గత ఏడాది జూలైలో ప్రారంభమైన ‘షీ–బాక్స్’, నవంబర్ నాటికి ప్రైవేటు ఉద్యోగినులను కూడా తన రక్షణ పరిధిలోకి తీసుకుంది. త్వరలోనే మరింతగా ఈ సదుపాయాన్ని కేంద్ర స్త్రీ,శిశు సంరక్షణ శాఖ విస్తృతం చేయబోతోంది.
అన్ని రంగాలలోను మహిళలు చురుకుగా ఉద్యోగాలు చేస్తున్నారు. స్వతంత్రంగా జీవిస్తున్నారు. అలాగని లైంగిక వేధింపుల నుంచి మాత్రం వారికి విముక్తి లభించడం లేదు. పని చేసే చోట నిత్యం ఎదురయ్యే లైంగిక వేధింపులు ఎంత నరకప్రాయమో.. ఆ బాధలు పడేవారికే తెలుస్తుంది. ఫిర్యాదు చేసినా ఫలితం లేని పరిస్థితి కూడా అనేక çసంస్థల్లో ఉంది. అందుకే, ఉద్యోగం చేస్తున్న మహిళల çసంక్షేమం కోసం భారతప్రభుత్వం కొత్తగా ఒక విధానం ప్రవేశపెట్టింది. అదే షీ – బాక్స్. సెక్యువల్ హెరాస్‌మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్ (ఎస్‌ఎచ్‌ఈ) పేరిట మహిళలకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మహిళలు నిశ్చింతగా ఉద్యోగం చేసుకుంటూ, వేధింపులకు గురికాకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఈ ఆన్‌లైన్ సౌకర్యాన్ని కల్పించింది. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు సంస్థలు.. ఎందులో పనిచేసే మహిళా ఉద్యోగులైనా ఫిర్యాదు చేయొచ్చు. తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి వివరంగా తెలియజేయవచ్చు. ఒక్క లైంగిక వేధిపులే కాదు.. మహిళలను భయపెట్టడం, జుగుప్సాకరమైన ఉద్యోగ వాతావరణం సృష్టించడం, స్త్రీలను తక్కువ చేసి మాట్లాడటం.. ఎటువంటి ఇబ్బందినైనా నిర్భయంగా చెప్పుకోవచ్చు.
వారి ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు కలిగించే అన్ని విషయాలనూ ఇందులో నమోదు చేయొచ్చు. షీ–బాక్స్ ఒక సింగిల్ విండోలా పనిచేస్తుంది. ఉద్యోగం చేస్తున్న చోట వేధింపులకు గురవుతున్నవారు చేసే ఈ ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారులకు చేరుతుంది. వెంటనే వారు.. బాధితురాలు పనిచేస్తున్న సంస్థ యాజమాన్యాలతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటారు. షీ–బాక్స్‌లో ఫిర్యాదు చేయడానికి ఈ మెయిల్ ఐడీ తప్పనిసరి. ఇందులో రిజిస్టర్ చేసుకోవడం చాలా సులువు. స్క్రీన్ మీద కనిపించే Register Your Complaint మీద క్లిక్ చేయాలి. వెంటనే మీ ఆఫీసులో ఏ సందర్భంలో మీరు వేధింపులకు గురి అయ్యారు, అవుతున్నారు అనే వివరాలను పొందుపరచడానికి మెజేస్ స్పేస్ వస్తుంది. తర్వాత ఫిర్యాదు నమోదు పత్రం వస్తుంది. అందులో సమాచారం నింపాక, submit బటన్ నొక్కాలి. ఒకసారి ఫిర్యాదు ఇచ్చారంటే, మీ ఈ మెయిల్‌కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అందులో ఒక లింక్ కూడా వస్తుంది. అక్కడ మీ ఈ మెయిల్ ఐడీని యూజర్ ఐడీ గా వాడుకుని, కొత్త పాస్‌వర్డ్‌ని జనరేట్ చేసుకుని, మీ ఫిర్యాదు విచారణ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.


