ఇంత చిన్న వయసులోనూ కండరాల నొప్పులా?

family health counciling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌  

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల తరచూ కాళ్లూ చేతుల్లో నొప్పులు అంటున్నాడు. కండరాల నొప్పులు కూడా ఉన్నాయి. ఈ సమస్య మినహా అన్ని రకాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. డాక్టర్‌కు చూపిస్తే విటమిన్‌–డి లోపాల వల్లగాని లేదా ఎదుగుదల సమయంలో వచ్చే నొప్పులు కావచ్చని అంటున్నారు. అయితే ఇటీవల నాకు కూడా విపరీతంగా కాళ్లూ, చేతుల్లో నొప్పి వస్తే డాక్టర్‌కు చూపించాను. నాకు విటమిన్‌–డి లోపం ఉన్నట్లు చెప్పారు. దీన్నిబట్టి మా బాబుకు నిశ్చయంగా విటమిన్‌–డి లోపమేనంటారా? ఇది ఇతర సమస్యలకు దారితీయవచ్చా? దయచేసి వివరంగా సలహా చెప్పండి. 
– సుహానా, కర్నూలు 

మీ బాబు విషయంలో మీరు పేర్కొన్న లక్షణాలు అనేక కారణాల వల్ల కనిపించినప్పటికీ... అతడిలో ఇతర ఆరోగ్య సమస్యలు... అంటే... తరచూ జ్వరం, బరువులో మార్పులు, ఎదుగుదల సమస్యలు, కడుపుకు సంబంధించిన లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, కీళ్లలో వాపులు, నడవడంలో తీవ్ర ఇబ్బందులు లేవు కాబట్టి మీ బాబు సమస్యను తీవ్రమైన ఇతర జబ్బులకు సూచనగా భావించలేం. మీ డాక్టర్‌ చెప్పినట్లుగా విటమిన్‌–డి లోపం ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాధారణంగా ఇటీవలి కాలం వరకూ బాగా చల్లటివీ, సూర్యరశ్మి తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్‌–డి లోపం ఎక్కువగా ఉంటుందనే అపోహ ఉండేది.  అయితే ఇటీవల మన దేశంలాంటి ఉష్ణమండల (ట్రాపికల్‌) వాతావరణం ఉన్నచోట్ల కూడా విటమిన్‌–డి లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. 
విటమిన్‌–డి అనేది అనేక ఆరోగ్య అంశాల నిర్వహణకు చాలా అవసరం. మన ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు అది దోహదం చేస్తుంది. అలాగే మన దేహంలోని అనేక కీలక అవయవాల సమర్థమైన పనితీరుకు అది అవసరం. ఎండకు తగినంతగా ఎక్స్‌పోజ్‌ కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో విటమిన్‌–డి  లోపం వల్ల,  శాకాహార నియమాన్ని మరీ ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల, పాలతో అలర్జీ ఉండటం వల్ల విటమిన్‌–డి లోపం కనిపిస్తుంది. అలాగే కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉండటం, కొన్ని రకాల మందులు వాడుతుండటం జరుగుతుంటే ఈ లోపం కనిపించవచ్చు. ఇప్పుడు విటమిన్‌–డి లోపం అన్నది పిల్లల్లో, పెద్దల్లో కనిపించడం చాలా సాధారణమైంది. 

విటమిన్‌–డి లోపం ఉన్నప్పుడు ఫిట్స్‌ వచ్చి స్పృహతప్పడం, కాళ్లూచేతులు వంకర్లు తిరగడం, కండరాల నొప్పులు, నడకలో నిదానం, రికెట్స్‌ కనిపించవచ్చు. దాంతో పాటు కొద్దిమందిలో వ్యాధినిరోధకశక్తి (ఇమ్యూనిటీ)లో లోపం రావడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్‌ బారిన పడటం, ఆస్తమా, మతిమరపు, డయాబెటిస్, మల్టిపుల్‌ స్కి›్లరోసిస్, గుండెజబ్బుల బారినపడటం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు లోనయ్యేందుకు విటమిన్‌–డి లోపం ఒక కారణమని తెలుస్తోంది. మీ అబ్బాయి విషయంలో విటమిన్‌–డి లోపంతో పాటు బహుశా క్యాల్షియం మెటబాలిజం లోపాల వల్ల  కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మీలోనూ విటమిన్‌–డి లోపం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి మీరు, మీ అబ్బాయి ఇద్దరూ విటమిన్‌–డి3తో పాటు క్యాల్షియమ్, ఫాస్ఫరస్‌ లోపాలు కనుగొనడానికి అవసరమైన వైద్య పరీక్షలతో పాటు థైరాయిడ్, పారాథైరాయిడ్‌ హార్మోన్‌ పరీక్షలు, సీబీపీ, సీపీకే పరీక్ష చేయించుకుంటే ఈ నొప్పులకు తగిన కారణాలపై పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుంది. ఈ లోపం తొలగడానికి విటమిన్‌–డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే కూడా...  సూర్యుడికి తగినంత ఎక్స్‌పోజ్‌ కావడమే చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే విటమిన్‌–డి ఎక్కువగా ఉండే పాలు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్‌–డి సప్లిమెంట్స్‌ తీసుకోవడం వల్ల మీ బాబు సమస్య తప్పక తగ్గుతుంది. అలాగే పైన పేర్కొన్న వాటితో పాటు క్యాల్షియం కూడా తగిన పాళ్లలో అందేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ లోపం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే విటమిన్‌–డి ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. 

బాబుకు యూరిన్‌లో ప్రోటీన్స్‌ ఎక్కువగా పోతున్నాయి... కిడ్నీ జబ్బు కావచ్చా? 
మా బాబుకు ఐదేళ్లు. వాడికి ఇటీవల రెండుమూడు సార్లు జ్వరం వచ్చింది. మందులు ఇచ్చిన వెంటనే తగ్గింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే మావాడికి  మూత్రంలో ఇన్ఫెక్షన్‌ అని చెప్పారు. కొద్దిగా నీరసంగా కూడా ఉన్నాడు. ఈమధ్య  మూత్రపరీక్ష చేయిస్తే అతడికి యూరిన్‌లో కొద్దిగా ప్రోటీన్స్‌ పోతున్నట్లుగా రిపోర్టు వచ్చింది. మా దూరపు బంధువుల్లో ఒకరికి కిడ్నీ రుగ్మత ఉంది. ఆయనకు కూడా ఇలాగే ప్రోటీన్స్‌ పోతుంటాయి. దాంతో మావాడి విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇదేమైనా మావాడి రాబోయే కిడ్నీ రుగ్మతకు సూచనా? దయచేసి వివరంగా చెప్పండి. 
– సునీల, బెంగళూరు 

పిలల్లోని పదిశాతం మందిలో ఎనిమిది, పదిహేనేళ్ల మధ్య...వారిలో జీవితకాలంలోని ఏదో సమయంలో ఇలా మూత్రంలో ప్రోటీన్‌ పోవడం అన్నది చాలా సాధారణంగా జరిగేదే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే... ఇలా పోతున్న ప్రోటీన్‌ అన్నది కిడ్నీకి సంబంధించినదా, లేక తాత్కాలికంగా నష్టపోతున్నదా లేదా ఇతరత్రా  హానికరం కాని కారణాల వల్ల పోతున్నదా అని తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, అధికంగా వ్యాయామం చేసినప్పుడు, జలుబు చేసినప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, తాము ఉన్న స్థితినుంచి మారడం (పొజిషనల్‌ వేరియేషన్‌) వంటి సాధారణమైన కారణాలు మొదలుకొని కిడ్నీజబ్బులు, ట్యూబ్యులార్‌ డిసీజెస్, పాలీసిస్టిక్‌ కిడ్నీ, రిఫ్లక్స్‌ నెఫ్రోపతి వంటి తీవ్రమైన, దీర్ఘకాలిక జబ్బుల వరకు ప్రోటీన్‌ పోవడం సంభవించవచ్చు. ప్రోటీన్‌ పోవడంలోని తీవ్రత  ఆధారంగానే పేషెంట్‌ విషయంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడం జరుగుతుంది. 

పిల్లల్లో యూరిన్‌లో ప్రోటీన్‌ పోవడంలోని తీవ్రత – నిత్యం, గుర్తించేంత మోతాదులో అంటే కన్సిస్టెంట్‌గా, సిగ్నిఫికెంట్‌గా పోతుంటే అప్పుడిది ఏదైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకు దారితీసే కండిషన్స్‌కు సూచికా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మూత్రంలో ప్రోటీన్స్‌ చాలా తక్కువ  మోతాదులో పోతుంటాయి. దీన్నే మైక్రో ఆల్బ్యుమిన్‌ యూరియా అంటారు. ఈ అంశంలో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్‌ ప్రోటీన్‌ క్రియాటినిన్, 24గంటల్లో మూత్ర విసర్జన పరిమాణం, ఇమ్యూనలాజికల్‌ టెస్ట్, అల్ట్రాసౌండ్‌ అబ్డామిన్‌ వంటి మరిన్ని అదనపు పరీక్షలు చేయించాలి. అవసరమైతే కిడ్నీ బయాప్సీ మొదలైన పరీక్షల ద్వారానే ఇదేమైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణమా అని తెలుసుకోవచ్చు. ఇక మీ అబ్బాయి విషయానికి వస్తే రెండు మూడు సార్లు జ్వరం తప్ప మరే ఇతర లక్షణాలూ కనిపించలేదు కాబట్టి అతడి విషయంలో కనిపిస్తున్న ప్రోటీన్‌ పోవడం అన్నది తీవ్రమైన, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణం కాకపోవచ్చు. అయినా మీ బంధువుల్లో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని రాశారు కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించడం వల్ల మీ అబ్బాయి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమవుతుంది. మీరేమీ ఆందోళన చెందకుండా మీ అబ్బాయికి సంబంధించిన యూరిన్‌ టెస్ట్‌ రిపోర్టులు, ప్రోటీన్‌ పోతున్న రిపోర్టులతో ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు నెఫ్రాలజిస్టును కలిసి తగిన సలహా తీసుకోండి. 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్, 
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top