సులభ సుందర కవి

Tribute To K S Nisar Ahmed - Sakshi

నివాళి

జనప్రియ కవిగా పేరు మోసిన  కన్నడ కవి కె.ఎస్‌.నిసార్‌ అహమద్‌ మే 3న బెంగళూరులో తన 84వ యేట క్యాన్సర్‌తో మరణించారు. భూగర్భ శాస్త్ర ఆచార్యులుగా పనిచేసిన నిసార్‌ పద్మశ్రీ, పంప ప్రశస్తి, గౌరవ డాక్టరేట్లతో సన్మానింపబడ్డారు. వినాయక కృష్ణ గోకాక్, ఎం.గోపాలకృష్ణ అడిగ 1950 ప్రాంతంలో ప్రతిపాదించిన నవ్య కవిత్వం ఉద్యమంలో పుట్టుకొచ్చిన కవుల్లో నిసార్‌ పేర్కొనదగినవారు. ఆంగ్ల కవులైన ఇలియట్, ఆడెన్, డిలాన్‌ థామస్, ఏట్స్, స్టీఫన్‌ స్పెండర్‌ మొదలైనవాళ్ల కవిత్వానికి ప్రభావితులై కన్నడంలో స్వాంతంత్య్రం తర్వాత నెలకొన్న రాజకీయ, సాంఘిక దుస్థితులకు ప్రతిస్పందిస్తూ వచ్చిందే నవ్య కవిత్వం.

విషమ పరిస్థితుల వాస్తవిక చిత్రణ, వచన కవితా శైలి, స్వానుభవ అభివ్యక్తి, బౌద్ధికతా ప్రాధాన్యం, నూతన ప్రతీకల, పదచిత్రాల ప్రయోగం, సూటితనం, వ్యంగ్యం దీని లక్షణాలు. బి.సి.రామచంద్రశర్మ, జి.ఎస్‌.శివరుద్రప్ప, చెన్నవీరకణవి, పి.లంకేశ్, చంద్రశేఖర పాటీల్, చంద్రశేఖర కంబార, సుమతీంద్ర నాడిగ మొదలైనవాళ్లు తమతమ వ్యక్తిగత ముద్రలతో కవితలు రచిస్తే, నిసార్‌ సులభ, సుందర శైలిలో రాసి విశాల పాఠక సముదాయాన్ని సంపాదించుకున్నారు. సంప్రదాయ, నవ్య కవుల, యువకవులతో పాలలో పంచదారలా కలిసిపోయినందువల్ల నిసార్‌ కవిత్వంలో ప్రబుద్ధతతో పాటు సంవేదన కూడా సుతారంగా సంగమించింది. సమకాలీన సమవయస్కుల కవితల్లో బౌద్ధికత పైచెయ్యి కాగ, ఈయన కవితల్లో సహృదయత, సారళం, సహజత్వం త్రివేణిగా రూపొందాయి.

నిసార్‌ కవిత్వంలో అన్యాయానికీ, అక్రమానికీ ప్రతిఘటన వుంది కానీ సాత్విక రూపంలో, సంస్కారవంతమైన రీతిలో. ఆవేశం లేదు, అనుభవం వుంది, అనురాగమూ వుంది. ఆయన కవితా సంకలనం నిత్యోత్సవ 1976లో వెలువడి, 1978లో క్యాసెట్‌ రూపంలో విడుదలైంది. మధుర లలిత సంగీత గాయకుడు మైసూరు అనంతస్వామి సంగీత సారథ్యంలో వెలువడ్డ ఈ క్యాసెట్‌ కర్ణాటకలో జయభేరి మోగించింది. ‘నిత్యోత్సవం తల్లి నిత్యోత్సవం నీకు నిత్యోత్సవం’ అంటూ మొదలైన గీతం జోగ్‌ జలపాతం వెలుగు జిలుగులతో, తుంగానది హొయలతో, సహ్యాద్రి పర్వత నీలుగులతో, సతత హరిత అరణ్యాల పచ్చదనంతో ప్రకృతి కర్ణాటక మాతకు నీరాజనం పడుతున్నదని నిసార్‌ నివాళులు అర్పించారు.

నిసార్‌ కవితా వస్తువు సామాన్యమైనదిగా కనిపించినా, కవి అంతర్‌ దృష్టి ఆ కవితకు విశిష్టతను సంతరించిపెడ్తుంది. ‘రామన్‌ సత్త సుద్ది’ (సర్‌ సి.వి.రామన్‌ మరణ వార్త) తనకు గొప్ప విషయంగా తోచినా, సామాన్య ప్రజల్లో ఎలాంటి కదలిక కలిగించకపోవడం చూసి ఆశ్చర్యపోతాడు. పేరు ప్రతిష్ఠల్ని ఆశించినా, వాటి పరిమితుల్ని అర్థం చేసుకోవాలన్న బోధ కలిగిస్తుంది ఈ కవిత. ‘నిమ్మొడ నిద్దూ నిమ్మంతాగదె’(మీతో వున్నా, మీవాడు కాని) కవిత, కవి ప్రజల్లో మమైక్యమైనా దూరం చేయబడ్డ విజాతీయుని బాధను వ్యక్తం చేస్తుంది. నిసార్‌ భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లోని ఉదాత్తతను ప్రశంసించారు. లోపాల్ని సుతిమెత్తగా సూచించి బాధపడ్డారు.
-ఘట్టమరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top