తల్లులకు ‘గృహహింస’తో పిల్లలపై ప్రభావం
యుక్తవయసులో మానసిక సమస్యలు
టీనేజీ యువత, వారి తల్లులపై అధ్యయనం
ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న టీనేజర్లు
అవగాహనా కార్యక్రమాలే శరణ్యం
ఇంట్లో భర్త లేదా అత్తమామల వేధింపులు.. మహిళల మీదే కాదు, చిన్నారుల మీదా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టీనేజర్లలో ఇవి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. వారిలో ఆందోళన, ఒత్తిడికి కారణమవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ‘జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్’, సీవేదా కన్సార్షియం, అంతర్జాతీయ సంస్థల పరిశోధనలో తేలిన అంశమిది.
ప్రముఖ ‘ప్లోస్ వన్’జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 2,800 మంది టీనేజీ యువత, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు. మనదేశంలో గృహహింస సర్వ సాధారణమైపోయింది. చాలామంది మహిళలు మౌనంగా దీన్ని భరిస్తుంటారు. కొద్దిమంది మాత్రమే ఎదిరించి పోరాడతారు. మౌనంగా భరించే తల్లులతోనే ఈ సమస్య ఆగడం లేదు.. వారి పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమెరికాకు చెందిన పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ ‘ప్లోస్ వన్’జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఇదే తేల్చింది. ఈ అధ్యయనం కోసం వారు.. దేశంలో ఏడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 12–17 ఏళ్ల మధ్య యువతను ఎంచుకున్నారు. మానసిక రుగ్మతలు; మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు గురైన వారి తల్లులను పరిశీలించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్
ఆత్మహత్యలకూ పురికొల్పుతున్నాయి
గృహ హింసకు గురైన తల్లుల్లో ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు స్పష్టంగా కనిపించాయి. ఇందులోనూ ముఖ్యంగా.. భౌతిక, లైంగిక దాడులకు గురైన తల్లుల్లో ఆందోళన వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపించగా.. మానసిక, భౌతిక, లైంగిక దాడులకు గురైన వారిలో తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలు కనిపించాయి.
మనదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహ హింసకు గురవుతున్నారని అంచనా. ఇవి వారిలో బయటకు చెప్పలేని బాధకు కారణమవడమే కాకుండా.. ఆత్మహత్యలకు కూడా పురికొల్పుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో చేసిన అధ్యయనాల్లో ఈ విషయం ఇప్పటికే రుజువైందని అధ్యయనకర్తలు తెలిపారు.
గర్భధారణ సమయంలోనూ..
అమ్మతనం ప్రతి స్త్రీకి ఒక కల. ప్రసవమంటే వేదన. కానీ, పుట్టే బిడ్డ కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది. ఆ కష్టానికి
గృహహింస కూడా తోడై మహిళలను మరింత కష్టపెడుతోంది. మనదేశంలో గృహ హింస కారణంగా మహిళలు గర్భధారణ సమయంలోనూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గర్భం మధ్యలోనే పోవడం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం జరుగుతున్నాయి. ఇవి పుట్టే పిల్లలపైనా ప్రభావం చూపుతున్నాయి.
వారిలో భావోద్వేగ, నడవడిక/ప్రవర్తనాపరమైన సమస్యలతోపాటు చదువులోనూ వెనకబడేలా చేస్తున్నాయి. ‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మహిళల పాలిట వరమూ కాగలదు, శాపమూ కాగలదు. భర్త చెడ్డవాడై, అత్త మామలు మంచి వాళ్లయితే.. మహిళకు వాళ్లు మానసికంగా బలాన్ని ఇవ్వగలుగుతారు. అదే అత్తమామలు ఆమెను వేధిస్తే ఆమెకు అదో కొత్త సమస్య. భర్త, అత్తమామల వేధింపులకు గురిచేస్తే నరకమే’అని ఈ సర్వే చేసినవాళ్లు అభిప్రాయపడ్డారు.
‘కౌమారం’పై జరిగే దాడి
భార్యలను అనుక్షణం తిట్లతో మానసికంగా వేధించడం, బెదిరించడం, వాళ్లకు ఇంట్లో అన్నం, నీళ్లు వంటివి ఇవ్వకుండా పస్తులుండేలా చేయడం.. ఇవన్నీ ఇంట్లో ఉండే చిన్నారులు చూస్తుంటారు. భర్తలు అరిచేటప్పుడు చాలామంది చిన్నారులు బింకచచ్చిపోయి ఉండిపోతారు. మరికొందరు ఏడుస్తారు. ఇలా తమ తల్లులపై జరుగుతున్న దాడిని ప్రత్యక్షంగా చూసిన ఆ చిన్నారుల లేత మెదళ్లు తీవ్రంగా ప్రభావితమై వారిలో మానసిక రుగ్మతలకు కారణమవుతాయి.
వారి నడతను ప్రభావితం చేసి.. వారి చదువుపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. జీవితంలో టీనేజీ /యవ్వనం చాలా ప్రధానమైన దశ. మన ఆలోచనా విధానం మొగ్గతొడిగేది అప్పుడే. ఆశలు, ఆశయాలు ఊపిరిపోసుకునేదీ అప్పుడే. మనం సమాజంలో ఎలా నడుచుకోవాలో, వ్యక్తిత్వం ఎలా ఉండాలో నేర్చుకునేదీ అప్పుడే. కానీ అదే సమయంలో.. తమ తల్లులను ఇంట్లోనివారు పెట్టే హింసలు, తల్లులు అనుభవించే మానసిక వేదన వారి లేత మనసులను గాయపరుస్తున్నాయి.
వారి విపరీత మానసిక ధోరణికి కారణమవుతున్నాయి. అయితే, గృహహింసను ఎదుర్కొనే మహిళలకు పుట్టే పిల్లల్లో ఇలాంటి మానసిక సమస్యలు ఎలా వస్తున్నాయో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలు, సాంస్కృతికపరమైన అంశాలపైనా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
గృహహింస అంటే..
» కట్నం కోసమో మరే ఇతర అవసరాల కోసమో భార్యలను భర్తలు వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయేలా హింసించడం.
» వాళ్లపై భౌతికదాడి చేయడం, యాసిడ్ వంటివి పోసి గాయపర్చడం
» కత్తుల వంటి వాటితో గాయపర్చడం, వాతలు పెట్టడం
» అమ్మాయి పుడితే హింసించడం, అబ్బాయి పుట్టేవరకు వేధించడం
టీనేజర్లలో ఈ సమస్య పరిష్కారానికి...
» పాఠశాలల్లో ఇలాంటి పిల్లలను గుర్తించాలి.
» వారిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పోగొట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి
» మహిళలపై గృహహింస జరగకుండా నిరోధించాలి.