యువరాణికి గౌరవ వందనం

women empowerment :   - Sakshi

నూరేళ్ల జ్ఞాపకం

రాణులంటే చుట్టూ సేవలందించే మందీ మార్బలం, సకల హంగులు అమరే జీవనంగా మన కళ్ల ముందొక దృశ్యం నిలుస్తుంది. కానీ, ప్రజల గురించి ఆలోచించి, ముఖ్యంగా మహిళా హక్కుల కోసం పోరాటం చేసి, సాధించిన అతి కొద్దిమందిలో రాణులలో సోఫియా అలెగ్జాండ్రా దులీప్‌సింగ్‌ ఒకరు.  లండన్‌లోని ప్రముఖ రాయల్‌ మెయిల్‌ తపాలాశాఖ ‘రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ యాక్ట్‌ –1918’ శత వసంతాలను పురస్కరించుకొని ఆనాడు ఈ చట్టం కోసం ఉద్యమించిన 8 మంది ప్రముఖులను ఎంపిక చేసి, వారి గౌరవార్థం స్టాంప్‌లను విడుదల చేసింది. అందులో ఆసియా తరఫున ఎంపికైన ఒకే ఒక్క ఉద్యమ మహిళ మన భారతీయ యువరాణి సోఫియా!   యువరాణి సోఫియా తండ్రి మహారాజా దులీప్‌సింగ్‌. ఆయన పంజాబ్‌ పాలకుడు. సోఫియా ఆగస్టు 1876 ఆగస్టు 8న పంజాబ్‌లోనే జన్మించారు. గవర్నర్‌ జనరల్‌ డల్హౌసీ రాజకీయ వ్యూహాలు పన్ని ఈ రాజ్యాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత దులీప్‌సింగ్‌ ఇంగ్లండ్‌ నుంచి బహిష్కృతుడయ్యాడు. తల్లి బాంబా ముల్లర్‌ కూతురు సోఫియాను తీసుకొని ఇంగ్లండ్‌లోని రాణీ విక్టోరియా హాంప్టన్‌ కోర్ట్‌ ప్యాలెస్‌ చేరారు.

తల్లితో కలిసి సోఫియా అక్కడే నివసించేవారు. విక్టోరియా రాణి సోఫియాను దత్త పుత్రికగా భావించేవారు. 19వ శతాబ్ది చివర్లో, 20వ శతాబ్ది ప్రారంభంలో బ్రిటన్‌లో ప్రజా ఎన్నికలలో మహిళలకు ఓటు హక్కు తప్పనిసరిగా ఉండితీరాలనే అంశం తలెత్తింది. అది ఉదమ్యంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమానికి సోఫియా ప్రాతినిధ్యం వహించారు. అలాగే ‘ఉమెన్స్‌ టాక్స్‌ రెసిస్టెన్స్‌ లీగ్‌’లోనూ సోఫియా ప్రముఖ పాత్ర పోషించారు. మహిళల సామాజిక, రాజకీయ సంఘాలతో సహా ఇతర మహిళా బృందాలలోనూ ఆమె నాయకత్వాన్ని అందించారు. ఇంగ్లండ్‌లోనే 1948 ఆగస్టు 22న సోఫియా మరణించారు. బి.బి.సి. జర్నలిస్ట్‌ అనితా ఆనంద్‌ నివేదిక ప్రకారం సోఫియాను దాదాపు 70 ఏళ్ల పాటు ఈ దేశం మర్చిపోయింది. ‘ఆసియా మహిళ’ అంటూ సోఫియా గురించి ఆనంద్‌ రాసిన పుస్తకంలో రాణిగా, పోరాటయోధురాలిగా, విప్లవకారిణిగా ఆమెను కీర్తించారు. 
– ఎన్‌.ఆర్‌.


సోఫియా అలెగ్జాండ్రాపై అనితా ఆనంద్‌ రాసిన పుస్తకం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top