నాటుకోడి నంజుకుందాం..

Special Story About Food Recipe With Rooted Chicken - Sakshi

సాక్షి, సనత్‌నగర్‌ : కోడి కూర.. చిల్లు గారె..కోరి వడ్డించుకోవె ఒక్కసారి అంటూ ఓ సినిమాలో ఆ రుచిలోని మాధుర్యాన్ని చూపించారు.. నాయుడోరీ పిల్లా నా ఇంటికొస్తావా..నాటు కోడి పులుసు నాకొండీ పెడతావా..చిట్టి గారె నాకిష్టం అంటూ మరోసినిమాలో కోడికూర కమ్మదనాన్ని చెప్పేశారు.. ఇలా సినీ గేయ రచయితలు నాటుకోడిలోని రుచులను చక్కగా వివరించారు. నాటుకోడిని కట్టెలపై కాల్చి..దానికి పసుపు, అల్లం దట్టించి..పులుసు చేసి గారెల్లో నంజుకుంటే ఆ టెస్టే వేరప్పా.

గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఎవరి ఇళ్లల్లో వారే ఈ సంప్రదాయాన్ని కొనసాగించేవారు. సంక్రాంతి, దసరా పండుగలు వచ్చాయంటే ఇప్పటికీ నాటుకోడి, చిట్టి గారెలు కాంబినేషన్‌ ఉండాల్సిందే. ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమైన నాటుకోడి వంటకాలు పలు రూపాలను సంతరించుకుని ఇప్పుడు సిటీలో కేక పుట్టిస్తున్నాయి. ప్రత్యేకంగా సిటీలో ‘కోడికూర’ పేరిట రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి. నాటుకోడి పులుసును గారెలకే పరిమితం చేయకుండా పలు రకాల వంటకాలకు కాంబినేషన్‌గా అందిస్తున్నారు. భోజన ప్రియులు సైతం లొట్టలేసుకుని మరీ తమ జిహ్వచాపల్యాన్ని తీర్చుకుంటున్నారు. 

ఆంధ్రాకు నాటుకోడి–చిల్లుగారె.. రాయలసీమకు నాటుకోడి–రాగి సంకటి.. తెలంగాణకు నాటుకోడి– బగారాపలావ్‌ పెట్టింది పేరు. ఈ మూడు ప్రాంతాల ప్రజలకు ఇష్టమైన వంటకాలను ఒకే వేదిక పైకి తీసుకువచ్చి ఫుడ్‌ లవర్స్‌ను మరిపిస్తున్నారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా నాటుకోడితో అనుబంధంగా ఉన్న అన్ని రకాల వంటకాలను భోజన ప్రియులు ఆరగించేస్తున్నారు. కేవలం గారె, రాగిసంకటి, బగారా పలావ్‌లకే పరిమితం కాకుండా నాటుకోడి ఇగురు–బిర్యానీ, గోంగూర–నాటుకోడి, తోటకూర–నాటుకోడి, నాటుకోడి కుండ బీర్యానీ, లెమన్‌ ఫ్లేవర్‌ నాటుకోడి, మహారాష్ట్ర ఆహార సంస్కృతిలో ప్రధానంగా కనిపించే నాటుకోడి కొలాపురి, తెలంగాణకు చెందిన అంకాపూర్‌ నాటుకోడి..ఇలా రకరకాల ఫ్లేవర్లతో కోడికూర నగరంలో కెవ్వుమనిపిస్తుంది. నాటు కోడి ఒక్కటే అయినప్పటికీ రకరకాల శైలిలో వంటకాలు చేసి అందిస్తుండడం గమనార్హం. 

మార్నింగ్‌ టిఫిన్‌లో సైతం.. 
లంచ్, డిన్నర్‌ నుంచి మార్నింగ్‌ టిఫిన్‌లో సైతం నాటుకోడి ఫ్లేవర్‌ మెనూలో భాగమైపోయింది. భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా పలు రెస్టారెంట్ల నిర్వాహకులు నాటుకోడిని అల్పాహారంలో భాగం చేశారు. అందులో ముఖ్యంగా దోశ–నాటుకోడి పులుసు, ఇడ్లీ–నాటుకోడి పులుసు కాంబినేషన్‌ ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని ఎక్కువగా తమిళనాడు బోర్డర్‌లోని అనంతపురం, చిత్తూరు ప్రాంతాల్లో ఈ రకమైన సంస్కృతి కనిపిస్తుంది. ఇప్పుడు సిటీలో సైతం మార్నింగ్‌ టిఫిన్‌ను నాటుకోడిì తో ఇష్టపడే కల్చర్‌ ఇప్పుడిప్పుడే పెరుగుతుందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు. 

ఎలా కావాలంటే అలా... 
నాటుకోడిని ఏవిధంగా వండాలో కస్టమర్లు ఆదేశిస్తే సరి..ఆ రకమైన ఫ్లేవర్‌లో అందించే డిష్‌ సెంటర్లు సిటీలో పుట్టుకొస్తున్నాయి. కొంతమంది నాటుకోడి స్పైసీ ఇష్టపడతారు..ఇంకొందరు నిమ్మకాయ ఫ్లేవర్‌ అంటే ఫిదా అయిపోతారు..మరికొందరు పచ్చిమిర్చి ఫ్లేవర్‌..ఇలా ఎవరి జిహ్వ చాపల్యానికి తగినట్లు వారికి ఆయా రకాల ఫ్లేవర్స్‌తో అందించేందుకు ఫుడ్‌ సెంటర్లు సై అంటున్నాయి. ఫారం కోడి లాగా బాయిల్డ్‌ వాటర్‌లో కాల్చకుండా కేవలం కట్టెలపై కాల్చిన నాటుకోడి అందించే రుచినే ఇష్టపడుతుంటారు, ఆ మేరకే చాలామంది రెస్టారెంట్లు, ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు కట్టెలపై కాల్చే సంస్కృతిని కొనసాగిస్తున్నారు. 

ప్రకృతి వంటకంగా ..
ప్రస్తుతం ఫారంకోళ్లు పెంపకంలో వివిధ రకాల రసాయనాలు వాడుతున్నారని, కృత్రిమ పద్ధతిలో వీటి పెంపకం జరుగుతుందన్న వార్తల నేపథ్యంలో నాటుకోడిని ప్రకృతి వంటకంగా భావిస్తున్నారు. ఫారం కోళ్ల కంటే నాటుకోడిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయన్నది కూడా నిపుణులు చెప్పే మాట. ఈ క్రమంలో నాటుకోడి వైపు సిటీ భోజన ప్రియులు మనస్సు పారేసుకుంటున్నారు. దీని దృష్ట్యా నాటుకోడి వంటకాల సెంటర్లు కూడా ప్రత్యేకంగా పుట్టుకొస్తున్నాయి. 

ఒక్కొక్కరు ఒక్కో ఫ్లేవర్‌  ఇష్టపడతారు... 
ఒకప్పుడు నాటుకోడి కూర పులుసు, ఫ్రై వంటి పరిమితమైన వంటకాలు ఉండేవి. ఇప్పుడు నాటుకోడితో వివిధ రకాల టేస్ట్‌లు పుట్టుకొచ్చాయి. ఆ మేరకే తాము వంటకాలు అందిస్తున్నాం. కస్టమర్ల టేస్ట్‌కు తగ్గట్టుగా నాటుకోడి వంటకాలను తయారుచేస్తున్నాం. మా వద్ద నాటుకోడి కుండ బీర్యానీ, పులుసు, ప్రై, నాటుకోడి గోంగూర వంటి వంటకాలతో పాటు కస్టమర్‌ ఆర్డర్స్‌ మేరకు వివిధ రకాల ఫ్లేవర్స్‌లో అందిస్తున్నాం.
– జయచందర్‌రావు, ఎంఆర్‌సీబీ నిర్వాహకుడు  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top