మాతృదేవతాౖయె నమః

Moms are a Great Source of our Mythology - Sakshi

ప్రేమ, కరుణలను వర్షించే ప్రేమమూర్తులుగా మాతృత్వమనే పదానికే అర్థంగా, నిదర్శనంగా నిలిచిన తల్లులు మన పురాణాల్లో ఎంతోమంది కనిపిస్తారు. అలాంటివారిలో... తలచుకోగానే బొమ్మకట్టే కొందరు మాతృమూర్తుల గురించి తెలుసుకుందాం.

పార్వతీదేవి: ఆమె అమ్మల గన్న అమ్మ, శక్తి స్వరూపిణి, తన బిడ్డ ప్రాణం కోసం పతి అయిన పరమ శివుడినే ఎదిరించి, ఆయనతో పోరాడి మరీ బిడ్డను బతికించుకున్న మాతృమూర్తి. తాను నలుగుపిండితో ప్రాణం పోసిన బాలుడికి, తన భర్త అయిన శంకరుడికి మధ్య జరిగిన పోరాటంలో ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని తెలిసి భోరున విలపించింది. తొందరపడి బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ప్రాణనాథుడైన పరమేశ్వరుడినే ఒక సాధారణ స్త్రీలా తూలనాడిన సిసలైన తల్లి ఆమె. ఏనుగు తలైనా ఫరవాలేదు పిల్లవాడు ప్రాణాలతో తిరుగాడితే చాలు అని ఆరాటపడిన అసలైన అమ్మ. ఆ బిడ్డడే అందరి తొలి పూజలందుకునే బొజ్జ గణపయ్య. 

సీతాదేవి: శ్రీరాముడి పత్ని అయిన సీతాదేవి గర్భిణిగా తనను అడవిలో వదిలేసినప్పటికీ, ఆ బాధను, శోకాన్ని దిగమింగుకుని వాల్మీకి ఆశ్రమంలో కవలలు లవకుశులకు జన్మనిచ్చింది. ఎన్ని కష్టనష్టాలెదురైనా తన కుమారులిద్దరినీ క్షత్రియపుత్రులు, ఇక్ష్వాకు వంశ వారసులుగా ఒంటరిగా పెంచి పెద్ద చేసింది. 

యశోదాదేవి: దేవకీ నందనుడైన కన్నయ్యను తన ప్రేమ, వాత్సల్యాలతో యశోదా కృష్ణుడిగా మార్చుకున్న ప్రేమమయి యశోదాదేవి. కన్నది దేవకీ దేవి అయినా కృష్ణుడి బాల్యం అనగానే మనకు చటుక్కున స్ఫురించేది యశోదాదేవి పేరే. పాలు, వెన్నలతోపాటు ప్రేమ, వాత్సల్యాలను, మమతానురాగాలను కూడా రంగరించి కృష్ణుడిని పెంచి పెద్ద చేసింది. కన్నయ్య ఆడితే ఆనందపడిపోయి, పాడితే పరవశించిపోయి, పిల్లనగ్రోవి ఊదితే మైమరచిపోయి అల్లరి చేస్తే ముద్దుగా కోప్పడి... ఇలా అతని బాల్యక్రీడలతో, అల్లరిచేష్టలతో మాతృత్వాన్ని తనివి తీరా ఆస్వాదించిన తల్లి.. యశోదమ్మ. అయితే అన్న అయిన కంసుడి క్రౌర్యానికి వెరచి పొత్తిళ్లలోనే బిడ్డను వేరొకరికి అప్పగించవలసిన అగత్యం ఏర్పడినా ఎక్కడో ఒకచోట తన బిడ్డ క్షేమంగా ఉంటే చాలని పుట్టెడు శోకాన్ని గుండెల్లోనే దాచుకున్న దేవకీదేవి కూడా స్మరణీయురాలే..

కౌసల్యాదేవి: దశరథ రాజు పట్టపురాణి, రామచంద్రుడి తల్లి కౌసల్యాదేవి. సవతి కైకేయికి భర్త ఇచ్చిన వరం మూలంగా పద్నాలుగేళ్ల పాటు తన పుత్రుడికి దూరమై తీవ్ర వేదనను అనుభవించిన మాతృమూర్తి. భర్త నిస్సహాయత, కైకేయి దురాలోచన ఫలితంగా రాముడు వనవాసానికి వెళ్లి తాను శోకంలో మునిగిపోయినప్పటికీ తనయుడి పితృవాక్య పరిపాలనకు లోటు రాకూడదన్న సదాశయంతో, సయమనంతో వ్యవహరించిన తల్లి కౌసల్యాదేవి. 

సుమిత్రాదేవి: భర్త దశరథుడు  కైకేయికి ఇచ్చిన వరమే తన పాలిట శాపం కాగా పుత్రుడి ఎడబాటును ఏళ్లతరబడి మౌనంగా భరించిన తల్లి సుమిత్ర. అన్నతోపాటు తాను కూడా వనవాసానికి వెళతానంటూ లక్ష్మణుడు పట్టుబట్టిన వేళ... అతడిని వారించకుండా రాముడిని కూడా తన కుమారుడిలాగే భావించి అతడి పితృవాక్యపరిపాలనకు తన వంతు సహకారాన్ని అందించిన సహృదయురాలు సుమిత్రాదేవి. 

కైక: పేరుకు భరతుడు తన పుత్రుడైనా రాముడినే తన బిడ్డగా భావించి అపరిమితమైన ప్రేమ, వాత్సల్యాలతో అల్లారుముద్దుగా రామచంద్రుడిని పెంచింది. అనుక్షణం రాముడినే కలవరించి, పలవరించేది. అలాంటిది మంధర చెప్పుడు మాటలు విని తన కుమారుడు భరతుడి భవిష్యత్తుకోసం రాముడిని వనవాసానికి పంపింది. ఫలితంగా కన్నకొడుకే తనను చూసి ఛీత్కరించుకుంటే ఎంతగానో ఏడ్చింది. ఆ తరువాత ఎంతో పశ్చాత్తాప పడ్డ కైక కూడా గుర్తుచేసుకోదగిన తల్లే.

వకుళమాత: శ్రీకృష్ణుడి బాల్యం మాత్రమే తాను చూడగలిగానని అనంతరం అతని వద్ద ఉండలేకపోయానని వాపోయిన యశోదమ్మకు మరుజన్మలో ఆ అవకాశం కల్పిస్తానని వాగ్దానం చేశాడు కృష్ణుడు. అన్నట్లుగానే యశోదమ్మ, వకుళమాతగా జన్మించగా తాను శ్రీనివాసుడిగా అవతరించి పుత్రుడిగా ఆమె ప్రేమను అందుకున్నాడు కృష్ణుడు. పూర్వజన్మలో తాను కోరిన కోరికను ఈ జన్మలో నెరవేర్చేందుకు పుత్రుడిగా తన వద్దకు ఏతెంచిన గోవిందుడిని వాత్సల్యంతో ఆదరించి తనలోని మాతృత్వభావనను పరిపూర్ణం చేసుకున్న మాతృమూర్తి వకుళమాత. 

అనసూయ: ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మారువేషాలతో అత్రి ఆశ్రమానికి అతిథులుగా వెళ్ళి భవతీ భిక్షాందేహి అని నిలబడ్డారు. అతిథులుగా వచ్చిన త్రిమూర్తులకు మర్యాదలు జరిపి భోజనానికి కూర్చోమన్నది అసూయ. అప్పుడు కపటయతులు ముగ్గురూ ఏకకంఠంతో, ‘‘సాధ్వీ! మాకొక నియమమున్నది – అది నీవు నగ్నంగా వడ్డిస్తేనే గాని తినేది లేదు!’’ అని అన్నారు. అనసూయ ‘అలాగా! సరే!’ అంటూ వారిమీద నీళ్ళు చిలకరించింది. ముగ్గురు అతిథులూ ముద్దులొలికే పసిపాపలైపోయారు.

అనసూయకు మాతృత్వం పొంగివచ్చింది. పసివాళ్ళకు పాలబువ్వ మెత్తగా కలిపి తినిపించింది. ఒడిలో చేర్చుకొని లాలించి పాలిచ్చింది. త్రిమూర్తులు పసిపాపలై అనసూయ ఒడిలో  నిద్రలోకి జారిపోయారు. ముగ్గుర్నీ ఉయ్యాల తొట్టిలో పరుండబెట్టి, ‘‘ముజ్జగాలేలే ముమ్మూర్తులు నా పాపలైనారు. బ్రహ్మాండమే వీళ్ళకు ఉయ్యాలతొట్టి, నాలుగు వేదాలే గొలుసులు, ఓంకార ప్రణవనాదమే జోలపాట!’’ అంటూ జోలపాడింది. ఆ పాటకు మైమరచిపోయిన బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కలిసిపోయి, ఒకే ఒక మూర్తిగా దత్తాత్రేయుడు రూపొందాడు.  మాతృమూర్తులందరికీ  అభివందనం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top