అవ్వ దాచిన అపురూప చీర

Special Story About Chintakindi Narsavva - Sakshi

చీనీ చీనాంబరాలు, పట్టు పీతాంబరాలు అనే మాట విని ఉంటాం. కానీ పీతాంబరాలను ఈ తరం చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే దాదాపు అంతరించిపోయాయి. అయితే వందేళ్ల కిందటి ఆ భారతీయ వస్త్ర కళావైభవానికి ఒక్క ఆనవాలు అయినా దొరక్కపోతుందా అనే ఆశ. దొరుకుతుందిలే అనే ఓ నమ్మకం. చివరికి ఆ నమ్మకమే గెలిచింది. తెలంగాణ జిల్లాలన్నింటినీ దుర్భిణీ వేసి గాలించగా జనగామ్‌లో దొరికిందా పీతాంబరం. ఆ పీతాంబరధారి చింతకింది నర్సవ్వ.

నర్సవ్వ పుట్టింది పెరిగింది జనగామ్‌లో. అత్తగారిల్లు కూడా అదే. వాళ్లది ఒక మోస్తరు సంపన్న కుటుంబమే. నర్సవ్వకు ఎదురింట్లో ఉన్న ఉప్పలయ్యతో పెళ్లైంది. నర్సవ్వ మామగారు ఆగయ్య.. కోడలికి పెళ్లికి పీతాంబరం చీర పెట్టాడు. పట్టుదారం, వెండి జరీతో తయారు చేసిన చీర ఇది. నర్సవ్వ పెళ్లి జరిగింది 1953లో. అప్పటికి నర్సవ్వ వయసు పదకొండేళ్లు. అంటే 67 ఏళ్ల కిందటిది ఈ పీతాంబరం చీర.  చీర బరువు ఎంతో తెలుసా? ఒక కిలో ఆరు వందల గ్రాములు. అప్పుడు ఈ చీర ధర నలభై రూపాయలు. చీరలో 650 గ్రాముల వెండి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజంపేట నేతకారుల నైపుణ్యానికి ప్రతీక ఈ చీర. ‘నా మామ ఆగయ్య అప్పట్లో కౌన్సిలర్, పద్మసాలి సంఘం జిల్లా అధ్యక్షుడు కూడా కావడంతో జిల్లాలో ఎక్కడ ఎలాంటి పనితనం ఉందో ఆయనకు బాగా తెలుసు. అందుకే నా పెళ్లికి అంత గొప్ప చీరను తెప్పించాడ’ని చెప్పింది నర్సవ్వ.

ఉతకు లేదు.. ఇస్త్రీ లేదు
పీతాంబరాన్ని ఇన్నేళ్లుగా నీటిలో ముంచలేదని చెప్పింది నర్సవ్వ. ‘‘చీర కట్టుకుని తీసిన తర్వాత ఒక రోజంతా గాలికి ఆరవేయాలి. చక్కగా చేత్తో సాపు చేసి, మెత్తటి నూలు గుడ్డలో చుట్టి పెట్టెలో పెట్టేదాన్ని. లోపల ధోవతి కట్టుకుని, పైన చీరకట్టే టోళ్లం. చీరను ఇస్త్రీ కూడా చేయలేదు. అయినా సరే ఎక్కడా ముడత పడలేదింత వరకు. నా పెద్ద కూతురు ఈ చీరిమ్మని అడిగింది. కానీ ‘నేనివ్వ’ అని చెప్పా. కావాలంటే కట్టుకోండి.. మళ్లీ తెచ్చి నా పెట్టెలో పెట్టండి. అంతే తప్ప ఎవరికీ ఇచ్చుడు లేదు. నా పానం పోయిన తర్వాత నా మీద ఈ చీరనే కప్పాలి అని గట్టిగా చెప్పాను. మా పెద్ద కోడలు ఒకసారి బతుకమ్మ ఆడడానికి ఈ చీర కట్టుకున్నది. ‘ఇంత బరువు నా వల్ల కాద’ని మళ్లీ ఆ చీరను ముట్టుకోలే. కోడళ్లు, కూతుళ్లలో ముగ్గురు కట్టిన్రు. ఇక ఇద్దరు కట్టుకోవాలె. నా కళ్ల ముందే కట్టుకుని చూపించండంటే వాళ్లకు పట్టడమే లేదు’’ అని చెప్పింది నర్సవ్వ.

తెలంగాణ సంస్కృతిలో భాగం ఈ పీతాంబరం. ధర ఎక్కువ కావడంతో సంపన్న కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ చీర ప్రస్థానం పెళ్లితో మొదలై అంత్యక్రియలతో ముగుస్తుంది. అందువల్లనే ఈ చీరలు ఆనవాలుకు కూడా మిగలకుండా అంతరించి పోయాయి. తెలంగాణ ప్రభుత్వం ఆ చీరలను పునరుద్ధరించడానికి కంకణం కట్టుకుంది. ఆ ప్రయత్నంలో నర్సవ్వ పీతాంబరం చీర వెలుగు చూసింది.
– వాకా మంజులారెడ్డి

పల్లకీలో ఊరేగాను
నా పెళ్లికి మా మామ పెట్టిన ఇరవై తులాల బంగారు నగలు ధరించి, ఈ పీతాంబరం చీర కట్టుకుని నా భర్తతో కలిసి పల్లకీలో ఊరేగాను. ఆ తరవాత నోములకు, బంధువుల పెళ్లిళ్లకు కట్టుకునేదాన్ని. నా ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డల (కూతుళ్లు) పెళ్లిళ్లకూ కట్టుకున్నాను. ఈ చీరతో ఎక్కడికి వెళ్లినా అందరూ చీర గురించి మాట్లాడుడే. మా ఆయనతోపాటు అన్ని వేడుకల్లోనూ దంపతుల గౌరవాన్ని అందుకున్నది ఈ చీరతోనే. ఆయన పోయి ఇరవై మూడేళ్లయింది. ఇక ఆ చీరను ముట్టనేలేదు. ఇప్పుడు మళ్లీ సర్కారోళ్లు వచ్చి ఇలాంటి పీతాంబరాల్ని మళ్లీ నేయిస్తామని చీరను ఓసారి నాకు కట్టబెట్టి, పట్టుకెళ్లారు. కేసీఆరు, కేటీఆరు గిట్లంటి వాటిని చేయించమని పట్టుపడుతున్నరంట. 
– నర్సవ్వ

ఈ సంస్కృతి తమిళనాడులోనూ ఉంది
సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల్లోని నేతకారులు వెండిజరీ చీరలను ఎక్కువగా నేసేవారు. అవి బనాసర్‌ చీరల్లాగ ఉంటాయి. ముదురు గులాబీరంగులోనే నేసేవారు. సుమంగళిగా పోయినప్పుడు ఆ మహిళకు అంతిమ సంస్కారాలను కూడా ఆ చీరతోనే నిర్వహించేవారు. ఈ సంస్కృతి ఉత్తర తెలంగాణతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉంది. అక్కడ కూడా ఇదే రంగు చీరను తొమ్మిది గజాల్లో నేస్తారు. ఇక్కడ ఉన్నట్లే తమిళనాడులో కూడా పెళ్లి చీరతోనే కర్మకాండలు నిర్వహించే ఆచారం ఉంది. మేమిప్పుడు పీతాంబరం చీరతోపాటు హిమ్రూ వస్త్రాలను పునరుద్ధరించడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టాం. హిమ్రూ వస్త్రాలు రెండు వైపులా ఒకే రకంగా ఉంటాయి. వీటి నేతకు ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. వస్త్రాలను నిజాం కాలంలో రాజులు, రాజ కుటుంబీకులు ధరించేవారు. ఔరంగాబాద్‌లో నేసేవారు. మన దగ్గర వరంగల్‌లో కార్పెట్‌ తయారీదారులకు ఈ హిమ్రూ నేతలో శిక్షణనిప్పిస్తున్నాం. ఇక హిమ్రూ వస్త్రాలను మన దగ్గరే తయారు చేయిస్తాం.
– శైలజా రామయ్యర్, ఐఏఎస్, డైరెక్టర్, హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ పార్క్స్‌ (ఎఫ్‌ఏసీ)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top