మొక్కై వంగని స్త్రీ జీవితం | Sakshi
Sakshi News home page

మొక్కై వంగని స్త్రీ జీవితం

Published Mon, Feb 25 2019 12:12 AM

Story On The Vegetarian By Han Kang - Sakshi

‘ద వెజెటేరియన్‌’ నవల్లో, యొంగ్‌ హై– తనంటే పెద్ద గౌరవం లేని, ఉదాసీనుడైన భర్త ఛోమ్‌తో ఉంటుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ నగర నేపథ్యంతో ఉన్న యీ నవల, యొంగ్‌ చుట్టూ తిరిగే ముగ్గురి కథనాలతో సాగుతుంది. ఛోమ్, అక్క–ఇన్‌ హై భర్తయిన ‘ఆర్టిస్ట్‌’, ఆఖరిగా ఇన్‌. ఇటాలిక్సులో ఉండే యొంగ్‌ ఆలోచనలు తప్ప ఆమె గొంతు వినపడదు.

ఛోమ్‌తో కలిసి సామాన్యమైన జీవితం గడుపుతున్న యొంగ్‌కు పశువధ గురించిన పీడకలలు రావడం మొదలయినప్పుడు, శాకాహారిగా మారి తను ‘మొక్క’ని అన్న భావం ఏర్పరచుకుంటుంది. తనకి ఆహారం అవసరం లేదనుకుంటుంది. ఇంట్లో ఉన్న మాంసాహారాన్ని పారేస్తుంది.

భార్య మానసిక స్థితి ఛోమ్‌కు తన సహోద్యోగుల ముందు ఇబ్బందికరంగా మారుతుంది. యొంగ్‌ తండ్రి ఛాందసుడు. సంగతి విని, భోజనాల బల్ల వద్ద కూతురి నోట్లో బలవంతంగా పంది మాంసాన్ని కుక్కుతాడు. యొంగ్‌ తిరుగుబాటుతనంతో, తన్ని తాను పొడుచుకుంటుంది. తండ్రి అందరిముందూ ఆమెను కొడతాడు. ఆ చర్య ఇన్‌ను కఠినపరుస్తుంది. యొంగ్‌ను శక్తి్తహీనం చేస్తుంది. ‘తను యీ లోకంలో ఎప్పుడూ జీవించనేలేదన్న అనుభూతి ఆమెను ఆశ్చర్యపరుస్తుంది. అది నిజం కూడా. తనకి గుర్తున్నంతవరకూ, చిన్నపిల్లగా కూడా ఆమె భరించడం తప్ప చేసినదేదీ లేదు.’

‘యొంగ్‌ నాకన్నా నాలుగేళ్ళు చిన్నది. పోటీ పడేంత వయోభేదం లేదు. మేము పిల్లలముగా ఉన్నప్పుడు మా లేత చెంపలు నాన్న భారీ చేతులకి గురయ్యేవి. తనే నాన్న దెబ్బలని ఎక్కువ భరించింది. అణుకువగా, అమాయకంగా ఉంటూ– నాన్న కోపాన్ని మళ్ళించలేక, ప్రతిఘటించలేక– బాధనంతా తనలోనే దాచుకుందని ఇంత కాలం తరువాతే అర్థం చేసుకోగలిగాను’ అంటుంది ఇన్‌. 

ఛోమ్‌ విడాకుల ప్రక్రియ ప్రారంభిస్తాడు. యొంగ్‌ ఇల్లు వదులుతుంది. క్రమేపీ, మానసిక అనారోగ్యపు అంచులను చేరుకుంటుంది. పోషణ లేక క్షీణిస్తున్న శరీరంతో, అక్కను అడుగుతుంది: ‘చనిపోవడం అంత చెడ్డదా?’ రచయిత్రి హేన్‌ కాంగ్‌ యీ ప్రశ్నకి పుస్తకమంతటా ఏ సమాధానం అందించరు. మామగారి చర్య వల్ల ధైర్యం పొందినది వీడియోగ్రాఫర్‌గా ఎదగలేకపోయిన ‘ఆర్టిస్ట్‌’. యొంగ్‌ ఇంటికి వచ్చి, ఆమె శరీరం మీద పువ్వులు గీస్తాడు. తను మొక్కననుకున్న యొంగ్, అతనితో పడుకోడానికి ఒప్పుకుంటుంది. ఇంతలో ఇన్‌ రావడం ఘర్షణకి దారి తీస్తుంది. ఆమె చెల్లెల్ని మానసిక చికిత్సాలయానికి తీసుకెళ్తుంది. యొంగ్, అక్కడ అడపా తడపా నెలల తరబడి ఉంటుంది. ఇన్‌ భర్తను వదిలేస్తుంది. ఇక్కడి నుండి వినిపించే ఇన్‌ కథనం, మానసిక ఆరోగ్యానికుండే నిర్వచనం మీద కేంద్రీకరిస్తుంది. 

‘చెల్లి నాకు గుర్తు చేస్తున్న సంగతులతో ఇంక పోటీ పడలేను. నేను దాటలేకపోయిన ఎల్లలను తనొక్కతే దాటేయడాన్ని క్షమించలేను.సామాజిక నియమాలకి ఖైదీగా ఉన్న నన్ను వెనక్కి నెట్టేసింది. ఇంతటి అద్భుతమైన బాధ్యతా రాహిత్యాన్ని క్షమించలేకపోతున్నాను. ఆ కడ్డీలను తను పగలగొట్టకముందు, అవి ఉండేవని కూడా యొంగ్‌కు తెలియదు’ అంటుంది ఇన్‌. ఇద్దరూ కలిసి అంబులెన్సులో వెళ్తూ– ఎదురవుతున్న చెట్ల నుంచి సహకారం, సత్యం కోసం చూస్తుండగా కథ ముగుస్తుంది. 

వాంఛకీ, నిర్లిప్తతకీ– తీరిన/తీరని కోరికల మధ్యనుండే సంఘర్షణలని పుస్తకం పలుమార్లు కనపరుస్తుంది. యొంగ్‌  మారుతున్నప్పుడల్లా, భాషా మారుతుంటుంది. తిరుగుబాటు, నిషేధం, దౌర్జన్యం, కామోద్రేకం గురించిన వివరాలతో ఉండి, కలవరపెట్టే తన పుస్తకం, ఆధునిక దక్షిణ కొరియాకి దృష్టాంతం అని రచయిత్రే చెప్తారు. డెబ్రా స్మిత్‌ ఇంగ్లిష్‌లోకి అనువదించిన యీ నవలను హోగార్థ్‌ ప్రెస్‌ ప్రచురించింది. నవల 2016లో ‘మ్యాన్‌ బుకర్‌ ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌’ గెలుచుకుంది. 
-కృష్ణ వేణి
 

Advertisement
Advertisement