వినయ విధేయ

Now sitting down next to a colleague  sitting next to me - Sakshi

మీటూ

ఎప్పుడూ పక్కన కూర్చునే సహోద్యోగే ఇప్పుడు కావాలని ఒదిగి మరీ కూర్చుంటున్నాడు! అన్‌నెససరీ కదా. ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనిషి, ఇప్పుడు కేవలం పలకరిస్తున్నాడు. అవసరమా అంత డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌! ఇంకొకరు.. తప్పుకుని, తప్పుకుని వెళుతున్నారు. దీన్నేమనుకోవాలి? డీసెన్సీనా, డిప్లమసీనా, లేక.. ‘చూశావా.. మీటూ వల్ల ఎంత అనర్థమో’ అని చెప్పడమా?!

చూసేదే ప్రపంచం. కనిపించేది కాదు. ప్రపంచాన్ని స్త్రీ ఒకలా చూస్తుంది. పురుషుడు ఒకలా చూస్తాడు. ప్రపంచానికి సొంతంగా ఓ షేప్‌ లేదా మరి? ఉంటుంది. అది ఏ షేప్‌లో ఉందన్నది మాత్రం స్త్రీ, పురుషులకు ఏ షేప్‌లో కనిపిస్తోందో అదే. అప్పుడు ఒకే ప్రపంచానికి రెండు షేప్‌లు అవ్వవా? అవుతాయి. అందుకే ఈ జెండర్‌ యుద్ధాలు. ‘బ్యాటిల్స్‌ ఆఫ్‌ సెక్సెస్‌’. ఇప్పుడు నడుస్తున్న బ్యాటిల్‌.. ‘మీ టూ’. చూడ్డంలో స్త్రీ కొంచెం పవర్‌ఫుల్‌. చూపు వెనుక చూపేమిటో కూడా ఆమె గ్రహించగలుగుతుంది. పురుషుడిలా ఆమె కూడా మనిషే కదా, ఎలా పురుషుడికన్నా ఆమె చూపు పవర్‌ఫుల్‌ అయింది? చాలా చూసింది కాబట్టి! స్త్రీ కూడా తనలా మనిషే అని పురుషుడు ఏ యుగంలోనూ అనుకోలేదు కాబట్టి. ‘ఆమె నన్ను ఎలా చూస్తే నేను అదే అయిపోతానా?’ అని పురుషుడి చికాకు. ‘అతడు నన్ను ఎలాగో లేకపోతే నేను అలా చూస్తానా?’ అని స్త్రీ సమాధానం. మళ్లీ యుద్ధం. బ్యాటిల్‌ ఆఫ్‌ సెక్సెస్‌. యుద్ధంలో కూడా మళ్లీ వైరుద్ధ్యం. పురుషుడు చికాకు పడతాడు. స్త్రీ సమాధానం చెబుతుంది. ఎందుకనంటే అధికుడిననుకుంటాడు పురుషుడు. అందుకని చికాకు పడతాడు. అర్థమయ్యేలా చెప్పాలనుకుంటుంది స్త్రీ. అందుకని సమాధానంతో సరిపెడుతుంది. ఇప్పుడు ఆమె చెబుతున్న సమాధానం.. ‘మీటూ’. 

కొద్దిగానైనా పురుషుడి చూపును మారుస్తోందా ‘మీ టూ’? పాపం.. ట్రై చేస్తున్నాడు మార్చుకోవాలని. సాటి మగవాళ్ల చూపును కూడా మార్చాలని చూస్తున్నాడు. ఆ చూడ్డం ఎలాగంటే.. ‘బాస్‌.. బీ డీసెంట్‌ టువర్డ్స్‌ హర్‌.. ఎందుకొచ్చిన షిట్‌’ అంటున్నాడు. అలాగా చూడ్డం! ‘మర్యాద కావాలా.. అయితే తీస్కో ఇస్తా’ అని పగబట్టినట్లుగానా చూడ్డం?! జపాన్‌ ప్రభుత్వం ‘మీ టూ’పై ఒక పోస్టర్‌ వేయించి, దేశంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ పంపబోతోంది. అంతకన్నా ముందు శాంపిల్‌గా పోస్టర్‌ని ట్విట్టర్‌లో పెట్టి ‘హావ్వీజిట్‌?’ అంది. ఉద్దేశం ఏంటంటే.. ఆఫీస్‌లో ఎవరైనా ఆడవాళ్లను లైంగికంగా వేధిస్తుంటే, ఆ వేధింపుల్ని ఆపే బాధ్యత మీదే అని. ‘మీదే’ అంటే పురుషులదే అని. ముల్లుతో ముల్లును తియ్యడం. అయితే ఈ ముల్లు మిస్‌ ఫైర్‌ అయి తిరిగి ప్రభుత్వం కాల్లోకే వెళ్లి గుచ్చుకుంది. ట్విట్టర్‌లో అంతా ఇన్ని తలంబ్రాలేస్తున్నారు. ‘మీ టూ’పై సెటైర్‌ వెయ్యడానికే ఈ పోస్టర్‌’ అనీ, మగబుద్ధికి ఇంతకన్న మంచి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయనీ, లైంగికంగా వేధించేవాళ్లనే పోస్టర్‌ సపోర్ట్‌ చేస్తోందనీ, ఈ పోస్టర్‌ని తయారుచేసిన టీమ్‌లో ఏ దశలోనూ స్త్రీలు లేనట్లున్నారనీ, ఇదిగో.. ఇందుకే మన దగ్గర ఉమెన్‌ పొలిటీషియన్‌లు తక్కువనీ.. ట్వీట్ల వర్షం కురుస్తోంది. 

ఈ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది జపాన్‌ క్యాబినెట్‌ ఆఫీస్‌. పోస్టర్‌లో జపాన్‌ నటుడు మికిహిసా అజుమా నోరు సగం తెరిచి, ఎంతో అమాయకంగా.. ‘ఇది కూడా సెక్సువల్‌ హెరాస్‌మెంటేనా?’ అని ప్రశ్నిస్తుంటాడు. వెనుక.. ఆయనవే రెండు చిన్న తలలు అటు, ఇటు ఉంటాయి. ఒక తల ఓరకంట తన సహోద్యోగిని చూస్తూ.. ‘‘నిన్నటి కన్నా మీరు అందం కనిపిస్తున్నారు. సన్నబడుతున్నారేమో కదా?’’ అంటుంటుంది. రెండో తల, ఇంకో ఉద్యోగిని వైపు చూస్తూ ‘‘ఇవాళ మీ డ్రెస్‌.. బాగుంది. నాకిలా ఉంటే ఇష్టం’’ అని చెబుతుంటుంది. ఆ కాంప్లిమెంట్‌లకు ఆ ఇద్దరు అమ్మాయిలు కోపంగా ఒకరు, ఇబ్బందిగా ఒకరు చూస్తుంటారు. పోస్టర్‌ అడుగున మళ్లీ మికిహిసా అజుమా ప్రత్యక్షం అవుతాడు. ‘ఇది కూడా సెక్సువల్‌ హెరాస్‌మెంటేనా?’ అనే  ప్రశ్నకు.. ‘ఏది సెక్సువల్‌ హెరాస్‌మెంటో నిర్ణయించవలసింది నువ్వు కాదు’ అని అతడే కింద సమాధానం ఇస్తుంటాడు. చురుకైన సందేశం ఉంది. అర్థంకాకనో, మరీ ఎక్కువ అర్థం అవడం వల్లనో గురి తప్పింది. ‘నీ చూపు నీకు వేధింపులా ఉండకపోవచ్చు. ఆమె చూపుకు అది వేధింపులా అనిపించవచ్చు.వేధింపా కాదా అన్నది డిసైడ్‌ చెయ్యవలసింది మాత్రం నువ్వు కానే కాదు’ అని పోస్టర్‌ అర్థం. జపాన్‌లో ఏటా ‘వయలెన్స్‌ అగైన్‌స్ట్‌ ఉమెన్‌’పై క్యాంపెయిన్‌ జరుగుతుంటుంది. ఆ క్యాంపెయిన్‌ ఈ ఏడాది నవంబర్‌ 12 న మొదలైంది. 25 వరకు జరుగుతుంది. అందుకోసం వేసిన పోస్టరే ఇది. ‘మగవాళ్లూ అమాయకత్వం నటించకండి. మీ పక్కన ఉన్న మహిళను ఎవరైనా వేధిస్తుంటే చూస్తూ ఊరుకోకండి’ అని చెప్పడం కోసం చేయించిన ఈ పోస్టర్‌ను ఎవరెంత అర్థం చేసుకున్నా.. వెనక్కు తీసుకునేది లేదని ప్రధాని షింజో అబే చెబుతున్నారు. జపాన్‌లో ఉద్యోగాలకు వచ్చే మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండడంతో.. ఉమెన్‌ వర్క్‌ఫోర్స్‌ను పెంచడం కోసం ఆయన ‘ఉమెనామిక్స్‌’ అనే అత్యవసర విధానాన్ని నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారు. 

‘మీ టూ’ మొదలయ్యాక ఆఫీస్‌లలో మహిళా ఉద్యోగులకు వేధింపులు తగ్గాయేమో కానీ, సాధింపులు ఎక్కువయ్యాయి. ఎమోషనల్‌ అత్యాచారాలు మొదలయ్యాయి. ఎప్పుడూ పక్కన కూర్చునే సహోద్యోగే ఇప్పుడు కావాలని ఒదిగి మరీ కూర్చుంటున్నాడు! అన్‌నెససరీ కదా.  ఎప్పుడూ నవ్వుతూ పలకరించే మనిషి, ఇప్పుడు కేవలం పలకరిస్తున్నాడు. అవసరమా అంత డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌! ఇంకొకరు, తప్పుకుని.. తప్పుకుని వెళుతున్నారు. దీన్నేమనుకోవాలి? డీసెన్సీనా, డిప్లమసీనా లేక.. ‘చూశావా.. మీటూ వల్ల ఎంత అనర్థమో’ అని చెప్పడమా! ‘సారీ, ఏదో ఆలోచిస్తూ మీ వైపు చూశాను. ఇదీ కూడా మీటూ కిందికే వస్తుందా?’ అని ఎక్స్‌ట్రాలు, ఎక్స్‌ట్రీమ్‌లు చేసేవాళ్లు కొందరు! ఆఫీస్‌లలో ఆడవాళ్లతో కాస్త మర్యాదగా ఉండండి అంటే.. ఈ అతిమర్యాదేంటి? అమర్యాద కన్నా హీనం అతిమర్యాద. బ్యాటిల్‌ ఆఫ్‌ సెక్సెస్‌కి కూడా యుద్ధనీతి అనేది ఒకటి ఉంటుంది. పనిచేసే చోట దొంగ విధేయతలు, యుద్ధంలో దొంగచాటు సంధింపులు రెండూ ఒకటే. అన్‌ ఫెయిర్‌.
∙మాధవ్‌ శింగరాజు         

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top