గాంధీ ముస్లిం భాయ్‌.. భాయ్‌ 

Syed Nasheer Ahmad Article on Gandhi Jayanthi - Sakshi

మహాత్మాగాంధీ జీవితంలో ముస్లింల ప్ర మేయం ఎంత గాఢంగా పెనవేసుకుపోయిందో ఆయన జీవితం తరచి చూస్తే అర్థమవుతుంది. ముస్లింల సంపూర్ణ మద్దతు లేకపోయి ఉంటే వారిలోని మహా మహా నాయకులు గాంధీజీకి తోడుగా నడవకపోయి ఉంటే గాంధీజీ స్వాతంత్య్రోద్యమం అసంపూర్ణంగా ఉండేదనే చెప్పాలి.  గాంధీ–ముస్లింల జమిలీగా సాగింది.

అసలు గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లడానికి ఒక సంపన్న ముస్లిం కారణం అని చాలామందికి తెలియకపోవచ్చు. దక్షిణాఫ్రికాలోని వ్యాపారి దాదా అబ్దుల్లా తన వ్యాపార లావాదేవీలలో స్థానిక న్యాయవాదులకు సహకరించాలని ఆహ్వానించడంతో 1892లో గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్లారు. అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న వివక్షను స్వయంగా అనుభవించిన గాంధీ దాదా అబ్దుల్లా ఆయన అనుచరుల వినతితో వివక్షకు వ్యతిరేకంగా పోరాటం ఆరంభించారు. దాదా అబ్దుల్లా గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే ‘నాటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌’ ఏర్పడింది. ఆ సంస్థ తొలి అధ్యక్షులుగా దాదా అబ్దుల్లా, కార్యదర్శిగా ఎం.కె.గాంధీ వ్యవహరించారు. ‘ఆ కారణంగా ప్రజాసే వ చేయాలన్న తలంపు అక్కడే కలిగింది. అందుకు అక్కడే శక్తి చేకూరింది’ అని స్వయంగా గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారు. 21 ఏళ్ల పాటు దక్షిణాఫ్రికాలో ఉన్నపుడు దాదా అబ్దుల్లా గాంధీకి అన్నివిధాలా తోడ్పాటు అందించడంతో ‘దాదా అబ్దుల్లా ఆయనకు తండ్రిలా తోడ్పడ్డారు’ అని చరిత్రకారులు అన్నారు.

1915లో గాంధీ భారత్‌ వచ్చేటప్పుడు అక్కడి గుర్రాల వ్యాపారి, సంపన్నుడైన అబ్దుల్‌ ఖాదిర్‌ కూడా ఆయనతో పాటు తన కుటుంబంతో వచ్చారు. సంపన్న జీవి తాన్ని వదిలి గాంధీతో పాటుగా ఆశ్రమ జీవితం గడిపారు. సబర్మతీ ఆశ్రమంలో ముద్రణాలయం బాధ్యతలను నిర్వహిం చారు. గాంధీ ఈయన ను ‘ఇమాం సాబ్‌’ అని పిలిచే వారు. ఖాదిర్‌ కు మార్తె అమనా ఖురేషి పెళ్లికి మహాత్మాగాంధీ వధు వు బాబాయిగా తన పేరుతో ఆహ్వానపత్రాలను వేయించి, సబర్మతీ ఆశ్రమంలో దగ్గరుండి పెళ్లి జరిపించారు.

మహాత్ముడు బిహార్‌ రాష్ట్రం చంపారన్‌కు రాకముందే ఈ పోరాటానికి పునాదులను నిర్మించిన రైతు నాయకులు షేక్‌ గులాబ్, పాత్రికేయుడు పీర్‌ ముహమ్మద్‌ మూనీస్‌ గాం ధీ వెంట నడిచారు. నీలిమందు కర్మాగారా ల ఆంగ్లేయ యజమానులు గాంధీ కార్యక్రమాలకు అంతరాయం కల్పించేందుకు ప్ర యత్నించడమే కాకుండా ఆయనను అం తం చేయాలని సంకల్పించారు. దీన్ని బట్ట బయలు చేసి గాం«ధీ ప్రాణాలను బతఖ్‌ మియా అన్సారి అనే సాహసి కాపాడారు. ఈ విషయాన్ని భారత ప్రథమ రాష్ట్రపతి డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ 1950లో బహిర్గతం చేయడమే కాకుండా అన్సారికి భూమిని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఈనాటినీ ఆ ఆదేశాలు అమ లుకు నోచుకోకపోవడం ఒక విషాదం.  

గాంధీ రాజకీయ రంగప్రవేశం చేశాక జాతీయ స్థాయిలో పూనిన అతి పెద్ద ఉద్య మం ఖిలాఫత్‌ – సహాయ నిరాకరణ ఉద్య మం. ఇందులో ఆయనకు అలీ సోదరులు గా ఖ్యాతిగాంచిన మౌలానా మహమ్మద్‌ అలీ జౌహార్, మౌలానా షౌకత్‌ అలీ అండదండలు అం దించారు. అలీ సోదరుల తల్లి అబాది బానో 70 ఏళ్ల వయసులో ఉద్య మ నిధులను సేకరిస్తున్న తీరు, జాతీయోద్యమంలోకి మహిళలను, పురుషులను ఆహ్వానిస్తూ చేస్తున్న ప్రసంగాలు గమనించిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆమెను ప్రమాదకర మహిళగా ప్రకటించింది. గాంధీతో పాటు ఇతర జాతీయోద్యమకారులంతా ‘అమ్మాజాన్‌’, ‘బీబీ అమ్మా’ అంటూ ఆమె ను గౌరవించే వారు. ఈ యోధురాలి కార్యదక్షతను, కార్యశీలతను మహాత్ముడు తన యంగ్‌ ఇండియాలో ప్రత్యేకంగా ఉటంకించారు. అలాగే జాతీయోద్యమం కోసం ఎంతో ఖ ర్చు చేసిన డాక్టర్‌ ముఖ్తార్‌ అహ్మద్‌అన్సారి, షంషున్నీసా అన్సారి దంపతులపై గాంధీ ఎంతో వాత్సల్యం చూపారు. 

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ‘సరిహద్దు గాంధీ’గా విఖ్యాతుడైన ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ 1928లో తొలిసారి గాంధీని చూశారు. ఆయుధం ఆభరణంగా కలిగివుంటూ, మిత్రునికి ప్రాణమివ్వడానికి, శత్రువు ప్రాణం తీయడానికి ఏమాత్రం సంకోచించని పఠాన్‌ జాతి నాయకుడైన గఫార్‌ఖాన్‌ మహాత్ముడి అహింసా సిద్ధాంతం పట్ల ఆకర్షితులయ్యారు. మహాత్ముడి కార్యాచరణను య«థాత«థంగా అమలుపర్చుతూ ‘ఖుదా–యే–ఖిద్మత్‌గార్‌’(భగవత్సేవకులు) సంస్థను 1929లో స్థాపించాడు. భారత జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొనడం, భారత విభజనను అంగీకరించకపోవడంతో ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌ 30 ఏళ్ల పాటు జైలు జీవితం, ప్రవాస జీవితం గడపాల్సి వచ్చినా గాంధీ బాటను వీడక సంపూర్ణ గాంధేయవాదిగా జీవితాన్ని గడిపారు. 

గాంధీజీకి పూర్తి తోడుగా నిలిచిన మరో మహనీయుడు జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీ. భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రారంభించకముందే ‘గుజరాత్‌ రాజ కీ య పరిషత్‌’ ద్వారా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న తయ్యాబ్జీ మహాత్మాగాంధీ ప్రేరణతో 1919లో అన్ని విలాసాలకు స్వస్తిపలికి స్వదేశీ ఉద్యమంలో పూర్తి భాగస్వామి అయ్యారు. ఎనభై సంవత్సరాల వయసులో ఖద్దరును ప్రోత్సహించేందుకుగాను ఎద్దులబండిలో ‘విముక్తి వస్త్రాన్ని’ విక్రయిస్తూ గుజరాత్‌లోని గ్రామాల్లో తిరిగారు. 1930లో 12 మార్చి నుంచి ఏప్రిల్‌ 6 వరకు సాగిన దండియాత్ర సందర్భంగా బ్రిటిష్‌ ప్రభుత్వం గాంధీజీని అరెస్టు చేసినపుడు ఆయన స్థానంలో యాత్రకు నాయకత్వం వహించిన వ్యక్తి అబ్బాస్‌. ఈయన గాంధీజీచే ‘గుజారాత్‌ వజ్రం’గా ప్రశంసలందుకున్నారు.

గాంధీ దంపతుల పుత్రిక బీబీ అమతుస్సలాం మహత్ముని అహింసా సిద్ధాంతం, కార్యచరణకు ఆకర్షితురాలై 1931లో అతి ప్రయాసతో సేవాగ్రాం చేరారు. గాంధీ పర్యటనల్లో ఆమే ఆయన వెంటుంటూ సేవలందించారు. గాంధీజీ జిన్నాకు లేఖ రాస్తున్న సందర్భంగా ఆయనను ఏ విధంగా సంబోధించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతుం డగా, అమతుస్సలాం ‘ఖాయిదే ఆజం’అయితే బాగుంటుందని సూచించారు. ఆ విధంగా గాంధీజీ జిన్నాను సంబోదించడంతో ‘ఖాయిదే ఆజం’ పేరుతో జిన్నా పేరొందారు. 

గాంధీకి సన్నిహితంగా మెలిగిన వారిలో అగ్రగణ్యుడు  అబుల్‌ కలాం ఆజాద్‌. 1920 జనవరిలో తొలిసారి గాంధీని కలుసుకున్న ఆజాద్‌ అప్పటి వరకు తాను అవలంబిస్తున్న విప్లవబాటను వీడి అహింసా మార్గాన ఖిలాఫత్‌–సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. భారత విభజనను, వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించారు. మహాత్ముని సహచరులుగా, అనుచరులుగా పురుషులతోపాటుగా చాలామంది ముస్లిం మహిళలు జాతీయోద్యమంలో పాల్గొన్నారు. మహత్ముని ఆదేశాలతో గుజరాత్‌లో గాంధేయ మార్గంలో సాగిన అన్ని పోరాట రూపాలకు సారథ్యం వహించిన మహిళ అమీనా తయాబ్జీ. గాంధీజీకి ఉర్దూ భాష నేర్పి ఆయనచే ‘వస్తాద్‌ బీ’అని అనిపించుకున్న మహిళ రెహనా తయాబ్జీ. అసాధారణ దేశభక్తికి అపూర్వ చిహ్నంగా పేర్కొనబడిన సకీనా లుక్మాని పెద్ద వయసులోనూ గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ మహాత్ముని ఆదేశాలను తు.చ తప్పకుండా పాటించారు. 

స్వాతంత్య్రోద్యమంలో ముస్లింల త్యాగాలు గాంధీజీకి సంపూర్ణంగా తెలుసు. హిందూ ముస్లింలు కలిసి ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని ఆయన ఎంతగానో భావించారు. 
– సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ ముస్లిం స్వాతంత్య్ర సమరయోధుల పరిశోధకుడు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top