్భాల్లో బాధితుల పట్ల పోలీసులు స్పందించే తీరు సరిగా ఉండట్లేదు. పోలీసులు, మధ్యవర్తులు, పెద్ద మనుషులు రాజీ కుదుర్చుకునేలా వాళ్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాగయితే ఇక బాధితురాలికి చట్టం ఏం సాయం చేసినట్టు? ఏం న్యాయం జరుగుతున్నట్టు?  ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ చట్టాలు అంటే ఇదేనా? చట్ట ప్రకారం తల్లిదండ్రుల దగ్గర వుండటాన్ని సేఫ్‌ కస్టడీ అంటాం. ఉమ కేసును బట్టి పరిశీలిస్తే  కుటుంబమూ ఆమెకు సేఫ్‌గా లేదని అర్థమవుతోంది. మహిళా హక్కులూ చట్టాల గురించి ఎంతగా చెప్పుకుంటున్నా, మహిళా దినోత్సవాలు వందేళ్లుగా జరుపుకుంటున్నా ఇలాంటి గాథలు అనేకంగా వినవస్తూనే ఉన్నాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే చట్టాల అమలు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. బాధితులకు భరోసా ఇవ్వగలగాలి. స్త్రీల పట్ల సమాజం ఏర్పరచుకున్న దృష్టికోణంలో మార్పు రావాలి.
– డాక్టర్‌ కె.అనితారెడ్డి, సంఘ సేవకురాలు, వరంగల్‌ 
(ఉమ కేస్‌ స్టడీ) – తాండ్ర కృష్ణ గోవింద్, 
సాక్షి బ్యూరో ఇన్‌చార్జ్, వరంగల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top