
మాతృభూమిని ప్రేమించనివారు ఉండరు.. కొందరు బహిరంగపరుస్తారు.. కొందరు గుప్తంగా వ్యక్తపరుస్తారు.. రెండో రకం దేశభక్తుడు అరవై సంవత్సరాల ఎన్. ఎస్. రాజప్పన్. తాను చిన్నప్పుడు ఏ సరస్సు ఒడ్డున అయితే ఆడుకున్నాడో, ఇప్పుడు అదే సరస్సు కలుషితం కావడం చూసి బాధపడి, దానిని శుభ్రం చేయడమే పనిగా పెట్టుకున్నాడతను.
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా మణియాణిక్కార గ్రామంలో వెంబల్యాండ్ సరస్సు ఒడ్డున పుట్టి పెరిగాడు రాజప్పన్. ఆ తీరంలోనే ఐదు సంవత్సరాల వయస్సు వచ్చేవరకు ఆటలాడుతూ, ఆ నీళ్లల్లో కలువలను, నీలిమబ్బు నీడలను, చందమామను.. ఎన్నో ఆనందాలను చూస్తూ పెరిగాడతను. ఇప్పుడు ఆ సరస్సులో కలువలకు బదులు ప్లాస్టిక్ సీసాలు, చేపలకు బదులు ప్లాస్టిక్ గ్లాసులు, నీలిమబ్బు నీడలకు మారుగా పెద్ద పెద్ద కవర్లు ఉండటం చూసి బాధపడ్డాడు. బాధపడి ఊరుకోక గత ఐదు సంవత్సరాలుగా వ్యర్థపదార్థాలను, ప్లాస్టిక్ సీసాలను ఏరిపారేసి, సరస్సును స్ఫటికంలా తయారు చేస్తున్నాడు. ‘‘నేను ఈ సరస్సు ఒడ్డున పుట్టి పెరిగాను. ఇక్కడే నా బాల్యమంతా గడిపాను. ఈ సరస్సులో ఏ చెత్త తేలుతున్నా నా గుండె గాయపడుతుంది. వాటిని ఏరిపారేస్తే కాని ఆనందంగా ఉండదు’’ అంటాడు రాజప్పన్.
ఇదే జీవనాధారం...
ఈ సరస్సే రాజప్పన్ జీవనాధారం. బాల్యంలోనే అంటే ఐదు సంవత్సరాల వయసులోనే రాజప్పన్ కాళ్లను పోలియో హరించేసింది. అయితేనేం, రాజప్పన్ మనస్సుకి ఏ వ్యాధీ లేదు. ‘‘నేను నా కాళ్లను కదపలేను. అందువల్ల నేను గత ఐదేళ్లుగా ఈ సరస్సులోని చెత్తను ఏరి, వాటిని అమ్మి జీవనం సాగిస్తున్నాను. పడవ నిండా ప్లాస్టిక్ సామాన్లు సేకరించినా కూడా నాకు ఎక్కువ ఆదాయం రాదు. కాని ఈ సరస్సు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో నేను ఈ పని చేస్తున్నాను’’ అంటారు రాజప్పన్.
2018 కేరళలో వరదలు వచ్చిన సమయంలో, రాజప్పన్ ఇల్లు పూర్తిగా పాడైపోయింది. అప్పుడు కూడా రాజప్పన్ తనకు సహాయం చేయమని ఎవ్వరినీ అడగలేదు. తన పడవలోనే కొన్ని వారాలపాటు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరవాత కొంత కాలానికి ఇంటి కప్పు వేసుకున్నప్పటికీ, ఇప్పటికీ ఆ ఇల్లు దీనావస్థలోనే ఉంది. కరోనా కాటుతో గత కొన్ని నెలలుగా పర్యాటకుల తాకిడి లేకపోవటంతో, ప్లాస్టిక్ సామాన్లు కూడా దొరకట్లేదు. రాజప్పన్‌కి ఆదాయం బాగా తగ్గిపోయింది. తనకు తగినంత ఆదాయం లభించకపోయినప్పటికీ, సరస్సు పరిశుభ్రంగా ఉంటున్నందుకు ఆనందంగా ఉందంటారు రాజప్పన్ ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో.
ఫేస్ బుక్ ద్వారా...
‘‘అబుదబీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న నేను ఫ్రీలాన్సర్‌గా కేరళలోని కొట్టాయం వచ్చాను. ఇంతలో లాక్‌డౌన్ విధించటంతో ఇక్కడే ఉండిపోయాను. లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక, నా స్నేహితుడితో కలిసి వెంబల్యాండ్ సరస్సు చూడటానికి వచ్చాను. అక్కడ ఫొటోలు తీస్తున్న సమయంలోనే రాజప్పన్ తన చిన్న పడవను నడుపుతూ కనిపించాడు. వెంటనే అతడి ఫొటో, వీడియో తీసి ఫేస్ బుక్‌లో అప్‌లోడ్ చేశాను. ఇప్పటివరకు 1,40,000 మంది చూసి, రాజప్పన్ గురించి తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందనీ, రాజప్పన్‌కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని కామెంట్లు పెడుతున్నారు. రాజప్పన్ నిస్వార్థంగా చేస్తున్న సేవలకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే’’ – నందు కె.ఎస్., ఇంజినీర్, ఫొటోగ్రాఫర్