బంగ్లాదేశ్‌ అమ్మాయిని అమెరికా అబ్బాయి పెళ్లాడితే?

Story On Nell Freudenberger The Newlyweds - Sakshi

కొత్త బంగారం

జార్జ్‌ 34 ఏళ్ళ అమెరికన్‌ ఇంజినీర్‌. అమీనా మజీద్‌ 24 యేళ్ళ బంగ్లాదేశ్‌ నివాసి. ఇద్దరి పరిచయం ఏషియన్‌ యూరో డాట్‌కామ్‌లో అవుతుంది. అమీనా తన కుటుంబపు ఇరుకు పరిస్థితులను తప్పించుకోవాలనుకుంటుంది. ఇక జార్జ్‌ అభిమతం, ‘నాకు తెలిసిన ఇతర స్త్రీలలా కాక, ఆటలాడని యువతితో నిలకడైన ఇల్లు, కుటుంబం కావాలి’.

సంవత్సరం తరువాత జార్జ్‌ ఆమె దేశానికి వెళ్ళి, పెళ్ళి చేసుకొమ్మని అడిగి, తనుండే రోఛెస్టర్‌కు తీసుకు వస్తాడు. ‘ద న్యూలీవెడ్స్‌’ నవల ప్రారంభం అయేటప్పటికి, అమీనా ఢాకా వదిలి ఆరు నెలలవుతుంది.

వారి వివాహం గొప్ప ప్రేమతో కూడుకున్నది కానప్పటికీ సహవాస యోగ్యమైనదే. అమీనా ఆలోచనలు అర్థం కావు కానీ ఆమె పట్ల స్నేహం, గౌరవం ఉంటాయి జార్జ్‌కు. ఇద్దరూ పరస్పర ప్రయోజనకరమైన వివాహబంధాన్ని ఏర్పరచుకుంటారు. 

అమీనా చిన్న ఉద్యోగం చేసుకుంటూ, టీచర్స్‌ కోర్స్‌ చేయడం మొదలెడుతుంది. అత్తగారి కుటుంబం పాతకాలపుదైనా, కోడలి బంగ్లాదేశ్‌ సంస్కృతి వాళ్ళని ఆకర్షిస్తుంది. అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ గ్రీన్‌ కార్డు తెచ్చుకుని, తల్లిదండ్రులని అమెరికా తెచ్చేవరకూ పిల్లలు వద్దనుకుంటుంది అమీనా. అమెరికన్‌ భార్యగా– డిష్‌ వాషర్లూ, వాషింగ్‌ మెషీన్లూ ఉపయోగిస్తూ అక్కడి సంస్కృతి, వాతావరణాలకు అలవాటు పడుతూ, ‘గతకాలపు అమీనా, ప్రస్తుతపు అమీనా ఒకరినొకరు గుర్తించలేనంత దూరం అయిపోతారేమో’ అని మథనపడుతుంటుంది.

‘నేనిక్కడ ఉన్నాను కాబట్టి నా తల్లిదండ్రులూ ఇక్కడికే రావాలి’ అని భర్త మీద ఒత్తిడి   పెట్టినప్పుడు, అత్తమామలతో కలిసి ఉండటం అన్న భావమే జార్జిని ఇబ్బంది పెడుతుంది. గతంలో దత్తత తీసుకున్న తన కజిన్‌ పట్ల జార్జికి ఉండే బలహీనతను అతడు నిరాకరించడాన్ని ఆధారంగా చేసుకుని, అమీనా నవ్వుతూనే ‘బయటకి చెప్తే తప్ప అబద్ధం, అబద్ధం అవదన్నది నీ ఆలోచన’ అని దెప్పి పొడిచి, జార్జిని ఒప్పిస్తుంది.

తల్లిదండ్రులని తీసుకు వచ్చేటందుకు వెళ్ళినప్పుడు– బంధువులతో జగడాలు, వీసాకి అడ్డుపడే ప్రభుత్వాధికారులు, అదుపులో ఉండని భావోద్వేగాలు– అన్నీ కలిసినప్పుడు అదొక పీడకల అవుతుంది. ఆఖరికి మూడేళ్ళ తరువాత, అమీనా తన అమ్మానాన్నని విమానంలో కూర్చోబెట్టగలుగుతుంది.

నవల– పెళ్ళి చేసుకోవడం, ఆ పెళ్ళిని నిలుపుకోవడం అనే నిజ జీవితపు చిక్కుల, సంశయాల, సంతోషాల గురించిన కథ. వచనం సాఫీగా ఉంటుంది. అమీనా గురించిన వర్ణనల్లో పడికట్టుపదాలేవీ ఉండవు. దంపతుల మధ్య తలెత్తే అపార్థాలు, తిరిగి వాళ్ళని కలిపే సంఘటనలు వరసగా వచ్చే అధ్యాయాల్లో కనబడతాయి. తన దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అమెరికాలో ఉన్న అమీనా అనుభూతులనూ, సంకోచాన్నీ, ఆమెకు కనిపించే సాంస్కృతిక తేడాలనూ, వచ్చిన మార్పులనూ పరిహాసంగా వర్ణిస్తారు రచయిత్రి నెల్‌ ఫ్రాయ్డెన్‌బెర్గర్‌. పాత్రలు యధార్థంగా, సజీవంగా అనిపిస్తాయి. 

దంపతులిద్దరూ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటూ, కలిసి ఉండే ప్రయత్నాలు చేస్తారో కనిపిస్తుంది. నవల్లో అధికభాగం అమీనా దృష్టికోణంతో ఉన్నదే. ‘కొత్త దేశంలో నిస్సహాయురాలిగా ఉన్న యువతి కాదు అమీనా. ఆమె ఆటలాడుతున్న చిన్నపిల్ల కాదు. తన నిర్ణయంపైన ఆధారపడే తన కుటుంబ భవిష్యత్తు గురించి చక్కగా తెలిసిన యువతి’ అంటారు రచయిత్రి. 

వీసా, గ్రీన్‌ కార్డ్, ఉద్యోగం, సిటిజెన్‌షిప్‌ కోసం ఎదురు చూడ్డం, అధికారిక జాప్యాలతో సాగే అధ్యాయాలు సామాన్యంగా అయితే పాఠకులని ఆకర్షించవేమోగానీ రచయిత శైలి వల్ల నాటకీయంగా అనిపిస్తాయి. చదవడానికి తేలికైనదిగా కనిపించే నవల్లో చతురత కనిపిస్తుంది.
-కృష్ణ వేణి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top