‘‘సర్‌.. నన్ను అరెస్ట్‌ చెయ్యండి’’

Special Story on Marital Molestation - Sakshi

భార్యాభర్తల గొడవల్లో ఎవరూ తలదూర్చరు! ఒక విషయంలోనైతే.. చట్టం కూడా జోక్యం చేసుకోదు. ఆ విషయమే.. ‘మ్యారిటల్‌ రేప్‌’! ఏది అత్యాచారమో చట్టం స్పష్టంగా నిర్వచించింది. కానీ ఏ నిర్వచనంలోనూ.. భార్య సమ్మతి లేకుండా భర్త ఆమెను లోబరుచుకోవడం అత్యాచారం అని చెప్పలేదు! దీనిపై ‘రిట్‌’ (యదార్థం) అనే సంస్థ ఒక ఉద్యమం ప్రారంభించింది. మ్యారిటల్‌ రేప్‌ను శిక్ష వేయవలసిన నేరంగా గుర్తించాలని కోరుతోంది.

క్యాబ్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆగింది. క్యాబ్‌లోంచి దిగాడు అతను. దిగే ముందు కొన్ని క్షణాలు క్యాబ్‌లోనే ఆలోచిస్తున్నట్లుగా కూర్చుని, ఆ తర్వాత దిగాడు. వయసు ముప్పై, ముప్పై ఐదు మధ్య ఉంటుంది. గళ్ల చొక్కా. నెరిసిన గడ్డం, కళ్లద్దాలు. ఎత్తుగా, బలంగా ఉన్నాడు. కానీ మనిషి నలిగినట్లుగా ఉన్నాడు. ముఖంలో బాధ. వడివడిగా స్టేషన్‌లోకి నడిచాడు. కంప్లయింట్‌ డెస్క్‌ దగ్గర ఆగాడు.
‘‘సర్, నేను ఫిర్యాదు ఇవ్వాలి’’.

డెస్క్‌ మీద ఇద్దరు పోలీసు సిబ్బంది ఉన్నారు. ఫిర్యాదులు తీసుకునే స్టాఫ్‌ వాళ్లు. వాళ్లలో ఒకతను అతడి వైపు తలెత్తి చూశాడు. ఆ వచ్చినతను మళ్లీ చెప్పాడు. ‘‘సర్, నేను కంప్లయింట్‌ ఇవ్వాలి’’.
‘‘నేరం ఏమిటి?’’   ‘‘రేప్, సర్‌’’ ‘రేపా!! నాతో రా’’.. పైకి లేచాడు ఆ పోలీస్‌ క్లర్క్‌. ఇద్దరూ లోపల ఇంకో గదిలోకి వెళ్లారు. ‘‘చెప్పండి.. బాధితురాలు ఎవరు?’’.. కంప్లయింట్‌ రాయబోతూ అడిగాడు పోలీస్‌ క్లర్క్‌.
‘‘నా భార్య సర్‌. ఆమెపై అత్యాచారం జరిగింది’’

‘‘ఆమెను రేప్‌ చేసిన వారెవరో మీకు తెలుసా?’’
‘‘తెలుసు సర్‌’’

‘‘ఎవరు?’’
‘‘నేనే సర్‌. నేనే నా భార్యను రేప్‌ చేశాను. ప్లీజ్‌ నన్ను అరెస్ట్‌ చెయ్యండి సర్‌’’ అన్నాడు అతను! అతడి కళ్లలో నీళ్లు.

పోలీస్‌ క్లర్క్‌ కళ్లలో క్వొశ్చన్‌ మార్క్‌! భార్యను రేప్‌ చేయడం ఏంటి? రేప్‌ చేసినందుకు భర్తను అరెస్ట్‌ చెయ్యడం ఏంటి? ‘‘నీకేమైనా మతిపోయిందా? తాగొచ్చావా?
‘‘సర్, నేను తప్పు చేశాను. రాత్రి తనకస్సలు బాగోలేదు. కానీ నేను తనను బలవంత పెట్టాను. తను వద్దంటున్నా వినకుండా..’’ ఆగాడతను.

‘‘నువ్వామెను కొట్టావా?’’
‘‘లేదు సర్‌’’
పోలీస్‌ క్లర్క్‌ ఇంటర్‌కమ్‌లో తన పై అధికారికి చెప్పాడు.. ‘‘సర్, ఇక్కడ ఒకతను భార్యను రేప్‌ చేశానని, తనను అరెస్ట్‌ చెయ్యమని కంప్లయింట్‌ ఇవ్వడానికి వచ్చాడు’’ అని చెప్పాడు.
‘‘లోపలికి పంపించు’’ అన్నాడు పోలీస్‌ ఆఫీసర్‌.

లోపలికి వెళ్లాడతను. అక్కడా అదే మాట. ‘‘సర్‌.. నన్ను అరెస్ట్‌ చెయ్యండి’’ ‘‘ముందు మీరు కూర్చోండి’’ అన్నాడు పోలీస్‌ ఆఫీసర్‌. కూర్చున్నాడు అతను. ‘‘ముందొక మాట చెప్పండి. మీ భార్యకు 18 ఏళ్లు నిండాయా?’’ ‘‘నిండాయి సర్‌. ఆమె వయసు 24’’ ‘‘నిన్న రాత్రి ఆమెపై మీరు చెయ్యి చేసుకున్నారా?’’ ‘‘లేదు సర్‌’’ ‘‘మీరు చెబుతున్న దానిని బట్టి మీరు మీ భార్య పట్ల ఏ విధంగానూ అనుచితంగా ప్రవర్తించలేదు. రేప్‌ చేశానని మాత్రం అంటున్నారు.’’

‘‘అవును సర్‌’’
‘‘కానీ చట్టప్రకారం భార్యను రేప్‌ చేయడం రేప్‌ అవదు. కనుక అది నేరం అవదు’’ అన్నాడు పోలీస్‌ ఆఫీసర్‌. ‘‘కనుక కంప్లయింట్‌ తీసుకోలేము’’ అని కూడా చెప్పాడు. ‘‘ఇది మీకు, మీ భార్యకు మధ్య పూర్తి వ్యక్తిగతమైన విషయం. మీరూ మీరూ పరిష్కరించుకోవలసిన సంగతి’’ అన్నాడు.

‘‘ఒకే సర్‌’’ అన్నాడు అతను.
‘‘మీరిక వెళ్లొచ్చు’’ అన్నాడు పోలీస్‌ ఆఫీసర్‌. అక్కడి నుంచి అతడు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ మాధుర్‌ వర్మ దగ్గరకు వెళ్లాడు. ‘‘మ్యారిటల్‌ రేప్‌.. రేప్‌ కాదు’’ అన్నారు ఆయన. అక్కడి నుంచి అతను లాయర్‌ విక్రమ్‌ శ్రీవాత్సవ దగ్గరికి వెళ్లారు. ‘‘చట్టంలో మ్యారిటల్‌ రేప్‌ అనే మాట లేదు. భార్య సమ్మతి లేకున్నా ఆమె నుంచి లైంగిక సుఖాన్ని పొందడం నేరం కాదు’’ అన్నారు ఆయన.
ఇక అక్కడి నుంచి అతడు ఎక్కడికీ వెళ్లలేదు. బయటికి వచ్చి చేతుల్లో ముఖం దాచుకుని పెద్దగా ఏడ్చాడు. ఢిల్లీ అంతటికీ, దేశం అంతటికీ వినిపించేలా.. ‘మ్యారిటల్‌ రేప్‌కి శిక్ష వేసే చట్టాన్ని తీసుకురండి’ అని పెద్దగా అరచి చెప్పాలనిపించింది అతడికి.

చట్టం తేవడం తేలికా? మగవాళ్లలో మార్పు తేవడం తేలికా? కళ్లు తుడుచుకుంటూ ఆలోచిస్తున్నాడతడు. అతడి పేరు సమీర్‌. జర్నలిస్టు. సోషల్‌ యాక్టివిస్టు కూడా.
అతడిలా పోలీస్‌ స్టేషన్‌ గడప, పోలీస్‌ కమిషనర్‌ గడప, లాయర్‌ గడప ఎక్కి దిగడానికి మూడు రోజుల ముందు...

సమీర్‌ ఆమె వైపు చూశాడు. ‘‘మ్యారిటల్‌ రేప్‌ మీద ఒక చట్టాన్ని తేవలసిన అవసరం ఉందని ప్రభుత్వానికి, ప్రజలకు చెప్పేందుకు కొంతమంది బాధితురాళ్ల ఇంటర్వ్యూలు చేస్తున్నాను. వాటితో ఒక వీడియోను తయారు చేసి.. ముందు సోషల్‌ మీడియాలోకి పంపుతాం. తర్వాత న్యాయస్థానం దృష్టికి. తర్వాత ప్రభుత్వం దృష్టికి. భార్య అంగీకారం లేకుండా ఆమె నుంచి బలవంతంగా లైంగిక తృప్తిని పొందడం నేరం అనే చట్టం రావాలి. మన దేశంలో ఇంతవరకు అలాంటి చట్టం లేదు’’ అన్నాడు.

‘‘అవును. చట్టం రావాలి. వస్తే బాగుంటుంది’’ అంది ఆమె.
‘‘ఒక బాధితురాలిగా మీరేం చెప్పదలచుకున్నారో చెప్పండి. వీడియోలో మిమ్మల్ని చూపించం. మీ మాట మాత్రమే వినిపిస్తుంది’’ నమ్మకం ఇచ్చాడు సమీర్‌. ఆమె చెప్పడం మొదలు పెట్టింది.

‘‘మాకు పెళ్లయి ఆరేళ్లయింది. అతను చదువుకున్న వాడే. అన్నీ అర్థం చేసుకోగలిగిన వాడే. ఇది ఎందుకు అర్థం కాదో నాకు తెలియదు. ఒంట్లో బాగోలేనప్పుడు బలవంతం చేస్తాడు. అప్పుడెలాగో భరిస్తాను. మనసు సిద్ధంగా లేనప్పుడు కూడా ముందుకొస్తాడు. అది భరించలేకపోతాను. ఈ విషయం మీద చాలాసార్లు మా మధ్య మనస్పర్థలు వచ్చాయి. మాట్లాడుకోని రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా ‘నీ మాటల్తో నాకు పనేముంది’ అన్నట్లుగా మీద పడేవాడు. ప్రతిఘటిస్తే అనరాని మాటలు అనేవాడు. చివరికి లోబరుచుకునేవాడు. ‘‘ఛీ.. భార్యను బతిమాలుకునే ఖర్మ పట్టింది’’ అని లేచి వెళ్లిపోయేవాడు. ఇదంతా కాదు.. ‘‘బాగో లేదు’’ అని చెప్పినప్పుడు.. కనీసం ‘‘ఏం బాగో లేదు’’ అని కూడా అడిగేవాడు కాదు. అది నన్ను ఇంకా బాధించేది. ఇప్పటికీ అంతే. ప్రతి రోజూ నాకీ నరకం ఉండాల్సిందే. భార్య విన్నపాన్ని మన్నించని వ్యక్తి భర్త ఎలా అవుతాడు!’’ అందావిడ. ఆమెతో పాటు మరికొంత మందిని.. ఢిల్లీలోని వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరు నేపథ్యాల బాధిత మహిళల్తో మాట్లాడాడు సమీర్‌.

బాధితురాలు 1
‘‘ఇష్టం లేనప్పుడు బలవంతపెట్టడం అన్యాయం అనిపిస్తుంది. నేనేం బొమ్మను కాదు కదా. కానీ బొమ్మలా పడి ఉండాల్సిందే. భర్త భరించేవాడు కాకపోయినా పర్వాలేదు, భార్య ‘ఇప్పుడు కాదు’ అన్నప్పుడు అర్థం చేసుకునేవాడై ఉండాలి’’

బాధితురాలు 2
‘‘భార్యనైనా, ఇంకెవర్నైనా ఫోర్స్‌ చెయ్యడం కరెక్ట్‌ కాదు. భర్త ఆకలి అవుతోంది అంటే.. ‘ఇదిగో చేసిపెట్టాను. ఆ డబ్బాలో ఉన్నాయి తిను’ అని భార్య అనడం లాంటిది కాదిది. భార్యాభర్తల్లో ఒకరికి ఉత్సాహంగా ఉండి, ఇంకొకరికి ఉత్సాహం లేనప్పుడు.. ఉత్సాహం లేని వాళ్ల అభిప్రాయానికే రెస్పెక్ట్‌ ఇవ్వాలి. నా భర్తకు ఇది అర్థం కాదు. ‘అదంతా నాకు తెలీదు’ అనేస్తాడు. అప్పుడు.. ఇదేం నరకమని పారిపోవాలనిపిస్తుంది’’.

బాధితురాలు 3
‘‘అతను నా భర్త మాత్రమే. నా పై హక్కుదారు కాదు. కానీ హక్కుదారులా ప్రవర్తిస్తాడు. ఎంత హక్కుదారుకైనా కొన్ని హక్కులు ఉండవు. భార్యాభర్తలుగా మేమిద్దరం ఒకటే కావచ్చు. దేహాలుగా మాత్రం ఇద్దరం. ఒక దేహంలో ‘సంసిద్ధత’ లేనప్పుడు సంసిద్ధంగా లేని ఆ దేహాన్ని రెండో దేహం ఆక్రమించుకోవడం హక్కును కాలరాయడమే. చట్టం దృష్టిలో వైవాహిక అత్యాచారం.. అత్యాచారం కాకపోవచ్చు. మనిషిగా నా దేహంపై నాకు హక్కు ఉంటుంది. దాన్ని ఉల్లంఘించడం భర్త గానీ, ఇంకొకరు కానీ చేయతగని పని’’.

బాధితురాలు 4
‘‘నా బాధను అమ్మకు చెప్పుకున్నాను. ఇంకా, ఇంట్లోని మిగతా పెద్దవాళ్లయిన ఆడవాళ్లకూ. వాళ్లూ అర్థం చేసుకోలేదు. ‘చిన్న చిన్న విషయాలకు కాపురాన్ని పాడు చేసుకోకు’ అని సలహా ఇచ్చారు! చిన్న విషయమా ఇది. ఎలా హింస నుంచి తప్పించుకోవడం?’’
ఇలా.. ఒక్కొక్కరిదీ ఒక్కో ఆవేదన.
‘‘దీనిని మ్యారిటల్‌ రేప్‌ అంటారు. సమ్మతి లేకుండా దేహవాంఛను తీర్చుకోవడం. శిక్షార్హమైన నేరంగా దీనిని చట్టంగా తేవాలని మీరు అనుకుంటున్నారా?’’ అని సమీర్‌ వాళ్లను అడిగాడు.
అవుననీ చెప్పలేదు. కాదనీ అనలేదు. కానీ.. భర్త అలా చేయకుండా ఉంటే బాగుంటుందని అన్నారు. ‘‘చట్టం వస్తే అలా చేయకుండా ఉంటారేమో’’ అని సమీర్‌ అన్నప్పుడు ‘అయితే మంచిదే’ అని మాత్రం అన్నారు!

ఆ తర్వాత అనూజా కపూర్‌ అనే సైకాలజిస్టును కలిశారు సమీర్‌. ‘‘కట్టుబాట్లు, కుటుంబ గౌరవాలకు ప్రాముఖ్యం ఇచ్చే సమాజంలో వ్యక్తిగతమైన సమస్యలు.. ముఖ్యంగా మహిళల సమస్యలు.. ఇంకా ముఖ్యంగా మహిళల వైవాహిక సమస్యలు అప్రాముఖ్యమైనవిగా కనిపిస్తాయి. అందుకే మ్యారిటల్‌ రేప్‌పై దాదాపుగా ఫిర్యాదులు ఉండవు. అయితే మ్యారిటల్‌ రేప్‌ను నేరంగా పరిగణించే ఒక చట్టమైతే రావలసి ఉంది’’ అని అనూజా అన్నారు.

‘కట్టుకున్నదానిపై’ సర్వహక్కులూ ఉంటాయని భావించే పురుషాధిపత్య సమాజం ఆలోచనను మార్చేందుకు ఢిల్లీలోని ‘రిత్‌’ అనే ఫౌండేషన్‌  సమీర్‌తో ఈ వీడియోను తయారు చేయించింది.  ‘రిత్‌’ అంటే సంస్కృతంలో యదార్థం అని అర్థం. భార్యను రేప్‌ చేసిన భర్త పాత్రగా సమీర్‌ను చూపించింది ‘రిత్‌’. ఆ పాత్ర తప్ప వీడియోలోని సన్నివేశాలన్నీ నిజమైనవి.

సెక్షన్‌ 375
ఏది ‘అత్యాచారం’ అవుతుందనే విషయమై భారత శిక్షా స్మృతిలోని సెక్షన్‌ 375 ఆరు విధాలైన నిర్వచనాలను ఇచ్చింది.  దాని ప్రకారం : 1) ఆమెకు ఇష్టం లేనప్పుడు, 2) ఆమె సమ్మతి లేనప్పుడు, 3) ఆమెను బెదిరించి, 4) పెళ్లి చేసుకుంటానని నమ్మించి, సమ్మతి పొంది లోబరుచుకున్నప్పుడు, 5)సమ్మతి తోనే అయినా, సమ్మతి ఇచ్చిన సమయంలో ఆమె మానసిక స్థితి సరిగా లేనప్పుడు, 6)సమ్మతి ఇచ్చినా, ఇవ్వకున్నా ఆమె వయసు 18 ఏళ్లు నిండనప్పుడు అది రేప్‌ కింద పరిగణించబడుతుంది. అయితే ఈ సెక్షన్‌లో ఎక్కడా కూడా ‘మ్యారిటల్‌ రేప్‌’ గురించి ప్రస్తావన లేదు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top