ఉనికి సైతం ఉత్త భ్రమే

One Straw Revolution Translated From Japanese To English - Sakshi

‘నా ఉనికి సైతం ఉత్త భ్రమే’ అని తెలుసుకున్నాడు మసనోబు ఫుకుఓకా (1913–2008). ‘ఈ జనన మరణ చక్రాలలో పాల్గొని, అనుభూతి పొంది, ఆనందించగలిగితే అంతకు మించి సాధించాల్సిన అవసరం లేదు’ అనుకున్నాడు. తన ఆలోచనను ఆచరణలో రుజువు చేసుకోవడానికిగానూ నగరంలో చేస్తున్న ఉద్యోగం వదిలి సొంతవూరికి వెళ్లిపోయాడు. భూమిని దున్నకుండా, రసాయనిక ఎరువులు వేయకుండా ప్రకృతి వ్యవసాయాన్ని సాధన చేశాడు. ప్రకృతి దానికదే అన్నీ అమర్చి పెట్టిందని నమ్మి, దానిమీద ‘గెలిచి’ ఆ అమరిక చెదరగొట్టకుండా, దానితో సమన్వయంతో బతికేందుకు ప్రయత్నించాడు. ‘నేను కనుగొన్న విషయం చాలా విలువైనదయినంత మాత్రాన నాకేదో ప్రత్యేక విలువ ఉన్నట్లు కాదు’ అని ప్రకటించుకున్నాడు. ఆ ఆలోచనా ప్రయాణాన్ని వివరించే పుస్తకం జపనీస్‌ నుంచి ఇంగ్లిష్‌లోకి వన్‌ స్ట్రా రెవల్యూషన్‌గా 1978లో వచ్చింది. అది తెలుగులోకి గడ్డిపరకతో విప్లవంగా అనువాదమైంది.

ఆ పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ఫుకుఓకా విద్యార్థి, సాధకుడు ల్యారీ కార్న్‌ ఇలా అంటారు: ‘తన సిద్ధాంతం ఏ మతంపైనా ఆధారపడి లేదని ఫుకుఓకా చెపుతారు. కానీ అతని బోధనా పద్ధతిపైనా, ఉపయోగించే పదజాలంపైనా జెన్, బౌద్ధం, టావోయిజమ్‌ల ప్రభావం బాగా ఉంది. అప్పుడప్పుడు అతను చెపుతున్న దానిని మరింత బాగా వివరించటానికో, చర్చను ప్రేరేపించటానికో బైబిల్‌ నుంచీ, క్రైస్తవ మతం నుంచీ ఉదాహరణలు ఇస్తుంటాడు. ‘వ్యక్తి ఆధ్యాత్మిక ఆరోగ్యం నుంచి ప్రకృతి సేద్యం పుట్టుకొస్తుందని ఫుకుఓకా నమ్మకం. భూమిని బాగుపరచటం, మానవ ఆత్మను ప్రక్షాళన చేయటం ఒకటేనని అతని అభిప్రాయం.

ఆధ్యాత్మికంగా సంతృప్తికరమయిన జీవితానికి దారితీసే రోజువారీ పనులు ప్రపంచాన్ని సుందరంగా, అర్థవంతంగా మారుస్తాయని నిరూపించటమే అతను మనకిచ్చిన కానుక.’ దీనికే రాసిన ముందుమాటలో అమెరికా రచయిత, పర్యావరణ కార్యకర్త వెండెల్‌ బెర్రీ ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘కేవలం వ్యవసాయం గురించే ఈ పుస్తకంలో ఉంటుందనుకొనే పాఠకులు ఆహారం గురించీ, ఆరోగ్యం గురించీ, సాంస్కృతిక విలువల గురించీ, మానవ జ్ఞాన పరిమితుల గురించీ కూడా ఇందులో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు. ఈ పుస్తకంలోని తత్వసిద్ధాంతాల గురించి ఆ నోటా ఈ నోటా విన్న పాఠకులు దీంట్లో వరి, శీతాకాలపు పంటలు, పండ్లు, కూరగాయలు ఎలా పండించాలో ఉండటం చూసి ఆశ్చర్యపోతారు.’ ‘ప్రగతి, పురోగమనం ఎందుకు సాధించాలి? సాధారణమయిన జీవితం గడుపుతూ అన్నిటినీ తేలికగా తీసుకోగలగటం కంటే మించినది మరేదయినా ఉందా?’ అని ప్రశ్నించే ఫుకుఓకా తత్వం ఈ హడావుడి లోకరీతికి  పూర్తి భిన్నమైనది. పూర్తిగా కావాల్సినది కూడానేమో!
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top