‘కూర నీ మొహంలా ఉంది’

Protest against woman violence - Sakshi - Sakshi - Sakshi

నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలలో  ‘స్త్రీ హింస నిర్మూలన’ కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంగా...

‘కూర నీ మొహంలా ఉంది’.. ‘ఈ చీరలో వెర్రి పీనుగులా ఉన్నావ్‌’... ‘పిల్లలు ఏం చేస్తున్నారో పట్టించుకోవా దున్నపోతా’ ‘నువ్విలా చేస్తూ ఉండు పుట్టింటికి తరుముతా’ ‘నువ్విలాగే చేస్తూ ఉండు... ఇంకోదాన్ని తెచ్చి నీకు సవితిని చేస్తా’... ‘నువ్విలాగే చేస్తుంటే కిరోసిన్‌ పోసి నిప్పంటిస్తా’... మాటకు మించిన మారణాయుధం లేదు. స్త్రీలను హింసించడానికి కొట్టక్కర్లేదు... కోయక్కర్లేదు. ఒక పదునైన మాటను వదిలితే చాలు. వాళ్లు విలవిలలాడడానికి. కుప్పకూలడానికి. తాము చాలా మంచివాళ్లమనుకునే మగవాళ్లు, తాము భార్యలను, తల్లులను, చెల్లెళ్లను, కుమార్తెలను బాగా చూసుకుంటున్నామనుకుంటున్న మగవాళ్లు స్త్రీల పట్ల హింసను ప్రదర్శించడం లేదనుకుంటే పొరపాటు.

హింసకు నిర్వచనం కేవలం రక్తం కారడమే అని అనుకుంటే కనపడని రక్తధారలు ఎన్ని ఉన్నాయో వీళ్లు పట్టించుకోకపోవడమే పెద్ద ప్రమాదం. ∙అమ్మాయికి ఇష్టం లేని పెళ్లి. ∙చదువుకుంటాననుకున్న అమ్మాయిని చదువుకోనివ్వకపోవడం ∙చదువుకునే అమ్మాయి మీద నిఘా పెట్టడం ∙చదువుకునే అమ్మాయికి చదువుకునే అబ్బాయి కంటే తక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ఇవన్నీ హింసలంటే ఇలాంటి వాళ్లు నమ్మరు. ఉద్యోగి అయిన భార్యకు ఆమె ఏ.టి.ఎం కార్డు ఆమెకు ఇవ్వకపోవడం, ఇంట్లో ఉండే భార్యకు చేతి ఖర్చులకు తగినన్ని డబ్బులు ఇవ్వకపోవడం, తన తరపు బంధువులకు ఏదైనా సాయం చేయాలని ఆమె అనుకున్నప్పుడు అందుకు సహకరించే ఆర్థిక వెసులుబాటు ఆమెకు ఇవ్వకపోవడం, ఆమె బంధువులను రానివ్వకపోవడం, ఆమె తల్లిదండ్రుల దగ్గరకు ఆమెను పంపకపోవడం, పిల్లల ముందు అవమానించడం, పిల్లల ముందు గౌరవం ఇవ్వకపోవడం, పిల్లల ఎదుట హేళన చేయడం... ఇవన్నీ ఆమెను హింసించడమే అని మగవాళ్లు ఏనాటికి గ్రహిస్తారు? తోబుట్టువుల బాగోగులు కనుక్కోవడం, వారు అత్తింట్లో అభద్రతతో ఉన్నప్పుడు తామున్నామన్న భరోసా ఇవ్వకుండా తప్పించుకు తిరగడం, సాంగెం సమయంలో చేయవలసిన ఆనవాయితీలు నెరవేర్చకుండా ఆమెకు మాట వచ్చేలా చేయడం... ఇవన్నీ పరోక్ష హింసలే.

ముసలితనంలో ఉన్న తల్లిని నిర్లక్ష్యం చేయడం, ఆమెను పట్టించుకోకపోవడం, ఆమెను ఒక్కర్తినే ఒదిలిపెట్టడం, లేదంటే ఆమె ఇష్టానికి భిన్నంగా ఓల్డ్‌ ఏజ్‌ హోముల్లో వదిలిపెట్టడం ఎంత హింస. ఎంత హింస. స్త్రీలను తాగు నీటి కోసం కిలోమీటర్ల కొద్ది నడిపించడం, స్త్రీలను విసర్జన అవసరాల కోసం బహిరంగ ప్రదేశానికి పంపడం వారిని హింసించడం కిందకే వస్తుంది. వారు ఇష్టపడే ఏదైనా టీవీ కార్యక్రమాన్ని కాదని వారి చేతిలోని రిమోట్‌ను లాక్కోవడం కూడా హింసే అని మనం ఎప్పటికీ గ్రహించంగాక గ్రహించం. కొన్ని ఇళ్లల్లో ఆడవాళ్లను కింద కూచోబెట్టడం, బహిష్టు సమయాల్లో ప్రత్యేక గదుల్లో పెట్టడమూ, మగవాళ్లకు ఒకరకమైన భోజనం... ఆడవాళ్లకు ఒక రకమైన భోజనం సిద్ధం చేయడం కూడా స్త్రీల పట్ల చూపించే మానసిక హింసే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు హింసకు గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

అత్యాచారం, అత్యాచారయత్నం, అసభ్య ప్రవర్తన, యాసిడ్‌ హింస, గృహ హింస ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. విషాదం ఏమంటే మతి చలించిన స్త్రీలు, వికలాంగ స్త్రీలు, పని మనుషులుగా వలస వెళ్లిన స్త్రీలు ప్రతి ముగ్గురులో ఇద్దరు లైంగిక దాడికి గురవుతున్నారు. కాందిశీక స్త్రీలలో కూడా ప్రతి ఐదుగురిలో ఒకరిమీద లైంగిక దాడులు జరుగుతున్నాయి. అలాగే జాతిని బట్టి, వర్గాన్ని బట్టి, కులాన్ని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి స్త్రీలు హింసకు లోనవుతున్నారు. ఆదివాసీ, గిరిజన, మూలవాసీ స్త్రీలు ఇతరుల చేతుల్లో హింసకు గురవుతున్న ఉదంతాలే ఎక్కువ. యుద్ధాలలో స్త్రీలపై సాగే అత్యాచారాలకు అంతులేదు. మత కలహాలలో ప్రతీకారం స్త్రీలపై అత్యాచారంతోనే ముగుస్తుంది. అన్నింటికంటే పెద్ద హింస... మారాల్సిన మగవాళ్లను వదిలిపెట్టి మారమంటూ పదే పదే స్త్రీల మీద వత్తిడి పెట్టడం.

వారు ఎలా బట్టలు కట్టుకోవాలో, ఏ టైమ్‌లో రోడ్‌ మీదకు రావాలో, ఎవరిని ప్రేమించాలో, ఏ రెస్టారెంట్‌కు వెళ్లాలో, ఎప్పుడు విడాకులు ఇవ్వాలో, విడాకులు తీసుకున్నా తిరిగి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో, అసలు పెళ్లి చేసుకోవాలో వద్దో... ఇవన్నీ ఒకరు ఆదేశించడం... చెప్పినట్టల్లా ఆడమనడం పెద్ద హింస. ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో గృహహింసను ఎదుర్కొంటున్న ఆడవాళ్లు భర్తను వదిలి పిల్లలతో విడిగా ఉండాలనుకున్నప్పుడు వారికి అద్దెకు తగిన ఇల్లు దొరక్కపోవడం వల్ల వారు ఆ హింసించే భర్త దగ్గరకు తిరిగి వెళ్లాల్సి వస్తోందట. ఈ పరిస్థితిని మనం మార్చలేమా? ఎక్కడ ఉన్నాం మనం? స్త్రీల గురించి సున్నితంగా ఇంకెప్పుడు ఆలోచిస్తాం మనం? మాటను, తీరును, శారీరక ఆధిపత్యాన్ని, సంఘ ఆధిపత్యాన్ని ఎప్పుడు ఆమె దృష్టికోణం నుంచి చూసి సరిదిద్దుకోగలం మనం? ప్రపంచ ఆడవాళ్లంతా గట్టిగా నినదిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి ‘మేల్కోండి మగ మహాశయులారా’ అని పిలుపునిస్తోంది. ఆడవాళ్లకు వ్యతిరేకంగా జరిగే అతి చిన్న హింసను కూడా సమూలంగా నిర్మూలించాల్సిన సమయం వచ్చేసింది. కదలండి. చేయి కలపండి.

ఒక అధ్యయనం ప్రకారం మన దేశంలో గృహ హింసను ఎదుర్కంటున్న ఆడవాళ్లు భర్తను వదిలి పిల్లలతో విడిగా ఉండాలనుకున్నప్పుడు వారికి అద్దెకు తగిన ఇల్లు దొరక్కపోవడం వల్ల వారు ఆ హింసించే భర్త దగ్గరకు తిరిగి వెళ్లాల్సి వస్తోందట. ఈ పరిస్థితిని మనం మార్చలేమా?

– ఫీచర్స్‌ డెస్క్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top