ఫైర్‌ ఉన్న ఫైటర్‌

ఫైర్‌ ఉన్న ఫైటర్‌ - Sakshi


ఈర్ష్యను మించిన నిప్పు ఉండదు. అందులోనూ మగ అహంకారం నివురుగప్పిన నిప్పు. ఏ మహిళ అయినా ఇలాంటి నిప్పులో దహించుకుపోవాల్సిందే. నిజమే... హర్షిణి కన్హేకర్‌ ఫస్ట్‌ ఉమన్‌ ఫైర్‌ ఫైటర్‌. తను కాకపోతే... మరో మహిళ ఫస్ట్‌ ఫైర్‌ ఫైటర్‌ అయ్యే అవకాశం ఉంది. మరి... తన గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం? భవనాలకు అంటుకున్న నిప్పుని ఆర్పడం మహిళలు చేయగలరు.హర్షిణి వ్యవస్థకు పట్టిన జెండర్‌ నిప్పును ఆర్పింది. మహిళలు ‘దీనిని చేయలేరు’ అని అంటే... దానినే చేసి చూపించింది హర్షిణి. ఒక రగులుతున్న సమస్యను ఆర్పింది.2005.. దీపావళి రోజు.. న్యూఢిల్లీలోని శాస్త్రినగర్‌..

బాంబులు, రాకెట్లు, కాకరపువ్వొత్తులు, భూచక్రాలు, విష్ణుచక్రాలు, చిచ్చుబుడ్ల వెలుగులు, జిలుగులు, మోతలతో మారుమోగుతోంది ఆ ప్రాంతం. అందరూ ఆనందంలో మునిగి ఉన్నారు. ఏ టపాకాయ ఎటు వెళుతుందో.. ఏమవుతుందో పట్టించుకునే స్థితిలో లేరెవరు! కాలుస్తున్నామా.. ఆస్వాదిస్తున్నామా అంతే! ఈ సందడిలోనే ఒక రాకెట్‌ వెళ్లి అక్కడే ఉన్న షూ ఫ్యాక్టరీలోని షూ మెటీరియల్‌ మీద పడింది. క్షణాల్లో ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. ఆ వేడికి బిల్డింగ్‌ పగుళ్లు రావడం ప్రారంభించింది. ఫైర్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశారు. వెంటనే ఫైర్‌ ఫైటర్స్‌ రంగంలోకి దిగారు. దాదాపు ఆరుగంటలు శ్రమించి మంటలను ఆర్పేశారు. చుట్టుపక్కల వాళ్లంతా ఆ ఫైర్‌ దళాన్ని, వాళ్లు చూపిస చాకచక్యం, ధైర్యసాహసాలను మెచ్చుకున్నారు. క్యాప్‌ తీసి చేతిలో పట్టుకుంటూ వస్తున్న ఫైర్‌దళపతిని అమ్మాయిలైతే అడ్మయిరింగ్‌గా చూడ్డం మొదలుపెట్టారు. కొందరైతే షేక్‌హ్యాండ్‌ ఇవ్వడానికి ఉవ్విళ్లూరసాగారు. పెద్దవాళ్లంతా సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నారు. ఆ పాజిటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌కు రీజన్‌.. అడ్వంచరస్‌ దళపతి.. స్త్రీ కావడమే. పేరు హర్షిణి కన్హేకర్‌. మన దేశపు తొలి మహిళా ఫైర్‌ ఫైటర్‌!2002 వరకు ఫైర్‌ ఫైటర్‌ ఉద్యోగాలు కేవలం పురుషులకే పరిమితం. ఆ యేటి నుంచే స్త్రీలకు ప్రవేశం దొరికింది. అది ప్రభుత్వం సడలించిన నియమం కాదు! హర్షిణి సృష్టించిన చరిత్ర. సాధారణంగా ఏ రంగంలోనైనా లేదా ఉద్యోగాల్లోనైనా ఆడవాళ్లకు అవకాశం..  ప్రభుత్వం లేదా వాటిని నిర్వహిస్తున్న ప్రైవేట్‌ యాజమాన్యాల నియమాలననుసరించి ఉంటుంది. కాని నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కమిషన్‌లో మాత్రం దాన్ని బ్రేక్‌ చేసింది హర్షిణీయే.  రోమాంచితంగా ఉందికదా! అందుకే ఆమె బయోగ్రఫీ!దిగులుపడ్డ ఫేజ్‌

హర్షిణి సొంతూరు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌. పుట్టడమే కాదు.. పెరిగింది, చదివింది కూడా అక్కడే. మెరిట్‌ స్టుడెంట్‌ ఏమీ కాదు. యావరేజ్‌. కాని ఆటలు, పాటలు వంటి ఎక్స్‌ట్రాకరిక్యులర్‌ యాక్టివిటీస్‌లో ఫస్ట్‌. ఏ పోటీల్లో పాల్గొన్నా మొదటి బహుమతి ఆమెకే. సాహసక్రీడలంటే ఎగిరి గంతేసేది. ఈ నైజంతోనే హర్షిణి స్కూల్లో పాపులర్‌ అయింది. పిల్లలకు, టీచర్లకు ఫేవరెట్‌గా నిలిచింది. ఇంత ఉత్సాహం  ఇంటర్‌లో ఆల్‌ గర్ల్స్‌ కాలేజ్‌..  లేడీ అమృతాబాయి కాలేజ్‌లో చేరగానే చప్పున చల్లారిపోయింది. కారణం.. ఆల్‌ గర్ల్స్‌ అన్నది ఆమెకు నచ్చకపోవడమే.  ఆటలు, పాటలు అన్నీ బంద్‌. చదువులోనూ పెద్దగా ఆసక్తి కనబర్చలేదు.  బోర్‌గా అనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ హుషారుగా ఉండే తను.. ఎవరితో మాట్లాడకుండా తనలో తానే ఉండేది. ‘‘నా జీవితంలో నేను దిగులుపడ్డ ఫేజ్‌ ఏదైనా ఉందంటే అది నా ఇంటర్మీడియేట్‌ రెండేళ్ల టైమే’’  అంటుంది హర్షిణి. అయితే డిగ్రీకి కూడా అదే కాలేజ్‌లో దరఖాస్తు చేసుకొమ్మని తల్లిదండ్రులు చెప్పడంతో ఇక ఆల్‌ గర్ల్స్‌ కాలేజే దిక్కు.. ఉత్సాహంగా ఉండక తప్పదు’అనుకుంది.  మళ్లీ ఆటలు, పాటలు, పోటీలు.. మొదలుపెట్టింది. ఉల్లాసానికి చిరునామా అయింది.  ఎన్‌సీసీలో కూడా చేరింది.లక్ష్యాన్ని ఛేదించే శక్తి..

యూనిఫామ్‌ ఉన్న సర్వీసెస్‌ అంటే ఇష్టం ఏర్పడింది కూడా అప్పుడే. ఒకరకంగా చెప్పాలంటే ఆమెకు ఒక లక్ష్యాన్ని.. దాన్ని ఛేదించే శక్తి ఎన్‌సీసీయే. ఆ సమయంలోనే  విదర్భకు చెందిన శివాని కులకర్ణి గురించి చదివింది. శివాని కులకర్ణి  ఎయిర్‌ ఫోర్స్‌  ఫస్ట్‌ విమెన్‌ పైలట్‌. ఆమె కథనం యూనిఫామ్‌ సర్వీసెస్‌పట్ల హర్షిణీకి ఉన్న అభిమానాన్ని ఆరాధనగా మార్చింది. ఆ బాధ్యత, హుందాతనం, ప్రైడ్‌.. చేస్తే అలాంటి ఉద్యోగమే చేయాలనే నిశ్చయాన్ని కలిగించాయి. ఆర్మీకి దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించుకుంది. డిగ్రీ అయిపోయాక తల్లిదండ్రుల కోరికమేరకు ఏంబీఏలో చేరింది. పేరుకే ఏంబీఏ  చదువుతోంది కాని ఆమె చిత్తమంతా ఆర్మీవైపే. అందుకే ఆ పరీక్షలకోసం ప్రిపేర్‌ అవసాగింది.నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కమిషన్‌

రోజులు చాలా నిరాసక్తిగా గడిచిపోతున్నాయి హర్షిణీకి. ఒకరోజు హర్షిణి స్నేహితురాలు శిల్ప చెప్పింది ఆమెతో.. ‘‘నీకు నచ్చిన సర్వీస్‌ ఒకటుంది. మొన్ననే దాని గురించి ఓ ఎంప్లాయ్‌మెంట్‌ పోర్టల్‌లో చదివా’’ అని చెప్పింది. ‘ఆ.. ఏముంటుందిలే అంత ఎగ్జయిట్‌మెంట్‌’ అని మనసులో అనుకొని అదే నిర్లప్తత మాటల్లోనూ వినిపించేలా  ‘ఏంటది’ అని అడిగింది. ‘‘నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌. ఇది ఇంచుమించు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎగ్జామ్‌తో సమానం తెలుసా’’ అంటూ ఆ ఎంప్లాయ్‌మెంట్‌ పోర్టల్‌ను చూపించింది. హర్షిణి కళ్లల్లో ఒక్కసారిగా వెలుగు. ‘‘ఏదీ చూద్దాం’’ అంటూ శిల్ప చేతుల్లోంచి లాక్కుని దాని గురించి సింగిల్‌ కాలమ్‌లో ఉన్న మ్యాటర్‌ చదివింది. ‘‘ఈ సర్వీస్‌కు యూనిఫామ్‌ ఉంటుందా?’’ ఆత్రంగా అడిగింది హర్షిణి తన స్నేహితురాలిని. ‘‘ఊ.. ఉంటుంది. రేపే లాస్ట్‌ డేట్‌. 30 సీట్సే ఉంటాయట. బాగా కష్టపడాలి. ఇదిగో అప్లికేషన్‌. ఈరోజు ఫిలప్‌ చేసేయ్‌. రేపు వెళ్లి ఇచ్చేద్దాం’’ అని దరఖాస్తు పత్రం ఇచ్చి వెళ్లిపోయింది శిల్ప. ‘‘యూనిఫామ్‌ ఉంటుంది’’ అన్న మాట ఆమెలోని నిర్తిప్తతను పటాపంచలు చేసింది. ఆ రాత్రి శ్రద్ధగా దరఖాస్తు పూర్తిచేసింది.ఇది మగవాళ్ల ప్రపంచం..

నాగ్‌పూర్‌లోని నేషనల్‌ ౖఫైర్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీస్‌. ఎర్రరంగులో చాలా ఆకర్షణీయంగా కనిపించింది ఆ భవనం హర్షిణికి. తనకు సెల్యూట్‌ చేసి.. ఆహ్వానిస్తున్నట్టనిపించింది. గేట్‌లోంచి లోపలికి నడుస్తున్నంతసేపు తెలియని ఆనందోద్వేగం ఆమెలో. అడ్మినిస్ట్రేషన్‌ సెక్షన్‌లోకి వెళ్లి దరఖాస్తు ఫారాలు ఇచ్చారిద్దరూ.  గుమాస్తా వీళ్లను చూసి.. ‘ఇది ఆల్‌ మెన్స్‌ కాలేజ్‌. ఈ రంగం మీకు సరిపడదు. ఏ ఆర్మీకో లేదంటే ఎయిర్‌ఫోర్స్‌కో అప్లయ్‌ చేసుకోండి.. అక్కడైతే అమ్మాయిల కోసం ప్రత్యేక సౌకర్యాలుంటాయి’ అని సలహా ఇచ్చాడు. ఆ మాటలు హర్షిణికి మరింత బలాన్నిచ్చాయి. ఆల్‌ మెన్స్‌ కాలేజ్‌ అన్న పదం ఆమెలో పోటీతత్వాన్ని నిద్రలేపింది. ‘‘అయితే నేను తప్పకుండా చేరాలన్నమాట.. థాంక్యూ ఫర్‌ గైడింగ్‌ మీ సర్‌’’ అని నవ్వుతూ అతనికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చింది హర్షిణి. పరీక్ష రాసింది.ది ఫస్ట్‌ ఉమన్‌

ఒకరోజు టెలిగ్రామ్‌ వచ్చింది ఇంటికి ఎన్‌ఎఫ్‌ఎస్‌సీలో సెలెక్ట్‌ అయినట్టు. ఆనందం.. ఆశ్చర్యం.. హర్షిణిలో. వెంటనే విచారం.. అసలు తనకు ఈ సర్వీస్‌ గురించి చెప్పి, పరీక్షరాయడానికి కారణమైన తన స్నేహితురాలు శిల్ప సెలెక్ట్‌ కాలేదని తెలిసి. ఆ బాధతోనే ఇంటర్వ్యూకి హాజరైంది. మెడికల్‌ ఎగ్జామినేషన్‌కు వెళ్లినప్పుడు.. ‘ఇది చాలా కష్టమైన సర్వీస్‌. నువ్వు చేయగలవా?’ అని అడిగారు. తలూపింది. ఫైనల్‌ ఇంటర్వ్యూలో ప్రశ్నల పరంపర మొదలైంది. ప్యానల్‌లో కొంతమంది ప్రోత్సహించారు. ఇంకొంతమంది వెనక్కి లాగారు. ఎలాగైతేనేం.. నెగ్గింది. ప్రోత్సాహం అందించిన ప్యానలిస్ట్‌లు ఫైర్‌ సర్వీసెస్‌లో కిరణ్‌బేడీవి అంటూ కితాబు ఇచ్చారు. యూనిఫామ్‌ ఉన్న సర్వీసెస్‌లో తాను పనిచేయబోతున్నానన్న ఆనందంలో నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కమిషన్‌కి ఎన్నికైన తొలి మహిళ తనేనన్న ఘనతను గుర్తించలేకపోయింది. ఆ రెడ్‌ ఆడ్మినిస్ట్రేషన్‌ సెక్షన్‌ గుమాస్తా వచ్చి.. ‘‘శభాష్‌.. బేటా! నువ్వు రికార్డ్‌ సృష్టించావ్‌!  నేషనల్‌ ఫైర్‌ సర్వీస్‌ కమిషన్‌కు సెలెక్ట్‌ అయిన ఫస్ట్‌ ఇండియన్‌ లేడీవి నువ్వే’ అంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చాడు. అప్పుడు ఆ ఆవరణను పరిశీలించింది. అన్నట్టుగానే  అందరూ మగవాళ్లే. ఒక్క స్త్రీ లేదు. గర్వంగా పెదవుల మీదకు వచ్చి చేరింది చిన్న నవ్వు!పాపులారిటీ.. ఫ్రెషర్‌

ఫైర్‌ ఇంజనీరింగ్‌లో ఫస్ట్‌ ఉమన్‌ కీర్తి బాగానే ఉంది. సవాళ్లూ అంతకన్నా బాగా కనిపించాయి. ఇటు హర్షిణికి... అటు ఫైర్‌ సర్వీసెస్‌కి. ఏడు సెమిస్టర్ల ఫైర్‌ ఇంజనీరింగ్‌ కోర్స్‌ చదవాలంటే ఎన్‌ఎఫ్‌ఎస్‌సి బిల్డింగ్‌లోని రెసిడెన్షియల్‌లోనే ఉండాలి. ఆ కోర్స్‌ పుట్టినప్పటి నుంచి హర్షిణి సెలెక్ట్‌ అయ్యేవరకు అందరూ మగవాళ్లే కాబట్టి ఆ కోర్సే కాదు.. ఆ బిల్డింగ్, రెసిడెన్షియల్‌ అన్నిటినీ పురుషులకు అనుగుణంగానే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆమె ఒక్కదాని కోసం వాటిని మార్చాలి.. సడలించాలి.. ఇది సర్వీసెస్‌కు సవాలు. మగవాళ్లతోపాటు ఆమే రెసిడెన్షియల్‌లోనే ఉండాలన్న నియమాన్ని కఠినంగా అమలుచేస్తూనే సెలవుల్లో ఇంటికి వెళ్లొచ్చు అనే వెసులుబాటునిచ్చారు. దీనికోసం హోమ్‌శాఖ నుంచి ప్రత్యేక అనుమతి తెచ్చుకోవాల్సి వచ్చింది ఎన్‌ఎఫ్‌ఎస్‌సీకి. ఇందులో ఒక్కో తరగతి ఒక్కోరకంగా ఉంటుంది. ప్రతి తరగతికి ఒక్కో యూనిఫామ్‌. దాంతో ప్రతి రోజును కొత్తగా  ఆస్వాదించసాగింది. డ్రిల్స్, ఎక్సర్‌సైజెస్, సాహసాలు.. వేటిలోనూ మగవాళ్లకు తీసిపోలేదు. 29 మంది మగవాళ్లలో ఒకే ఒక్క స్త్రీ.. ఎంత పాపులారిటీని తెచ్చిందో అంత ప్రెషర్‌ను పెంచింది. మీడియా అటెన్షన్, పబ్లిసిటీ.. అంతా ఆమె పైనే.. ఆమెదే! ఇది ఆమె క్లాస్‌లోని మగవాళ్లకు కంటకింపుగా ఉండేది. ‘మేం చదివేదే తను చదువుతోంది. మేం చేసే డ్రిల్స్‌.. అడ్వంచర్సే ఆమే చేస్తోంది.ఇందులో ఆమె ప్రత్యేకతేముంది? ఆమె మీదే ఎందుకంత అటెన్షన్‌.. ఆమెకే ఎందుకంత పబ్లిసిటీ అని ఉడుక్కునేవాళ్లు. కాని మగవాళ్ల కంచుకోటగా ఉన్న  ఎన్‌ఎఫ్‌ఎస్‌సీలోకి హర్షిణి ప్రవేశించడమే పెద్ద బ్రేకింగ్‌ అనేది వాళ్లకు అర్థంకాలేదు. అదే ఆమె ప్రత్యేకతని వాళ్లు గ్రహించలేదు. భారీ నీటి పైపులను, సక్షన్‌ పైపులను సంభాళించడం, మోక్‌ డ్రిల్స్‌ వంటివి చేయడం దేహదారుఢ్యం ఉన్న మగవాళ్లకు కూడా కష్టం. అలాంటి ఇబ్బందులన్నిటినీ హర్షిణి అధిగమించింది.. ఆ పనిపట్ల ఉన్న భక్తి, గౌరవం, ఆత్మవిశ్వాసంతో! ‘ఏ కొంచెం తప్పు చేసినా.. ఏ పని చేయలేకపోయినా  ‘‘ఆడవాళక్లు ఇలాంటి చేతకావు’’  అని ఎక్కడ అంటారో.. ఈ రంగంలో స్త్రీలు పనికిరారు అని ఎక్కడ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తారోనని కొత్తలో చాలా ప్రెషర్‌ ఫీలయ్యేదాన్ని. తర్వాత తర్వాత సెల్ప్‌కాన్పిడెన్స్‌తో అన్నిటినీ ఓవర్‌కమ్‌ చేశా’ అని నాటి రోజులను గుర్తు చేసుకుంటుంది హర్షిణి.సిలెండర్‌ బ్లాస్ట్‌..

ప్రాక్టికల్‌ ఇయర్‌లో తను ఫస్ట్‌ డీల్‌ చేసిన ఫైర్‌యాక్సిడెంట్‌.. సిలెండర్‌ పేలిన ఘటనే. ఇది షిరిడీలో జరిగింది. ఆ మంటలు ఆర్పడం చాలా తేలిక. పెద్ద పెద్ద ఫైర్‌ యాక్సిడెంట్స్‌ జరిగినప్పుడు తనకు ‘ఆ ఆపరేషన్స్‌ ఇస్తే బాగుండు..’ అని ఉవ్విళ్లూరేది. ఫైర్‌ స్టేషన్‌ కమాండర్‌ను అడిగేది తననెప్పుడు బిగ్‌ఫైర్స్‌కి పంపిస్తారు అని. జాయిన్‌ అయిన మూడేళ్లకు  కానీ దొరకలేదు ఆ చాన్స్‌. ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబైలలో పనిచేసినప్పుడు బిగ్‌ ఫైర్స్‌ని డీల్‌ చేసింది. హర్షిణీ చేసిన పెద్ద ఆపరేషన్‌ ఢిల్లీ శాస్త్రినగర్‌లో దీపావళి ఘటనే.  ఆ మంటలను ఆర్పడానికి దాదాపు ఆరు గంటలు పట్టింది.  దాని కోసం ఆ షూ ఫ్యాక్టరీ పక్కనున్న బిల్డింగ్‌ ఎక్కాల్సి రావడం.. ఆ బిల్డింగ్‌కూ మంటలు అంటుకొని అదీ పగుళ్లు తీస్తుంటే ఆగమేఘాల మీద దిగేసి ఫ్యాక్టరీకి ఇటు పక్కనున్న బిల్డింగ్‌ గోడ కూల్చి దాని పైకెక్కి మంటలను ఆర్పింది. ఇది హర్షిణీ ధైర్యసాహసాలకు మచ్చుతునక.  ఇవే కాక వరదలు వచ్చి నదులు పొంగినప్పుడు, వన్యప్రాణులు ఊళ్ల మీద దాడిచేసినప్పుడు అత్యంత చాకచక్యంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. మనుషుల ప్రాణాలను కాపాడి ఫైర్‌ ఉన్న  ఫైటర్‌గా పేరు తెచ్చుకుంది.

ఓఎన్‌జీసీలో..

2006లో ఓఎన్‌జీసీలో చేరింది హర్షిణి. ఈ కంపెనీ ఆమెకు గుజరాత్‌లోని  ‘మెహసనా’లో ఉన్న తన ఫైర్‌స్టేషన్‌కి ఇన్‌చార్జిగా పోస్టింగ్‌ ఇచ్చింది. ఓఎన్‌జీసీకి చెందిన రెండవ అతి పెద్ద ఆన్‌షోర్‌ ప్రొడక్షన్‌ ప్రాంతం అది.  హæర్షిణి గురించి ఎరుక ఉన్న ఓఎన్‌జీసీ 2013లో  ఆఫ్‌షోర్‌ రిగ్స్‌నూ  ఆమెకు అప్పచెప్పింది.  అదీ రికార్డే. అప్పటిదాకా ఆఫ్‌షోర్‌ రిగ్స్‌లో మహిళలకు అనుమతి లేదు. ఆ రూల్‌ని బ్రేక్‌ చేసిందీ ఆమెనే. ఆఫ్‌షోర్‌ రిగ్స్‌ కోసం హెలికాప్టర్‌లో వెళ్లాలి.. ఆడిటింగ్‌ చేయాలి.. ఫాలోఅప్‌లు చూసుకోవాలి.. ఇలా బాధ్యత మొత్తం వహించాలి. ఈ పనిని ఎంతో చక్కగా నిర్వహించింది హర్షిణి.

బైకర్‌...

ప్రస్తుతం  ఫైర్‌ సర్వీసెస్‌ డిప్యూటీ మేనేజర్‌గా పనిచేస్తున్న హర్షిణికి బైక్‌ రైడింగ్‌ అంటే చాలా ఇష్టం. లేహ్‌ నుంచి కార్గిల్‌ వరకు బైక్‌ నడిపింది. తన తోటి బైకర్‌నే పెళ్లి చేసుకుంది. ‘నా పెళ్లి క్రిస్‌మస్‌ రోజు జరగడం వల్ల పెళ్లికి లీవ్‌ పెట్టే అవకాశాన్ని కోల్పోయా’ అని జోక్‌ చేస్తుంది హర్షిణి.‘నా మీద నమ్మకం ఉంచి.. క్రూషియల్‌ ఆపరేషన్స్‌అప్పగించి.. ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహిస్తున్న మేనేజ్‌మెంట్‌కి కృతజ్ఞురాలిని. ఫస్ట్‌ ఉమన్‌ ఫైర్‌ ఫైటర్‌ అన్న క్రెడిట్‌ వల్ల ఎంత గర్వంగా ఉంటుందో అంతే రెస్పాన్స్‌బులిటీ పెరుగుతుంది.  అసలు ఆ మాటకొస్తే చేసే పనికి జెండర్‌ ఏంటి? ఇది మగవాళ్ల పని, ఇది ఆడవాళ్ల పని అంటూ ఏమీ ఉండదు. క్వాలిఫికేషన్‌.. కేపబులిటీయే ప్రధానం. ఉదాహరణకు బైక్‌ తీసుకుంటే.. తనను నడుపుతోంది స్త్రీనా? పురుషుడా అని దానికి తెలుస్తుందా? ఆ భేదం ఏమన్నా చూపిస్తుందా? వర్క్‌ కూడా అంతే! ఏ రంగానికీ స్త్రీ, పురుషులనే జెండర్‌ డిస్క్రిమినేషన్‌ ఉండదు. అదొక మిత్‌. జీవితం ఒకటే... లక్ష్యాన్ని ప్రేమించాలి.. ప్యాషన్‌తో ఛేదించాలి. కలలను సాకారం చేసుకోవాలి.. కలలను కనడం మాత్రం ఆపొద్దు!

– హర్షిణీ కన్హేకర్‌

– శరాది

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top