మృత్యు బీమా!

Family crime story special - Sakshi

మరణానంతరం అయినవారికి బతుకునిచ్చేది జీవనబీమా!బతికి ఉండగానే మృత్యువును చూపించేది మృత్యుబీమా!జలపాతాలు అందరూ చూసి ఉంటారు ఇది జలపాతకం.జలఘాతుకం. మృత్యుఘాతుకం.

2006 నవంబర్‌ 30, సాయంత్రం 6 గంటలు.ఎక్కడో చావు కేక వినిపించినట్టుగా ఆ సాయంత్రం భయం భయంగా ఉంది. మైదాన ప్రాంతం కావడం వల్ల పొగమంచు మొదలయ్యి వాతావరణంలో ఏదో భీతావహం కనిపిస్తూ ఉంది.ఆదిలాబాద్‌ నేరడిగొండ ఠాణా.ఒక కారు వచ్చి ఆగింది.నల్ల కోటు వేసుకుని అడ్వకేట్‌లా కనిపిస్తున్న ఓ వ్యక్తి, కారు డ్రైవర్, మరో ఇద్దరు దిగారు. పోలీసు స్టేషన్‌లోకి వడివడిగా వచ్చి ఎస్‌.ఐ ని కలిశారు.ఎస్‌.ఐ ఏంటన్నట్టుగా చూశాడు. ‘సార్‌... నా పేరు రమణ (పేరు మార్చాం). అడ్వకేట్‌ని. మాది హైదరాబాద్‌. కుంటాల జలపాతం చూడ్డానికి వచ్చాం..’ ‘అయితే’ అన్నట్టు చూశాడు ఎస్‌ఐ.‘మాతోపాటు వచ్చిన నారాయణ్‌సింగ్‌ అనే మిత్రుడు జలపాతంలో ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. ఆచూకీ లభించలేదు’ ఎస్సై అలెర్ట్‌ అయ్యాడు.  కుంటాల అంటే ప్రమాదంతో నిండిన జలపాతం. చాలామంది ప్రాణాలు మింగిన జలపాతం అది.‘నారాయణ్‌సింగ్‌ వయసెంత?’ ‘62 ఉంటుంది సర్‌’‘మిగతా ఈ ముగ్గురు ఎవరు?’  ‘ఇతను మా కారు డ్రైవర్‌ వినోద్, అతను నా స్నేహితుడు కిరణ్‌’ అని లాయర్‌ చెబుతుండగా ‘నేను కుంటాల వాచ్‌మెన్‌ని సర్‌’ అన్నాడు నాలుగో అతను.అందరూ కుంటాల జలపాతానికి చేరుకున్నారు. అప్పటికే చీకటి అలుముకుంది. అటవీప్రాంతం. అందులోనూ ప్రమాదకరమైన జలపాతం. ‘వెతకడం కష్టమే. ఉదయాన్నే వద్దాం’ అన్నాడుఎస్సై. 

తెలతెలవారుతూనే పోలీసులు కుంటాల జలపాతానికి చేరుకున్నారు. జాలర్లు, గజ ఈతగాళ్లతో గాలించారు. నారాయణ్‌సింగ్‌ ఆచూకీ దొరకలేదు. మూడు రోజుల తర్వాత అంటే డిసెంబర్‌ 3న మృతదేహం లభించింది. పోలీసులు యాక్సిడెంటల్‌ కేస్‌గా నమోదు చేస్తూ  వివరాలు చెప్పమన్నారు. అడ్వకేట్‌ రమణ చెప్పడం మొదలుపెట్టాడు..‘సార్‌.. నారాయణసింగ్‌ నాకు మార్నింగ్‌ వాక్‌లో మిత్రుడు. అతని భార్య పేరు లక్ష్మి. ఆమెకు 60 ఏళ్లు ఉంటాయి. తీర్థయాత్రలకు వెళ్లింది. ఎప్పుడొస్తుందో తెలియదు. కాంటాక్ట్‌ నెంబర్‌ కూడా నా వద్ద లేదు. అతని బావమరిది శంకర్‌సింగ్‌ చత్తీస్‌గఢ్‌లో ఉన్నాడు. అతని ఫోన్‌ నెంబర్‌ కలవడం లేదు. నారాయణసింగ్‌కి పిల్లల్లేరు’ చత్తీస్‌గఢ్‌కు ఫోన్‌ కలపడానికి ట్రై చేశారు. కానీ సిగ్నల్‌ దొరకలేదు. అప్పటికే శవం బాగా కుళ్లిపోయింది.  ‘ఏం చేద్దాం’ అడిగాడు ఎస్‌.ఐ.స్నేహితుడి మృతదేహాన్ని చూడలేక ఆ అడ్వకేటు ‘అంత్యక్రియలు మీ ఆధ్వర్యంలోనే చేయండి సార్‌’ అన్నాడు. కుంటాలలోనే నారాయణసింగ్‌ శవానికి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు. యాక్సిడెంటల్‌ డెత్‌ కింద కేసు మూసివేశారు.

ఐదు నెలలు గడిచాయి.ఠాణాకు ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది.‘నారాయణ సింగ్‌ మరణం యాక్సిడెంట్‌ కాదు, హత్య’ అని ఉంది అందులో. ఎస్‌.ఐ దాని వైపే చూస్తూ కూర్చున్నాడు. ఎవరు రాసి ఉంటారు దీనిని అని ఆలోచించాడు. క్లూ ఏమీ లేదు. అలాగని నారాయణ సింగ్‌ మరణంలో కూడా తనకు ఎటువంటి అనుమానాలు లేవు. కాలు జారి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు కుంటాలలో. ఇదీ అలాంటిదే ఒకటి అని కార్డు చించేశాడు.ఇది జరిగిన వారం రోజులకు ముంబై నుంచి స్టేషన్‌కు ఫోన్‌ వచ్చింది.ఎస్‌.ఐ ఎత్తాడు.అది ఒక ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి.‘నారాయణ సింగ్‌ ప్రమాదవశాత్తే మరణించాడా?’ అటువైపు నుంచి అడిగారు.‘అవును. ఏంటి ప్రాబ్లం’‘మాకు నారాయణసింగ్‌కు సంబంధించిన క్లయిమ్‌ పేపర్స్‌ వచ్చాయి. అతని భార్య పేరు వేరుగా ఉంది. మాకు డౌట్‌ వచ్చింది. మాకు వచ్చిన క్లయిమ్‌ పత్రాలలో ఉన్న భార్య పేరు వేరు. ఆవిడ రమణ అనే అడ్వకేట్‌కు చెందిన వ్యక్తి అని మా ఎంక్వయిరీలో తేలింది. మొత్తం ఈ వ్యవహారమే అనుమానాస్పదంగా ఉంది’ అన్నాడు అవతల వ్యక్తి.వాళ్ల క్లయిమ్‌కు వచ్చిన పాలసీ కాకుండా ఆ సంస్థలో నారాయణసింగ్‌కు గతంలో ఇంకో పాలసీ ఉంది. అది ఈ పాలసీ కంటే పాతది. అందులో భార్య పేరు సుశీల అని ఉంది. ఇప్పుడు క్లయిమ్‌ పేపర్స్‌లో భార్య పేరు లక్ష్మి అని ఉంది. ఫొటో కూడా వేరే ఉంది.

‘మీకు వచ్చిన పేపర్లలో నామినీ పేరు ఏమని ఉంది?’‘లక్ష్మి’‘అసలు భార్య పేరు?’‘సుశీల’మరి ఈ లక్ష్మి ఎవరు? దొరికింది క్లూ అనుకుని ఎస్సై లేచాడు.పోలీసులకు ఎలాగైతే ఇంటర్నల్‌గా ఒక వ్యవస్థ ఉంటుందో ఇన్సూరెన్స్‌ సంస్థలకు కూడా ఇంటర్నల్‌గా ఒక కమ్యూనికేటివ్‌ వ్యవస్థ ఉంది. ముంబైలోని టాటా ఏఐజీ సంస్థ నారాయణ సింగ్‌ భార్య పేరు తేడా ఉన్నట్టు కనిపెట్టింది. దానికి కారణం వాళ్ల క్లయిమ్‌కు వచ్చిన పాలసీ కాకుండా ఆ సంస్థలో నారాయణసింగ్‌కు గతంలో ఇంకో పాలసీ ఉంది. అది ఈ పాలసీ కంటే పాతది. అందులో భార్య పేరు సుశీల అని ఉంది. ఇప్పుడు క్లయిమ్‌ పేపర్స్‌లో భార్య పేరు లక్ష్మి అని ఉంది. ఫొటో కూడా వేరే ఉంది. వాళ్లు ఇతర ఇన్సూరెన్స్‌ సంస్థలతో ఎంక్వయిరీ చేస్తే నారాయణ సింగ్‌ హెచ్‌డీఎఫ్‌సీ, ఇఫ్కో బజాజ్‌ అలియంజ్, ఇతర అన్ని బీమా కంపెనీ సంస్థలలోనూ పాలసీలు తీసి ఉన్నాడు. అన్ని పాలసీల్లో అతని భార్య పేరు లక్ష్మి అని ఉంది. ఒకవేళ అతడు ప్రమాదవశాత్తు మరణించి ఉంటే అతని భార్యకు మొత్తం 67 లక్షల రూపాయలు వస్తాయి.ఇంతకీ అసలు భార్య ఎవరు?ఈ సమాచారం ఆదిలాబాద్‌ జిల్లా ఎస్పీకి చేరింది. ఇన్సూరెన్స్‌ సంస్థల ఫిర్యాదుతో నారాయణసింగ్‌ మృతిని అనుమానాస్పద మృతిగా తిరిగి ఓపెన్‌ చేశారు.2007లో ఈ కేసు పునర్విచారణ మొదలైంది.బోథ్‌ సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు.పాలసీ కాపీల ఆధారంగా ఆయా అడ్రసుల్లో ఉన్న వ్యక్తులను, ఇన్సూరెన్స్‌ కంపెనీలను కలిసి విచారణ చేసి వారి స్టేట్‌మెంట్‌ నమోదు చేసుకున్నారు. అన్ని చోట్లా ఒక్క పేరే అనుమానాస్పదంగా బయటకు వచ్చింది.ఆ పేరు అడ్వకేట్‌ రమణ.వెంటనే రమణను అదుపులోకి తీసుకున్నారు.అతని పథకం విని పోలీసులు నోరెళ్లబెట్టారు.

న్యాయవాది రమణ నిజామాబాద్‌ వాసి. ఆర్థికంగా నష్టపోయి హైదరాబాద్‌లోని మెహదీపట్నానికి మకాం మార్చాడు. అదే ప్రాంతానికి చెందిన ఠాకూర్‌ నారాయణసింగ్‌ మార్నింగ్‌ వాక్‌లో పరిచయమయ్యాడు. స్నేహితుడిగా మారాడు. అంతేకాదు రమణ వద్దకు కొన్ని కేసులు తీసుకొచ్చేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. నారాయణ సింగ్‌ భార్య సుశీల చనిపోవడంతో తోడు ఎవరూ లేక అతను రమణ ఇంట్లోనే ఉండేవాడు. ఇదే అదనుగా రమణ నారాయణసింగ్‌కు తెలియకుండా అతని పేరిట అనేక కంపెనీల్లో పలు పాలసీలు తీసుకొని, అతని భార్యగా తన బంధువు లక్ష్మిని నామినీగా పెట్టి, ప్రీమియం చెల్లించాడు. తర్వాత హత్యకు  పథకం వేశాడు. ఒకసారి మహారాష్ట్రలో లారీ కిందికి నెట్టేసి హత్యాయత్నం చేశాడు. అయితే, నారాయణసింగ్‌ అదృష్టవశాత్తు అప్పుడు బతికి బయటపడ్డాడు. ఆయనకు అనుమానం వచ్చినప్పటికి రమణ మాయమాటలు చెప్పి నమ్మించాడు. 2006 నవంబర్‌ 30న ఆదిలాబాద్‌లోని కుంటాల జలపాతం చూసేందుకు అడ్వకేట్‌ రమణ నారాయణసింగ్, డ్రైవర్‌లతో కలిసి కారులో బయల్దేరాడు. నిజామాబాద్‌లో మరొక స్నేహితుడిని కలుపుకున్నాడు. అందరు కలిసి కుంటాల జలపాతానికి చేరుకున్నారు. వాచ్‌మెన్‌ వారించినా వినకుండా జలపాతం వద్దకు వెళ్లారు. న్యాయవాది, డ్రైవర్, న్యాయవాది మిత్రుడు కలిసి నారాయణసింగ్‌ను నీటిలోకి తోసేశారు. ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయాడని వాచ్‌మెన్‌కు చెప్పారు. పోలీసులకూ అదే విషయం చెప్పారు. కేసు ఏ పేచీ లేకుండా క్లోజ్‌ అయ్యింది. 

ఆ తర్వాత న్యాయవాది వ్యూహం ప్రకారం తన దగ్గరి బంధువును నారాయణసింగ్‌ భార్యగా చిత్రీకరించాడు. ఆమె పేరిట ఓ నకిలీ రేషన్‌కార్డు తయారుచేయించాడు. బ్యాంక్‌లో ఖాతా తెరిచాడు. నారాయణసింగ్, ఆయన భార్య లక్ష్మీ కలిసి నిజామాబాద్‌లో తాను నివసించే అపార్ట్‌మెంట్‌లోనే వారు నివసిస్తున్నట్లు వార్డు కౌన్సిలర్‌ ఇచ్చినటువంటి ధ్రువపత్రాన్ని జతచేశాడు. రమణ బుద్ధి ఎరిగిన వారు ఎవరో రాసిన ఆకాశరామన్న ఉత్తరం అందినప్పుడే అతను దొరకాల్సింది. ముంబయ్‌ నుంచి కేసు కదలాల్సి వచ్చింది. బీమా పాలసీ డబ్బుల కోసం నారాయణసింగ్‌ను హత్య చేశారని రమణ మీద కేసులు నమోదు చేశారు పోలీసులు. విచారణ కొనసాగుతూ ఉంది. 
– గొడిసెల కృష్ణకాంత్‌ గౌడ్

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top