శ్రావణ మాసం సకల శుభాలకు ఆవాసం...

Sravanamasam Is Good Season For Ceremonies - Sakshi

శ్రావణమాసం... ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపించే మాసం. నెల రోజులపాటు ఉదయం, సాయంత్రం భగవన్నామస్మరణతో మారు మోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందని పండిత ఉవాచ. అంతేకాదు... ఈ నెలలో ఎన్నో పండుగలు, పర్వదినాలు. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు మహావిష్ణువుకు, ఆయన దేవేరి మహాలక్ష్మికి; లయకారుడైన పరమేశ్వరుడికి, ఆయన సతీమణి మంగళ గౌరీదేవికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రవణం పేరుతో ఏర్పడిన మాసం కావడం వల్ల ఈ మాసం లక్ష్మీవిష్ణుల పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవకార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణ మాసం అంటే శుభమాసం. దీనిని నభో మాసం అని కూడా అంటారు. నభో అంటే ఆకాశం అని అర్థం. ఈ నెలలో వచ్చే సోమవారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, శనివారాలు ఎంతో పవిత్రమైనవి. ఈ మాసంలోని ప్రతి శుక్రవారం మహిళలు మహాలక్ష్మిలా అలంకరించుకుని తమకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని సముద్ర తనయకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం పాలసముద్ర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడిగా లోకాన్ని ఉద్ధరించాడు.

ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవతను పూజిస్తారు. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. వీటితోపాటు గరుడ పంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, రుషి పంచమి, గోవత్స బహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య లాంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.

శ్రావణం చంద్రుడి మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణంగా మనస్సు మీద ప్రభావం చూపే మాసం. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించి, మంచి కలిగించడానికి, మనస్సు మీద మంచి ప్రభావం ప్రసరించి పరమార్ధం వైపు మళ్లించి మానసిక ప్రశాంతత పొందడానికి, ప్రకృతి వల్ల కలిగే అస్తవ్యస్త అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి, మంచి ఆరోగ్యాన్ని పొందడమే శ్రావణ మాసంలో వచ్చే పండుగలలోని ఆచారాల ముఖ్యోద్దేశం. సకలదేవతలకు ప్రీతికరమైనది శ్రావణమాసం. ప్రతిరోజూ పండుగలా ఆడపడుచులు సంతోషంగా ఉండే మాసం. ఈ మాసంలో రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే దీర ్ఘసుమంగళీయోగం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని విశ్వాసం. తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం ఇదే.  

శివారాధనకు ఎంతో శ్రేష్ఠమైనది
ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని ఇస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రివేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని శాస్త్ర వచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యర్థం ఉపవాసం ఉండ గలిగినవారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ మాసం దీనిని ఒక వ్రతంగా పెట్టుకుని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభఫలితాలు కలుగుతాయి.

మంగళ కరమైన మంగళ గౌరీ వ్రతం
శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయని వ్రత కథ చెబుతోంది. 

ఐశ్వర్య ప్రదమైన వరలక్ష్మీ వ్రతం
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభి వృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ చేతికి తోరం కట్టుకోవాలి. అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశ్వీరాదాలు తీసుకోవాలి. 

  • ఈ మాసంలో వచ్చే సోమవారం నాడు ఆవుపాలు, పెరుగు, చక్కెర, నెయ్యి, తేనె లాంటి పంచామృతాలతో శివుడికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, కలువ, తుమ్మి లాంటి ఇష్టమైన పుష్పాలతో ఈశ్వరారాధన చేస్తారు. 
  • శ్రావణమాసం మొదలైన నాలుగో రోజునే వచ్చే పండుగ నాగపంచమి. శివుడి ఆభరణమైన నాగేంద్రుడిని పూజించడం ఆచారం. పాలు, మిరియాలు, పూలతో నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి, చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తారు. 
  • సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో శ్రావణ శుక్ల ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు చేసి, ఉపవాసం ఉంటే మంచి సంతానం కలుగుతుంది. అందుకే దీన్ని పుత్రద ఏకాదశి అన్నారు. 

శుక్ల పక్ష పౌర్ణమి
శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధన పర్వదినం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ, వేదవిద్యారంభమూ చేస్తారు.  కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి పర్వదినాలు, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచ తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top