గెలుపు పంటలు!

Inti Panta Special Story in Sagubadi - Sakshi

సాగుబడి

యుద్ధభేరి మోగగానే ఆహార భద్రత గురించిన ఆలోచన మదిలో రేకెత్తుతుంది.  కష్టకాలంలోనే ఆహార స్వావలంబన మార్గాల అన్వేషణ ప్రారంభమవుతుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటి పంటలు, పెరటి తోటల సాగు దిశగా అడుగులు పడతాయి. తొలి, మలి ప్రపంచ యుద్ధ కాలాల్లోనూ ‘విక్టరీ గార్డెన్స్‌’ విస్తరించాయని చరిత్ర చెబుతోంది. అమెరికా విధించిన కఠోర ఆంక్షల నడుమ క్యూబా బతికి బట్టకట్టగలిగింది కూడా సేంద్రియ ఇంటిపంటల ద్వారానే. కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడిన ఈ యుద్ధ కాలమూ అందుకు అతీతం కాదు. గోదాముల్లో తిండి గింజలకు కొరత లేదు. కానీ వాటికి మన సేంద్రియ ఇంటిపంటలు కూడా తోడైతేనే సంపూర్ణ ఆహార భద్రత చేకూరేది. అప్పుడే పౌష్టికాహార లోపాన్ని, అనారోగ్యాలనూ మనం గెలవగలం. అందుకే మనకు ఇప్పుడు ఇంటింటా ‘గెలుపు పంటలు’ కావాలి!

కరోనా మహమ్మారి విశ్వమానవాళిపై యుద్ధం ప్రకటించగానే ఆహార భద్రత గురించిన తలపులు మదిలో మెదిలాయి. లాక్‌డౌన్‌ పునరాలోచనకు పురికొల్పింది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొంతమేరకైనా ఇంటి పట్టున అప్పటికే పండించుకుంటున్న నగరాలు, పట్టణ వాసులు సంతోషించారు. టెర్రస్‌ ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడమే మేలన్న భావన  మిగతా వారిలోనూ వేరూనుకుంటున్నది. ఈ చైతన్యం మున్ముందు అర్బన్‌ ఫార్మింగ్‌ వ్యాప్తికి దోహదం చేస్తుందని ఆర్కిటెక్ట్‌లు, ఆహార నిపుణులు అంచనా వేస్తున్నారు.  
‘మనం తినే ఆహారం ఎంత దూరం నుంచి తరలివస్తున్నది? అక్కడి నుంచి తరలి వచ్చే దారిలో ఎటువంటి అవాంతరాలకు ఆస్కారం ఉంది? ఈ అవాంతరాలను తగ్గించుకునే మార్గాలేమి ఉన్నాయి? అని చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు’ అని థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్‌ కొచ్చకార్న్‌ ఒరాఖోమ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. బాంకాక్‌లో ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్‌ రూఫ్‌టాప్‌ ఫామ్‌కు రూపుకల్పన చేసిన ఆర్కిటెక్ట్‌గా ఆమె ప్రసిద్ధిపొందారు.

తొలి ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత రాకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ ‘విక్టరీ గార్డెన్స్‌’ పేరిట పంటల సాగు చేపట్టాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్‌ తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా అంతే. అమెరికాలో ప్రతి ఇల్లు, స్కూలు పరిసరాల్లో గజం కూడా ఖాళీ స్థలం వదలకుండా కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష భవనం ఎదుట కూడా కూరగాయలు సాగు చేశారు. 1940వ దశకంలో 2 కోట్ల అమెరికన్‌ కుటుంబాలు కూరగాయలు ఇంటిపంటలు పండించడం ప్రారంభించారు. నాలుగేళ్లలో 40% కూరగాయలను విక్టరీ గార్డెన్లే వారికి తఅందించాయట.

‘ఇంటిపంటల టవర్‌’ విశేషం ఏమిటంటే.. దీని పైన, చుట్టూతా కూడా అనేక మొక్కలు పెంచుకోవచ్చు. కంపోస్టు తయారు చేసుకోవచ్చు. టవర్‌ పైభాగన నీరు పోస్తే చాలు.
అమెరికా కఠోర ఆంక్షల వల్ల క్యూబాకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చమురు దిగుమతి ఆగిపోయింది. ఆ కష్టకాలంలో క్యూబా నగరాలు, పట్టణాల్లో ప్రజలు సేంద్రియ ఇంటి పంటల సాగు ద్వారానే బతికి బట్టకట్టగలిగారు. అంతేకాదు, తాము పండించిన కూరగాయలు, పండ్లు గ్రామాలకు కూడా పంపగలిగారు!
2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు మంది నగరాల్లో నివాసం ఉండబోతున్నారని ఐక్యరాజ్య సమితి అంచానా వేస్తోంది. వీరికి కావాల్సిన కూరగాయలు, పండ్లలో కొంత మేరకైనా అర్భన్‌ ప్రాంతాల్లోనే పండించే మార్గాంతరాలు వెతకాల్సి ఉందని ఎర్త్‌ ఫ్యూచర్‌ అధ్యయనం చెబుతోంది.
భారత్‌ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరీకరణ వేగం పుంజుకున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతవాసుల్లో పౌష్టికాహార లోపం (హిడెన్‌ హంగర్‌) పెరుగుతున్నది. కనపడని శత్రువుపై పోరులో మనకు నిండుగా తోడుండేవి ఇంటి పంటలు.
అవును, ఇవే గెలిపించే పంటలు.. మనుషులుగా మనల్ని, దేశాన్ని కూడా!
ఇంటిపంటలు ఎంత మంచివైనా ఇప్పుడు టైం ఎక్కడుందిలే అని ఇక సరిపెట్టుకోలేం!!– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి

‘ఇంటిపంటల టవర్‌’తో మేలు
పట్టణాలు, నగరాల్లో గృహస్తులు టెర్రస్‌ల మీద కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మా ఇంటిపైన పుదీనా, పొన్నగంటి, గంగవాయిలి, ఎర్రగలిజేరు వంటి ఆకుకూరలు, టమాటా, వంగ వంటి కూరగాయలను అతితక్కువ స్థలంలో ఇమిడిపోయే ‘ఇంటిపంటల టవర్‌’లో పెంచుతున్నాం. మేం తినడంతోపాటు బంధుమిత్రులకూ పంచుతున్నాం. వంటింటి వ్యర్థాలను ఈ టవర్‌లో వేసి కంపోస్టు తయారు చేస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కుటుంబాల పౌష్టికాహార, ఆరోగ్య భద్రతకు టవర్‌ గార్డెనింగ్‌ ఎంతగానో దోహదపడుతుంది.
– కె. క్రాంతికుమార్‌రెడ్డి,లక్ష్మి దంపతులు (83096 15657),రామాంతపూర్, హైదరాబాద్‌అర్బన్‌ ఫార్మింగ్‌తోనే ఆహార భద్రత

ప్రజలు, ప్రణాళికావేత్తలు, ప్రభుత్వాలు కూడా నగరాల్లో భూమిని ఇప్పుడు ఉపయోగిస్తున్న తీరుపై పునరాలోచన చేయాలి. అర్బన్‌ ఫార్మింగ్‌కు చోటివ్వాలి. ఇది ఆహార భద్రతను కల్పించడంతోపాటు పౌష్టికాహార లోపాన్ని అరికడుతుంది. వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తినిస్తుంది. మానసిక వత్తిడినీ ఉపశమింపజేస్తుంది.– కొచ్చకార్న్‌ ఒరాఖోమ్,ప్రముఖ లాండ్‌స్కేప్‌ ఆర్కిటెక్ట్,ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్‌ ఫామ్‌ రూపశిల్పి, బ్యాంకాక్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top