పలాయనం

Palayanam Illu stration - Sakshi

సిటీ నుండి అనుకున్న టైం కంటే రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాం. ఎప్పటినుండో నా స్నేహితుడు తను మూడేళ్ళక్రితం కొన్న పొలం చూడడానికి రమ్మంటుంటే, ఇప్పటికి కుదిరింది. నాకు రెండు రోజులు సెలవు దొరికినప్పుడే వెళ్దాం అన్న మాటగురించి ఈ శని, ఆదివారాలు ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. వాడు వ్యాపారస్థుడు కాబట్టి తను ఎప్పుడు వెళ్ళాలన్నా వెళుతుంటాడు. 
ఏడుగంటలకు అన్నవాడు ఎనిమిదైనా పత్తాలేడు. ఫోను చేశాను. ఇంకో గంట పడ్తుంది, రెడీగా ఉండు వచ్చేస్తాను అన్నాడు. ఆకలి అనిపించింది. ‘‘మీ ఫ్రెండు ఎప్పుడు టైముకి వచ్చారు కనక’’ అని విసుక్కుంటూనే నా భార్య ‘‘ఉండండి కొంచెం ఉప్మా  చేసేస్తాను’’ అంటూ లోపలికెళ్ళింది. నాకు ఉప్మా రెడీ చేసి తెచ్చేంతలో మావాడు ఫోన్‌ చేసి ‘‘కిందికి వచ్చెయ్యి, నేను అయిదు నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను’’ అన్నాడు. చేసేది లేక లంచ్‌ బాక్సులో పెట్టెయ్యమన్నాను. ‘‘మీరూ, మీ స్నేహితుడూ ఎప్పుడూ ఇంతే’’ అని కసురుకుంటూనే ఉప్మా సర్ది పెడుతూ, ‘‘రేపు మధ్యాహ్నానికి వచ్చేస్తారుకదా!’’  అంది అనుమానంగా. అంతలో మా వాడు పొలో మంటూ హారను మోగించాడు. 

బ్యాగులోనే టిఫిన్‌ బాక్సు కుక్కి పరిగెత్తుకుంటూ మెట్లు దిగివచ్చి కారు ఎక్కాను. ‘‘రాత్రి పార్టీ, బాగా ఆలస్యం అయిపోయిందిరా, ఎవళ్ళో ఆఫీసర్లను తీసుకెళ్ళాల్సొచ్చింది. లేచి రెడీ అయ్యేటప్పటికి కొంచెం తలపోటు మొదలయ్యిందిరా. ఇంకో అరగంటలో ఓ కొత్త రెస్టారెంటు వస్తుంది అక్కడేదన్నా తిని వెళ్దాం’’ అన్నాడు. అప్పుడు చెప్పాను ఉప్మా సంగతి. ‘‘తొందరగా తియ్యరాబాబూ! వెళ్తూ వెళ్తూనే తినేద్దాం’’ అని కంగారు పెట్టేశాడు. హైవే దిగి సన్నటి తారురోడ్డు మీద వెళుతున్నాం. వాడు ముందులో కొన్నాళ్ళు ప్రైవేటు ఉద్యోగం చేశాడు ఒక పెద్ద కాంట్రాక్టరు దగ్గర. సొంతంగా వ్యాపారం మొదలెట్టి పదేళ్లవుతుందనుకుంటాను. బాగానే సంపాదించాడు. కొన్న ఆస్తులన్నీ విపరీతంగా పెరిగాయి. అయినా ఎప్పుడూ ఆందోళనగా ఉంటాడు. కాలేజీ నుంచీ స్నేహితం. నెలకో రెన్నెల్లకో తప్పకుండా కలుస్తాం. మంచి పార్టీలకు తీసుకెళ్తుంటాడు. నాకదో వైభోగం. వాడికి తన వైభవం ప్రదర్శించుకోవడానికి నేనో అవకాశం. ఉప్మా తిన్నాక కొంచెం రిలీఫ్‌గా ఉంది ఇద్దరికీ. కబుర్లు చెప్పుకుంటూ మెల్లగానే వెళుతున్నాం. 

‘‘ఇంకెంత దూరం’’ అడిగా. అప్పటికి ఒంటిగంట అవుతోంది. ‘‘మరో ముఫ్ఫై కిలోమీటర్లే, కానీ గంటపైనే పడ్తుంది. రోడ్డు కొంచెం బాగోదు ఇక్కణ్ణుంచి’’ అన్నాడు. ‘‘ఒరేయ్‌ ముందు ఏదో హోటలులా ఉంది ఆపరా ఏమన్నా తిందాం’’ అంటే.. ‘‘ఏయ్‌ అది హోటలేందిరా, బాగోదు’’ అని వాడు అంటున్నా, బతిమాలి ఆపుచేయించాను.   నేను కారు దిగి  సందేహిస్తూ ఆ పాక ముందు నిలబడ్డాను. ‘‘రండిసార్‌. లోపలికి రండి. ఇక్కడ బావుంటాది. ఇక్కడ కూసోండి’’ అంటూ మాంచి హుషారుగా ఓ కుర్రాడు నాలుగు కుర్చీలు, ఓ ప్లాస్టిక్‌ టేబుల్‌ ఉన్నదగ్గర చూపిస్తూ, అవన్నీ ఓ గుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేస్తున్నాడు. ఇంతలో మావాడు వచ్చి ‘‘ఇక్కడేవుంటయిరా తినడానికి’’ అంటుండగానే ఆ కుర్రాడు ‘‘ఏం కావాలో సెప్పండి సార్‌. ఏడేడిగా ఇప్పుడే సేస్తాం సార్‌’’ అన్నాడు కొంచెం కంగారుగా, మేమెక్కడ వెనక్కి వెళిపోతామోనని. నేను ఓ కుర్చీలో కూలబడిపోయి ‘‘ఇప్పుడు చెప్పరా బాబూ. తిండానికి ఏం బావుంటాయిక్కడ?’’ అడుగుతుండగా ఒకతను లోపల్నించి వచ్చాడు. ఏభై పైనే ఉంటుంది వయసు. కొంచెం పొట్ట, కళ్ళు ఉబ్బి మెడపై ఉబికిన కండ నల్లబారి ఉంది. ‘‘భోజనం దొరుకుద్ది కానీ మీరు తినలేరు. అన్నం పప్పూ మాత్రం ఉన్నాయి. కూర అయిపోయింది. గిరాకి ఎక్కువ లేదని అక్కడికక్కడే చేస్తం’’. వెనకనుండి మావాడు ‘‘లేరా! ఒక్క గంటలో పొలం వెళ్లిపోతాం’’. నీరసంగా లేవబోతుంటే ఆ కుర్రాడు ‘‘కూతంత ఆగండి సార్, మా అమ్మని అడిగి ఒత్తా’’ అంటూ లోపలికి పరుగు తీశాడు. 

ఆ పెద్ద మనిషి కాళ్ళీడ్చుకుంటూ పక్కకు వెళ్ళిపోయాడు. నేను మొహమాటానికి కూర్చొని ఉండిపోయాను. 
కుర్రాడు హడావిడిగా వచ్చి ‘‘సార్‌! మా అమ్మ మంచిగా కోడిగుడ్డు అట్టు ఏత్తది సార్, ఉల్లి, పచ్చిమిర్చి ఏసి – చాలా బాగా ఏత్తది సార్‌. అయిదు నివసాలే సార్‌ ’’ అని నా కళ్ళల్లోకి దీనంగా చూశాడు. ‘‘సరే రెండు వెయ్యమను, తొందరగా’’ అన్నానో లేదో, పరుగునపోయాడు లోపలికి. మావాడి చిరాకును శాంతపరుస్తూ ‘‘నాకు చాలా ఆకలిగా ఉందిరా. ప్లీజ్‌! తినేసి వెళ్దాం’’ అన్నాను. ఆకలితో నేను ఎదురు చూస్తుండగా రెండు ప్లేట్లతో కుర్రాడు వచ్చేశాడు. ఆమ్లెట్‌ చాలా బావుంది. నా స్నేహితుడు సగం ముక్క చేసి నాకు వేసి, అయిష్టంగానే తినడం మొదలెట్టాడు. ఇంతలో ఆ కుర్రాడు వచ్చి, ‘‘ఎలా ఉంది సార్‌ అట్టు?’’ అనడిగాడు. ‘‘బావుందోయ్‌ చాలా’’ అన్నాను. ‘‘సార్, అయితే ఇంకో అట్టు వేయించుకొత్తా సార్‌. ఒక్క నివసంలో అయిపోతాది అన్నీ రెడీగా ఉండాయి సార్‌’’. ‘‘సరే’’ అనగానే వాడు హుషారుగా పరుగెత్తాడు. మరో ఆమ్లెట్టు వచ్చింది. నాకు చిన్న ముక్క వేసి మావాడు లాగించేశాడు. అప్పుడడిగాను వాణ్ణి ‘‘నీపేరేంటి?’’ అని. ‘‘చాకూ’’ అన్నాడు హుషారుగా.  ‘‘అదేం పేరోయ్‌!’’ అన్నాన్నేను వింతగా.   ‘‘వాడి పేరు నరసింహ బాబూ’’ లోగొంతులో స్త్రీ కంఠం లోపల్నించి వినబడింది.ఆమె మెల్లగా రెండడుగులు ముందుకు వచ్చి నిలబడి, ‘‘హుషారుగా ఉంటాడని అందరూ అలా పిలుస్తారు కాని, వాడి పేరు నరసింహ బాబూ’’ అంది చిన్న నవ్వుతో. 

ఆమెకు నలభై దాటుండొచ్చు కాని అంతకు మించి కనబడుతోంది. ముందు చామనచాయే అయ్యుండొచ్చు. పనికీ, కష్టానికీ, పోషణ కరువైనందునా ఆమె నల్లగా కనబడుతోంది. తైల సంస్కారం లేని జుట్టూ, అరకొర తిండికి శుష్కించిన లొట్టబోయిన చెంపలూ, మట్టిగాజులు కూడా లేని చేతులూ – ఆమె మూర్తీభవించిన దైన్యంలా ఉంది.  మాట, నిలుచున్న తీరు చూస్తే ఒద్దికయిన మనిషి అనిపిస్తుంది. ‘‘నాపేరు చాకూనే సార్, అలాగే పిలవండి’’ అన్నాడు చాకూ మరింత హుషారుగా.   ‘‘బిల్లెంత?’’ అనడిగాను. ‘‘అరవై రూపాయలు సార్‌’’ అన్నాడు చాకూ.  ‘‘సరే! ఇదిగో డబ్బులు తీసుకో’’ అని వంద కాగితం ఇచ్చాను. చాకూ వాళ్ళ అమ్మ వంక చూశాడు. ఆమె అయోమయం చూసి అప్పుడు గమనించాను, అప్పటివరకూ ఉన్న ఆ పొట్ట మనిషి ఆ చుట్టుపక్కల లేకపోవడం. ‘‘చిల్లర ఉందాండీ?’’ ఆమె చిన్న స్వరంతో అడిగింది. పర్సు వెతికాను. మావాడు అప్పటికే కారులో కూర్చొని ఉన్నాడు. కొంచెం దగ్గరకెళ్ళి చిల్లర కోసం అడిగితే లేదన్నాడు. ఆ విషయం నేను చెప్పేలోపే చాకూ అన్నాడు. ‘‘సార్, ఆ ముంగటే ఒక కిరాన దుకానం ఉంది సార్‌. అక్కడ దొరుకుద్ది  సిల్లర. అక్కడవరకూ నేను వత్తాను’’  ‘‘మరి వెనక్కు?’’ అడిగాను. 

‘‘నడిసి ఒచ్చేత్తాను సార్‌’’ చాకూ కారు వెనుక సీటులో కూర్చుని అన్నాడు.‘‘సార్, మీరు పట్నంలో ఉంటారనుకుంటాను. మమ్మల్ని తీసుకెల్లండి. మాయమ్మ, నేను ఏ పనైనా సేత్తాం’’  ‘‘ఏం పనులు చెయ్యగలరు?’’ అన్నాడు మావాడు, అప్పటివరకూ లేని ఆసక్తిని చూపిస్తూ. ‘‘మా అమ్మ వంట బాగా సేత్తాది సార్‌. వంటే కాదు సార్, ఇంటిపనులెయ్యైనా సేత్తాది. ఇప్పుడు రోజూ తెల్లారినంక మొదలెట్టి రేత్రి పొద్దోయేదాకా పని సేత్తానే ఉంటాది సార్‌ మాయమ్మ’’‘‘మరి నువ్వు?’’ మావాడి ప్రశ్న. ‘‘నేను అన్ని పనులూ సెయ్యగలను సార్‌. ఇంకో రెండుమూడేల్లయితే కారు తోలడం కూడా నేర్సుకుంటాను సార్‌’’ అని ఆగాడు, మేం ఏం చెబుతామో అని ఆతృతగా. షాపు వచ్చింది. కారు ఆపాడు కాని కారు లాక్‌ తెరవలేదు మావాడు. వెనక్కి తిరిగి అడిగాడు. ‘‘మరి మీ నాన్న ఏం చేస్తాడు?’’ ‘‘ఆడి సంగతి ఒదిలెయ్యండి సార్, మమ్మన్నెలాగైనా తీసుకెల్లండి సార్‌’’ అన్నాడు ఆందోళనగా. నేను ఉండబట్టలేక ‘’నీ వయసెంత చాకూ? ఏం చదువుతున్నావు?’’ అని అడిగాను. 

‘‘సరిగ్గా తెలియదు సార్‌! కానీ మా అమ్మ చెప్పేదాన్నిబట్టి పద్నాలుగేళ్ళు సార్‌. నాలుగుతో ఆగిపోయింది సార్‌ నా సదువు’’ మావాడికి ఇంకొంత ఆసక్తి కలిగి అడిగాడు ‘‘మీ నాన్నకు తెలియకుండా వచ్చెయ్యాలనా?’’ ‘‘అవును సార్‌. రేపు మీరు ఎల్లేటప్పుడు ఆగండి తప్పకుండా. నేనూ మాయమ్మా ఎలాగైనా మీతో ఒచ్చేత్తాం’’ బతిమాలుతూ అన్నాడు. ‘‘సరే రేపు సాయంత్రం ఇటు వెళ్తూ ఆగుతాం. రెడీగా ఉండండి. మీ నాన్నతో ఏదైనా గొడవ వస్తుందంటే మాత్రం తీసుకెళ్ళం. ఆలోచించుకో. మీ అమ్మతో కూడా చెప్పు’’ అన్నాడు మావాడు, కారు లాక్‌ తెరుస్తూ. నేను దిగి చిల్లర తీసుకొని చాకూకి మరో ఇరవై ఇవ్వబోతూంటే వద్దని చెప్పి, ’’రేపు ఎలాగైనా మీరు  తీస్కెల్లండి సార్‌.  కట్టపడి పని సేత్తాం సార్‌’’ అని నా మాటకోసం చూడకుండానే రోడ్డు అవతలకు దాటి వెనక్కి చూసుకుంటూ పరుగెత్తుకు వెళ్ళిపోయాడు. నా స్నేహితుడి పొలం, ఫాం హౌస్‌ బావున్నాయి.  సౌకర్యాలన్నీ బానే సమకూర్చాడు. మేం చేరేటప్పటికే నాలుగు దాటిపోయింది. ఉత్త పెరుగన్నం తినేశాం. గడ్డ పెరుగు చాలా బావుంది.

 మావాడు అన్నాడు.. ‘‘ఈ పక్కన మరో పదెకరాలు అమ్మకానికుంది. నువ్వు కొనుక్కోరా. నాకు తోడు ఉన్నట్టూ ఉంటుంది. నీకు రిటైర్మెంటుకి పనికొస్తుంది’’ అన్నాడు. ‘‘చాల్లేరా! ఆశకు హద్దు ఉండాలి. నేను జాగ్రత్త చేసిందే అంతంతమాత్రం. ఇంకా పిల్లలను చదివించి వాళ్ళు స్థిరపడేలా చెయ్యడమే నాకు గగనం’’ అన్నాను చుట్టూ చెట్లూ అవీ చూసి ఆనందిస్తూ. ఆ సాయంత్రం నాటుకోడి కూరతో మందు తాగుతూ పొద్దు పోయేవరకూ కబుర్లు చెప్పుకొని బాగా ఎంజాయ్‌ చేశాం. పొద్దున్న టిఫిను, కాఫీలు అయ్యాక నాకు ఒక మనిషిని ఇచ్చి పొలం అంతా చూసి రమ్మని పురమాయించి తను ఊర్లోకి వెళ్ళి పనులు చూసుకొస్తానని వెళ్ళినవాడు మధ్యాహ్నం రెండింటికి వచ్చాడు. వస్తూనే ‘‘సారీరా, నీకు బోరు కొట్టిందేమో! ఏవో ఒక తకరార్లు లేకుండా ఇక్కడ వ్యవహారాలు ఉండవనుకో. సాయంత్రం ఇద్దరు పెద్దమనుషులు వస్తానన్నారు. రేపు ఉదయం బయలుదేరి వెళ్దాం. మీ ఇంటికీ, నీ ఆఫీసు కొలీగ్‌కీ ఫోన్లు చేసి చెప్పెయ్యరా ప్లీజ్‌’’ అన్నాడు. 

‘‘ఫరవాలేదురా, నీ పన్లు కానియ్యి’’ అన్నాను. ఇంతట్లో మావాడు అక్కడి పనివాళ్ళతో వంటల పురమాయింపు మొదలెట్టాడు, చేపలూ, రొయ్యలూ అంటూ. ‘‘ఎందుకురా అన్ని రకాలు’’ అంటే, ‘‘బయటి పెద్దమనుషులు ఉన్నారు కదా. కాస్త వాళ్ళను ప్రసన్నం చేసుకొవాలోయ్‌!’’ అని నవ్వాడు. ఆ రాత్రి బాగా పొద్దుపోయింది. మర్నాడు పొద్దున్నే ఎనిమిదికే బయలుదేరాం టిఫిన్‌ తినేసి. ఒక గంట ప్రయాణం చేసేటప్పటికి, నిన్న ఆమ్లెట్లు తిన్న ఊరి దగ్గరకొచ్చాం. అప్పటివరకూ ఆ సంగతే మర్చిపోయాం. ఆ మాటే అన్నాను. దానికి మావాడు ‘‘నేను మరిచి పోలేదురా బాబూ! ఆ తల్లీ కొడుకుల్నిద్దర్నీ తీసుకెళ్ళాలి కదా! ఆమె చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుంది. సందేహం లేదు. ఇక ఆ కుర్రాడంటావా, ఏవిటీ పేరు –– చాకూ కద! నిజంగా చాకూ లాంటి కుర్రాడేరా. నాకూ ఇంటిదగ్గర పనోళ్ళ అవసరం చాలా ఉంది. వీళ్ళు చూస్తే నమ్మకస్తుల్లాగా, వళ్ళు దాచుకోకుండా పని చేసేవాళ్ళలాగా కనబడుతున్నారు’’ చెప్పుకుపోతున్న మావాణ్ణి ఒకసారి ఆగమని సైగ చేసి ‘‘ఏవిట్రా అక్కడ జనం గుమిగూడారు? అదేకదా మనం తిన్న చోటు?’’ అంటుండగానే అక్కడకు మేం సమీపించడం, కారు ఆపుచెయ్యడం జరిగిపోయింది. 

దిగి అనుమానిస్తూ దగ్గరకు వెళ్ళాం. అక్కడ చేరిన సుమారు పదిమందిలో కొందరు వెనక్కి చూసి మాకు దారి ఇచ్చి తప్పుకున్నారు. ఒక్క క్షణం అక్కడి దృశ్యం చూసిన నేను నిశ్చేష్టుణ్ణయిపోయాను. ఆ పొట్ట మనిషి వెల్లకిలా చచ్చిపడి ఉన్నాడు. అతని దగ్గర కూర్చొని ఆ ఆడమనిషి మొహం కప్పుకొని కూర్చొని ఉంది. చాకూ దూరంగా చూరుకింద పొయ్యిగట్టుకు జేరబడి కూర్చున్నాడు. మమ్మల్ని చూడగానే ఒక్కసారిగా కోపోద్రిక్తం అయిపోయినట్టు అయ్యి గబగబా వచ్చి నాకళ్ళ దగ్గర కూర్చొని గట్టిగా అరుస్తూ––‘‘నిన్న ఒత్తానన్నోల్లు ఎందుకు రాలేదు బాబూ మీరు. మీరు వచ్చి ఉంటే మా అమ్మకి ఈ గోరం జరక్కపోను. ఈడి సెర నించి అమ్మని ఇడిపించాలనుకున్నాను. అందుకు మీ ఆసరా తీసుకుందారనుకున్నాను. కానీ ఆలీసెం జేసేశారు సారూ!’’ ఇంతలో గుంపులో ఒకతను కలగజేసుకుని ‘‘దారంటా పొయ్యే బాబుల్ని అడిగితే ఆల్లేటి సెబుతార్రా, సెయ్యాల్సిందంతా సేసేసి నిన్ను కాపాడమంటే ఒవులు కాపాడతార్రా’’. చాకూ కళ్ళెత్తి చూసేడు ఆ మనిషి వంక. 

‘‘ఆల్లు దారంటా పొయ్యే బాబులయితే, మరి నువ్వెవర్రా. మాకేవవుతావురా? ఆడి దగ్గర కూంత పైకం ఉన్నప్పుడెల్లా ఆడితో సందటేల ఇక్కడే తాగి, ఆడికి కైపెక్కి మాయమ్మని సావదన్నే టయానికి ఎప్పుడన్నా అడ్డం వచ్చావురా?’’ ఇంతలో వెనకనుండి మావాడి విసుగుతో కూడిన సైగలకి రెండడుగులు వెనక్కి వేసేంతలో చాకూ చెయ్యి పట్టుకుని ఆపి చెప్పడం మొదలెట్టాడు. 
‘‘ఈ మనిసికీ మాయమ్మకీ ఏకాన్నుంచి సంబందవో నాకు తెలవనే తెలవదు. మాయమ్మ ఎప్పుడూ సెప్పలేదు. వారానికి నాల్రోజులయినా నిండా తన్నులు తినడం అలవాటు శేసుకుంది. పైకి సప్పుడు అవ్వకుండా ఏడ్సుకోటం నేర్సుకుంది. నేనేమైన గట్టిగా అడిగితే నవ్వేత్తం అబ్బాశం సేసింది. నాకు ఊహ ఒచ్చాక నేను బల్లోకెల్తున్న కొత్తలో అని గుర్తు –– ఈడు నా నాన్నేనా అని అడిగితే ఒల్లో పడుకోబెట్టుకుని నిదరోబెట్టేసింది కానీ నాకెప్పుడూ ఇసయం సెప్పలేదు. 

అప్పట్నించీ అడగడం మానేశాను. కానీ ఇన్ని అగసాట్లు పడతా ఈడికాడ ఎందుకే మనం అంటే ‘ఓ మగతోడు’ అని మాత్తరం ఓ ముక్క కక్కింది. ఇదా మగ తోడంటే? ఈడా మగదిక్కంటే? బరించటం మాయమ్మకి అలవాటయిపోయింది కానీ, సూత్తా ఊరుకోటం నావల్ల అవుతల్లేదు. ఎన్నాల్లని? పూర్తిగా కడుపుకి తిని ఎంత కాలవయ్యిందో మాయమ్మ. సలికి నేను వనకతావుంటే దాని కొంగంతా నా సెవ్వుల్కి కప్పి ముడిసిపెట్టుకు పడుకుందేకానీ నాకు సలి గాలి జొరనివ్వలేదు. జొరంతో కాలిపోతున్న ఒంటితో నాకు సలి కాసేది సార్‌ మాయమ్మ. అంత సల్లోనూ, ఆకలితోనూ అంత ఎచ్చటి నీల్లు ఎలా ఒచ్చేయో మాయమ్మ కంట్లోంచి నాకిప్పుడికీ అర్తం కాదు సార్‌. సార్‌ సలికి వొనకొచ్చు, వానకి తడవొచ్చు, ఎండకి మాడొచ్చు, ఆకల్ని తట్టుకోవచ్చు కానీ మాయమ్మ బాదని సూత్తా తట్టుకోటం కట్టం సార్‌. అది కూడా పెతి రోజూ. అందుకే ఈడికి దొరకనంత దూరంగా మాయమ్మని తీస్కపోవాలని ఆసపడి మీదగ్గర నోరు తెరిసాను సార్‌. మాయమ్మని ఈ నరకంలోంచి ఎలాగైనా బైటపడెయ్యాలనే కానీ ఏరే ఆసలేవీ లేవు సార్‌ నాకు. ఓ గట్టి  కోర్కి మాత్తరం ఉండేది సార్‌. ఈడ్ని సంపెయ్యాలని. మా అమ్మని బాది బాది, అలిసిపోయి తాగిన మత్తులో తొంగున్నప్పుడు సాలాసార్లు సంపెయ్యాలనుకున్నాను సార్‌. మాయమ్మ పెతీసారీ నన్ను వాటేస్కుని ఆపేసినందుకే ఈడు బతికిపొతా వచ్చేడు సార్‌ ’’ చాకూ కొంచెం ఆగాడు కాస్త ఊపిరి తీసుకోవాలన్నట్టు. 

అప్పటికే సగమ్మంది జారుకున్నారు. వాడి మాటల సెగలు తగిలినోళ్ళు కావొచ్చు. మనకెందుకొచ్చిన లంపటం అనుకున్నోళ్ళూ కావొచ్చు. చాకూ మళ్ళీ గొంతు విప్పాడు. ‘‘ఇప్పుడైనా మాయమ్మ ఈడ్ని ఒదిలి ఎల్లిపోటాకి ఎందుకు ఒప్పుకుందో దెల్సా సార్‌? నేను ఇలాంటి ఒగాయిత్తెం సేత్తానేమో అనే బయ్యం సేత’’. ఏదో మోటారు శబ్దం వస్తే అందరూ గాభరాగా పక్కకు జరుగుతుండగా చూశాను, పోలీసు జీపు రావడం. వెనకే ఇంకో వ్యాన్‌ వచ్చి ఆగింది. ముందు కానిస్టేబుళ్ళు అందర్నీ తప్పుకోవాలని హడావిడి చేస్తూ ఉండగా ఇన్‌స్పెక్టర్‌ వచ్చి  శవం దగ్గర పరిశీలించి మిగతావాళ్ళకి సూచనలు చేశాడు. ఆమెను కాస్త లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఇద్దరు లేడీ కానిస్టేబుళ్ళు. లేచి నించున్న చాకూ దగ్గరకు వెళ్ళి ‘‘వీళ్లల్లో మీకు సంబంధం ఉన్నవాళ్ళూ, బంధువులు ఎవరు?’’ అని అడిగాడు. ఎవ్వరూ లేరన్నట్టు తల అడ్డంగా ఊపాడు చాకూ. 

మెల్లగా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను తెల్లబోయి చూస్తుండగా ఇన్‌స్పెక్టర్‌ మర్యాదగా నన్ను అడిగాడు.. ‘‘మీరు ఎవరు? వీళ్లకీ మీకూ ఏవిటి సంబంధం?’’. చాకూ తొందరబాటుగా ‘‘ఆల్లకేవీ తెల్వదు సార్‌. ఇక్కడ తింటాకని ఆగేరు’’ అన్నాడు. ‘‘నిన్నడిగానా? నిన్నడిగానా?’’ అని గద్దించి మరీ అన్నాడు. ‘‘నువ్వేం చేశావో నీకు తెలుస్తోందా? అందుకు శిక్ష ఏవిటో నీకు తెలుసా? మైనారిటీ కూడా తీరని నీకు ఇయ్యన్నీ ఏవి తెలుస్తాయి? గాలికి పుట్టావు. గాలికి పెరిగావు. గాలికి తిరుగుతున్నావు. ఇంకాబొడ్డూడని నీకు ఇవన్నీ ఏం తెలుస్తాయి?’’‘‘తెలుసు సార్‌’’ చాకూ కంఠం స్ఫుటంగా వుంది. ఇన్‌స్పెక్టర్‌కి కొంచెం అసహనం పెరిగింది. ‘‘ఏవి తెలుసురా నీకు?’’ అని రెట్టించాడు. ‘‘నేను మైనర్‌ని అని తెలుసు సార్‌. ఉరి సిచ్చ పడదని దెల్సు సార్‌. మాలాంటి మైనర్‌ నేరగాల్లకు సదువు సెప్తారని దెల్సు సార్‌.’’‘‘అయితే’’ అని తదేకంగా చూశాడు ఇన్‌స్పెక్టర్‌ చాకూని. ‘‘సదూకుంటా సార్‌’’ 

‘‘ఆ! చదువుకొని? ఎన్నాళ్ళుపడుతుందో తెలుసా నువ్వు బయట పడటానికి? మీయమ్మ ఏం చెయ్యాలి అప్పటివరకూ? నీకు చదువు రావాలి కదా! వస్తే ఆ చదువుతో ఏం చేద్దామని?’’ 
‘‘సంపుతాను సార్‌.’’ చాకూ గొంతు పూర్తిగా మారిపోయింది. ‘‘చదువుకుని కూడా చంపడం ఏంట్రా?’’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ ఆశ్చర్యంగా.‘‘అవును సార్‌ సదువుతోనే సంపేత్తాను సార్‌. ఇప్పుడు అవుతున్నదదేకద సార్‌. సదూకున్నోల్లే కద సార్‌ నాయాన్ని సంపేత్తాంది. ఎలాటి కత్తులూ వాడకుండా సంపుతా సార్‌. మాయమ్మ లాటోల్లను అన్నాయం సెయ్యాలనుకున్నోల్లను సంపుతాను సార్‌.’’ చాకూ ఎటో చూస్తున్నాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఇన్‌స్పెక్టర్‌ గాఢంగా నిట్టూర్చి, నావంక తిరిగి ‘‘మీరు వెళ్ళండి. మాకు ఫార్మాలిటీస్‌ ఇంకా చాలా ఉన్నాయి’’ అన్నాడు. నేను చాకూ వంక బిక్కుబిక్కు చూస్తూ కారు దగ్గరకు నడిచాను. నా మిత్రుడు కంగారుగా, అసహనంగా ఉన్నాడు. నన్ను చూడగానే కారు స్టార్టు చేశాడు.  సూర్యుడు నడినెత్తికి వచ్చి మండిపడుతున్నాడు లోకం మీద, ’చాకూ’లాగ.     

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top