అమెరికా కూతురు

Parents Need To Take Care Of Their Childrens - Sakshi

చేతి వేళ్లు ఒక్కలా లేనట్టే ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు కూడా ఒక్కలా ఉండరు. ఒకరు మాట వింటారు. ఒకరు వినరు. ఆ ఇంట్లో ముగ్గురు పిల్లలు. అక్క చెల్లి తమ్ముడు. అక్క, తమ్ముడు మాట విన్నారు. చెల్లి వినలేదు. ఎందుకు వినడం లేదు అని ఆలోచించాలి తప్పితే ఎందుకు వినదో చూద్దామని పెద్దగా అరిస్తే ఆ కథ ఇలాగే అవుతుంది. ఇక్కడికే చేరుతుంది.

పన్నెండు పదమూడేళ్ల అమ్మాయంటే ఇండియాలో పుస్తకాలు పట్టుకొని, అమ్మ ఇచ్చిన కేరేజీ తీసుకొని స్కూలుకు వెళుతూ కనిపించాలి. కాని అమెరికా అమ్మాయి అయిన శ్రీమిత్ర పోలీసులకు ఫోన్‌ చేసి కంప్లయింట్‌ చేసింది. ‘మా నాన్న నన్ను తిడుతున్నాడు. కొట్టబోతున్నాడు. మీరు హెల్ప్‌ చేయాలి’ అని. తెలుగువాళ్ల ఇంటికి పోలీసులు రావడం సాటి తెలుగువారందరికీ అక్కడ వార్త. పోలీసులు వచ్చి తల్లిదండ్రులను ‘ఏమైంది?’ అని అడిగారు. ‘ఏం లేదు. మాట వినడం లేదు. తను అమ్మాయి. చాలాసేపు ఫ్రెండ్స్‌ దగ్గరకు వెళుతోంది. చాటింగ్‌ చేస్తోంది. ఎక్కడ ఉంటోందో సమాధానం చెప్పడం లేదు. ఇది మా సంస్కృతికి విరుద్ధం. అందుకని కొంచెం గట్టిగా మాట్లాడాం. మీరైనా మా అమ్మాయికి బుద్ధి చెప్పండి’ అన్నారు తల్లిదండ్రులు.

అయితే పోలీసులు ఆ పని చేయలేదు. ఎదురు తల్లిదండ్రులనే కూచోబెట్టి అమెరికాలో పిల్లలకు ఉండే హక్కులు, వారి రక్షణకు ఉన్న చట్టాలు వివరించి వెళ్లారు. తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రికి అమెరికాలో వ్యాపారం ఉంది. ముగ్గురు పిల్లల చదువులూ సగం సగంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఇండియాకు తిరిగి వెళ్లిపోవడం కుదరని పని. అందుకే రెండో కూతురిని, భార్యను ఇండియాకు పంపించేశాడు భర్త. ‘నేను తర్వాత వస్తాను ముందు నువ్వు వెళ్లు. ఇది ఇక్కడే ఉంటే చేతికి దక్కదు’ అని పంపించేశాడు. కూతురిని తీసుకొచ్చిన తల్లి హైదరాబాద్‌లో ఫ్లాట్‌ తీసుకొని శ్రీమిత్రను ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చేర్పించింది. పరిస్థితి కుదుట పడుతుందిలే అనుకుంది. కాని శ్రీమిత్ర మరింత మొండిగా తయారైంది.

స్కూలుకు ఒకరోజు వెళితే ఒకరోజు వెళ్లదు. శుభ్రంగా ఉండదు. చెప్పినమాట వినదు. కోపంగా ఉంటుంది. తల్లి ఇవన్నీ తట్టుకోలేక సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకొచ్చింది. సైకియాట్రిస్ట్‌ శ్రీమిత్రను గమనించి చూశాడు. ఐ కాంటాక్ట్‌ ఇవ్వడం లేదు. చెప్తే అటెన్షన్‌తో వినను అన్నట్టుగా బాడీ లాంగ్వేజ్‌ ఉంది. కొంచెం మురికిగా కనిపిస్తోంది. ‘ఏంటమ్మా సమస్య’ అని అడిగాడు తల్లిని. ‘అమెరికా వాళ్లకు పుట్టాల్సిన పిల్ల మాకు పుట్టింది డాక్టర్‌. నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంగారు పిల్లలు. చెప్పినట్టు ఉంటారు. ఇదే... మా ప్రాణాలు తినేస్తోంది. అమెరికాలో అమెరికా పిల్లల్లా మన పిల్లలు మెలగాలంటే ఎలా డాక్టర్‌? పెద్ద కొంపలు ముంచే పనులు ఏమీ చేయలేదు కానీ ఎక్కడ చేసేస్తోందో అన్నట్టు ఉంది దీని వాలకం. భయపడి తీసుకొచ్చేశాం.

ఇక్కడ ఇంకా భయం పుట్టిస్తోంది’ అంది తల్లి. ‘సరే. మీరు వెళ్లండి. మీ అమ్మాయి వెంటనే నోరు తెరిచే చాన్స్‌ కనపడటం లేదు. రెండు మూడుసార్లు వచ్చాక నెమ్మదిగా మాట్లాడతాను’ అని పంపించేశారు. ఆమె మళ్లీ కూతురుని తీసుకొని రెండు మూడుసార్లు వచ్చింది. నాలుగోసారి తల్లిని బయట కూచోబెట్టాక శ్రీమిత్ర మాట్లాడింది. ‘అంకుల్‌... నేను అమెరికా బార్న్‌ అన్నమాటేకానీ పెరగడం అంతా ఇండియాలోలాగే పెంచారు అమ్మా నాన్నా. అది చేయ్యొద్దు... ఇది చెయ్యొద్దు... వారితో తిరగొద్దు.. వీరితో మాట్లాడొద్దు... ఆ బట్టలు వద్దు.. ఈ పార్టీకి వద్దు... కథలు వింటే రామాయణం, భారతాలే వినాలి... టీవీ చూస్తే తెలుగు చానల్సే చూడాలి... నేను పదేళ్ల వరకూ విన్నాను. కాని ఆ తర్వాత నా ఫ్రెండ్స్‌తో కంపేర్‌ చేసుకుంటే వాళ్లు ఉన్న స్టయిల్‌కి నేనున్న స్టయిల్‌కి చాలా డిఫరెన్స్‌ కనిపించింది. వాళ్లు గుడ్‌ ఫ్రెండ్స్‌. ఏమీ చెడిపోలేదు. నేను మాత్రం ఎందుకు చెడిపోతాను.

కాని మా డాడీకి మాత్రం పుస్తకంలో రాముడు, సీతలా కచ్చితంగా మేమంతా ఉండాలని కోరిక. మా అక్క, తమ్ముడు అడ్జస్ట్‌ అయ్యారు కాని నేను కాలేకపోయాను. నా రైట్స్‌ నాకు కావాలనిపించింది. నా ఇండివిడ్యుయాలిటీ కావాలనిపించింది. పేరెంట్స్‌కు నేను రెస్పెక్ట్‌ ఇస్తాను. కాని నాక్కూడా పేరెంట్స్‌ రెస్పెక్ట్‌ ఇవ్వాలి.. ఐ మీన్‌ నా ఫీలింగ్స్‌. అది లేకుండా నన్ను తిట్టడం కొట్టడం చేశారు. అందుకని నేను మొండిగా మారాను. వారు వద్దన్నది చేయడమే ఇప్పుడు నా ముందు ఉన్న పని’ అంది. ఆ తర్వాత తల్లితో మాట్లాడాడు సైకియాట్రిస్ట్‌. ‘సార్‌. ఏం చేసేది... నేను ఏం నేర్చుకున్నానో అదే నా పిల్లలకు నేర్పాను. మా నాన్న ఆడపిల్లల విషయంలో అంత స్ట్రిక్ట్‌ కాదు. కాని పెళ్లయినప్పటి నుంచి నా ప్రతి పద్ధతిని నా హజ్బెండే డిసైడ్‌ చేశాడు. ఆయన నడిచే రూల్‌బుక్‌లా ఉంటాడు.

డిసిప్లిన్‌ లేకపోతే పిల్లలు కాని భార్య కాని నాశనమైపోతారని అతని థియరీ. నాకెప్పుడు ఆయన సపోర్ట్‌ లేదు. అదే కరెక్ట్‌ ఏమో అనుకుని పిల్లల్ని పెంచాను. ఇది ఎదురు తిరిగింది’ అందామె. ‘ఒకసారి మీవారితో కూడా మాట్లాడాలమ్మా’ అని నంబర్‌ తీసుకున్నాడు సైకియాట్రిస్ట్‌. ఆ తర్వాత రెండు రోజులకు శ్రీమిత్ర తండ్రి లైన్‌లోకి వచ్చాడు. ‘నా తప్పేమిటి డాక్టర్‌. మన పద్ధతుల్లో పెంచడం తప్పా. మేం చాలా పేద కుటుంబం నుంచి వచ్చాం. మా నాన్న డిసిప్లిన్‌ వల్లే నేను ఇంతవాణ్ణి అయ్యానని నేను నమ్ముతాను. ఆ డిసిప్లిన్‌ కోసమే నేను నా కూతురిపై కోప్పడ్డాను. నాకు మాత్రం నా పిల్లలంటే ఇష్టం ఉండదా?’ అన్నాడతను. అంతా విన్న సైకియాట్రిస్ట్‌ ఈ కేసులో ముగ్గురు పార్టీలను నిర్వచించాడు. ఒకటి కౌన్సిలర్‌. అంటే తను. రెండు లిజనర్స్‌ అంటే తల్లిదండ్రులు.

మూడు ఎక్స్‌ప్రెసర్‌ అంటే శ్రీమిత్ర. అమెరికా నుంచి కొన్ని రోజుల కోసం తండ్రిని పిలిపించి వాళ్ల ముగ్గురితోనూ మాట్లాడటం మొదలుపెట్టాడు సైకియాట్రిస్ట్‌. ‘రిసీవింగ్‌ ఎండ్‌ను అర్థం చేసుకోకుండా అందరికీ ఒకే రకమైన రూల్స్‌ పాస్‌ చేయలేం’ అని మెల్లగా చెప్పడం మొదలెట్టాడు. తనకేం కావాలో తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పేలా శ్రీమిత్రను ఎంకరేజ్‌ చేశారు. పరస్పర స్నేహం, పరస్పరం అర్థం చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు సర్దుబాటు చేసుకోవడం ఇవన్నీ కొన్నాళ్లు నడిచాక ముగ్గురిలోనూ చాలా మార్పు వచ్చింది. అమెరికాలో అమెరికన్‌ అమ్మాయిలతోపాటు ఉంటూ కూడా మన పద్ధతిలోనే కావలసిన స్వతంత్రం ఎలా తీసుకోవచ్చో తల్లిదండ్రులకూ, శ్రీమిత్రకు అర్థమైంది. శ్రీమిత్ర ఒక్క సంవత్సరమే హైదరాబాద్‌ స్కూల్‌లో చదువుకుంది. ఇప్పుడు అమెరికాలో చదువుకుంటోంది. ఆ కుటుంబం ఇప్పుడు పెంపకానికి సంబంధించిన చికాకుల నుంచి బయటపడినట్టే.
– కథనం: సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి,
సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top