తలరాత గీసుకోలేకపోయాడు! | Which are daily stories | Sakshi
Sakshi News home page

తలరాత గీసుకోలేకపోయాడు!

May 29 2015 10:25 PM | Updated on Mar 22 2019 1:41 PM

తలరాత గీసుకోలేకపోయాడు! - Sakshi

తలరాత గీసుకోలేకపోయాడు!

సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర.. బస్టాప్‌కు సమీపంలో ఫుట్‌పాత్‌కు ఆనుకొని ఓ చిన్న స్థలం.

రోజూ కనబడే కథలు
 
సికింద్రాబాద్ ప్యాట్నీ దగ్గర.. బస్టాప్‌కు సమీపంలో ఫుట్‌పాత్‌కు ఆనుకొని ఓ చిన్న స్థలం. నాలుగు అడుగుల వెడల్పు, మూడు అడుగుల పొడవు బండ ఉంటుంది. ఆ బండ చివరనఐదు అడుగుల సాయిబాబా చిత్రం పూలతో అలంకరించి కనిపిస్తుంది. ఆ చిత్రం పక్కనే కూర్చుని ఏదో ఆలోచిస్తూ కనిపించాడు ఓ వృద్ధుడు. బక్కచిక్కిన అతని దేహం చిన్న పనికి కూడా అలసిపోయేట్టుగా ఉంది.  అతని పేరు శివరాజ్. వయసు డెబ్భైకి పైనే ఉంటుంది. ఎన్నో బొమ్మలను అలవోకగా గీసిన శివరాజ్ తలరాతను మాత్రం పైవాడు వేరే విధంగా రాశాడు.
 
‘‘కష్టమొస్తే దేవుడికి-నాకు తప్ప రెండో మనిషికి తెలియనివ్వనమ్మా!  నలుగురికి చెప్పుకుంటే కష్టం కాదు గౌరవం తగ్గుతుంది. అందుకే నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు తల్లీ’’ అన్నాడు శివరాజ్. ఇలాంటి కచ్చితమైన మనిషిని మాట్లాడించడం కాస్త కష్టమే. కానీ, ఏడు పదుల అతని జీవితం ఎన్నో అనుభవాలను మూటగట్టుకున్న గనిలా అనిపించింది. ‘బాబా చిత్రం చాలా బాగుంది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు...’ అని మాటలు కదిపితే..’ శివరాజ్ మొహం మతాబులా వెలిగిపోయింది. ‘‘నేనే గీసిన, నా చేతులతో...’’ అన్నాడు. నిరుపేద కళాకారుడిగా అతని జీవితం ఎక్కడ మొదలయ్యిందో.. ఎక్కడకు చేర్చిందో.. ఇక అక్కడ నుంచి ఆగకుండా ఒకటొకటిగా చెబుతూనే ఉన్నాడు...

 ‘‘నేను పుట్టి పెరిగింది కర్నాటక. అమ్మనాయిన చిన్నప్పుడే చనిపోయారు. ఇరవై ఏళ్ల వయసున్నప్పుడే హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చిన. సదువు లేదు. ముందుగా ఈత చీపుర్లు కట్టేవాడిని. వాటితో పాటే శిరిసాపలు.. అల్లేవాడిని. గోడలకు పెయింట్లు వేయడానికి పోయేవాడిని.  బతుకుదెరువు కోసం దేన్నీ వదల్లేదు, అన్ని పనులూ చేస్తూ వచ్చాను.
 
రోడ్డే కాన్వాస్...


 ఎక్కడో లోపల బొమ్మలు వేయాలనే బుద్ధి ఉన్నట్టుంది.. అందుకే సుద్దముక్కలతో గోడల మీద, బండల మీద నచ్చిన బొమ్మల్లా గీసేవాడిని. గుళ్ల మీద పెయింటింగ్‌లు వేయడానికి వెళ్లేటప్పుడు అక్కడ దేవుళ్ల బొమ్మలను బాగా పరిశీలించేవాడిని. ఇంటికొచ్చి సాధన చేసేవాడిని. అలా అలా ఏ గీత ఎలా గీస్తే, బొమ్మ ఎలా వస్తుందో వొంటపట్టింది. పెళ్లయ్యింది. లాలాపేట దగ్గర సంజీవనగర్‌లో కాపురం. మాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. పెద్దోడు  మెకానిక్ పని చేస్తుండు. ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు చేసిన. వాళ్లకూ పిల్లలు ఉన్నారు. చిన్నోడు ఇంకా సదువుతున్నడు. ఇంత చేసినా నా భార్యను ఏనాడూ పనికి పోనివ్వలేదు.
 
పదేళ్ల కిందట...


 ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేసినట్టుగా ఉండేది. చేత బ్రష్ పట్టుకుంటే జారిపోయేది. దవాఖానాలో చూపించుకున్నా. మందులు వాడిన. అయినా బాగా కాలేదు. ఎండిన చెట్టు కొత్తగా చిగురుపెట్టమంటే పెడ్తదా! ఇదీ అంతే, రక్తం సచ్చిపోయింది. కానీ, ఉన్నన్నాళ్లూ జీవనం గడవాలి. పిలగాడి సదువు సాగాలే.. ఎలా అనేదే ఆలోచన.. అందుకే ఓపికంతా తెచ్చుకొని బొమ్మలు వేసేవాడిని. సాపలు అల్లేవాడిని. ముందు ముందు.. ఈ కష్టం నుంచి గట్టెక్కెదెలా?! ఎవరికీ చెప్పుకోలేను. దేవుడికే నా కష్టం చెప్పుకున్నాను. వచ్చిన కళనే నలుగురికి చూపించాలనుకున్నాను. ఉప్పల్, రామంతాపూర్, ప్యాట్నీ రోడ్ల పక్కన బండరాళ్లమీద నాకు వచ్చిన బొమ్మలు సుద్దముక్కలతో అందంగా గీసేవాడిని. పెద్ద పెద్ద అట్టలు, చెక్కల మీద బొమ్మలు వేసేవాడిని. (ఈ బాబా బొమ్మ అలా వేసిందే అని చెప్పాడు) అవి చూసి చాలా మంది మెచ్చుకునేవారు.
 
 ఐదేళ్లుగా...

 రోజూ పొద్దున్నే ఐదున్నరకు లాలాపేట్ నుంచి ఇక్కడకు (ప్యాట్నీ) వస్తా. ఈ నేల శుభ్రం చేసి, నా చేతులతో దిద్దుకున్న బాబా బొమ్మను తెచ్చి పెడతా. ఇక్కడే ఓపిక ఉంటే బొమ్మలు గీస్తాను. లేదంటే లేదు. ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే ఇచ్చింది తీసుకుంటాను. లేదంటే, రూపాయి కూడా ఎవరినీ అడగను. సూర్యుడు నడినెత్తికి వచ్చేవరకు ఉండి, తిరిగి ఇంటికి వెళ్లిపోతాను. చిన్నకొడుకు జీవితం స్థిరపడేంతవరకు ఒంట్లో ఓపికున్నంతవరకు ఈ పనులను వదల్లేను’’ అంటూ ముగించాడు శివరాజ్.
 - నిర్మలారెడ్డి
 ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement