కవరింగ్‌ కోడలు

family situations - Sakshi

‘కవర్‌ ఇవ్వు అర్జంట్‌’ అంటూ హడావుడిగా లోపలికి వచ్చాడు శ్రీనివాస్‌. ‘దేనికి?’ అడిగాను. ‘ప్రశ్నలు కాదు. కవర్‌ కావాలి’ అనేసరికి తప్పదన్నట్టు ఓ వెడల్పాటి బట్టల కవర్‌ వెతికి ఇచ్చాను. దాంట్లో తెగిపోయిన చెప్పులు వేసుకొని వెళ్లిపోయాడు కుట్టించుకురావడానికి. ముందే చెబితే పాత కవర్‌ తీసిస్తా కదా, మంచి కవర్‌.. ఎందుకని అడిగితే చెప్పడానికేంటో.. విసుక్కుంటూ వంటకు కావల్సిన కూరగాయలు తరిగే పనిలో పడ్డాను. ఉదయం ‘డ్రెస్‌ స్టిచ్చింగ్‌కి ఇచ్చి రావాలి కవర్‌ ఇవ్వు’ అంటే తీసిచ్చాను.

కూరగాయలు తీసుకురావడానికి కవర్‌ అడిగితే ఇచ్చా. ఇంట్లో చేసిన ఫలహారాలు బంధువులకు ఇచ్చిరావాలి అంటే కవర్‌ వెతికిచ్చా. ఇప్పుడు పాత చెప్పులకు కూడా మంచి కవర్‌ కావాలి.. నేనేమైనా కవర్లు అమ్ముకునే షాప్‌ పెట్టానా? అడిగిన ప్రతిసారీ కవర్, అందులోనూ మంచి కవర్‌ ఇవ్వడానికి.. తిట్టుకుంటూనే కుకర్‌ విజిల్‌ మోగకుండా అవస్థ పడుతుంటే దాన్నో మొట్టికాయ వేశాను! అది చెయ్యికి చుర్రుమని వేడిగా చురక అంటించింది.

‘అమ్మా, రెడీ అయ్యావా! ఆటో తీసుకొస్తా, నాకు టైమ్‌ అయిపోతోంది’ హడావుడిగా తయారవుతూనే తల్లిని కేకేశాడు శ్రీనివాస్‌. ‘ఒరేయ్, మొన్న నువ్వు ఊరెళ్లేటప్పుడు పెద్ద కవరొకటి ఇచ్చాను కదా! అదిటివ్వు. బట్టలు సర్దుకోవాలి’.. ఆఫీసుకెళ్లడానికి లంచ్‌బాక్స్‌ బ్యాగ్‌లో పెట్టుకుంటూ టైమ్‌ చూస్తున్న నేను‘ పెద్ద కవర్‌’ అనే మాట అత్తగారి నోట వినగానే ఉలిక్కిపడ్డాను. ప్రశాంతంగా ఉన్న ఇంటిలో వాయుగుండం ఏర్పడబోతున్న సంకేతాలు అందుతున్నాయి.    ‘ఆ కవరే ఉందా, ఐరన్‌ షాప్‌కి దాంట్లోనే బట్టలు పెట్టిచ్చాను. వాడు సాయంత్రానికి గానీ తీసుకురాడు...’ అంతే ఫాస్ట్‌గా చెప్పేశాడు శ్రీనివాస్‌. ‘ఏదైనా ఇస్తే.. తిరిగిచ్చే అలవాటు లేదురా నీకు.

మొన్న పాపం ఆ సీతమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఇచ్చింది, పే..ద్ద కవర్‌.. ఎన్ని బట్టలు పట్టేవో..’ అల్మారా తలుపు దఢేల్న మూసుకున్న సౌండ్‌. ఆవిడకు కోపం వచ్చుంటుందని అర్థమైంది. ‘ఇంకా నయం ఆవిడ బంగారం పెట్టింది. అది నేను దోచేశాను అనలే..’ అన్నాడు శ్రీనివాస్‌ మాట పడనివాడిలా! ‘అవున్రా.. నేను బంగారమే కావాలని దాచుకొని ఉండుంటే ఈ రోజుకి మీరిలా ఉండేవారా!’ గదిలో నుండే ఆవిడ కంఠం స్థాయి పెంచి అంది. ‘అవును మరి.. మీ నాయిన కిలో బంగారంబెట్టె. మేమంతా కరగదీసుకుని తినేస్తిం..’ పేపర్‌ చదువుతున్న మామగారు అత్తగారి మాటకు ఎక్కడో కనెక్ట్‌ అయ్యి వెంటనే కౌంటర్‌ ఇచ్చేశారు. కవర్‌తో మొదలైన ఘాటు కనకం దాకా ప్రయాణిస్తూ.. అదెటు వెళుతుందో.. ! డబ్బులు తీసుకుని ఇవ్వలేదంటే ఒక అర్థం ఉంది. కవర్‌ తీసుకొని ఇవ్వకపోతే కూడా కోపం వస్తుందా?! ఏంటో వీళ్ల కవర్ల గోల. వీళ్లను కవర్‌ చేయలేక నా తల ప్రాణం తోకకొచ్చేట్టుంది.

త్వరగా ఈ వ్యవహారాన్ని బ్యాగ్‌లో చుట్టేయాలి అనుకుంటూ... ‘ఈ బ్యాగ్‌లో పెట్టుకెళ్లండి అత్తయ్య. చిన్న బ్యాగ్‌. మొన్న శిల్పారామంలో తెచ్చా. బాగుంటుంది కూడా!’ కలంకారీ బ్యాగ్‌ ఆమె ముందు పెడుతూ సర్దిచెబుతున్నట్టు కాస్తంత హోప్‌తో చెప్పా! ‘ఒక్కరోజు వెళ్లి రావడానికి మూటెందుకు?’ అని దీర్ఘం తీసింది.   ‘అల్లుడు ఊరెళ్లాడు, రాత్రికి తోడుగా ఉందువుగానీ రా’ అని కూతురు ఫోన్‌ చేసిందట. అందుకే ఈ అకస్మాత్తు ప్రయాణం. ఈవిడ కవర్‌కే ఫిక్స్‌ అయిపోయింది. ఇక మన మాట వినదు.. నాకీ కవర్ల వెతుకులాట తప్పదు. టైమ్‌ అయిపోతోందని హెచ్చరిస్తున్న గడియారం నా వైపు జాలిగా చూస్తున్నట్టు అనిపించింది. ‘‘నేనే ఫాస్ట్‌ చూడు’ అని గడియారం వైపు ఓ లుక్కేసి బీరువా వైపు పరుగులాంటి నడకతో వెళ్లాను. బట్టల షాపింగ్‌ చేసినప్పుడు వాటిని కవర్లలో పెట్టి ఇస్తుంటారు షాప్‌వాళ్లు. (ఇప్పుడు వాటి ఖరీదు కూడా జత చేస్తున్నారు) అవసరం ఉంటుంది కదా అని వాటిని బీరువా అట్టడుగున ఉన్న రాక్‌లో జాగ్రత్త చేసి ఉంచుతుంటాను.

ఓ మోస్తరు కవర్లు ఉంటే బెడ్‌ కింద చేర్చుతుంటాను. ప్రతి ఇంట్లోనూ  కవర్ల అవసరం ఏదో టైమ్‌లో ఉంటూనే ఉంటుంది. కానీ, మా ఇంట్లో మాత్రం కవర్ల కోసమే అప్పుడప్పుడు చిన్న చిన్న యుద్ధాలూ జరుగుతుంటాయి.   వాటిని కట్టడి చేయడానికి నేను డబ్బులు పోగేసుకున్నట్టు కవర్లు పోగేస్తుంటాను. నిన్నటికి నిన్న.. ‘మున్సిపల్‌ ఆఫీసులో పని ఉంది ఈ కాగితాలన్నీ పట్టుకెళ్లాలి. ఓ మంచి కవర్‌ చూసివ్వమ్మా..’ అన్న మామగారికి ఓ మోస్తరు బాగున్న కవర్‌ తీసిచ్చా. ‘ఈ రెండూ రోలింగ్‌ చేసిన చీరలు. బ్యాగులో పెడితే ముడతలు పడతాయిగానీ ఓ కవర్‌ ఇవ్వు’ అన్న అత్తగారికి ఇంకాస్త బాగున్న కవర్‌ వెతికి మరీ ఇచ్చాను. ‘నానమ్మ కొబ్బరికాయ, అరటిపళ్లు తీసుకురమ్మంది, కవరివ్వమ్మా’ అన్న నా కూతురికి బలంగా ఉన్న కవర్‌ ఇచ్చాను.

ఏం అవసరం ముంచుకొచ్చిందో అడక్కుండానే కనిపించిన కవర్‌ని నాలుగు మడతలు వేసి జేబులో పెట్టుకొని వెళ్లిపోయాడు నా కుమారరత్నం. ప్లాస్టిక్‌ కవర్‌ వాడకం అంత మంచిది కాదని అప్పటికీ కలంకారీ, ఖాదీ క్లాత్‌తో కుట్టిన సంచులు నాలుగైదు తెచ్చిపెట్టాను. ఇంట్లో ఎవరు కవర్‌ అడిగినా ఆ బ్యాగ్‌లను ముందు పెడుతున్నాను. కానీ, ఒక్కరూ వాటిని ముట్టుకోవడం లేదు. ఏదో ఒక కారణం చెప్పి వాటిని విజయవంతంగా వెనక్కి నెడుతున్నారు. అలా ఆలోచిస్తూనే.. ర్యాక్‌ వెతికితే ముడతలు పడిన మరీ పెద్దగా లేని కవర్‌ ఒకటి దొరికింది. బీరువా ర్యాక్‌ ఏమీ అక్షయపాత్ర కాదుగా.. తీసిన కొద్దీ కవర్లు రావడానికి.

ఈ కవర్‌ ఇస్తే మళ్లీ గోడకు కొట్టిన బంతిలా ఇక్కడికే రావాలి, ఎలా.. అనుకుంటూ దిక్కులు చూస్తుంటే పైన అరలో పట్టుచీరను లోపల దాచుకొని రాజసం ఒలకబోస్తున్న కవరొకటి కనిపించింది. పిచ్చిమొద్దు.. ఎంత బాగుందో.. చాలా రోజుల నుంచి నా దగ్గరే ఉంది. పోయినసారి పండక్కి అమ్మవాళ్లు బట్టలు పెట్టారు. వాటితోనే ఆ కవర్‌ వచ్చింది. ఈవిడ పట్టుచీర అడిగినా బాధ ఉండేది కాదేమో.. అనుకుంటూ చీర బయట పెట్టి.. ఆ కవర్నొకసారి కళ్లనిండుగా చూసుకున్నాను! నెలాఖరుకి చివరి నోటు ఖర్చయిపోతే కలిగే బాధలా ఉంది. ఆ చిట్ట చివరి కవర్‌.. తీసుకెళ్లి అత్తగారి చేతికిచ్చాను.

‘ఏంటీ ఎక్కడికో రెడీ అయినట్టున్నావ్‌..!’ అప్పటి వరకు టీవీ రిమోట్‌ని నొక్కీ నొక్కీ అలసిపోయి రూమ్‌లోకి వచ్చిన శ్రీనివాస్‌ ఆశ్చర్యం మార్క్‌ ఫేస్‌తో ‘సండే ఎక్కడికి’ అన్నట్టు చూశాడు. ‘మీరూ రెడీ అవండి. షాపింగ్‌కి వెళుతున్నాం. డ్రెస్సులు కొనాలి’ అన్నాను చీర కొంగుకు పిన్ను పెట్టుకుంటూ.. ‘ఇప్పుడెందుకు షాపింగ్‌? నీ బర్త్‌ డే నా?’ అన్నాడు. నిరసనగా ఓ చూపు చూశాను! ‘పోయిన నెలలో బర్త్‌ డే రోజున కనీసం గుర్తు తెచ్చుకొని విష్‌ కూడా చేయనందుకే కదా! నాలుగు రోజులు మాటల్లేనిది? అప్పుడే మర్చిపోయినట్టున్నాడు. కాదన్నట్టు తల అడ్డంగా ఊపాను. ‘పండగ టైమ్‌ ఇంకో నెల ఉందిగా, అప్పుడు కొందాంలే!’ మంచం మీద వాలిపోతూ అన్నాడు.

‘కాదు, ఇప్పుడే వెళుతున్నాం. రేపట్నుంచి నాకు కుదరదు. మీకు ఓ పది, మీ అమ్మగారికి ఓ ఐదు, నాన్నగారికి నాలుగు, చిన్నుగాడికి ఓ ఐదు,...’ ‘ఏంటీ డ్రెస్సులే..?!’ ఉన్నఫళంగా లేచి కూర్చుంటూ అడిగాడు. ‘మంచి కవర్లు కావాలి. అన్నీ అయిపోయాయి మరి. రేపటి నుంచి మీ అందరికీ కవర్లు నేనెక్కడ సప్లై చేసేది? ఇంట్లో కవర్ల కోసం జరిగే కత్తియుద్ధాలు ఎక్కడ ఆపేది. రంగు, హంగు ఉన్న కవర్లు కావాలంటే కాస్త బ్రాండెడ్‌ షోరూమ్స్‌కి వెళ్ళాలి. క్రెడిట్‌ కార్డ్‌ తీసుకొని త్వరగా రండి..’ అంటూ బ్యాగ్‌ భుజానికేసుకొని బయటకు నడిచాను. ఈయన వెనకాల వస్తారా..?! షాపింగ్‌కి. లేకపోతే.. ‘కవర్‌ అడగనులే.. కలంకారీ బ్యాగ్‌ చాలు’ అని కవరింగ్‌ ఇవ్వడానికి వస్తారా? వస్తే కొత్త కవర్లతో పాటు కొత్త బట్టలూ వస్తాయి. రాకపోతే కలంకారీ, ఖాదీ బ్యాగులు కళకళల్లాడుతూ వీళ్లతో పాటు తిరుగుతాయి అనుకుంటే భలే ఖుషీగా అనిపించింది.

‘మంచి కవర్లు కావాలి. అన్నీ అయిపోయాయి మరి. రేపటి నుంచి మీ అందరికీ కవర్లు నెనెక్కడ సప్లై చేసేది? ఇంట్లో కవర్ల కోసం జరిగే కత్తియుద్దాలు ఎక్కడ ఆపేది. రంగు, హంగు ఉన్న కవర్లు కావాలంటే కాస్త బ్రాండెడ్‌ షోరూమ్స్‌కి వెళ్ళాలి. క్రెడిట్‌ కార్డ్‌ తీసుకొని త్వరగా రండి..’ అంటూ బ్యాగ్‌ భుజానికేసుకొని బయటకు నడిచాను.

– నిర్మలారెడ్డి చిల్కమర్రి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top