సమ్మోహిని

Special interview with aditi rao hydari - Sakshi

అందం వెయ్యి పొరల వెనకాల దాగి ఉంటుంది. కానీ ప్రతి పొరకి ఆ అందం కాంతి వెలుగునిస్తుంది. గుణం కూడా అంతే. దాన్ని ఎన్ని పొరలతో కప్పినా సమ్మోహనంగానే ఉంటుంది. కళ్లకి కనబడే పొర వస్త్రాలైతే మనసుకు కనపడే పొర నేపథ్యం. నేను ఎవర్ని? నేను ఎక్కణ్ణుంచి వచ్చాను? నేను ఏమి చేస్తున్నాను? ఇవన్నీ గుణం అందం ముందు తేలిపోతాయి అంటుంది అదితీ రావ్‌ హైదరీ.

పద్మావతి, సమ్మోహనం... వరుస విజయాలతో కెరీర్‌ పాజిటివ్‌గా ఉంది కదా?
అవును. అయితే ఈ సక్సెస్‌ క్రెడిట్‌ మొత్తం డైరెక్టర్స్‌కే ఇస్తాను. వాళ్లు అలాంటి పాత్రలు రాయబట్టే నాకు నటించడానికి మంచి స్కోప్‌ దొరికింది. ఈ రెండు సినిమాలకన్నా ముందు మణిరత్నం సార్‌తో ‘చెలియా’ చేశాను. అదొక బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌. ‘పద్మావతి’ కంప్లీట్లీ డిఫరెంట్‌. ఆ సినిమాలో నాది చిన్న పాత్ర. కానీ ప్రేక్షకులకు గుర్తుండిపోయే క్యారెక్టర్‌.

అందుకే చేశాను. ‘సమ్మోహనం’ విషయానికొస్తే.. మోహనకృష్ణగారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్‌ అయ్యాను. అయితే డేట్స్‌ ఇష్యూ వల్ల ఈ సినిమా చేయగలుగుతానా? లేదా? అని వర్రీ అయ్యాను. ఫైనల్లీ ఎలాగోలా మేనేజ్‌ చేశాను. ‘సమ్మోహనం’ చేయకపోతే మంచి సినిమా మిస్సయ్యుండేదాన్ని.

‘పద్మావతి’లో మీ భర్త పాత్రధారి పెట్టే హింస, ‘సమ్మోహనం’లో బాయ్‌ఫ్రెండ్‌ హింస. ఓ అమ్మాయిగా రియల్‌ లైఫ్‌లో అబ్బాయిల నుంచి ఇలాంటి హెరాస్‌మెంట్స్‌?
ఒకే ఒక్క ఇన్సిడెంట్‌ ఉంది. చిన్నప్పుడు స్కూల్‌కి ట్రైన్‌లో వెళ్లేదాన్ని. ఒక అంకుల్‌ అలా టచ్‌ చేస్తూ వెళ్లాడు. ఆ టచ్‌లో చెడు కనిపించింది. ‘ఇంకెప్పుడూ ఎవర్నీ ఇలా చేయొద్దు అంకుల్‌’ అని అతనివైపు చాలా డర్టీగా చూస్తూ అన్నాను. ఇంటి దగ్గర, ఇంట్లోనూ నాకెలాంటి సమస్యలూ రాలేదు. నేను మంచి వాతావరణంలో పెరిగాను.

నా ఫ్యామిలీ మెంబర్స్‌ అంతా చాలా లిబరల్‌గా ఉంటారు. నన్ను ప్రొటెక్ట్‌ చేస్తూనే చాలా ఫ్రీడమ్‌ ఇచ్చేవారు. ‘గుడ్‌ టచ్‌’, ‘బ్యాడ్‌ టచ్‌’ గురించి ఇంట్లోవాళ్లు చెబితేనే తెలిసింది. ఆడపిల్లల్ని ఈ విషయంలో ఎడ్యుకేట్‌ చేయాలి.

బ్యాడ్‌ టచ్‌ అని కనిపెట్టి అంకుల్‌కి ఎదురు తిరిగారంటే మీరు చాలా బోల్డ్‌ అనుకోవచ్చా?
నిజానికి ధైర్యవంతురాలినో కాదో నాకు తెలియదు. ఆ టైమ్‌కి అది తప్పనిపించింది. తప్పు జరిగినప్పుడు మాత్రం మాట్లాడే ధైర్యం ఉంది. అయితే చాలా మటుకు పొలైట్‌గానే మాట్లాడతాను.

ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ‘ఉమెన్‌’కి  రెస్పెక్ట్‌ దొరుకుతుందా?
ఒకళ్లు మనల్ని రెస్పెక్ట్‌ చేయాలని ఎదురు చూడకూడదు. మన ప్రవర్తన చూసి ఆటోమేటిక్‌గా ఎదుటి వ్యక్తి మర్యాద ఇవ్వాలి. అలాగే మనల్ని మనం రెస్పెక్ట్‌ చేసుకునే తీరుని బట్టే మనల్ని ఎదుటి వ్యక్తులు గౌరవిస్తారు. నా మటుకు నేను చాలా హుందాగా ప్రవర్తిస్తాను. ఎదుటి వ్యక్తులు నాతో అలానే ఉంటారు.

హాలీవుడ్‌లో నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌ పెట్టిన హింస గురించి కొందరు కథానాయికలు నలుగురికీ తెలిసేలా మాట్లాడారు. ఇక్కడ (ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ) అలా మాట్లాడితే అవకాశాలు తగ్గుతాయా?
నేను గమనించినంతవరకూ కొంత ఆ వాతావరణం ఉంది. వేధింపుల గురించి బయటికి చెబితే వాళ్లని కించపరచడమో, భయపెట్టడమో చేసేవాళ్లు ఉన్నారు. ఆ అమ్మాయిలకు పని కూడా తగ్గిపోతుంది. ఇండస్ట్రీలోవాళ్లు అమ్మాయిల్ని ‘ఆబ్జెక్ట్స్‌’లా కాకుండా ‘ఆర్టిస్ట్స్‌’లా చూడగలిగినప్పుడే ఈ పరిస్థితి మారుతుంది. అమ్మాయిలను నెగటివ్‌ దృష్టితో చూసేవాళ్ల గురించి ఈ మాట చెబుతున్నాను.

సేవా కార్యక్రమాలేవైనా చేస్తుంటారా?
అదంతా మనసుకి నచ్చి చేస్తా ను. పబ్లిసిటీ కోసం కాదు. ఉమెన్‌ రైట్స్, ఎడ్యుకేషన్‌ వంటి వాటి మీద ఆసక్తి. ఎడ్యుకేషన్‌ అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు కూడా అందాలి. లేకపోతే వాళ్లకి అమ్మాయిల్ని ఎలా ట్రీట్‌ చేయాలో ఎప్పటికీ తెలియదు. అందుకే ఎడ్యుకేషన్‌ ఇంపార్టెంట్‌ అని ఫీల్‌ అవుతాను. అలాగే యానిమల్‌ రైట్స్‌ కోసం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటాను. ప్రకృతిని కాపాడే కార్యక్రమాల్లో పార్టిసిపేట్‌ చేస్తాను.

‘చెలియా’లో లీల, ‘పద్మావతి’లో మల్లిక, ‘సమ్మోహనం’లో సమీరా.. అన్ని పాత్రలూ బాగా చేశారు. నటనలో ట్రైనింగ్‌ తీసుకుని సినిమాల్లోకి వచ్చారా?
లేదు. నాకు తెలిసిందల్లా ఫీల్‌ అవ్వడం. డైరెక్టర్‌ ఒక మంచి క్యారెక్టర్‌ క్రియేట్‌ చేసినప్పుడు జెన్యూన్‌గా నేను ఆ పాత్రలా మారిపోవాలి. అలా జరగాలంటే నేనే ఆ పాత్ర అనుకోవాలి. ఆ క్యారెక్టర్‌ పడే బాధ, సంతోషం, ఆశ్చర్యం అన్నీ నాకు జరుగుతున్నట్లుగా ఫీల్‌ అవ్వాలి. అలా ఫీలై చేస్తాను కాబట్టే, ‘బాగా యాక్ట్‌ చేస్తున్నారు’ అని కాంప్లిమెంట్స్‌ అందుకోగలుగుతున్నా. అఫ్‌కోర్స్‌ ఆ క్యారెక్టర్స్‌ క్రియేట్‌ చేసిన డైరెక్టర్స్‌కి ఎక్కువ క్రెడిట్‌ ఇచ్చేస్తాను.

ఆమిర్‌ ఖాన్‌ వైఫ్‌ కిరణ్‌ రావ్‌ మీ కజిన్‌ కదా?
ఆమె మా అమ్మమ్మ సైడ్‌ రిలేటివ్‌. యాక్చువల్లీ ఆమిర్‌ని కిరణ్‌ పెళ్లి చేసుకున్నారనే కానీ తనదీ ఫిల్మీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ కాదు. మేమిద్దరం బంధువులం అని చాలామందికి తెలియదు. ఎందుకంటే నా కెరీర్‌ కోసం ఆమిర్‌ భార్య కిరణ్‌ నా కజిన్‌ అని నేనెక్కడా చెప్పను. ప్రొఫెషనల్‌గా కిరణ్‌ నుంచి నేనెలాంటి సహాయం తీసుకోలేదు.

  మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అని, నీ కెరీర్‌కి  నువ్వే రెస్పాన్సిబుల్‌ అవ్వాలి అని ఇంట్లో నేర్పారు. కిరణ్, నేను చాలా క్లోజ్‌. నా వర్క్‌ చూసి, తను ప్రౌడ్‌గా ఫీలవుతుంది. వెంటనే నాకు మెసేజ్‌ పెడుతుంది.

హీరోయిన్‌ అంటే ‘జస్ట్‌ గ్లామర్‌’ కోసం అని చాలామంది అనుకుంటారు. మీరేమంటారుæ?
మేం సిల్వర్‌ స్క్రీన్‌ని అందంగా మార్చడానికి ఇక్కడ లేము. మా ప్రొఫెషన్‌లో అదొక చిన్న భాగం... అంతే. మేం ఇక్కడ ఉన్నది కథలో భాగం అవ్వడానికే. ఆ కథకు వేల్యూ తీసుకు రావడానికే అని నమ్ముతాను. హీరోయిన్‌ గురించి మాట్లాడేటప్పుడు ఆమె బాడీ, ఫేస్‌ గురించి కాదు.. పాత్ర గురించి మాట్లాడాలి. ముందు టాలెంట్‌ గురించి మాట్లాడాలి. బ్యూటీ, ఫిట్‌నెస్‌ ఓ బోనస్‌ అని నేను ఫీలవుతాను.

సో.. ఓ క్యారెక్టర్‌ ఒప్పుకునేటప్పుడు మీరెలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు?
సినిమా మొత్తం కనిపిస్తామా? 20 నిమిషాలే కనిపిస్తామా? అన్నది నాకు ముఖ్యం కాదు. ఆ స్క్రిప్టులో నా క్యారెక్టర్‌కి ఎంత వేల్యూ ఉందని చూస్తాను. హీరోయిన్‌ అంటే డ్యాన్స్‌లకే అనే సబ్జెక్ట్స్‌ చేయను. నేను చేసిన సినిమాలు గమనిస్తే మీకది అర్థమవుతుంది. హాలీవుడ్‌ హీరోయిన్లు ఇలానే ఆలోచిస్తారు. ఇక్కడ మనం కూడా అలానే ఉండాలన్నది నా ఒపీనియన్‌.

మీ ప్లస్, మైనస్‌ పాయింట్స్‌ ఏంటి ?
నా ప్లస్,  మైనస్‌ రెండూ దాదాపు ఒకటే. ఒకటి సెన్సిటివిటీ (సున్నిత మనస్కురాలు). యాక్టర్‌గా అది చాలా ప్లస్‌. క్యారెక్టర్‌ని ఈజీగా ఫీల్‌ అవ్వగలను, సినిమా చేస్తున్నంతసేపూ ఆ క్యారెక్టర్‌తో ట్రావెల్‌ చేయగలను. ఆ క్రెడిట్‌ అంతా నా పేరెంట్స్‌కి ఇస్తాను. ఎందుకంటే వాళ్లూ సున్నిత మనస్కులే. ఇలా ఉండటం వల్ల ఓ మైనస్‌ ఉంది. నేనేం దాచుకోలేను (నవ్వుతూ).

అప్‌సెట్‌ అయినా, ఏదైనా బాధలో ఉన్నా బయటకు కనిపించేస్తుంది. రెండోది పాజిటివ్‌ పర్సన్‌ని. నాకు వంద చెడ్డ విషయాలు చెప్పినా అందులో కూడా పాజిటివిటీని వెతుక్కోగలను. ప్రతి పనిలో, ప్రతి మనిషిలో మంచే చూడాలని నన్ను ఎంకరేజ్‌ చేసింది పాజిటివిటీయే. దాని వల్ల మైనస్‌ ఏంటంటే మనం ప్రతి దాంట్లో పాజిటివ్‌గా ఉంటే అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. మనల్ని మ్యానిపులేట్‌ చేయడానికి చూస్తుంటారు.

అలాంటి సిచ్యువేషన్స్‌ ఏమైనా ఎదుర్కొన్నారా?
సెట్లో ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. అయితే నేను చిన్న చిన్న విషయాలకి అప్‌సెట్‌ అయిపోయి కోపం తెచ్చుకునే టైప్‌ కాదు. నేను నిజంగా అప్‌సెట్‌ అయ్యానంటే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినట్టు లెక్క. అందుకే నా ప్లస్‌లు, మైనస్‌లు దగ్గర దగ్గరగా ఉంటాయి. నేను 5 ఏళ్ల పాపలాగ. చిన్నదానికే ఆనందపడతాను.

సినిమాలెందుకు చేస్తున్నారు? డబ్బు కోసమా? ప్యాషనా?
100 శాతం ప్యాషన్‌ వల్లే చేస్తున్నాను. అలా అని దాని ద్వారా వచ్చే నేమ్, ఫేమ్‌ ఇష్టం లేదని కాదు. చిన్నప్పటి నుంచి నేను సంపాదించే దాన్ని. డ్యాన్స్‌  చేస్తూనే సంపాదించేదాన్ని. అందుకే హీరోయిన్‌ అయ్యాను. ఇవన్నీ ఇష్టమే. గ్రేట్‌ డైరెక్టర్స్‌తో వర్క్‌ చేసినప్పుడు రెమ్యునరేషన్‌ పెద్దగా పట్టించుకోను. నా ఫస్ట్‌ ప్రయారిటీ ‘ఫలానా డైరెక్టర్స్‌ హీరోయిన్‌’ అనిపించుకోవాలన్నదే.

ఆ తర్వాతే డబ్బు గురించి ఆలోచిస్తాను. ఒక ఎగ్జాంపుల్‌ చెబుతాను. నా కెరీర్‌ స్టార్టింగ్‌లో పెద్ద సినిమాకి చాన్స్‌ వస్తే, ఆ సినిమాలో హీరోయిన్‌గా నాకు చేయడానికి ఏమీ లేదు. ఓ సినిమాకి మంచి రెమ్యునరేషన్‌ ఇస్తానన్నారు. ఆ సినిమాలో నాకు పెద్దగా స్కోప్‌ లేదు. అందుకే ఒప్పుకోలేదు. నా రోల్, డైరెక్టర్‌ ఇంపార్టెంట్‌.

అంటే.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు నచ్చవా? మీరు చేసిన పాత్రలు కూడా గ్లామరస్‌గా ఉండవు. ఒకవేళ స్క్రిప్ట్‌ స్విమ్‌ సూట్‌ డిమాండ్‌ చేస్తే?
ఆ డిమాండ్‌ చాలా జెన్యూన్‌గా ఉండాలి. అప్పుడు అభ్యంతరం చెప్పను. అయితే స్విమ్మింగ్‌ పూల్‌లో స్విమ్‌ సూట్‌లో దిగితే అందులో ఛీప్‌గా ఫీల్‌ అవ్వాల్సిన అవసరం ఏంటి? నాకు కమర్షియల్‌ సినిమాలు ఇష్టమే. మార్కెట్‌లో వాటి హవా ఎక్కువ. అయితే ఆ సినిమాలో కూడా హీరోయిన్‌గా నాకు ఏదైనా స్కోప్‌ ఉండాలని ఆశిస్తాను. అప్పుడే ఆ స్క్రిప్ట్‌కి ఓకే చెబుతాను.

నంబర్‌ రేస్‌ మీద ఇంట్రెస్ట్‌గా ఉన్నారా? మీరు ప్రాపర్‌ రేస్‌లో కూడా లేరనుకుంటాను? పైగా లెంగ్త్‌ తక్కువ ఉన్న రోల్స్‌ కూడా చేసేస్తున్నారు?
అందరం ఓన్లీ లీడ్‌ రోల్స్‌ చేస్తాం అనుకోకూడదు. నేను గెస్ట్‌ పాత్రలు చేయడానికి సిద్ధమే. అప్పుడే కెరీర్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొన్నిసార్లు లీడ్‌ రోల్స్‌ కన్నా గెస్ట్‌ పాత్రలకే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్‌.. ఈ ప్లేసెస్‌ ఇండస్ట్రీ , ఆడియన్స్‌ డిసైడ్‌ చేసేవి. అలా చేసినందున మా స్టార్‌ వాల్యూ ఏం పడిపోదు.

రేస్‌లో పరిగెట్టే వాళ్ల కంటే ఆర్టిస్ట్‌లే ఎక్కువ కాలం నిలబడతారు, గుర్తుండిపోతారు. రేస్‌ అయిపోవచ్చు కానీ మారథాన్‌ అవ్వదు. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. విద్యా బాలన్, కంగనా రనౌత్, రాణీ ముఖర్జీ, టబు లాంటి వాళ్లు రేస్‌లో పరిగెత్తడం లేదు. మంచి సినిమాలు క్రియేట్‌ చేస్తున్నారు. వాళ్లు చేస్తున్నది మారథాన్‌.

మీ చిన్నప్పుడే మీ అమ్మానాన్న విడిపోయారు. అమ్మగారి దగ్గర పెరిగిన మీకు నాన్నను మిస్సయిన ఫీలింగ్‌ ఉండేదా?
ఇద్దరు వ్యక్తుల మధ్య సఖ్యత కుదరకపోతే గౌరవంగా విడిపోవడం బెస్ట్‌ అనుకుంటాను. పేరెంట్స్‌ ఎప్పుడైనా పిల్లల కోసం సంతోషమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేయగలగాలి. మా పేరెంట్స్‌ విడిపోయి చేసింది అదే. ఒకే గొడుగు కింద ఉంటూ, ఎప్పుడూ గొడవలు పడుతుంటే కూతురిగా నేను హ్యాపీగా ఉండేదాన్ని కాదు. నేను చాలా సంతోషమైన వాతావరణంలో పెరిగాను. ఎప్పుడంటే అప్పుడు డాడీని కలిసేదాన్ని.

అప్పుడప్పుడూ కలవడం వేరు. రోజూ డాడీతోనే ఉండటం వేరు కదా?
చిన్నప్పుడు బాధ అనిపించలేదు కానీ, ఇప్పుడు ఆలోచిస్తే మా నాన్నగారితో ఇంకొన్ని రోజులు టైమ్‌ స్పెండ్‌ చేసి ఉంటే బాగుండేదనిపిస్తోంది. ఆయన నాలుగేళ్ల క్రితమే చనిపోయారు. నేను పెరిగేటప్పుడు ఆయన్ని మిస్‌ అవ్వలేదు. ఏ విషయంలోనూ కొరత లేకుండా చూసుకున్నారు మా అమ్మ వాళ్లు. మా గ్రాండ్‌ పేరెంట్స్, మా మామయ్య, అందరూ నాకోసం ఉన్నారు.

అయితే మా నాన్నగారికి నా ప్రొఫెషన్‌ గురించి ఏమీ తెలియదు. మా డాడ్‌ ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్‌ బ్యాక్‌డ్రాప్‌. ఒకసారి మా డాడీ ‘రో జంతా సెట్లో ఏం చేస్తారు? అన్ని గంటలు ఏం పని చేస్తుంటారు’ అని అడిగారు. ఆయనకు సినిమాలు ఎక్కువగా తెలియదు. నాన్నగారు ఇప్పుడుంటే కచ్చితంగా నాతో పాటు లొకేషన్‌కి వచ్చేవారు. నా గురించి గుడ్‌ థింగ్స్‌ వినేవారు. ఆ ఆనందాన్ని ఆయన మిస్సయ్యారని బాధ.

మీ అమ్మగారు హిందూ, నాన్నగారు ముస్లిం కదా. మీరు ఏ దైవాన్ని నమ్ముతారు?
రెండు మతాల బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చాను. మా ఇంట్లో  అన్ని మతాలను నమ్ముతాం. రెండు వైపుల వారు చాలా ఓపెన్‌ మైండెడ్‌. ‘లివ్‌... లెట్‌ లీవ్‌’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాం. మా ఫ్యామిలీ రెండు వైపుల వారు ఎడ్యుకేటెడ్‌. ఓపెన్‌ మైండెడ్‌. కుల మతాలకు అతీతంగా స్నేహం చేస్తాం. అందరితో బాగుంటాం.

హైదరాబాద్‌లోనే పుట్టారు కదా. తెలుగు ఎందుకు నేర్చుకోలేకపోయారు?
ఇక్కడ పుట్టినా, నేను ఎక్కువగా నార్త్‌లో పెరిగాను. అమ్మ తెలుగు. నాన్న హిందీ. నాతో పాటు అమ్మ షూటింగ్‌కి వచ్చినప్పుడు టీమ్‌ అందరితో తెలుగులోనే మాట్లాడతారు. ‘మీ అమ్మగారు ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు, మీరెందుకు మాట్లాడట్లేదు?’ అని అడుగుతారు. నా చిన్నతనం అంతా డ్యాన్స్, ఆర్ట్‌తో గడిచిపోయింది. లాంగ్వేజ్‌లు నేర్చుకోవడానికి టైమ్‌ లేదు. అలాగే కొత్త లాంగ్వేజెస్‌ నేర్చుకోవడంలో నేను వీక్‌.

‘సమ్మోహనం’ సినిమాకు డబ్బింగ్‌ చెప్పుకున్నారు కదా?
వేరే భాష సినిమాలు చేస్తున్నప్పుడు ఇంపార్టెంట్‌ విషయం ఏంటంటే ఆ దర్శకుడు విజన్‌ని అర్థం చేసుకోవడం. డైలాగ్స్‌ అన్నీ నా భాషలో రాసుకొని బట్టీపడతాను. ఇలా డైలాగ్స్‌ బట్టీపట్టడం చూసి మణీసార్‌ నన్ను ‘రామచిలుక’ అనేవారు. ‘సమ్మోహనం’లో హీరోయిన్‌ నార్త్‌ అమ్మాయి, తన తెలుగు కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన పని లేదు. అందుకని ఈజీగా చెప్పగలిగాను.

ప్రస్తుతం సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో చేస్తున్న తెలుగు సినిమా గురించి?
సంకల్ప్‌ సార్‌ ఈ కథ నాకు లాస్ట్‌ ఇయరే చెప్పారు. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని జస్ట్‌లో మిస్‌ అయ్యేదాన్ని. అనుకోకుండా ఓ హిందీ సినిమా డిలే అయింది. దాంతో మళ్లీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఈ సినిమాతో పాటు మణీసార్‌ ‘నవాబ్‌’ సినిమా చేశాను.

ఫైనల్లీ సోషల్‌ మీడియా ట్రాల్స్, కామెంట్స్‌ గురించి?
మా అమ్మగారి ఫిలాసఫీ ఫాలో అవుతాను. ఎవరి పని వాళ్లు చేసుకోవాలి. ఎవరైనా మన గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే అది వాళ్ల ఖర్మ అని వదిలేస్తాను. నాకు వీలున్నంత వరకు నా ఫ్యాన్స్‌కి రెస్పాండ్‌ అవుతాను. ఫ్యాన్స్‌ చాలా ప్రేమిస్తారు. వాళ్ల కోసం నేను చేయగలిగేది వాళ్లకు రెస్పాండ్‌ అవ్వడం. సోషల్‌ మీడియాలో వచ్చే నెగటివిటీకి ఇంపార్టెన్స్‌ ఇవ్వను. బీ పాజిటివ్‌ అనేది నా పాలసీ. అందుకే నెగటివిటీకి దూరంగా ఉంటాను. అలా ఉండగలిగితే మనం హాయిగా ఉండగలుగుతాం.

– డి.జి. భవాని

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top